శబర శ్రీ క్షేత్రం
శ్రీ జగన్నాథ స్వామి ఒరియా ప్రజలకు ప్రధమ ఆరాధ్య దైవం. సుందర సాగర తీరాన యుగాల క్రిందట అగ్రజుడైన శ్రీ బలదేవునితో మరియు సోదరి అయిన శ్రీ సుభద్ర దేవితో కలిసి కొలువైన శ్రీ జగన్నాధుని స్మరణం, వీక్షణం ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా విశ్వసిస్తారు ఒడిసా వాసులు. హిందువులకు ముఖ్యమైన దర్శనీయ నాలుగు క్షేతాలలో ఒకటి అయిన పూరి శ్రీ జగన్నాథుని స్వగృహం.
దేశంలో పేరొందిన ఆలయాలతో పోలిస్తే పూరి క్షేత్రంలో జరిగే పూజలు, అలంకరణలు, యాత్రలు మరియు ఆరగింపులు చాలా ప్రత్యేకంగా ఉండటం పేర్కొనవలసిన అంశం. కాలక్రమంలో తొలుత ఏర్పడిన పూరి ఆలయ తరహాలో అనేక ప్రాంతాలలో అదే శైలిలో ఆలయాలను స్థానిక భక్తులు నిర్మించుకున్నారు. ఒక్క ఒడిసా రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఏర్పడినాయి. శ్రీ జగన్నాథ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యింది. ఇలా ఇతర ప్రాంతాలలో శ్రీ జగన్నాథ మందిరాలు ఏర్పడటానికి మూలం తొలుత శ్రీ జగన్నాథుని ఆరాధించిన శబరులే కావడం విశేషం.
ఆంధ్ర, ఒడిసా మరియు చత్తిస్గఢ్ రాష్ట్ర సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలుస్తారు. ఇది శబరల నివాసస్థానం. పూరిలో కొలువు తీరడానికి పూర్వం జగన్నాధుడు శబరుల పూజలందుకొనేవారని పురాణాల ద్వారా తెలుస్తున్న విషయం. నేటికీ పూరి ఆలయంలో శబరుల ప్రాధ్యాన్యత చెప్పుకోదగినదే ! సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట స్థానిక శబర నాయకులు ఇక్కడ జగన్నాధుని ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. చిన్న పర్వతాన్ని ఎంచుకొని "నీలాంచల" అని నామకరణం చేసి అక్కడ సంప్రదాయం ప్రకారం దారు వృక్షాన్ని ఎంచుకొని విగ్రహాలను మలచారట. పూరి ఆలయ నమూనాలో మందిరాన్ని నిర్మించుకొన్నారట. పూరిలోని ఆలయం ఉన్న ప్రాంతాన్ని నీలాచలమని, మందిరాన్ని శ్రీ క్షేత్రం అని పిలుస్తారు. కాలగమనంలో ఈ మందిరం కూడా "శబర శ్రీ క్షేత్రం" గా పేరొందినది. ఈ ప్రాంతం కోరాపుట్ నగరంగా అభివృద్ధి చెందినది.
నగర నడిబొడ్డున ఉన్న నీలాచల శిఖరాన కొలువై ఉన్న శ్రీ జగన్నాధ, శ్రీ బలదేవ మరియు శ్రీ సుభద్ర కొలువై ఉంటారు. కొండా పై భాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. భోగ, నట, ముఖ మండపాల తరువాత వచ్చే గర్భాలయంలోని రత్న బేది మీద సుందర అలంకరణ తో నేత్రపర్వంగా దర్శనమిస్తారు పురుషోత్తముడు సోదర మరియు సోదరితో కలిసి. ప్రతి సంవత్సరం నూతన రథాలను తయారు చేస్తారు.
పూరి క్షేత్రంలో జరిగే అన్ని పూజలు, యాత్రలు ఇక్కడ నిర్వహిస్తారు. కానీ ఒక తేడా ఉన్నది. పూరి ఆలయం లోనికి హిదువేతరులకు ప్రవేశం లభించదు. కానీ ఇక్కడ అలాంటి నిబంధన ఏదీ లేదు. పూరి లో స్వామివారికి సమర్పించే విధంగానే ఇక్కడ కూడా అన్న ప్రసాదం నివేదన చేస్తారు. దీని కోసం ఒక వంటశాల కలదు. పక్కనే భక్తులకు ప్రసాద వితరణ చేయడానికి "ఆనంద బజార్" కూడా కలదు. ప్రాంగణంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కేదారనాథ్, బద్రీనాథ్, అమరనాథ్, పుష్కర్, శ్రీరంగ, మధురై, శబరిమల, తిరుమల మూలవిరాట్టులతో పాటు శ్రీ పశుపతి నాధుని ఉపాలయాలు కనపడతాయి. పర్వత శిఖరాన విశాలమైన స్థలంలో దేవుల శైలిలో నిర్మించిన ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ శ్రీ జగన్నాధుడు వివిధ సందర్భాలలో దర్శనమిచ్చే హతి, నాగార్జున, శ్రీ నారసింహ, శ్రీ రామ, బంకచూడ, కాళియ మర్దన, లక్షీనారాయణ, రఘునాథ, వామన మరియు సోనా వేషాలలో దర్శనమిస్తారు. ఉపాలయాల్లో శ్రీ వినాయక, శ్రీ హనుమాన్, శ్రీ లక్ష్మీనారసింహ, శ్రీ లక్ష్మి, శ్రీ కాళి మరియు నవగ్రహాలు కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి నిత్యం స్థానిక మరియు దూరప్రాంత భక్తులు వస్తుంటారు. ఉదయం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరాయంగా తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రంలో ముఖ్యమైనది శ్రీ జగన్నాధ రథ యాత్ర. కొండా మీద నుండి బయలుదేరి రాయగడ రహదారిలో ఉండే గుండిచా మందిరం వరకు సాగే ఈ రథయాత్రలో పాల్గొనడానికి మరియు వీక్షించడానికి వేళా సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
కోరాపుట్ జిల్లా అంటేనే ప్రకృతికి పుట్టిల్లు. ఎన్నో రకాల వృక్షాలు, మొక్కలు, జలపాతాలతో నిండిన పర్వతాలతో, లోయలతో ఎటు చూసినా పరవశింపచేసే పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో పలు గుహాలయాలు కనపడతాయి. ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధికెక్కిన "అరకు" కోరాపుట్ కి సమీపంలోనే ఉంటుంది. కోరాపుట్ నగరంలో శ్రీ ముత్యాలమ్మ, శ్రీ తరణి, శ్రీ మహేశ్వర పురాతన ఆలయాలు ఉన్నాయి. తెలుగు జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా అన్ని పర్వదినాలలో రెండు ప్రాంతాల సంప్రదాయాల కలయిక కనిపించడం విశేషం.
విశాఖపట్నం,ఒడిసా రాష్ట్రం నలుమూలల నుండి రోడ్డు మరియు రైలు మార్గాలలో కోరాపుట్ చేరుకోవచ్చును. చక్కని వసతి సౌకర్యాలు మరియు భోజనం లభిస్తాయి.
( జులై 4న తారీఖున జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్బంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి