11, నవంబర్ 2019, సోమవారం

Ganapavaram Temples

                           సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు 






ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. కానీ తెలియనిదల్లా మన రాష్ట్రంలో కూడా అనేకానేక పురాతన చారిత్రక ఆలయాలు నెలకొని ఉన్నాయి అని. 
మన రాష్ట్రాన్ని క్రీస్తు పూర్వం నుండి ఎన్నో రాజ వంశాలు పాలించాయి. అందరూ మన సంస్కృతి సంప్రాదాయాల, భాష మరియు ఆరాధనా విధానాల అభివృద్ధికి విశేష కృషిచేశారని లభించిన శాసనాల ఆధారంగా అవగతమౌతుంది. రాయలసీమ జిల్లాల తరువాత ఉభయ గోదావరి జిల్లాలు వీటికి ప్రసిద్ధి. కాకపోతే దురదృష్టవశాత్తు తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం దక్కలేదని భావించవలసి వస్తుంది.  
ఆంధ్రప్రదేశ్ జీవనాడి జీవనది అయిన గోదావరి. నిరంతరం గలగలా ప్రవహించే ఈ నదీ తీరాలు  పచ్చని పంట పొలాలకు , సుందర ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. సంవత్సరమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉండే ఈ ప్రాంతాలలో ఎన్నో గొప్ప క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక విశేష క్షేత్రం "పద్మినీ పురం". 
ఈ పేరు చెబితే చాలామందికి అర్ధం కాదు. తెలియదు కూడా ! అదే "గణపవరం" అని చెబితే ఠక్కున గుర్తిస్తారు. పురాణాలలో, పురాతన గ్రంధాలలో, శాసనాలలో కొలను పురం, సరసీ పురం, కురాల సరస్సు, పద్మినీ పురంగా పేర్కొనబడిన ఈ ప్రాంతం కాకతీయుల కాలం నుండి గణపవరంగా పిలవబడుతోంది. రాణీ రుద్రమదేవి ఈ ప్రాంతాన్ని సందర్శించి తన తండ్రి గణపతి దేవుని పేరు మీద గ్రామాన్ని పునఃనిర్మించినది. శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి వారి ఆలయాన్నికూడా పునః నిర్మించినట్లుగా తెలియవస్తోంది. ఈ కారణంగా ఈ గ్రామాన్నిఆయన పేరుతో పిలవబడసాగింది.











ఆలయ పౌరాణిక గాధ 

లోకాలకు వెలుగును పంచెడివాడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. ఆయన భార్యలలో ఒకరైన ఉషా దేవి కైలాసనాధుని దర్శనాన్ని ఆపేక్షిస్తూ ఇక్కడి సువర్ణ (కురాల) సరోవర తీరాన నియమంగా దీక్షతో తపస్సు చేసినదట. ఆమె భక్తికి సంతసించిన భక్తసులభుడు దర్శనాన్నిప్రసాదించారట. ఆమె ఆర్తితో లోకాలను కాపాడేందుకు ఇక్కడే కొలువు తీరమని కోరగా సమ్మతించి స్వయం భూలింగ రూపంలో వెలిశారని స్థల పురాణం తెలుపుతోంది. 
తరువాత ద్వాపర యుగంలో పాండవుల మనుమడైన పరీక్షిత్తు మహారాజును " తక్షకుని కాటుతో నీకు మరణం ప్రాప్టించుకాక!" అని శపించాడు ఒక మహర్షి కుమారుడు. ఈ కధ అందరికీ తెలిసినదే !
కానీ తనకు తానుగా కాకుండా ముని వాక్కు మేరకు రాజుని కాటువేసినా సంక్రమించిన దోషం తొలగించుకోడానికి నాగరాజు తక్షకుడు ఈ కురాల సరోవరాన్నే ఎంచుకున్నాడట. నియమంగా శ్రీ సువర్ణేశ్వర స్వామిని సేవించుకొని దోషాన్ని తొలగించుకొన్నాడట. ఈ కారణంగా శ్రీ సువర్ణేశ్వర స్వామి వారు కొలువైన గణపవరం సర్పదోష పరిహార క్షేత్రంగా గుర్తింపబడింది.








ఆలయ చరిత్ర 

నేటి పశ్చిమ గోదావరి జిల్లా లోని పెదవేగి ఒక చిన్న పల్లె. కానీ క్రీస్తుశకం రెండో శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకూ ఎన్నో రాజవంశాలకు రాజధానిగా వెలుగొందినది. అప్పట్లో "వేంగి" అని పిలిచేవారు. తూర్పుచాళుక్యులు, ఢిల్లీ సుల్తానులు, హొయసల, యాదవ, శాతవాహన, కళింగ, పల్లవులు, శాలంకాయనులు, బృహత్సలాయకులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు వేంగి మీద ఆధిపత్యం చేసి పదిహేడవ శతాబ్దం వరకు పాలించారు. 
సుల్తానుల మరియు నవాబుల కాలంలో గణపవరం ప్రాంతం మరియు ఆలయం కూడా రెండు పర్యాయాలు ధ్వసం చేయబడినాయి. మొదటిసారి శాతవాహనలు, రెండో సారి విజయనగర రాజులు గ్రామాన్ని మరియు దేవాలయాన్ని పునః నిర్మించారు. మిగిలిన రాజ వంశాల పాలకులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారని ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 
గోల్కొండ నవాబుల తరువాత ఈ ప్రాంతం నూజివీడు జమీందారుల అధికారం లోనికి వచ్చింది. వారు ఆలయ మరియుప్రాంతీయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు అని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ నిమిత్తం భూమిని ఇచ్చారు. ఉత్సవాల సమయంలో  తమ వంతు కైంకర్యాలతో శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి పట్ల తమ భక్తిని ప్రకటించుకొనేవారు.ఆంధ్ర రాష్ట్ర పురావస్తు శాఖ వారు రాతితో నిర్మించిన శ్రీ సువర్ణేశ్వర స్వామి ఆలయాన్ని పురాతన నిర్మాణంగా నిర్ధాకరించి గుర్తించారు. కొల్లలుగా ఏరులు సంగమించే కొల్లేరు సరస్సుకు దగ్గరలో ఉన్న గణపవరంలో శ్రీ సువర్ణేశ్వర స్వామి కొల్లేరు కోట పెద్దింటమ్మ ఒకరికొకరు అభిముఖంగా ఉండటం చెప్పుకోదగిన విషయం. 

ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంతంలో పడమర ముఖంగా ఉండే ప్రధాన ద్వారం పైన మూడు అంతస్థుల రాజ గోపురాన్ని నూతనంగా నిర్మించారు. వర్ణమయ శిల్పాలతో రమణీయంగా దర్శనమిస్తుంది. 
ప్రాంగణంలో శ్రీ గణేశ, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (విశేషమేమిటంటే ఈ మూడు విగ్రహాలు ఏక రాతి మీద మలచినవి కావడం), సప్తమాతృకలు, ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలను తెలిపే ఫలకం ఉంటాయి. 
రాతితో నిర్మించబడిన పడమర దిశగా ఉండే గర్భాలయాలలో శ్రీ గణేశ, శ్రీ దుర్గంబిక ఇరుపక్కల ఉండగా మధ్యలో శ్రీ సువర్ణేశ్వర స్వామి ప్రధాన గర్భాలయంలో విభూది, చందన కుంకుమ లేపనాలతో, వర్ణమయ పుష్పాలంకరణలో నేత్రపర్వంగా  దర్శనం ప్రసాదిస్తారు. 
నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యాన్ని తెలిపి ఒక అద్భుతం వైశాఖ మాస పౌర్ణమి నుండి ఆలయంలో ఆవిష్కారమౌతుంది. నాటి నుండి ఒక నెల పాటు ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో పడమర దిక్కు అస్తమించబోయే ముందు ఆదిత్యుడు తన కిరణాలతో  నేరుగా లింగానికి ప్రదోషకాల అభిషేకం చేస్తాడు. అత్యంత అరుదైన నిర్మాణ విశేషమిది. చూడటానికి ఎంతో దూరాలనుండి కూడా భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి నిత్యం నాలుగు పూజలను నియమంగా జరిపిస్తారు.














అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. కార్తీక మాసం, వినాయక  చవితి, దేవీ నవరాత్రులు, శివరాత్రి వైభవంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో షష్టి నాడు శ్రీ వల్లీ దేవసేన  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం, వైశాఖ మాస పౌర్ణమి నాడు  ఆదిదంపతులైన శ్రీ దుర్గంబిక,  శ్రీ సువర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుతారు. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆయా పర్వదినాలప్పుడు గంగరాజు అన్నదానసమితి, శ్రీ సాగిరాజు సుబ్బరాజు గార్లు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నారు. 
శివ పరివారం కొలువైన శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి వార్ల దేవస్థానం కాకుండా గ్రామంలో పురాతనమైన రామాలయం, శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, గ్రామదేవతలైన శ్రీమారెమ్మ మరియు శ్రీకప్పాలమ్మ సన్నిధితో పాటు నూతనంగా నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎన్నో పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి. 

మార్గం 

 విశేష పౌరాణిక, చారిత్రిక ఆలయాలకు నిలయమైన "గణపవరం" గ్రామం తాడేపల్లి గూడెం లేదా భీమవరం పట్టణాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ రెండు పట్టణాలకు రాష్ట్రం లోని అన్ని పట్టణాల నుండి రైలు సౌకర్యం కలదు.అక్కడ నుండి బస్సులు లేదా ఆటోలలో సులభంగా చేరుకోవచ్చును. 
ఆలయ కమిటీ వారు భక్తులకు భోజన మరియు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.












నమః శివాయ !!!!!





   

1, అక్టోబర్ 2019, మంగళవారం

World Elephant Day

                           ప్రపంచ ఏనుగుల దినోత్సవం 

                                                 
                                                                                                     




మానవులుగా జన్మించిన మనందరికీ ఒక జన్మ దినోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం తాహతుకు తగ్గట్టుగా జరుపుకొంటాము. పుడమి మీద జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక రకంగా సంఘానికి ఉపయుక్తంగా ఉంటారు. అది మంచి కానీ చేడు  కానీ ! మనతో పాటు అనేక జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటి మూలంగా ప్రకృతికి జరిగే మేలు ఎంతో ! మరి అలాంటి పరోపకారులను, అవి చేస్తున్న సేవని, వాటి  వలన ఒనగూడే లాభాలను మర్చిపోదామా ! ఈ మూగ జీవాల నిష్కల్మష సేవను గుర్తించి విదేశీయులు వాటికి కూడా సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. వీటిల్లో ఏనుగులు, సింహాలు, పెద్దపులులు లాంటి పెద్ద మృగాలతో పాటు చిన్న చిన్న పక్షుల వరకూ ఉన్నాయి. ఇలా కేటాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
తగ్గుతున్న జంతువుల మరియు పక్షుల సంతతిని, వాటి వలన జరిగే పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధి, శుద్ధమైన గాలి, సకాలంలో వర్షాలు ఆదిగా గల విషయాల పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించడానికి ఇదో మార్గంగా వారు భావించి  నిర్ణయించారు.
ఉదాహరణకు పిన్నలను, పెద్దలను ఆకర్షించే గజరాజునే తీసుకోండి. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న అవి నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల లోపలే ఉన్నాయి. రోజుకు ఎన్ని జన్మిస్తున్నాయో తెలీదు గానీ వంద వరకు వేటగాళ్ల క్రూరత్వానికి బలి అవుతున్నాయి అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చును. అందుకే వీటిని 1986 నుండి అంతరించి పోతున్న జంతువుల జాబితా అగ్రస్థానంలో ఉంచారు. ఏనుగు దంతాలు, చర్మం తో తయారయ్యే వస్తువుల అమ్మకాన్ని నిషేదించారు. అయినా ఫలితం లేకపోవడంతో వినియోగదారులైన ప్రజలకు పర్యావరణ పరిరక్షణకు ఏనుగుల అవసరాన్నిగురించి తెలియచెప్పి, వారికి దంతపు వస్తువుల పట్ల గల వ్యామోహాన్ని వదిలించడానికి అన్ని దేశాలలోని ఏనుగుల అభిమానులు, ప్రభుత్వాలు  అనేక మార్గాలను ఎంచుకొంటున్నారు.
భారత దేశంలో 1992 వ సంవత్సరంలో "ప్రాజెక్ట్ ఎలిఫెంట్" అన్న కార్యక్రమాన్ని ఆరంభించారు. ముప్పయి రెండు గజ సంరక్షణ కేంద్రాలను ఏనుగులు ఎక్కువగా తిరుగాడే  రాష్ట్రాలలో   నెలకొల్పారు. దీని వలన ఏనుగులు హంతకుల బారిన పడటం తగ్గింది కానీ సంఖ్యలో పెద్దగా అభివృద్ధి లేదనే లెక్కలు చెబుతున్నాయి. అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోవడం తో గ్రామాల మీద గజ దాడులు ఎక్కువ అయ్యాయి.






భారతదేశం తరువాత పెంపుడు ఏనుగులు ఎక్కువగా ఉన్న థాయిలాండ్ దేశంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది అని అక్కడి అధికారుల రూపొందించిన పత్రాలు తెలుపుతున్నాయి.
శతాబ్దం క్రిందట లక్షకు పైగా తిరుగాడిన ఏనుగుల సంఖ్య నేడు నాలుగు వేలకు దిగజారి పోయింది. అందులో మూడువేలకు పైగా పెంపుడు ఏనుగులే ! వన్యప్రాణి సంరక్షకుల లెక్క ప్రకారం థాయిలాండ్లో సంవత్సరానికి మూడున్నర శాతం చొప్పున ఏనుగులు తగ్గిపోతున్నాయి. . ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు దశాబ్దాల తరువాత ఆ దేశంలో ఏనుగులన్నవి కనపడని తేల్చి చెప్పారు. దీనిని అరికట్టడానికి థాయిలాండ్ మహారాణి "సిరి కీత్" స్వయంగా నడుం బిగించారు.
రెండువేల రెండో సంవత్సరంలో "ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్" ను స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం పెంపకందారుల  దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న ఏనుగులను ఉచితంగా కానీ, ఖరీదు చేసి కానీ తీసుకొని, వాటికి అవసరమైన వైద్య సేవలను అందిస్తారు. పూర్తి స్వస్థత చేకూరిన తరువాత వాటిని అడవిలో వదులుతారు. దీని కోసం థాయిలాండ్ ప్రభుత్వం మూడు   అభయారణ్యాలను, ఇరవై ఎనిమిది మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించినది. ఒక్కోప్రాంతం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రభుత్వం దీని కొరకు ప్రత్యేక నిధులను కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా గజాభిమానుల నుండి విరాళాలను సేకరించారు.
అలాంటి సమయంలో కెనడాకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు " పాట్రికా సిమ్స్" నటుడు  "విలియం షాట్నర్" జత కలిశారు. వీరిరువురూ గజాల పట్ల మక్కువ, ప్రేమ, అభిమానం కలిగిన వారు. ఏనుగు పెంపక దారులలో చైతన్యం కలిగించడానికి ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ స్థాపించిన దశాబ్ద కాలం పూర్తి అయిన సందర్బంగా "రిటర్న్ టు ది ఫారెస్ట్" అన్న అరగంట నిడివి గల డాక్యూమెంటరీ నిర్మించారు. ఎంతో హృద్యంగా నిర్మించిన ఈ చిత్రానికి వ్యాఖ్యాత నటుడు విలియం షాట్నర్. ఆయన తన నవరసాలు పలికే గొంతుతో గొప్పగా చిత్రములోని అసలు ఉద్దేశ్యాన్ని హృదయాలను కదిలించేలా చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం విడుదల సమయానికి ఈ సంస్థ వారు వంద ఏనుగులను పెంపకందారులు నుండి తీసుకొని అరణ్యాలలో వదిలారు. ఈ విజయానికి గుర్తుగా సిమ్స్ 12.08.2012ని "ప్రపంచ ఏనుగుల దినోత్సవం"గా ప్రకటించారు.నాటి నుండి ఆగస్టు పన్నెండవ తేదీని ఏనుగుల దినోత్సవంగా పరిగణిస్తున్నారు.







విడుదలై వనాలలో విహరిస్తూ స్వతంత్రాన్ని అనుభవిస్తున్న గజరాజులు, రాణులకు  ఇరవై అయిదు మంది సంతానం కలిగారు. అన్ని కుటుంబాలు సుఖంగా ఉన్నాయని సంబంధిత వర్గాల వారు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఎందరో ప్రముఖులు,వన్యప్రాణి       ప్రేమికులు, స్వచ్చంద సేవా సంస్థల వారు కలిశారు. ఎందరో ఏనుగుల అభిమానులు, ప్రకృతికి మానవాళికి వాటి అవసరాన్ని గుర్తించిన వారు కూడా విరాళాలుఇస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
 ఏనుగుల సంతతి వృద్ధి చెందడానికి దర్శకురాలు సిమ్స్ తమ తరుఫున నుండి చేస్తున్న కృషిని మరింత ముందుకు కొసాగిస్తూ 2015వ సంవత్సరంలో "వెన్ ఎలెఫెంట్స్ వర్ యంగ్" అన్న రెండో డాక్యూమెంటరీ నిర్మించారు. వాయువ్య థాయిలాండ్ ప్రాంతంలోని ఒక కుగ్రామం లో నివసిస్తున్న ముఫై అయిదు మంది ఏనుగుల పెంపకం దారులలో ఒకడైన ఇరవై అయిదు సంవత్సరాల "ఓక్" మరియు అతని "నోంగ్ మయి" అనే పెంపుడు ఏనుగు గురించిన కధ. ఎంతో వ్యయప్రయాసలకోర్చినిర్మించిన ఈ చిత్రం అనేక చిత్రోత్సవాలలో ప్రశంసలు మరియు బహుమతులు అందుకొన్నాది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కూడా విలియం షాట్నర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ! రెండు చిత్రాలు కూడా థాయిలాండ్ నేపథ్యంలోనే నిర్మించడం మరో విశేషం !
ఈ సంస్థ వారు పెరిగిపోతున్నజల, వాయు, భూమి  కాలుష్యంగురించి దానికి విరుగుడుగా చెట్ల పెంపకం ఎంతగా దోహదపడుతుందో అన్న విషయాన్నీ సవివరంగా తెలుపుతారు.రోజుకు పాతిక కిలోమీటర్లు ఆహారం కోసం తిరిగే ఏనుగులు తమ మలం ద్వారా విత్తనాలను విసర్జించి అడవుల అభివృద్ధికి ఎలా  తోడ్పడతాయో అన్న విషయాల గురించి సదస్సులను నిర్వహించి, ప్రజలకు   ఏనుగుల గురించి అవగాహన కలిగిస్తున్నారు. వాటి వలన పర్యావరణానికి జరిగే మేలు గురించి వివరిస్తారు.








దర్శకురాలు సిమ్స్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ వర్గాల వారిని కలుస్తూ తమ సంస్థ గురించి వివరిస్తుంటారు. ఆమే కాదు సంస్థలోని సభ్యులందరూ ఏనుగులను కాపాడుకోవడం గురించి ప్రజలకు తెలుపుతుంటారు. ఒక్క ఏనుగే కాదు ప్రతి ఒక్క జీవి ప్రకృతి మరియు పర్యావరణానికి సహకరిస్తాయి. అందుకని మనం కూడా వారితో జత కలుద్దాం. ఎందుకంటే మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాము. మనకీ స్వచ్ఛమైన పరిసరాలు, ఆహారం, నీరు, గాలి కావాలి కదా మరి !
(12.08. 2018 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్బంగా )



Saptha Karai kanda sthalams

                 కుమారుడు ప్రతిష్టించిన కైలాసనాధుడు 


  భరత ఖండం అనాదిగా దైవభూమి. ప్రతి పల్లె, పట్టణం, నగరం, అరణ్యం, పర్వతాలు ఇలా అన్నీ కనీసం ఒక హిందూ దైవం యొక్క ఆలయాన్ని కలిగి ఉండటం ప్రస్తావించవలసిన విషయం. ఇవన్నీ కూడా ఏదో ఒక విశేష కారణం వలన ఏర్పడినవి అన్న సంగతి ఆయా క్షేత్రాల పురాణ గాధలను పరిశీలించినప్పుడు అవగతమౌతుంది. విచారించవలసిన అంశం ఏమిటంటే వీటిల్లో చాలా క్షేత్రాలు కాలగతిలో మరుగున పడిపోయి స్థానికంగా ఒక సాధారణ ఆలయంగా పరిగణింపబడటం. కాకపోతే సంతోషించదగ్గ విషయం మాత్రం అన్ని ఆలయాలలో నిత్య దీపధూప నైవేద్యాలు జరగడం.
ఈ ఆలయాలలో శ్రీ మహావిష్ణు, శ్రీ కైలాసనాధ, శ్రీ వినాయక, శ్రీ షణ్ముఖ మరియు దేవీ ఆలయాలు ఎక్కువగా కనపడతాయి. అలానే వీటిల్లో కొన్ని ఒకే దేవతామూర్తి కొలువైన గొలుసు కట్టు ఆలయాలు కూడా కనపడతాయి.                                                     
వీటిల్లో అధిక శాతం నిరాకారుడైన నటరాజ స్వామి కొలువైనవే కనపడతాయి. గొలుసు కట్టు   అంటే ఒకే అంశం లేదా ఒకే క్షేత్ర గాధ కలిగిన ఆలయాలన్న మాట. ఇలాంటి విశేష ఆలయాలు అధికంగా ఆలయాల రాష్ట్రం తమిళనాడులో కనపడతాయి. నవ కైలాసాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు ఇలా ఎన్నో ! వాటిల్లో ప్రత్యేకమైనవి చెయ్యారు నది ఉత్తర దక్షిణ తీరాలలో నెలకొని ఉన్న సప్త కారై కాంద మరియు సప్త కైలాసాలు (కైవల్య/ కళ్యాణ) క్షేత్రాలు.
ఇవన్నీ శ్రీ కుమారస్వామి ప్రతిష్టగా ఆలయ గాధలు తెలుపుతున్నాయి.
పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా, స్వయం సర్వేశ్వరుడే పర్వతరూపంలో వెలసిన దివ్య స్థలం తిరువణ్ణామలై (అరుణాచలం). ఈ శిఖరానికి చేసే గిరిప్రదక్షణ ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా ఎన్నో పురాణ గ్రంధాలలో ఉదాహరించబడింది. ఈ కారణంగా ప్రతి నిత్యం విశేషించి పౌర్ణమి రోజులలో భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గదర్శకులెందరికో ఈ క్షేత్రం అంతిమ గమ్యంగా పేరొందినది. శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి లాంటివారు ఎందరికో మార్గదర్శకత్వం చేశారు. అంతటి విశేష స్థలమైన తిరువణ్ణామలై కి యాభై కిలోమీటర్ల పరిధిలో ఈ పదునాలుగు ఆలయాలు ఉండడం ఈ స్థల పాశస్త్యాన్ని తెలుపుతుంది. ఈ ఆలయాల క్షేత్ర గాధ కూడా తిరువణ్ణామలైతో ఆది దంపతులతో ముడి పడి  ఉండటం ఉదాహరించవలసిన సంగతి.

క్షేత్ర గాధ 

తెలియక చేసిన అపరాధానికి శివాజ్ఞ మేరకు కాంచీపురంలో తపస్సు చేసిన పార్వతీదేవి దేవసేనాని అయిన కుమారుడు శ్రీ కుమారస్వామి, మహర్షులు, ఇతర గణాలతో కలిసి తిరువణ్ణామలై పయనమయ్యారట. దారిలో "వళై పాండాల్" అనే ప్రదేశం వద్దకు చేరుకునేసరికి సంధ్యా సమయ పూజకు వేళయ్యిందిట. యధాప్రకారం సైకత లింగాన్ని చేయడానికి ఉపక్రమించిన భవానికి కనుచూపు మేరలో నీటి జాడ కానరాలేదుట. తల్లి కి కావలసిన జలం కొఱకు షణ్ముఖుడు తన వేల్ ని దూరంలో ఉన్న పర్వతాల పైకి విసిరారట. కొద్దీ సేపటిలోనే నీరు ప్రవహించిందిట. కానీ రక్థవర్ణంలో ఉండటంతో విషయం తెలుసుకోడానికి వేలాయుధుడు పర్వతాల వద్దకు వెళ్ళాడట.
 "పుతిరందన్, పురుహూదన్, పాండురంగన్, బోధవన్, బోధన్, కొమన్ మరియు వామన్" అనే ఏడుగురు గంధర్వులు శాపవశాత్తు భూలోకంలో జన్మించారట. శివకుమారుని అనుగ్రహంతో  శాపవిమోచనం పొందడానికి అక్కడి కొండ గుహలలో తపస్సు చేస్తున్నారట. వేల్ వారి శరీరాల లోనికి  దూసుకొని పోవడంతో నీరు రంగు మారింది అన్న విషయం గ్రహించారట దండాయుధ పాణి. సప్త మునీంద్రులు కుమారుని స్తోత్రం చేసి విముక్తి పొంది తమ లోకానికి వెళ్లి పోయారట. కానీ పుత్రుడు అనుకోకుండా బ్రహ్మ హత్యాదోషానికి గురికావడంతో బాధపడిన లోకపావని అతనిని ఉద్భవించిన నదీతీరంలో శివలింగాలను ప్రతిష్టించి దోషాన్ని తొలగించుకోమని ఆదేశించారట.అలా మునుల రక్తం నుండి పుట్టిన చెయ్యారు నది ఉత్తర మరియు దక్షిణ తీరాలలో స్కందుడు లింగాలను ప్రతిష్టించారన్నది స్థానికంగా వినిపించే గాధ.

క్షేత్ర విశేషాలు

చెయ్యారు నదికి ఉత్తరం పక్క ఉన్న క్షేత్రాలను "కార్తె కాండ స్థలాలు" అని, దక్షిణం పక్క ఉన్న వాటిని "సప్త కైవల్య/ కళ్యాణ/ కైలాస స్థలాలు" అని పిలుస్తారు. ఇవన్నీ తొమ్మిది మరియు పదో శతాబ్దాల మధ్య కాలంలో చోళరాజులచే నిర్మించబడి అనంతర కాలంలో "శాంభవరాయ మరియు విజయనగర రాజుల" కైంకర్యాలతో నేటి రూపును సంతరించుకొన్నట్లుగా శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.
సప్త కార్తె కాండ స్థలాలలో  కొలువైన ఆదిదంపతులను "శ్రీ బృహన్నాయకీ సమేత శ్రీ కార్తె కాండేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక దక్షిణం పక్కన వెలసిన స్వామిని శ్రీ కైలాసనాథర్, శ్రీ అగ్నీశ్వర స్వామి అని, అమ్మవారిని కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రధమ పూజితునిగా విఘ్ననాయకునికి అన్ని ఆలయాలలో సముచిత స్థానం ఏర్పాటయింది. కానీ ఇవన్నీ శరవణుని ప్రతిష్ట కావడం వలన అన్ని చోట్లా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన ఉపాలయాలలో భైరవ, సప్త మాతృకలు, దక్షిణామూర్తి, చెండికేశ్వర స్వామి ఉండగా అన్ని చోట్లా నవగ్రహ మండపం ఉంటుంది. కొన్ని ఆలయాల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాయణ పెరుమాళ్, శ్రీ వరద రాజ స్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరివార దేవతలలో కనిపిస్తారు. మరికొన్ని చోట్ల అర్ధనారీశ్వర, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప లతో పాటు శివగాయక భక్తులైన అరవై మూడు మంది నయన్మారులలో ప్రముఖులైన తిరు జ్ఞాన సంబందార్, సుందరార్ మరియు అప్పార్ దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయాల వేటిల్లో నయన్మార్లు ఎవరూ పాటికాలను గానం చేయలేదు. అందువలన ఇవి "పడాల్ పేట్ర లేదా తేవర వైప్పు స్థలా"లలో గాని లేవు.
అన్ని గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ మహావిష్ణు, శ్రీ లింగోద్భవ మూర్తి, శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ దుర్గ ఉపస్థితులై ఉంటారు.
అన్ని చోట్ల నిర్దేశిత విధానంలో దినానికి నాలుగు పూజలు, అభిషేకాలు, అలంకరణ, అర్చన మరియు ఆరగింపులు ఉంటాయి. మాసశివరాత్రి, త్రయోదశి ప్రదోష పూజ, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో విశేష పూజలు, ఆరుద్ర ఉత్సవం, ఫల్గుణి ఉత్తిరాయణం, నెలకొక విశేష ఉత్సవం, మహాశివరాత్రికి, గణేశ మరియు దుర్గా నవరాత్రులలోతొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా అలంకారాలు, పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. స్థానికులు ఎక్కువగా విద్యార్థులుగా, వివాహార్ధులుగా, సంతానాభిలాషులుగా, గ్రహ దోష నివారణకు పూజలు చేయించుకొంటున్నారు.  ఈ పదునాలుగు క్షేత్రాలలో చెయ్యారు నది ఉత్తరాభిముఖంగా ప్రవహించడం వలన వీటిని కాశీ సమాన క్షేత్రాలుగా భక్తులు భావిస్తారు. నదిలో స్నానం చేసి ఏదో ఒక ఆలయంలోని స్వామి దర్శనం చేసుకోవడం వలన జన్మజన్మల కర్మ ఫలం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం.

సప్త కార్తె కాండ స్థలాలు 

ఇవి వరుసగా కంజి, కదలాడి, మాంబాక్కం, తెన్మతి మంగళం, ఎళ త్తూరు, పూండి మరియు కురివిమలై. ఈ ఏడు క్షేత్రాలు చెయ్యారు నదికి ఉత్తర దిశన ఒకదాని తరువాత ఒకటిగా ఉంటాయి. వీటిల్లో కొన్ని పురాతన నిర్మాణాలుగానే ఉండగా కొన్ని నూతన రూపును సంతరించుకొన్నాయి. 

శ్రీ కారై  కాండేశ్వర స్వామి ఆలయం, కంజి 

తిరువణ్ణామలై కి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం నుండి చతుర్దశ క్షేత్రాల సందర్శన యాత్ర ఆరంభం అవుతుంది. స్వామి తూర్పుముఖంగాను, అమ్మవారు పెరియనాయకి దక్షిణ ముఖంగాను కొలువుతీరి దర్శనం ప్రసాదిస్తారు. గణేష, అయ్యప్ప, శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉపాలయాలతో పాటు మిగిలిన ఆరు సప్త కారైకాండ క్షేత్రాల లింగాలు కూడా ఉంటాయి. విశాల ప్రాకారంలో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు. చక్కని నిర్మాణాలు, పరిశుభ్రమైన వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక అనుభూతులలో ఉంచుతాయి. ఉదయం ఆరు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి ఏడు గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, కదలాడి 

చాలా చిన్న పురాతన సాదా సీదా ఆలయం పచ్చటి పొలాల మధ్య, పర్వతాల ముందు చక్కని ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. కంజికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోవెల ఉదయం ఆరు నుండి తొమ్మిది తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు తెరిచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, మాంబాక్కం 

పదో శతాబ్దంలో చోళరాజుల చేత నిర్మించబడిన ఈ ఆలయాన్ని శాంభవరాయ మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ప్రశాంత ప్రకృతి ఒడిలో అలరారే ఈ క్షేత్రంలో ఎలాంటి విశేష నిర్మాణాలు కనపడవు. శివ కుమారులు మాత్రమే పరివారదేవతలుగా దర్శనమిస్తారు. కదలాడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఉదయం ఏడు నుండి పది వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు వరకు మాత్రమే తెరచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, తెన్మతి మంగళం 

తెన్ మహాదేవ మంగళం గా కూడా పిలవబడే ఈ క్షేత్రం ఏడు ఆలయాలలో మధ్యది. చూడబోయే మిగిలిన మూడు క్షేత్రాల లింగాలు ఒక మండపంలో దర్శమిస్తాయి. శ్రీ విశాలాక్షీ సమేత కాశీ విశ్వనాధ స్వామి కూడా దర్శనమిస్తారు. రెండు ఎకరాల విశాల స్థలంలో ఉన్న ప్రాంగణంలో చక్కని శోభ ఉట్టిపడే నిర్మాణాలు కనపడతాయి. కదలాడి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మధ్య కారై కాండ క్షేత్రం. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, ఎళత్తూరు 

దక్షిణ ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న  ఆలయంలో గర్భాలయం ఉత్తర దిశగా ఉంటుంది. అమ్మవారు పెరియనాయకి తూర్పు దిశగా కొలువుతీరి ఉంటారు. ప్రధాన ఆలయ విమానంతో పాటు ఉపాలయాల విమానాలు కూడా స్వర్ణవర్ణమయంగా శోభిస్తుంటాయి. 
పూండికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఈ క్షేత్రం. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, పూండి 

పూండి స్వామిగళ్ గా ప్రసిద్ధికెక్కిన అవధూత నడయాడిన ప్రాంతమిది. స్వామి జీవ సమాధిని దర్శించుకోవచ్చును. బాల వినాయక మరియు బాల సుబ్రహ్మణ్య సన్నిధులుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఈ ఊరిలో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపిన తరువాత శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయాన్ని తెరుస్తారు. ఈ సాదాసీదా ఆలయం ఎళత్తూర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, కురువిమలై 

ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో  ఉన్న రెండు ఆలయాలను కలిపి ఒక కారై కాండ స్థలంగా పరిగణిస్తారు. పక్కపక్కనే ఉండే ఆలయాలలో ఒకటి శ్రీ ఆది కారై కాండేశ్వర స్వామి కొలువైనది కావడం ప్రత్యేకం. రెండు ఆలయాలలో అమ్మవారు పెరియనాయకి దేవే ! పూండికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం సప్త కారై కాండ క్షేత్రాలలో ఆఖరిది. 
సప్త కారై కాండ క్షేత్ర దర్శన వివరాల తరువాత తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడితో సప్త కాండేశ్వర ఆలయాలు పూర్తి అవుతాయి. కురువిమలై నుండి సప్త కైలాస క్షేత్రాలలో ఆఖరుదైన మందకొళుత్తుర్ నుండి మొదలు పెట్టవచ్చును. కానీ స్వంత లేదా అద్దె వాహనంలో వెళితే ఉత్తరం పక్కన ఒక ఆలయాన్ని, దక్షిణం పక్కన ఒక ఆలయాన్ని దర్శించుకొంటూ శీఘ్రగతిన మొత్తం ఆలయాలను సందర్శించే అవకాశం కలదు. మార్గం గురించి స్థానిక అద్దె కార్ల డ్రైవర్లకు పూర్తి అవగాహన ఉంటుంది.

సప్త కైలాస / కళ్యాణ/ కైవల్య క్షేత్రాలు 

శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి ఆలయం, వాసుదేవంపట్టు 

స్థానిక పాలకుడైన వాసుదేవవర్మ పేరు మీద ఏర్పడిన ఊరు ఇది. ఆయన నిర్మించిన శిధిల కోట, శ్రీ వీరనారాయణ పెరుమాళ్ ఆలయం చూడవచ్చును. ఈ ఆలయంలో ఎనిమిది అడుగుల శ్రీ ఆంజనేయ విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది. పురాతనమైన శ్రీ మార్గసహాయేశ్వర స్వామి ఆలయం కూడా ఈ ఊరిలో ఉన్నది.  సప్త కార్తె కాండ క్షేత్రాలలో మొదటిదైన కంజి కన్నా ముందు వస్తుంది. తిరువణ్ణామలైకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నిర్మించబడినది. దక్షిణ ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే సప్త మాతృకల రూపాలను  చక్కగా మలచిన ద్వాదశ  స్తంభాలతో ఆస్థాన  మండపం కనపడుతుంది. గర్భాలయానికి ముందు ద్వారపాలకులను, నలవర, కాశీ లింగం, భైరవుడు, శ్రీ దక్షిణామూర్తిలతో పాటు నందీశ్వరుడు కొలువై దర్శనమిస్తారు. వినాయక, షణ్ముఖ ఉపాలయాలతో పాటు నవగ్రహమండపం, ప్రాంగణ ఈశాన్యంలో శ్రీ చిత్ర విచిత్ర గతుల సన్నిధి కూడా ఉంటుంది. భక్తులు దీర్గాయువు కొరకు వీరికి ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. అమ్మవారు శ్రీ సౌందర్యనాయకి విడిగా సన్నిధిలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 

శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం, తామరై పాక్కం 

శ్రీ త్రిపుర సుందరీ సమేత శ్రీ అగ్నీశ్వరస్వామి కొలువైన ఈ ఆలయం కుళోత్తుంగ చోళుడు పదో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. చూడచక్కని శిల్పాలు కనపడతాయి. నర్తన గణపతి, దక్షిణామూర్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరద రాజా స్వామి, శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రమణ్య స్వామి పరివార దేవతలుగా కొలువై ఉంటారు. ప్రధాన ఆలయ విమానంతో పాటు అన్ని ఆలయాల విమానాలు స్వర్ణవర్ణంతో శోభాయమానంగా కనపడతాయి. 
కంజికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ స్థలం. 

శ్రీ కైలాసనాథర్ ఆలయం, నర్తన పూండి 

దక్షప్రజాపతి ఇచ్చిన శాపాన్ని తొలగించుకోడానికి త్రిలోక సంచారి ఐన నారద మహర్షి ఈ క్షేత్రంలో పుష్కర కాలం తపమాచరించారట. ఈ క్షేత్ర విశేషాలు స్కంద పురాణంలో ఉన్నట్లుగా చెబుతారు. అందువలన తొలినాళ్లలో నారద పూండి అని పిలువబడి కాలక్రమంలో నర్తన పూండి గా మారినట్లుగా తెలుస్తోంది. 
సువిశాల ప్రాంగణానికి తూర్పున అయిదు అంతస్థుల రాజ గోపురం నిర్మించబడినది. ఉపాలయాలలో గణపతి, స్కందుడు, ఆదిగా గలవారు ఉంటారు. ప్రాంగణ పడమరలో ఉన్న "కోతలత్తు వినాయకుడు" అధికారాన్ని అనుగ్రహించేవానిగా ప్రసిద్ధి. ముఖ్యంగా రాజకీయ వర్గాల వారు ఎన్నికల సమయంలో విజయానికి ఈయనకు పూజలు చేయించుకొంటుంటారు. భక్తులు విద్యలలో విజయానికి, వివాహానికి, సత్సంతానానికి శ్రీ పెరియ నాయకీ సహిత శ్రీ కైలాసనాథర్ స్వామికి ప్రత్యేక పూజలు చేయించుకొంటుంటారు. 
చోళ  రాజులు నిర్మించిన ఆలయాన్ని హొయసల మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేయించినట్లుగా ఇక్కడి శాసనాలు తెలుపుతాయి. కంజికి పదునాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నర్తన పూండి. 

శ్రీ కైలాసనాథర్ ఆలయం, తెన్ పళ్లి  పట్టు 

శ్రీ కనకాంబికై సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి కొలువుతీరిన ఈ మధ్య కళ్యాణ క్షేత్రం పూండి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాతన నిర్మాణం. చిన్న ఆలయంలో శ్రీ గణేశుడు, శ్రీ సుబ్రమణ్య స్వామి సహా ఆది దంపతులు విడివిడిగా సన్నిధులలో దర్శనమిస్తారు. యోగ విశారదుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన శ్రీ మహాన్ సభాపతి స్వామి జన్మస్థలం. ఆలయానికి సమీపంలోనే ఆయన జీవ సమాధి ఉంటుంది. 

శ్రీ బాలక్రడేశ్వర స్వామి ఆలయం, పళం కోవిల్ 

దూరానికి ప్రస్ఫుటంగా కనిపించే అయిదు అంతస్థుల రాజగోపురంతో విరాజిల్లే ఈ ఆలయంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ బాలక్ర డేశ్వర స్వామి లింగరూపంలో, అమ్మవారు శ్రీ బాలాంబిక స్థానిక భంగిమలో రెండు సన్నిధులలో కొలువై దర్శనం ప్రసాదిస్తారు. స్వామివారు అనారోగ్యాన్ని హరించేవానిగా ప్రసిద్ధి. అమ్మవారు సుమంగళత్వం ప్రసాదిస్తారు అన్నది భక్తుల తరతరాల విశ్వాసం. పదవ శతాబ్ద చివరి కాలంలో మధురాంతక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఎన్నో విలువైన వస్తువులను కైంకర్యంగా సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. 2001 వ సంవత్సరం ఆలయ బావి పూడిక తీసే సమయంలో పురాతన పంచలోహ ఉత్సవిగ్రహాలు,పాత్రలు లభించాయి. నాయన్మారులతో సహా ఎందరో దేవీదేవతలు ఉపాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం పూండికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

శ్రీ ధర్మనాథేశ్వర స్వామి ఆలయం, మండకొళత్తూర్ 

ద్వాపరయుగంలో తమ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారట. పాండవాగ్రజుడు ధర్మరాజు నిత్య లింగరాజును నియమంగా అర్చించేవారట. అందువలన కాలగతిలో ఆయన పేరు మీదగా స్వామివారిని ఈ పేరుతొ పిలవడం ఆరంభమైనట్లుగా చెబుతారు. అమ్మవారు శ్రీ ధర్మసంవర్ధనీ దేవి. గత యుగం నుండి పదిహేనవ శతాబ్దం వరకు ఈ ఊరు గొప్ప వేద విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందినట్లుగా పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొన్నట్లుగా తెలియవస్తోంది. ఆలయ గోడల పైన తమిళనాట విశేష ఆలయాలుగా గుర్తింపు పొందిన అష్ట వీరట్ట స్థలాల నటరాజ మూర్తులను సహజ వర్ణాలతో సుందరంగా చిత్రించారు. 
ప్రణాళిక సిద్ధం చేసుకొని కారులో ఉదయాన్నే తిరువణ్ణామలై నుండి బయలుదేరితే మధ్యాహన్నానికల్లా అన్ని ఆలయాలను సందర్శించే అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చును. 
తిరువణ్ణామలై నుండి రానూ పోను కలిపి ప్రయాణ మార్గం వంద కిలోమీటర్లు ఉంటుంది. 


నమః శివాయ !!! 

 

  

Lord Ganesha

                                     విఘ్ననాయక వినాయక 







































2, జులై 2019, మంగళవారం

Elephant race at Guruvayur




  ఆహ్లాదం  మరియు  ఆధ్యాత్మికతల కలయిక అనేయోట్టం


                                                                                              



భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలోని ఆలయాలలో ఏనుగు ఉండటం ఒక తప్పనిసరి ఆనవాయితీ. అన్ని ప్రముఖ దేవాలయాలు నియమంగా  గజ సేవ నిర్వహించడం కూడా ఒక సంప్రదాయంగా నెలకొని ఉన్నది. ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు ధరించి,పుష్పాలతో తీర్చిదిద్దిన   అంబారీతో సుందరంగా అలంకరించిన ఏనుగు మీద నయనమనోహరంగా ముస్తాబు చేసిన ఉత్సవ మూర్తులను ఉపస్థితులను చేసి మాడ  లేదా నగరవీధులలో ఊరేగించడం అనాదిగా వస్తున్న ఒక సేవ లేదా సాంప్రదాయం.
 గజాలు చాలా తెలివిగలిగిన జంతువులు. సూక్ష్మ గ్రాహులు. నేర్పించే వాటిని సులభంగా గ్రహించగలవు. వాటి పెద్ద శరీరం, తల, చెవులు, దంతాలు, తొండం మరియు చిన్న తోక అన్నింటికీ మించి వాటి నడక చూపరులను దృష్టి మరల్చుకోకుండా చేస్తాయి. ప్రజలకు ఏనుగుల పట్లగల ఆకర్షణ అంతులేనిది.  వాటి విన్యాసాలను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏనుగులు పర్యాటకకులకు ప్రధాన ఆకర్షణగా  నిలుస్తున్నాయి.
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏనుగుల పట్ల గల ఆదరాభిమానాలు ఎనలేనివి. వారి పర్వదినాలలో జరిగే ఉత్సవాలలో ఏనుగుకు  ఉన్న స్థానం ప్రత్యేకమైనది. కేరళీయులు అభిప్రాయంలో ఏనుగులు లేని ఉత్సవం ఉత్సవం కానే  కాదు. అందులోనూ ఊరిలోని ఆలయ ఉత్సవం అయితే  అస్సలు తగ్గే ప్రసక్తి లేదు. తమ గ్రామంలో ఏనుగు లేక పోతే లక్షల రూపాయల అద్దె పోసి తీసుకొని రావడానికి సిద్ధపడతారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఉత్సవాలు వరసగా జరుగుతాయి.ఆ సమయంలో ఏనుగుల పెంపకందారులు, ఏనుగులు కలిగిన ఆలయాల వారు వారి ఏనుగులు  క్షణం తీరిక లేకుండా ఉంటారు. మలయాళీలకు ఏనుగు పట్ల అంతటి వ్యామోహం.
అందువల్లనే తమ ఆరాద్య దైవాలకు ఏనుగులనే కానుకగా సమర్పించుకొంటుంటారు. ముఖ్యంగా  శ్రీ గురువాయూరప్పన్ కి అత్యధిక సంఖ్యలో ఏనుగులను బహుమతిగా రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు ఇచ్చారు . అలా వచ్చిన ఏనుగుల కొరకు "పునత్తూరు కోట" అనే ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. నేడు సుమారుగా అరవై కి పైగా ఏనుగులు గల గురువాయూర్ దేవస్థానం గతంలో  ఒక్క ఏనుగు లేని పరిస్థితిలో ఉన్నదంటే నమ్మగలమా ! కానీ అది చరిత్రలో లిఖించబడిన నిజం. ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో ఒక్క ఏనుగు కూడా లేని రోజుల గురించి గురువాయూర్ ఆలయ చరిత్రలో ఉదాహరించబడినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఆలయాల వారు స్వచ్చందంగా వచ్చి ఉత్సవాలలో పాల్గొనేవారట.

గత చరిత్ర  

ప్రశాంతంగా ఉన్న కేరళలో  వాస్కోడిగామా అడుగు పెట్టడంతో అలజడులు మొదలయ్యాయి. నాటి దాకా  కాలికట్ (కోళికోడ్) పాలకులైన జొమారిన్ రాజులకు, కొచ్చిన్ వంశ పాలకులకు మధ్య ఉన్న సత్సంబంధాలు పోర్చుగీసు వారి రాకతో విచ్చిన్నమయ్యాయి. 
పదిహేనో శతాబ్ద కాలంలో గురువాయూర్ జొమారిన్ రాజులు ఎక్కువగా ఆరాధించే శ్రీ కృష్ణుడు కొలువైన చిన్న ఆలయం మాత్రమే!  ఆలయానికి ప్రత్యేక గజం అంటూ లేదు. ఇవ్వడానికి రాజులకు గజసంపద లేదు. ఆలయ ఉత్సవాల కొరకు నేటి కొడంగళ్ళూరుకు సమీపంలోని "త్రిక్కనమతిలకం" ఊరి విష్ణు ఆలయ గజరాజును తీసుకొని వచ్చేవారు. ఈ ప్రాంతం కొచ్చిన్ రాజుల పాలనలో ఉండేది. పాలకుల మధ్య తలెత్తిన విభేదాలు ఆలయ నిర్వాహకులకు దాకా   వ్యాపించాయి. దానితో త్రిక్కనమతిలకం ఆలయం వారు గురువాయూర్ ఆలయ ఉత్సవాలకు ఏనుగును ఇవ్వడానికి నిరాకరించారు.
ఉత్సవ సమయం దగ్గర పడింది. ఏనుగు లేదు. అద్దెకు తెచ్చే ఆనవాయితీ లేదు. ఆలయ నిర్వాహకులకు ఏమి చేయాలో పాలుపోలేదు. అప్పుడొక చిత్రం జరిగింది. సరిగ్గా ఉత్సవాలు ఆరంభమయ్యే సమయానికి త్రిక్కనమతిలకం ఆలయానికి చెందిన ఏనుగు తనంతట తానుగా గురువాయూర్ చేరుకొన్నది. దాని పాదాలకు ఉన్న తెగిన గొలుసులను చూడగానే అది వాటిని తెంపుకొని వచ్చింది అని అర్ధమయ్యింది. గురువాయూర్ కి త్రిక్కనమతిలకం నూట ఇరవై కిలోమీటర్ల దూరం .
విషయం తెలుసుకొన్న త్రిక్కనమతిలకం ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యం చెంది వచ్చి గురువాయూరప్పన్ ని దర్శించుకొని తమ తప్పిదనానికి క్షమాపణలు చెప్పుకొన్నారు.  ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఇక్కడ ప్రస్తావించవలసిన  విషయం ఏమిటంటే పోర్చుగీసు వారి తరువాత జొమారిన్ రాజులతో స్నేహం చేసిన డచ్చి వారు  ఆ రోజులలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన త్రిక్కనమతిలకం ఆలయాన్ని 1755వ సంవత్సరంలో పూర్తిగా నేలమట్టం చేయడం.

ఉత్సవాల ఆలయం  

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి శ్రీ గురువాయూరప్పన్ కొలువైన గురువాయూర్ ఆలయం. విశేష పౌరాణిక చారిత్రక విశేషాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. స్థానిక  హిందూ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే ఆలయాలలో ఒకటి. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రం నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి శ్రీ గురువాయూరప్పన్ దర్శనార్ధం తరలి వస్తుంటారు. నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుడు కొలువైన క్షేత్రంలో రోజుకొక విశేష పూజ జరుగుతుంది. అష్టమి తిధి మరియు రోహిణి నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రతి నెల ఒక ఉత్సవం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 
అన్నింటి లోనికి మళయాళ పంచాంగం ప్రకారం కుంభం మాసంలో పది రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాలు ముఖ్యమైనవి. కుంభం మాసం పుష్యమీ నక్షత్రం రోజున ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 
ఆ రోజు ఉదయం ధ్వజారోహణ, కలశ పూజ నిర్వహిస్తారు. తరువాత ఏనుగు మీద ఊరేగవలసిన వాసుదేవుని ఉత్సవిగ్రహాన్ని ప్రధాన పూజారి తన చేతులలో ఉంచుకొని మేళతాళాల మధ్య మాడ వీధులలో ఊరేగిస్తారు. ఆలయంలో ఏనుగు లేని రోజులకు గుర్తుగా నిర్వహించే దీనిని  "అనయిళ్ళ సీవేళి" అని అంటారు. ఆ రోజు సాయంత్రం "అనే యోట్టం" జరుగుతుంది. త్రిక్కనమతిలకం నుండి ఏనుగు తనంతట తానుగా ఆలయ ఉత్సవాల రోజున చేరుకొన్న సంఘటనకు గుర్తుగా  దీనిని నిర్వహిస్తున్నారు. 
ఈ పది రోజులు కథాకళి నాట్యాలు,  పౌరాణిక నాటకాలు, ఇతర నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పేరొందిన నాట్యకారులు, సినీ నటులు వీటిల్లో పాల్గొంటారు. చివరి రోజున "ఆరట్టు"(పవిత్ర స్నానం) తో ఉత్సవాలు ముగుస్తాయి. శబరిమల భక్తుల సందడి సద్దుమణిగిన తరువాత ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు గురువాయూర్ శోభను ఇనుమడిస్తాయి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరిస్తాయి. అన్నింటిలోకీ   అనే యోట్టం ప్రధానమైనది. 

అనెయోట్టం 

మలయాళంలో అనే అంటే ఏనుగు. అనె యోట్టం అనగా గజరాజుల పరుగు మరియు విందు  అని అర్ధం. దేవస్థానానికి ఉన్న గజాలలో బలమైన, ధృడమైన ఆరోగ్యవంతమైన కొన్ని గజాలను ఎంపిక చేస్తారు. వీటి సంఖ్య అయిదు నుండి ముప్పై దాకా ఉంటుంది. వీటి మధ్యనే  పరుగు పందెం ఉంటుంది. ఇవి పరుగు పందెంలో పాల్గొనడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నాయని దేవస్థాన పశు వైద్యులు ధృవీకరించాలి. గతంలో దేవస్థానం వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. కానీ 1986 వ సంవత్సరం నుండి ఏనుగులను రక్షించవలసి జంతువుల జాబితాలో చేర్చడం వలన  అటవీ శాఖ వారు,జంతు సంరక్షణ సమితీ వారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి  పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. పోలీసువారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.  
మధ్యాహన్నం మూడు గంటలకు పందెం ఆరంభం అవుతుంది. పరుగెత్తాల్సిన దూరం అయిదు వందల మీటర్లు.  గురువాయూర్ ఊరిలోనికి ప్రవేశించే ముందు ఆలయ తూర్పు ద్వారానికి వెళ్లే దారి వద్ద  పెద్ద గరుడ పక్షి బొమ్మ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని "మంజులాల్" అంటారు.  గజాలు వాటి మావటీలు సరిగ్గా రెండు గంటల నలభై అయిదు నిమిషాలకు అక్కడికి చేరుకొంటారు. 
పందెం ఏమిటంటే మంజులాల్ నుండి పరుగు ప్రారంభించి నేరుగా ఆలయ తూర్పు ద్వారం గుండా లోనికి ప్రవేశించి గర్భాలయానికి ఏడు  ప్రదక్షణలు  చేసి తిరిగి వెలుపలికి రావాలి. అలా మొదటగా తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన  గజాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎన్ని ఏనుగులు పందెంలో పాల్గొన్నా మొదటి  మూడు  గజాలనే ఆలయం లోనికి అనుమతిస్తారు. మిగిలినవి వెలుపలే నిలిచి పోతాయి. ఈ పందెంలో విజేత ఒక సంవత్సరం పాటు ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలో "తిరంబు"(ఉత్సవిగ్రహం) ను ఊరేగించే  అవకాశాన్ని దక్కించుకొంటుంది. గత మూడు సంవత్సరాలుగా " గోపి కన్నన్" విజేతగా నిలవడం విశేషం. పందెం ముగిసిన తరువాత దేవస్థానం వారు అన్ని గజాలకు ప్రత్యేక అనె యోట్టం(విందు) ఏర్పాటు చేస్తారు. 
ఏనుగుల పరుగు పందెం ఆద్యంతం ఉల్లాస మరియు ఉత్సాహభరిత  వాతావరణంలో జరుగుతుంది. స్థానికులు,దేశవిదేశాల పర్యాటకులు మరియు భక్తులు తరలివస్తారు. ఏనుగులు తరలి రావడంతో వారి ఆనందహేలలు మొదలవుతాయి. పందెం ఆరంభం కాగానే వారి ఉత్సాహం పూర్తిగా హద్దులు దాటుతుంది. తమ అభిమాన ఏనుగును ప్రోత్సహిస్తూ కేకలు పెడుతుంటారు. వాటితో పాటు పరుగులు పెడతారు. ఆ నాలుగు గంటల కాలం గురువాయూర్ సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ సంబరంలో భాగం అయిపోతారు. మరపురాని అనుభవాన్ని సొంతం  చేసుకొంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

(అనె యోట్టం గురించిన పూర్తి సమాచారాన్నిచ్చిన మిత్రులు, గురువాయూర్ దేవస్వం పూజారి శ్రీ రాజేష్ నంబూద్రి కి కృతజ్ఞతలు )





    


Sri Jagannatha Mandir, Koraput

                                          శబర శ్రీ క్షేత్రం 


శ్రీ జగన్నాథ స్వామి ఒరియా ప్రజలకు ప్రధమ ఆరాధ్య దైవం. సుందర సాగర తీరాన యుగాల క్రిందట అగ్రజుడైన శ్రీ బలదేవునితో మరియు సోదరి అయిన శ్రీ సుభద్ర దేవితో కలిసి  కొలువైన శ్రీ జగన్నాధుని స్మరణం, వీక్షణం ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా విశ్వసిస్తారు ఒడిసా వాసులు. హిందువులకు ముఖ్యమైన దర్శనీయ నాలుగు క్షేతాలలో ఒకటి అయిన పూరి శ్రీ జగన్నాథుని స్వగృహం. 
దేశంలో పేరొందిన ఆలయాలతో పోలిస్తే పూరి క్షేత్రంలో జరిగే పూజలు, అలంకరణలు, యాత్రలు మరియు ఆరగింపులు చాలా ప్రత్యేకంగా ఉండటం పేర్కొనవలసిన అంశం. కాలక్రమంలో తొలుత ఏర్పడిన పూరి ఆలయ తరహాలో అనేక ప్రాంతాలలో అదే శైలిలో ఆలయాలను స్థానిక భక్తులు నిర్మించుకున్నారు. ఒక్క ఒడిసా రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఏర్పడినాయి. శ్రీ జగన్నాథ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యింది. ఇలా ఇతర ప్రాంతాలలో శ్రీ జగన్నాథ మందిరాలు ఏర్పడటానికి మూలం తొలుత శ్రీ జగన్నాథుని ఆరాధించిన శబరులే కావడం విశేషం. 
ఆంధ్ర, ఒడిసా మరియు చత్తిస్గఢ్ రాష్ట్ర సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలుస్తారు. ఇది శబరల నివాసస్థానం. పూరిలో కొలువు తీరడానికి పూర్వం జగన్నాధుడు శబరుల పూజలందుకొనేవారని పురాణాల ద్వారా తెలుస్తున్న విషయం. నేటికీ పూరి ఆలయంలో శబరుల ప్రాధ్యాన్యత చెప్పుకోదగినదే ! సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట స్థానిక శబర నాయకులు ఇక్కడ జగన్నాధుని ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. చిన్న పర్వతాన్ని ఎంచుకొని "నీలాంచల" అని నామకరణం చేసి అక్కడ సంప్రదాయం ప్రకారం దారు వృక్షాన్ని ఎంచుకొని విగ్రహాలను మలచారట. పూరి ఆలయ నమూనాలో మందిరాన్ని నిర్మించుకొన్నారట. పూరిలోని ఆలయం ఉన్న ప్రాంతాన్ని నీలాచలమని, మందిరాన్ని శ్రీ క్షేత్రం అని పిలుస్తారు.  కాలగమనంలో ఈ మందిరం కూడా "శబర శ్రీ క్షేత్రం" గా పేరొందినది. ఈ ప్రాంతం కోరాపుట్ నగరంగా అభివృద్ధి చెందినది. 
నగర నడిబొడ్డున ఉన్న నీలాచల శిఖరాన కొలువై ఉన్న శ్రీ జగన్నాధ, శ్రీ బలదేవ మరియు శ్రీ సుభద్ర కొలువై ఉంటారు. కొండా పై భాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. భోగ, నట, ముఖ మండపాల తరువాత వచ్చే గర్భాలయంలోని రత్న బేది మీద సుందర అలంకరణ తో నేత్రపర్వంగా దర్శనమిస్తారు పురుషోత్తముడు సోదర మరియు సోదరితో కలిసి.  ప్రతి సంవత్సరం నూతన రథాలను తయారు చేస్తారు. 
పూరి క్షేత్రంలో జరిగే అన్ని పూజలు, యాత్రలు ఇక్కడ నిర్వహిస్తారు. కానీ ఒక తేడా ఉన్నది. పూరి ఆలయం లోనికి హిదువేతరులకు ప్రవేశం లభించదు. కానీ ఇక్కడ అలాంటి నిబంధన ఏదీ లేదు. పూరి లో స్వామివారికి సమర్పించే విధంగానే ఇక్కడ కూడా అన్న ప్రసాదం నివేదన చేస్తారు. దీని కోసం ఒక వంటశాల కలదు. పక్కనే భక్తులకు ప్రసాద వితరణ చేయడానికి "ఆనంద బజార్" కూడా కలదు. ప్రాంగణంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కేదారనాథ్, బద్రీనాథ్, అమరనాథ్, పుష్కర్, శ్రీరంగ, మధురై, శబరిమల, తిరుమల మూలవిరాట్టులతో పాటు శ్రీ పశుపతి నాధుని ఉపాలయాలు కనపడతాయి. పర్వత శిఖరాన విశాలమైన స్థలంలో దేవుల శైలిలో నిర్మించిన ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ శ్రీ జగన్నాధుడు వివిధ సందర్భాలలో దర్శనమిచ్చే హతి, నాగార్జున, శ్రీ నారసింహ, శ్రీ రామ, బంకచూడ, కాళియ మర్దన, లక్షీనారాయణ, రఘునాథ, వామన మరియు సోనా వేషాలలో దర్శనమిస్తారు. ఉపాలయాల్లో శ్రీ వినాయక, శ్రీ హనుమాన్, శ్రీ లక్ష్మీనారసింహ, శ్రీ లక్ష్మి, శ్రీ కాళి మరియు నవగ్రహాలు కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి నిత్యం స్థానిక మరియు దూరప్రాంత భక్తులు వస్తుంటారు. ఉదయం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరాయంగా తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రంలో ముఖ్యమైనది శ్రీ జగన్నాధ రథ యాత్ర. కొండా మీద నుండి బయలుదేరి రాయగడ రహదారిలో ఉండే గుండిచా మందిరం వరకు సాగే ఈ రథయాత్రలో పాల్గొనడానికి మరియు వీక్షించడానికి వేళా సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.  
కోరాపుట్ జిల్లా అంటేనే ప్రకృతికి పుట్టిల్లు. ఎన్నో రకాల వృక్షాలు, మొక్కలు, జలపాతాలతో నిండిన పర్వతాలతో, లోయలతో ఎటు చూసినా పరవశింపచేసే పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో పలు గుహాలయాలు కనపడతాయి. ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధికెక్కిన "అరకు" కోరాపుట్ కి సమీపంలోనే ఉంటుంది. కోరాపుట్ నగరంలో శ్రీ ముత్యాలమ్మ, శ్రీ తరణి, శ్రీ మహేశ్వర పురాతన ఆలయాలు ఉన్నాయి. తెలుగు జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా అన్ని పర్వదినాలలో రెండు ప్రాంతాల సంప్రదాయాల కలయిక కనిపించడం విశేషం. 
విశాఖపట్నం,ఒడిసా రాష్ట్రం నలుమూలల నుండి రోడ్డు మరియు రైలు మార్గాలలో కోరాపుట్ చేరుకోవచ్చును. చక్కని వసతి సౌకర్యాలు మరియు భోజనం లభిస్తాయి. 
    



( జులై 4న తారీఖున జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్బంగా) 





1, జులై 2019, సోమవారం

Nava Kailasam's Thirunelveli

                          నవగ్రహ క్షేత్రాలు - నవ కైలాసాలు 


                                                                                                       



కైలాసనాధుడు ఇలలో పెక్కు క్షేత్రాలలో స్వయంభూలింగ రూపంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయాలన్నీ భక్తులకు భువిలో కైలాస సమానంగాను,దర్శనీయ క్షేత్రాలుగా ప్రసిద్దమయ్యాయి. 
కానీ ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని దక్షిణ భాగాన ఉన్న తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలను సస్యశ్యామలం చేసే నది తమిరపారాణి. ఆ నదీతీరంలో ఉన్న నవ కైలాస క్షేత్రాలు మిగిలిన వాటికి భిన్నమైనవి.  
పురాణ గాధలలో పేర్కొన్న ప్రకారం నవ కైలాసాలు ముక్తి ప్రసాదాలు. 
శివ పార్వతుల కళ్యాణం వీక్షించడానికి ముల్లోకాల నుండి తరలి వస్తున్న వారితో భూమి ఉత్తర భాగంలో భారం పెరిగి ఒక పక్కకు ఒరగసాగిందట. పరమేశ్వరుడు సప్తమహర్షులలో ఒకరైన అగస్థ్య మునిని పిలిచి, శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ భాగానికి వెళ్ళమని ఆదేశించారట. చెమ్మగిల్లిన కనులతో "స్వామి!తమరి వివాహం వీక్షించే భాగ్యం నాకు లేదా ?" అని విషాదముగా ప్రశ్నించారట మహర్షి. ఆశీర్వదించిన మహేశ్వరుడు "నీవు ఎక్కడ ఉన్నా అక్కడ నుండి నా వివాహాన్ని చూడగలవు" అని వరం ప్రసాదించారట. త్రినేత్రుని ఆదేశం కాదనలేక వింధ్య పర్వతాలను దాటి దక్షిణాదిలో తాను ఎక్కడ విడిది చేశారో అక్కడ నిత్య పూజ నిమిత్తం ఒక లింగాన్ని ప్రతిష్టించేవారట. వాటినే నేటికీ మన రాష్ట్రంతో పాటు, కర్ణాటక మరియు తమిళనాడులలోని చాలా శివాలయాలలో కొలువైన లింగరాజుని "అగస్తేశ్వరుడు" అని పిలుస్తుంటారు. 
 పవిత్ర నదులలో స్నానమాడుతూ పుణ్య క్షేత్రాలనుసందర్శించుకొంటూ చివరికి పశ్చిమ కనుమలలో ఉన్న పొదిగై పర్వతాలను చేరుకొన్నారట. ఇక్కడే ఆయన సంస్కృత తమిళ భాషలకు లిపిని సృష్టించారని పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొనబడినది.  అగస్త్య మలై మీద అగస్త్య మహర్షి ఆలయం ఉన్నది. 
ఈ కొండల పైనుండే కైలాసనాధుని కరుణతో స్వామివారి కల్యాణ సంబరాలను కమనీయంగా దర్శించుకొన్నారట అగస్త్యుడు. ఈ ఉదంతం గురించి వరాహ, స్కాంద పురాణాలలో, రామాయణ మరియు మహాభారతాలలో విశదీకరించబడినది. రోమశ ముని అగస్త్యుని ప్రధమ శిష్యుడు. తపస్సు చేసి నందివాహనుని సాక్షాత్కారం పొందారు. కానీ అతను కోరిన మోక్షాన్ని ప్రసాదించలేనని, దానికి గురువాజ్ఞ కావాలన్నారట. తిరిగి వచ్చి గురువునకు జరిగింది తెలిపి ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశించమని అర్ధించారట రోమశ ముని. అగస్త్యుడు శిష్యుని ఆకాంక్షకు ఆనందించి తొమ్మిది కమలాలను తమిరబారాణి నదీప్రవాహంలో విడవమన్నారట. అవి తీరాన్ని తాకి శివలింగాలుగా మారిపోతాయి. ఆ దివ్య క్షేత్రాలలో సర్వేశ్వరుని అర్చించి, చివరగా నది సముద్రునితో కలిసే సంగమ స్థలంలో తపస్సు చేస్తే కోరిక సిద్ధిస్తుంది అని తెలిపారట. 
శిష్యుడు అదే విధంగా చేసి ముక్తిని పొందారు. అలా రోమశ మహర్షి వదిలిన పుష్పాల నుండి ఉద్భవించిన లింగాలు కొలువైన క్షేత్రాలు నవ కైలాసాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పాపనాశం, చేరన్ మహాదేవి, కొడగనల్లూరు, కూనత్తూరు, మూరప్పనాడు, శ్రీ వైకుంఠం, తెందూరిపెరై, రాజపతి మరియు సెందపూమంగళం. శైవ సంప్రదాయం ప్రకారం ఇవి మానవ జీవితాలను ప్రభావం చేసే నవ గ్రహాలకు ప్రతీక.జాతకరీత్యా ఏ గ్రహ ప్రభావంతో జీవితంలో ఎదుర్కొంటున్న   ఒడుదుడుకులు ఆ గ్రహ క్షేత్రాన్ని సందర్శించుకొంటే తొలగిపోతాయి అన్న విశ్వాసంతో ప్రతి నిత్యం ఎందరో ఈ క్షేత్రాలను సందర్శించుకొంటుంటారు.చోళలు నిర్మించిన ఆలయాలను, పాండ్య మరియు నాయక రాజులు అభివృద్ధి చేసినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
నవ కైలాస క్షేత్రాలన్నీ విశేష పురాణ నేపథ్యం కలిగినవి. అన్ని క్షేత్రాలలో (పాపనాశం తప్ప) కొలువైన ఆదిదంపతులను శివగామి సమేత కైలాసనాథర్ అనే పిలుస్తారు. కైలాస సమాన ప్రదేశాలు కదా ! కార్తీకమాసం,ఆరుద్రోత్సవం,నవరాత్రులు,గణేశ చతుర్థి,స్కంద షష్టి, శివరాత్రి,   త్రయోదశి ప్రదోష పూజలు, పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు. అన్ని చోట్లా శైవాగమన విధానాన్ని అనుసరించి రోజుకు ఆరు పూజలు జరుపుతారు. 
మరో విశేషం ఏమిటంటే పావన తమిరబారాణి నదీతీరంలో ఆళ్వారుల పాశురాలతో దివ్యదేశాల హోదా పొందిన తొమ్మిది శ్రీమన్నారాయణుని ఆలయాలు కూడా ఉన్నాయి.వీటిని నవ తిరుపతులు అని పిలుస్తారు.చిత్రమైన విశేషం ఏమిటంటే ఇవి కూడా నవగ్రహ క్షేత్రాలే.   కాకపోతే శ్రీ వైష్ణవ నవగ్రహ  క్షేత్రాలు. 

పాపనాశం  శ్రీ పాపనాశనాథర్ స్వామి అర్ధాంగి లోకనాయకి (ఉళగమ్మాళ్) సమేతులై కొలువైన ఈ క్షేత్రం రోమశ ముని వదిలిన పుష్పాలలో తొలి పుష్పం తీరాన్ని తాకడంతో ఏర్పడినది.  స్వామివారు ఆరోగ్యప్రదాత. అందుకని సూర్యగ్రహానికి సంకేతమీ ఆలయం. 
దేవతలను నాశనం చేయాలన్న ఉదేశ్యంతో తపమాచరిస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుని కుమారుడైన  ద్వస్థ అనే వాడిని సంహరించారు దేవేంద్రుడు. దాని వలన సంక్రమించిన బ్రహ్మహత్య పాపాన్ని తొలిగించుకోడానికి నీలకంఠుని ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి పాపాన్ని తొలగించుకున్నారు. ఆ కారణంగా స్వామిని పాపనాశనాథర్ అని పిలుస్తారు. 
సుందర జలపాతాలు, నదీ తీరం, వనాల మధ్య ప్రకృతి పూర్ణస్వరూపంగా దర్శనమిచ్చే పాపనాశం క్షేత్రంలో వినాయక, షణ్ముఖ, దక్షిణామూర్తి, దుర్గ ఆదిగా గల దేవీ దేవతలు ఉపాలయాలలో కొలువై ఉంటారు. విజయనగర మరియు నాయక రాజులు పునః నిర్మించిన ఈ ఆలయంలో రమణీయమైన శిల్పకళ కనపడుతుంది. ఆలయం ఉదయం ఆరు నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటుంది. జిల్లా కేంద్రమైన తిరునెల్వేలికి అరవై కిలోమీటర్ల దూరం. పాపనాశంలోని శ్రీ నారాయణ స్వామి, శ్రీ కాళీ అమ్మన్ ఆలయాలు తప్పక దర్శించుకోవలసినవి. 
ప్రకృతి ప్రేమికులకు ఈ క్షేత్ర సందర్శన ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలుగ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అంబ సముద్రం, విక్రమసింగ పురం,మన్నార్ కోయిల్, శివశైలం గ్రామాలలో గొప్ప పురాతన ఆలయాలను దర్శించుకోవడం అదనపు అవకాశం. 
చేరన్ మహాదేవి   శ్రీ కైలాసనాథర్ శివగామీ అంబాళ్ సమేతులై కొలువు తీరిన చేరన్ మహాదేవి నవ కైలాసాలలో రెండవది. ఇది చంద్ర క్షేత్రం. రోమశ మహర్షి తొలుత తపస్సు చేసి శివ దర్శనాన్ని పొందినది ఈ క్షేత్రంలోనే . అందుకే మహర్షి ఒక ఉపాలయంలో కొలువై ఉంటారు. 
గర్భాలయానికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇక్కడ కొద్దిగా పక్కకు ఉంటాడు. దీనికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. అంటరాని కులానికి చెందిన నందనార్ గొప్ప శివభక్తుడు. దళితులకు ఆ రోజులలో ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అయినా నందనార్ శైవ క్షేత్రాలను సందర్శించి వెలుపలి నుండే తన ఆరాధ్యదైవాన్ని ప్రార్ధించుకొనేవాడు. ఒకనాడు నందనార్ ఇక్కడికి వచ్చి వెలుపల నిలిచి ప్రార్ధిస్తున్నాడు. భక్తవత్సలుడు తన భక్తుడు చూడటానికి వీలుగా నందిని పక్కకు జరగమన్నారు. అందుకని నంది పక్కకు ఉంటాడు. 
ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ విశ్వనాథ, నటరాజ, సప్త మాతృకలు దర్శనమిస్తారు. నవగ్రహ మండపం ఉంటుంది.  ఆలయం ఉదయం ఏడు నుండి పది వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి ఆరువరకు మాత్రమే తెరిచి ఉంటుంది. చేరన్ మహాదేవి లో  శ్రీ వైద్యనాథర్ , శ్రీ భక్తవత్సల పెరుమాళ్, శ్రీ మారియమ్మన్ ఆలయాలు దర్శనీయాలు.   పాపనాశం నుండి చేరన్ మహాదేవికి  పాతిక కిలోమీటర్లు. 
కొడగనల్లూరు చేరన్ మహాదేవికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగనల్లూరు నవ కైలాసాల్లో మూడవ క్షేత్రం. ఈ ఆలయం మహాభారతంతో ముడిపడి ఉన్నట్లుగా క్షేత్ర గాధ తెలుపుతోంది. పరీక్షిత్తు మహారాజు మృతికి కారకుడైన తక్షకుడు (కర్కోటకుడు) పాపపరిహారార్ధం  శ్రీ కైలాసనాథర్ ని ప్రార్ధించి అనుగ్రహం పొందాడట. అంగారక క్షేత్రం. కుజ గ్రహ వక్ర దృష్టితో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నవారి ఉపశమనార్ధం పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో వృశ్చిక మరియు మేష రాశి వారికి కూడా దర్శనీయం. సాదాసీదాగా ఉండే ఈ ఆలయంలో ఒక విశేషం కనపడుతుంది. దీర్ఘకాలంగా వివాహం కాని యువతీయువకులు యాభై యెనిమిది పసుపు కొమ్ములు కట్టిన దండ నంది మెడలో వేస్తారు. దీని వలన కళ్యాణ ఘడియలు తొందరగా వస్తాయని విశ్వసిస్తారు. లెక్కలేనన్ని పసుపు కొమ్ముల దండలతో నంది నిండుగా కనపడతాడు. 
బృహదీశ్వర ఆలయం తరువాత అంత పెద్ద లింగాన్ని ఇక్కడ చూడవచ్చును. గర్భాలయంలోని కైలాసనాథర్ లింగానికి కట్టడానికి ఎనిమిది గజాల ధోవతులు ఎనిమిది కావాలంటే లింగ పరిమాణాన్ని ఊహించుకోవచ్చును.అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది. 
ఈ ఊరిలోని శ్రీ బృహన్ మాధవ స్వామి ఆలయం, శ్రీ అభిముక్తేశ్వర స్వామి ఆలయాలు పురాతనమైనవి. తప్పక సందర్శించవలసినవి. 
కున్నత్తూర్  కొడగనల్లూరు కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్నత్తూర్ నవ కైలాసాలలో నాలుగవది. ఇక్కడ కొలువైనదీ శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి. కానీ స్థానికంగా శ్రీ గోత పరమేశ్వరస్వామి కోవెలగా పిలుస్తారు. సాధారణంగా కనిపించే ఈ క్షేత్రం రాహు గ్రహ పరిహార క్షేత్రం మరియు పూజలకు ప్రసిద్ధి. జాతక రీత్యా రాహు వక్రదృష్టితో ఇక్కట్లు పడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు.  
మరెక్కడా చూడని విశేషం ఇక్కడ కనపడుతుంది. లింగం మీద సర్పాకృతి ఉంటుంది. ఇలాంటి విశేష లింగాన్ని  మరెక్కడా చూడలేము.  సాదా సీదా గా ఉండే ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. 
మూరప్పనాడు    నవ కైలాసాలలో అయిదవది. కున్నత్తూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి కొలువై ఉంటారు. గురు గ్రహ క్షేత్రం. ధను మరియు మీన రాశిలో జన్మించినవారికి కూడా దర్శనీయ క్షేత్రం. ఇక్కడ తమిర బారాణి నది ఉత్తర వాహిని. ఇక్కడ స్నానం సమస్త పాపహరం. గంగా స్నానముతో సమానం. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో అదే విధంగా నెల చివరి శుక్ర, శని వారాలలో వేలాదిగా భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు.మరో విశేషమేమిటంటే గర్భాలయం వద్ద నిలబడి చూస్తే నదిలో స్నానమాచరించి భక్తులు కనపడతారు. దక్షిణ గంగలో స్నానమాచరించే వారిని   గంగాధరుడు లోపలి నుండే ఆశీర్వదిస్తున్న అనుభూతి కలుగుతుంది భక్తజనులకు. 
విజయనగర మరియు నాయక రాజులు యుద్దానికి తరలి వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా గురువుకు పూజలు చేసేవారట. గురు అనుగ్రహం విజయాన్ని అదృష్టాన్ని తెస్తుంది అన్నది తరతరాల విశ్వాసం.
సూరపద్ముని అరాచకాల నుండి కాపాడమని మునులు నదీతీరంలో వరుసలో నిలబడి నందివాహనుని ప్రార్ధించారట. అందుకని ఈ పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ సమయంలో మునులు ప్రతిష్టించిన "మురంబేశ్వర స్వామి" లింగం ఈ సంఘటనకు గుర్తుగా చూపుతారు. 
ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. ద్వారపాలకులుగా వినాయకులు ఉంటారు.   భైరవ సన్నిధిలో రెండు భైరవ మూర్తులు ఉంటాయి. శునకంతో ఉన్నరూపాన్ని కాలభైరవగా  లేకుండా ఉన్న మూర్తిని వీరభైరవగా ఆరాధిస్తారు. 
ఈ ఆలయంలో కనపడుతుంది మరెక్కడా కనిపించని ప్రత్యేకత నంది విగ్రహంలో. వృషభ (ఎద్దు) మొహానికి బదులు అశ్వవదనంతో కనిపిస్తాడు శిలాద తనయుడు.దీనికి సంబంధించిన కధ ఇలా ఉన్నది. ఒక చోళ రాజుకు అశ్వవదనంతో కుమార్తె జన్మించినది. తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ఇక్కడికి వచ్చి తదైకదీక్షతో తపమాచరించి కైలాసనాథుని ప్రసన్నం చేసుకొన్నాడు. ఆయన నందిని బాలిక మోమును స్వీకరించమని ఆదేశించారు. అలా బాలిక మోము నందికి వచ్చింది. 
ఉపాలయాలలో సూర్య, అష్టలక్ష్మి, నయమ్మార్లు, పంచ ముఖ లింగం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వర స్వామి, శని భగవాన్ కొలువై ఉంటారు. గురు మరియు నవగ్రహ అనుగ్రహం కొరకు భక్తులు దక్షిణామూర్తి, శని భగవానునికి తొమ్మిది చొప్పున ప్రదక్షణాలు చేస్తారు. 
ఏనుగు, నెమలి మరియు గోమాత శివపూజ చేస్తున్నచెక్కడం, ఆంజనేయ మూర్తి, కన్నప్ప శిల్పం జీవకళ ఉట్టిపడుతూ చూపరులను నిలబెట్టేస్తాయి. ఈ విశేష ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది. 
శ్రీ వైకుంఠం పేరు తెలుపుతున్నట్లుగా ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ  క్షేత్రం. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ కోవెల నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో సూర్య క్షేత్రం. 
ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది నవ కైలాసాలలో ఆరవది శని క్షేత్రమైన 
శ్రీ కైలాసనాథర్ స్వామి ఆలయం. చోళ, పాండ్యులు నిర్మించిన ఆలయాన్ని నాయక రాజులు అభివృద్ధి చేశారు అని శాసనాలు తెలియజేస్తున్నాయి. చక్కని శిల్పాలకు నిలయం. జన్మ, అర్ధాష్టమ,ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు విశేష సంఖ్యలో వస్తుంటారు. 
పరివార దేవతలుగా వినాయక, సుబ్రహ్మణ్య, దుర్గ, దక్షిణామూర్తి కనపడతారు. శని దేవుడు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఆలయ కావలి దేవత భూతనాథర్ విగ్రహం చెక్కతో చేసినది కావడం ఒక విశేషంగా పేర్కొనాలి. 
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది. మూరప్ప నాడు నుండి శ్రీ వైకుంఠం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
తెందురి పెరై ఈ క్షేత్రం కూడా నవ కైలాసాలు మరియు నవ తిరుపతులలో స్థానం పొందినది. 
శ్రీ మకర నెడుంకులైనాథ పెరుమాళ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది శ్రీ శివగామీ సమేత శ్రీ కైలాసనాథర్ ఆలయం. నవ కైలాసాలలో ఏడవది. ఇది బుధ క్షేత్రం. 
ప్రాంగణ నలుదిక్కులా వల్లభ గణపతి,శక్తి వినాయక,కన్నెమూల గణపతి, సిద్ది వినాయక కొలువై ఉంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, దక్షిణామూర్తి ఆదిగా గలవారు పరివార దేవతలుగా కొలువుతీరి ఉంటారు.  వేదరూపిగా పేర్కొనే అష్టభుజ భైరవునికి అష్టమి మరియు పౌర్ణమినాడు విశేష పూజలు చేస్తారు. బుధుడు ప్రత్యేక సన్నిధిలో ఉంటారు. బుధ శాంతికి భక్తులు పెసలు, పచ్చ వస్త్రాలు సమర్పించుకొంటుంటారు. 
నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఉదయం ఎనిమిది నుండి పది వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీ వైకుంఠం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. 
రాజపతి తెందురి పెరై కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేతు క్షేత్రమైన రాజపతి. 
రోమశ మహర్షి వదిలిన తొమ్మిది పుష్పాలలో ఆఖరి పుష్పం ఆగిన స్థలం ఇదే ! కేతువు శివానుగ్రహం కొరకు ఇక్కడ తపస్సు చేశారట.
అవివాహితులు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, సంతానం లేని దంపతులు అధిక సంఖ్యలో వస్తుంటారు.కేతు పరిహార పూజలు ఆదివారాలు మధ్యాహన్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర దాకా నిర్వహిస్తారు. తిరిగి మంగళవారాలు ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు జరుపుతారు. మంగళ వారాలు హోమం కూడా ఉంటుంది.
గర్భాలయంలో శ్రీ కైలాసనాథర్ లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఉపాలయాలలో ఆది కైలాసనాథర్, శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, నటరాజ స్వామి, దక్షిణామూర్తి, నయమ్మారులలో ప్రముఖులైన సంబందర్, సుందరార్, అప్పార్, మాణిక్యవాసగర్ కొలువై ఉంటారు.
దక్షిణ కాళహస్తీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది.
సెంద పూమంగళం నవ కైలాసాలలో ఆఖరిది. శుక్ర క్షేత్రం. ఇక్కడ కుబేరుడు శివగామి సమేత   కైలాసనాథర్ ని ఆరాధించారట. గర్భాలయం విమాన గోపురం పైన  సతులైన శంఖనిధి, పద్మనిధిలతో పాటు ఉన్న కుబేరుని చూడవచ్చును.
ఉపాలయాలలో గణపతి, మురుగన్, చొక్కనాథర్, చండికేశ్వరార్, దక్షిణామూర్తి, భైరవుడు,  కొలువై ఉంటారు. నవగ్రహాలు, సప్త మాతృకలు మరియు అరవై మూడు మంది నయమ్మార్లు విడిగా మండపాలలో ఉంటారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ నవ కైలాసాల లింగాలను సందర్శించుకొనవచ్చును.
ఈ క్షేత్రం రాజపతి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక్కడితో నవగ్రహ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచిన నవ కైలాసాల సందర్శనం ముగిసినట్లే. సెంద మంగళం నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరుపాడై వీడు లలో ఒకటైన తిరుచెందూర్ ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సాగరతీర ఆలయం ఆధ్యాతిక భావాలతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
తిరుగు ప్రయాణంలో కొత్తగా నిర్మించిన వన తిరుపతి శ్రీ బాలాజీ ఆలయాన్ని,నవ తిరుపతులను  దర్శించుకొని రాత్రికి తిరునెల్వేలి చేరుకోవచ్చును. తిరునెల్వేలిలోని శ్రీ నెల్లిఅప్పార్ ఆలయం శిల్పకళకు ప్రతిరూపం. సరైన ప్రణాళిక తో వెళితే దగ్గరలో ఉన్న టెంకాశీ, కుర్తాళం లాంటి క్షేత్రాలను కూడా సందర్శించుకునే అవకాశం లభిస్తుంది.

నమః శివాయ !!!!


  

    


30, ఏప్రిల్ 2019, మంగళవారం

Kanaka Dhara Sthothram


   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
కనకధారా స్తోత్రం

వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం  
1. అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్!
అంగీకృతాఖిల విభూతి రసంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!
2. ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని !
మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !!
3. విశ్వా మరేంద్ర పదవి భ్రమ దానదక్షమానంద హేతు రదికం మురవిద్విషోపి.
ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !!
4.అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం!
అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !!
5. బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి !
కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !!
6. కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !!
7. ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!!
మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః !
8. దద్యాద్దయాను పవనోద్రవిణాంబు ధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !!
దుష్మర్మ ఘర్మమపనీయ చిర్టయదూరం నారాయణ ప్రణయనీ నయనాంబువహః !
9. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే !
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!
10. గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి !
      సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!
11. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై !
      శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!
12. నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !
      నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై !!
13. నమోస్తు హేమాంభుజపీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై
      నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ ఙ్గయుధ వల్లభాయై !!
 14. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణో రురసిస్థితాయై 
       నమోస్తు లక్ష్మయ్ కమలాలయై నమోస్తు దామోదర వల్లభాయై 
  15.నమోస్తు కాన్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై !!
       నమోస్తు దేవాదిభి రర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై   
   
16. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !
      త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!
17. యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలర్థ సంపదః !
     సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!
18. సరసిజనిలయే ! సరొజహస్తే ! దవళత మాంశుక గందమాల్య శోభే !
     భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే ! త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!
19. దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !
     ప్రాత ర్న మామి జగతాం జననీ మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!
20. కమలే ! కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితై రపాంగైః !
     అవలోకయ మా మకించనానం ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!
21. స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం త్రయీ మయీం త్రిభువనమాతరం                     రమాం  !
     గుణాధికా గురుతుర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః !!

సువర్ణదారా స్తోత్రం యః శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేత్ స కుబేర సమోభవేత్ !!!


4, మార్చి 2019, సోమవారం

pancha kosha yatra





                        పుణ్య ప్రదం పంచ కోశి యాత్ర


భగవదనుగ్రహం కొరకు భక్తులు ఎన్నో తీర్థ పుణ్య క్షేత్రాల యాత్రలు చేస్తుంటారు. చార్ ధామ్ యాత్ర, కాశీ యాత్ర, కైలాస మానససరోవర యాత్ర, అమరనాథ్ యాత్ర, దక్షిణ దేశ యాత్ర ఇలా చాలా ! వీటన్నింటిలో ముఖ్యమైన సంకల్పం ఆయా ప్రాంతాలలో దేవాలయాలలో వివిధ రూపాలలో కొలువైన భగవంతుని సందర్శనం. కానీ దీనికి భిన్నమైన యాత్ర ఒకటి ఉన్నది. అదే పంచ కోశ యాత్ర. దీనినే పంచ క్రోష యాత్ర అని కూడా అంటారు. అనగా నిర్ణీత వ్యవధిలో (ఒక రోజు నుండి అయిదు రోజుల లోపల) నిర్ణయించబడిన అయిదు ఆలయాలను దర్శించుకోవాలి. యాత్ర చేయాలి అనుకొన్న రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదులు చేసి బయలుదేరాలి. రోజంతా ఉపవాసం ఉండాలి(ఒక రోజు అయితే).ద్రవ పదార్ధాలను తీసుకోవచ్చును.యాత్రను కాలినడకన (చెప్పులులేకుండా) చేయాలి.
పురాణ కాలం నుండి ప్రజలే కాదు పాలకులు కూడా ఈ యాత్ర (పరిక్రమ / ప్రదక్షణ) చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్రేతాయుగంలో దశరధ నందనులు నలుగురూ తమ భార్యలతో కలిసి అయోధ్యతో పాటు  వారణాసిలో కూడా ఈ పరిక్రమ చేసినట్లుగా తెలుస్తోంది. అలానే ద్వాపర యుగములో పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా వారణాశిలో పంచ కోశ (క్రోష) యాత్ర చేపట్టినట్లుగా పురాణాలలో పేర్కొనబడినది.
పంచ కోశి  (క్రోష) యాత్రను ఉత్తరాదిన పంచ కోశి పరిక్రమ (ప్రదక్షణ) అని అంటారు. దక్షిణాదిన పంచ క్రోశ యాత్ర అంటారు. కోశ (కోశి ) లేదా క్రోష (కోషి) అన్న పదం తోనే తేడా వస్తోంది అని అనుకోవాలి. ఎందుకంటే క్రోశి లేదా క్రోసు అన్న పదాలకు అర్ధం దూరం అని. పూర్వ కాలంలో దూరాన్ని క్రోసులలో కొలిచేవారు. ఒక క్రోసు అంటే నేటి లెక్కల ప్రకారం మూడుంపాతిక కిలోమీటర్లతో సమానం. దీని ప్రకారం పంచ కోశి అంటే అయిదు క్రోసుల దూరంలో ఉన్నట్లుగా అర్ధం చేసుకోవాలి. అనగా ఒక క్షేత్రం నుండి మరో క్షేత్రానికి మధ్య దూరం మూడుంపాతిక నుండి పదహారు కిలోమీటర్ల మధ్య ఉండాలి. కానీ అలా లేదు.ఎక్కువే ఉంటుంది. అందువలన దూరాన్ని సరైన ప్రమాణంగా తీసుకోకూడదు అని అంటారు కొందరు.
 ఉత్తరాదిన చెప్పే పంచ కోశి అన్నది చాలా వరకు సరైన అర్ధం వచ్చే విధంగా ఉన్నది అని అంటారు. ఎలా అంటే కోశి అనగా అర అనే అర్ధం ఉన్నది. యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరాలను పంచ కోశాలు ఆవరించి ఉంటాయి అని చెబుతారు. అవి "అన్నమయ కోశం" ఇది భౌతిక శరీరం. పంచ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండే ఈ శరీరం ఆహరం (అన్నం)మీద ఆధారపడి ఉంటుంది. 2. "ప్రాణమయ కోశం" ఇది భౌతిక శరీరానికి మూలమైన శక్తి. శరీరంలో ఆహార, ప్రాణవాయువును రక్తం ద్వారా సరఫరా, మెదడు నుండి జ్ఞానేంద్రియాలకు సూచలను చేయడానికి ప్రాణంశక్తి తప్పనిసరి. మూడవదైన "మనోమయ కోశం" మనిషి అంతరంగంలో తలెత్తే భావోద్వేగాలకు కారణం. మానవులను అన్ని విధాలుగా బలహీనులను చేసే కామ, క్రోధ, లోభ,మద మరియు మాత్సర్యాలు ఈ కోశం పరిధి లోనివే ! నాలుగోదైన విజ్ఞానమయ కోశం మానవుడు తాను చేస్తున్న పనులలో తప్పొప్పులను విశ్లేషణ చేసుకొనే పరిణితి ఇస్తుంది. విషయ అవగాహన పెంపొందుతుంది.  అంతర్గత ఆలోచల మీద నియంత్రణ సాధించగలుగుతుంది. నేను అనే అహం నశిస్తుంది. సర్వాంతర్యామి అయిన పరమాత్మ పట్ల సంపూర్ణ శరణాగతి దిశగా అడుగులు వేయిస్తుంది. ఆఖరిది ఆనందమయ కోశం. ఆత్మ పరమాత్మ వేరు కాదు. ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడమే ముక్తి అన్న ఆధ్యాత్మిక గ్రహింపు పొందటమే ఈ దశ.
మనిషి తన నాలుగు దశల జీవితంలో మొదటి రెండింటిలో సర్వసాధారణమైన భౌతిక సుఖాల కోసం ఆరాటపడతాడు. మూడో దశలో తనకు తెలియకుండానే భగవంతుని వైపుకు నడుస్తాడు. ఈ దశ చివరి భాగంలో తనను తాను తెలుసుకొనే ప్రయత్నంలో ఆధ్యాత్మికత భావనలను సొంతం చేసుకొంటాడు. ఆఖరి దశలో మొదటి మూడు చాలా వరకు మూసుకొని పోతాయి. అప్పుడు నాలుగో అర పూర్తిగాను, అయిదవది కొంతమేర తెరుచుకొంటాయి. నాలుగో దశ అంతిమ కాలంలో అయిదవ అర పూర్తిగా తెరుచుకొంటుంది.
ఈ యాత్ర లేదా పరిక్రమ లక్ష్యం అదే ! ఒక క్రమపద్ధతిలో మనిషిని  ఆనందమయమైన మార్గం లోనికి  మళ్ళిస్తుంది. అందుకే ఇది "పంచ కోశ (కోశి) పరిక్రమ లేదా యాత్ర అని విశ్లేషించారు.
పంచ కోశ యాత్ర ప్రధానంగా వారణాసి,అయోధ్య,బ్రజ్ (బృందావనం),ఉజ్జయిని, తమిళనాడు లోని కుంభకోణం మరియు తిరునెల్వేలిలలో ప్రతి సంవత్సరం భక్తి విశ్వాసాలతో లక్షలాది మంది భక్తులు చేస్తుంటారు.
ఈ యాత్ర ఒక్కో చోట ఒక్కో రోజున ప్రారంభం అవుతుంది.సహజంగా అధిక మాసంలో లేదా ఫాల్గుణ, వైశాఖ, చైత్ర మాసాలలో కృష్ణపక్ష ఏకాదశి నాడు చేపడతారు.వారణాసిలో శివరాత్రి నాడు లేదా శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు. అయోధ్య,ఉజ్జయిని, బ్రజ్ (బృందావనం) లలో కార్తీక మాసంలో చేస్తారు. తమిళనాడులోని రెండు క్షేత్రాలలో చైత్రమాసంలో   చేస్తారు.

ఉత్తరాదిన పంచ కోశి పరిక్రమ చేసే నాలుగు ప్రదేశాలు ప్రసిద్ధి చెందిన సప్త ముక్తి క్షేత్రాలలో భాగమే !


వారణాసి పంచ కోశి పరిక్రమ 



ఎనభై కిలోమీటర్ల వారణాసి పంచ కోశి పరిక్రమ కాలినడక చేయడానికి అయిదు రోజులు పడుతుంది. పాల్గొనే భక్తులు సూర్యోదయానికి ముందే మణికర్ణిక లేదా అస్సి ఘాట్ల దగ్గరకు చేరుకొంటారు. గంగా స్నానం చేసి, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని యాత్ర ప్రారంభిస్తారు. భక్తులు కాలి నడకన వరసగా కర్దమేశ్వర, భీంచెండి, రామేశ్వర్, శివపూర్, కపిల్ ధార దర్శించుకొని తిరిగి మణికర్ణిక వద్దకు వస్తారు. ఎక్కడ నుండి ఆరంభిస్తామో అక్కడే పరిక్రమ ముగించాలి. ఈ అయిదు ఆలయాలు విశేషమైనవి. నడవలేనివారు వాహనంలో వెళ్లి తప్పని సరిగా దర్శించుకోవలసినవి.ఈ పరిక్రమ మార్గంలో అనేక పురాతన విశిష్ట ఆలయాలను కూడా దర్శించుకొనే అవకాశం లభిస్తుంది. అలసట తీర్చుకోడానికి ఈ ఆలయాలలో తగు మాత్రాపు సదుపాయాలు లభ్యమౌతాయి.లక్షల మంది పాల్గొంటారు కనుక అధికారులు విశ్రాంతి తీసుకోడానికి మండపాలు నిర్మిస్తారు. వదాన్యులైన నగర ప్రజలు పరిక్రమ చేసేవారికి ఆహార సదుపాయం అందచేస్తారు. అన్నపూర్ణ కొలువైన కాశీ క్షేత్రం కదా!
అలహాబాదు, అయోధ్య, మథుర లాంటి దూర ప్రాంతాల నుండి భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో పంచ కోశి ప్రదక్షణలో పాల్గొంటారు.


అయోధ్య పంచ కోశి పరిక్రమ


శ్రీ మహావిష్ణు అవతార రూపమైన శ్రీ రాముని జన్మస్థలం అయోధ్య.హిందువులకు పరమ పవిత్ర దర్శనీయ తీర్ధ క్షేత్రం. ఇక్కడ మూడు రకాల పంచ కోశి పరిక్రమ చేస్తారు.
ఒక రోజులో పూర్తి చేసే పదునాలుగు కిలోమీటర్ల పరిక్రమ మొదటిది. కార్తీక మాస ఏకాదశి నాడు  అత్యధికంగా భక్తులు, సాధుసంతులు చేపడతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాక పక్క రాష్ట్రాల మరియు నేపాల్ నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. పావన సరయూ నదిలో స్నానమాచరించి యాత్ర పాదనడకను కేశవపురం దగ్గర ప్రారంభిస్తారు. నృత్యగానాలతో, భజన కీర్తనలతో పరిపూర్ణ భక్తిభావంతో సాగుతుంది.  చక్రతీర్ధ, నయా, రామ, దశరధ ఘాట్లతో పాటు, జోగియాన్, రణోపాలి, జల్పానల మరియు మహతాబ్ బాగ్ ల మీదగా ఈ పరిక్రమ సాగుతుంది. రెండవది అయోధ్య మరియు పక్కనే ఉన్న ఫైజాబాద్ లో గల ప్రసిద్ధ మందిరాల దర్శనం చేస్తారు. నలభై అయిదు కిలోమీటర్ల ఈ ప్రదక్షణను కూడా ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు.
మూడవది శ్రీరామనవమి నాడు ప్రారంభిస్తారు. శ్రీ రాముని పాలనలో ఉన్న నేటి ఉత్తరప్రదేశం లోని ఆరు జిల్లాల లోని ఎనభై నాలుగు ఆలయాల సందర్శన చేసుకొంటారు. దీనికి ఇరవై ఒక్క రోజలు పడుతుంది.



బ్రజ్ (బృందావనం) పంచ కోశి పరిక్రమ



హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యస్థలం,స్వయం శ్రీ కృష్ణుడు నడయాడిన దివ్యక్షేత్రం బృందావనం. ఇక్కడ కూడా భక్తులు రెండు విధములైన పంచ కోశి యాత్ర చేస్తారు. కార్తీక మాస కృష్ణ పక్షఏకాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి ఇస్కాన్ ఆలయం నుండి ఆరంభించి కృష్ణ బలరామ ఆలయం, గౌతమ మహర్షి ఆశ్రమం,వరాహ ఘాట్ , మోహన్ తీర్, కాళియ ఘాట్, ఇమ్లితల, శృంగార వాట్, కేశి ఘాట్, తేకరి రాణి ఆలయం, శ్రీ జగన్నాధ మందిరం మరియు శ్రీ చైతన్య మహాప్రభు ఆలయం దర్శించుకొని తిరిగి ఇస్కాన్ ఆలయం చేరి యాత్రను ముగిస్తారు. దీనికి ఒక రోజు పడుతుంది.
రెండవది మండలం (41 రోజులు) నుండి రెండు మాసాలు పడుతుంది. గోవర్ధనగిరి, మథుర ఇలా ఎన్నో విశేష స్థలాల లోని పురాతన పురాణ ప్రసిద్ధి చెందిన ఎనభై నాలుగు మందిరాలను దర్శించుకొంటారు. చౌరాసియా పరిక్రమగా పేరొందిన దీనిని ఎక్కువగా సాధువులు చేపడుతుంటారు.



ఉజ్జయిని పంచ కోశి పరిక్రమ



అయోధ్య తరువాత అంత వైభోగంగా పంచ కోశి యాత్ర జరిగేది ఉజ్జయిని లోనే! సంవత్సరానికి ఆరు లక్షల పైచిలుకు ప్రజలు పాల్గొంటారు. కారణమేమిటంటే ఉజ్జయినీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. అలానే అష్టాదశ పీఠాలలో ఒకటి. ఈ క్షేత్ర గొప్పదనం అక్కడితో ఆగలేదు.  సప్త ముక్తి క్షేత్రాలైన అయోధ్య, మథుర, హరిద్వార్, వారణాసి, కంచి, ద్వారకలతో సమానమైన స్థానాన్ని పొందినది. భక్తులు వైశాఖ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి నాడు పంచ కోశి పరిక్రమ  ఆరంభించి అమావాస్య నాటికి  ముగిస్తారు.
 క్షిప్ర నదిలో స్నానమాచరించి శ్రీ మహాకాళేశ్వరుని, శ్రీ ఉజ్జయిని మహాకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షణ శ్రీ నాగచంద్రశేఖర మహాదేవుని అనుమతితో ప్రారంభిస్తారు. ఉజ్జయిని మహానగరానికి నాలుగు ద్వారాలుగా పురాణ ప్రసిద్ధి పొందిన పింగళేశ్వర్ (తూర్పు), విల్వకేశ్వర్ (పడమర), ఉత్తరేశ్వర్ (ఉత్తరం) మరియు కావ్యారోషన్ మహాదేవ్ (దక్షిణం) లతో సహా సుమారు ఎనభై నాలుగు  పురాతన శైవ క్షేత్రాలను సందర్శించుకొని చివరగా  శ్రీ నాగచంద్రశేఖర్ స్వామిని దర్శించుకొంటారు. శ్రీ మహాకాళేశ్వర్ ఆలయం పైన ఉండే శ్రీ నాగ చంద్రశేఖర్ ఆలయం సంవత్సరానికి రెండు సార్లే తెరుస్తారట. మొదట నాగ పంచమికి, తిరిగి పంచ కోశి పరిక్రమ రోజునేనట. చాలా ప్రత్యేకతలు కలిగిన మందిరం.


ఇక దక్షిణాదిన భక్తులు పంచ క్రోశ యాత్ర రెండు క్షేత్రాలలో చేపడతారు. మొదటిది ఆలయాల నగరంగా ప్రసిద్దికి ఎక్కిన కుంభకోణం, రెండవది తిరునెల్వేలి దగ్గర.

తిరునెల్వేలి పంచ క్రోశ యాత్ర 

తమిళనాడు రాష్ట్ర దక్షిణ భాగాన పశ్చిమ కనుమల దగ్గర ఉంటుందీ జిల్లా. ఎన్నో అద్భుత ఆలయాలకు నిలయం. చైత్రమాసంలో కృష్ణ పక్ష ఏకాదశి నాడు పెద్ద సంఖ్యలో పంచ క్రోశ యాత్ర చేపడతారు.
తిరునెల్వేలి కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశం దగ్గర నుండి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. చోళ రాజులు నిర్మించిన పాపనాశర్ స్వామి ఆలయం ఈ జిల్లాలో ఉన్న నవ కైలాసాలలో తొలి క్షేత్రం. సూర్య స్థలం. భక్తులు పావన తమిరబారాణి నదిలో స్నానం చేసి, పాపనాశర్ దర్శనం చేసుకొని వరుసగా శివశైలం,ఆళ్వార్ కురిచ్చి,కడియం,తిరుప్పుదై  మరుదూర్ లోని విశేష శివాలయాలను సందర్శించుకొని తిరిగి సాయంత్రానికి పాపనాశం చేరుకొంటారు. వాహనంలో అయితే ఒక రోజే ! అదే కాలినడకన అయితే రెండురోజులు పడుతుంది. మొత్తం దూరం డెబ్బై రెండు కిలోమీటర్లు.
భక్తులు పంచ క్రోశ యాత్ర తరువాత టెంకాశి, కుర్తాళం, అంబసముద్రం, మన్నార్ కోయిల్ లాంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చును. చిక్కని అడవులు, జలపాతాలతో  సుందర ప్రకృతికి నిలయం ఈ ప్రాంతం.



కుంభకోణం పంచ క్రోశ యాత్ర


తమిళులకు గంగతో సమానమైన కావేరి నదీ తీరాన ఎన్నో అద్భుత ఆలయాలను చోళులు, పాండ్యులు, నాయక రాజులు నిర్మించారు. అడుగడుగునా ఒక చక్కని ఆలయం కనపడుతుంది.
కుంభకోణం పట్టణం ఎన్నో ప్రత్యేక ఆలయాలకు నెలవు. సంవత్సరమంతా యాత్రీకులతో కోలాహలంగా ఉంటుంది. చైత్రమాసంలో భక్తులు చేపట్టే పంచ క్రోశ యాత్ర లో సందర్శించే అయిదు ఆలయాలు విశేషమైనవి. అన్నీ శివాలయాలైనా దేనికదే ప్రత్యేకమైనవి.భక్తులు             మహామాహం పుష్కరణిలో స్నానమాచరించి ఆది కుంభేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆదిదంపతుల కుమారుడు శ్రీ స్వామినాథన్ వల్లీ దేవసేన లతో కలిసి కొలువైన స్వామిమలై చేరుకొంటారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కొలువైన ప్రసిద్ధ ఆరుపాడై వీడు ఆలయాలలో ఒకటి స్వామిమలై.
రెండవ క్షేత్రం శ్రీ ఐరావతేశ్వరుడు కొలువైన ధారాసురం. అద్భుత శిల్పకళకు నిలువెత్తు రూపం ఈ ఆలయం. ప్రస్తుతం పురావస్తుశాఖ అధీనంలో ఉన్నదీ ఆలయం. తరువాత మజిలీ  కరుప్పూర్. శ్రీ అభిరామీ సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వార్లు కొలువై ఉంటారు. కానీ  పేట్టై కాళీయమ్మన్ ఆలయంగా ప్రసిద్ధి.  అక్కడ నుండి నవగ్రహ క్షేత్రాలలో రాహు గ్రహ క్షేత్రం  తిరునాగేశ్వరం చేరుకొంటారు. రాహు లింగంతో పాటు శ్రీ గిరి గుజాంబికా సమేత శ్రీ నాగనాథర్ స్వామిని దర్శించుకొంటారు.
పంచ క్రోశ యాత్రలో ఆఖరి క్షేత్రం తిరువిడై మరుదూర్. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. దీనిని చోళ రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు.తిరువిడై      మరుదూర్ నుండి నేరుగా కుంభకోణం చేరుకొని మరోమారు శ్రీ ఆది కుంభేశ్వర స్వామి కి మొక్కి యాత్ర ముగిస్తారు. మొత్తం దూరం అరవై కిలోమీటర్లు. సహజంగా వాహనంలో ప్రయాణించి ఒకరోజులో పూర్తిచేసుకొంటారు.
స్కాంద పురాణం లో ప్రముఖంగా ప్రస్తావించబడిన పంచ క్రోశ యాత్ర మానవునికి బాల్యం నుండి వృధాప్యం వరకు కావలసిన ఇహపర సుఖాలను ప్రసాదించి అంతిమంగా ముక్తిని అందిస్తుందని విశ్వసిస్తారు. కనుక ప్రతి ఒక్క హిందువు అవకాశం ఉన్న ఏదో ఒక క్షేత్రం నుండి ఈ యాత్ర చేయడం అభిలషణీయం.

నమః శివాయ !!!!








Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...