4, మార్చి 2019, సోమవారం

pancha kosha yatra





                        పుణ్య ప్రదం పంచ కోశి యాత్ర


భగవదనుగ్రహం కొరకు భక్తులు ఎన్నో తీర్థ పుణ్య క్షేత్రాల యాత్రలు చేస్తుంటారు. చార్ ధామ్ యాత్ర, కాశీ యాత్ర, కైలాస మానససరోవర యాత్ర, అమరనాథ్ యాత్ర, దక్షిణ దేశ యాత్ర ఇలా చాలా ! వీటన్నింటిలో ముఖ్యమైన సంకల్పం ఆయా ప్రాంతాలలో దేవాలయాలలో వివిధ రూపాలలో కొలువైన భగవంతుని సందర్శనం. కానీ దీనికి భిన్నమైన యాత్ర ఒకటి ఉన్నది. అదే పంచ కోశ యాత్ర. దీనినే పంచ క్రోష యాత్ర అని కూడా అంటారు. అనగా నిర్ణీత వ్యవధిలో (ఒక రోజు నుండి అయిదు రోజుల లోపల) నిర్ణయించబడిన అయిదు ఆలయాలను దర్శించుకోవాలి. యాత్ర చేయాలి అనుకొన్న రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదులు చేసి బయలుదేరాలి. రోజంతా ఉపవాసం ఉండాలి(ఒక రోజు అయితే).ద్రవ పదార్ధాలను తీసుకోవచ్చును.యాత్రను కాలినడకన (చెప్పులులేకుండా) చేయాలి.
పురాణ కాలం నుండి ప్రజలే కాదు పాలకులు కూడా ఈ యాత్ర (పరిక్రమ / ప్రదక్షణ) చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్రేతాయుగంలో దశరధ నందనులు నలుగురూ తమ భార్యలతో కలిసి అయోధ్యతో పాటు  వారణాసిలో కూడా ఈ పరిక్రమ చేసినట్లుగా తెలుస్తోంది. అలానే ద్వాపర యుగములో పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా వారణాశిలో పంచ కోశ (క్రోష) యాత్ర చేపట్టినట్లుగా పురాణాలలో పేర్కొనబడినది.
పంచ కోశి  (క్రోష) యాత్రను ఉత్తరాదిన పంచ కోశి పరిక్రమ (ప్రదక్షణ) అని అంటారు. దక్షిణాదిన పంచ క్రోశ యాత్ర అంటారు. కోశ (కోశి ) లేదా క్రోష (కోషి) అన్న పదం తోనే తేడా వస్తోంది అని అనుకోవాలి. ఎందుకంటే క్రోశి లేదా క్రోసు అన్న పదాలకు అర్ధం దూరం అని. పూర్వ కాలంలో దూరాన్ని క్రోసులలో కొలిచేవారు. ఒక క్రోసు అంటే నేటి లెక్కల ప్రకారం మూడుంపాతిక కిలోమీటర్లతో సమానం. దీని ప్రకారం పంచ కోశి అంటే అయిదు క్రోసుల దూరంలో ఉన్నట్లుగా అర్ధం చేసుకోవాలి. అనగా ఒక క్షేత్రం నుండి మరో క్షేత్రానికి మధ్య దూరం మూడుంపాతిక నుండి పదహారు కిలోమీటర్ల మధ్య ఉండాలి. కానీ అలా లేదు.ఎక్కువే ఉంటుంది. అందువలన దూరాన్ని సరైన ప్రమాణంగా తీసుకోకూడదు అని అంటారు కొందరు.
 ఉత్తరాదిన చెప్పే పంచ కోశి అన్నది చాలా వరకు సరైన అర్ధం వచ్చే విధంగా ఉన్నది అని అంటారు. ఎలా అంటే కోశి అనగా అర అనే అర్ధం ఉన్నది. యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరాలను పంచ కోశాలు ఆవరించి ఉంటాయి అని చెబుతారు. అవి "అన్నమయ కోశం" ఇది భౌతిక శరీరం. పంచ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండే ఈ శరీరం ఆహరం (అన్నం)మీద ఆధారపడి ఉంటుంది. 2. "ప్రాణమయ కోశం" ఇది భౌతిక శరీరానికి మూలమైన శక్తి. శరీరంలో ఆహార, ప్రాణవాయువును రక్తం ద్వారా సరఫరా, మెదడు నుండి జ్ఞానేంద్రియాలకు సూచలను చేయడానికి ప్రాణంశక్తి తప్పనిసరి. మూడవదైన "మనోమయ కోశం" మనిషి అంతరంగంలో తలెత్తే భావోద్వేగాలకు కారణం. మానవులను అన్ని విధాలుగా బలహీనులను చేసే కామ, క్రోధ, లోభ,మద మరియు మాత్సర్యాలు ఈ కోశం పరిధి లోనివే ! నాలుగోదైన విజ్ఞానమయ కోశం మానవుడు తాను చేస్తున్న పనులలో తప్పొప్పులను విశ్లేషణ చేసుకొనే పరిణితి ఇస్తుంది. విషయ అవగాహన పెంపొందుతుంది.  అంతర్గత ఆలోచల మీద నియంత్రణ సాధించగలుగుతుంది. నేను అనే అహం నశిస్తుంది. సర్వాంతర్యామి అయిన పరమాత్మ పట్ల సంపూర్ణ శరణాగతి దిశగా అడుగులు వేయిస్తుంది. ఆఖరిది ఆనందమయ కోశం. ఆత్మ పరమాత్మ వేరు కాదు. ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడమే ముక్తి అన్న ఆధ్యాత్మిక గ్రహింపు పొందటమే ఈ దశ.
మనిషి తన నాలుగు దశల జీవితంలో మొదటి రెండింటిలో సర్వసాధారణమైన భౌతిక సుఖాల కోసం ఆరాటపడతాడు. మూడో దశలో తనకు తెలియకుండానే భగవంతుని వైపుకు నడుస్తాడు. ఈ దశ చివరి భాగంలో తనను తాను తెలుసుకొనే ప్రయత్నంలో ఆధ్యాత్మికత భావనలను సొంతం చేసుకొంటాడు. ఆఖరి దశలో మొదటి మూడు చాలా వరకు మూసుకొని పోతాయి. అప్పుడు నాలుగో అర పూర్తిగాను, అయిదవది కొంతమేర తెరుచుకొంటాయి. నాలుగో దశ అంతిమ కాలంలో అయిదవ అర పూర్తిగా తెరుచుకొంటుంది.
ఈ యాత్ర లేదా పరిక్రమ లక్ష్యం అదే ! ఒక క్రమపద్ధతిలో మనిషిని  ఆనందమయమైన మార్గం లోనికి  మళ్ళిస్తుంది. అందుకే ఇది "పంచ కోశ (కోశి) పరిక్రమ లేదా యాత్ర అని విశ్లేషించారు.
పంచ కోశ యాత్ర ప్రధానంగా వారణాసి,అయోధ్య,బ్రజ్ (బృందావనం),ఉజ్జయిని, తమిళనాడు లోని కుంభకోణం మరియు తిరునెల్వేలిలలో ప్రతి సంవత్సరం భక్తి విశ్వాసాలతో లక్షలాది మంది భక్తులు చేస్తుంటారు.
ఈ యాత్ర ఒక్కో చోట ఒక్కో రోజున ప్రారంభం అవుతుంది.సహజంగా అధిక మాసంలో లేదా ఫాల్గుణ, వైశాఖ, చైత్ర మాసాలలో కృష్ణపక్ష ఏకాదశి నాడు చేపడతారు.వారణాసిలో శివరాత్రి నాడు లేదా శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు. అయోధ్య,ఉజ్జయిని, బ్రజ్ (బృందావనం) లలో కార్తీక మాసంలో చేస్తారు. తమిళనాడులోని రెండు క్షేత్రాలలో చైత్రమాసంలో   చేస్తారు.

ఉత్తరాదిన పంచ కోశి పరిక్రమ చేసే నాలుగు ప్రదేశాలు ప్రసిద్ధి చెందిన సప్త ముక్తి క్షేత్రాలలో భాగమే !


వారణాసి పంచ కోశి పరిక్రమ 



ఎనభై కిలోమీటర్ల వారణాసి పంచ కోశి పరిక్రమ కాలినడక చేయడానికి అయిదు రోజులు పడుతుంది. పాల్గొనే భక్తులు సూర్యోదయానికి ముందే మణికర్ణిక లేదా అస్సి ఘాట్ల దగ్గరకు చేరుకొంటారు. గంగా స్నానం చేసి, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని యాత్ర ప్రారంభిస్తారు. భక్తులు కాలి నడకన వరసగా కర్దమేశ్వర, భీంచెండి, రామేశ్వర్, శివపూర్, కపిల్ ధార దర్శించుకొని తిరిగి మణికర్ణిక వద్దకు వస్తారు. ఎక్కడ నుండి ఆరంభిస్తామో అక్కడే పరిక్రమ ముగించాలి. ఈ అయిదు ఆలయాలు విశేషమైనవి. నడవలేనివారు వాహనంలో వెళ్లి తప్పని సరిగా దర్శించుకోవలసినవి.ఈ పరిక్రమ మార్గంలో అనేక పురాతన విశిష్ట ఆలయాలను కూడా దర్శించుకొనే అవకాశం లభిస్తుంది. అలసట తీర్చుకోడానికి ఈ ఆలయాలలో తగు మాత్రాపు సదుపాయాలు లభ్యమౌతాయి.లక్షల మంది పాల్గొంటారు కనుక అధికారులు విశ్రాంతి తీసుకోడానికి మండపాలు నిర్మిస్తారు. వదాన్యులైన నగర ప్రజలు పరిక్రమ చేసేవారికి ఆహార సదుపాయం అందచేస్తారు. అన్నపూర్ణ కొలువైన కాశీ క్షేత్రం కదా!
అలహాబాదు, అయోధ్య, మథుర లాంటి దూర ప్రాంతాల నుండి భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో పంచ కోశి ప్రదక్షణలో పాల్గొంటారు.


అయోధ్య పంచ కోశి పరిక్రమ


శ్రీ మహావిష్ణు అవతార రూపమైన శ్రీ రాముని జన్మస్థలం అయోధ్య.హిందువులకు పరమ పవిత్ర దర్శనీయ తీర్ధ క్షేత్రం. ఇక్కడ మూడు రకాల పంచ కోశి పరిక్రమ చేస్తారు.
ఒక రోజులో పూర్తి చేసే పదునాలుగు కిలోమీటర్ల పరిక్రమ మొదటిది. కార్తీక మాస ఏకాదశి నాడు  అత్యధికంగా భక్తులు, సాధుసంతులు చేపడతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాక పక్క రాష్ట్రాల మరియు నేపాల్ నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. పావన సరయూ నదిలో స్నానమాచరించి యాత్ర పాదనడకను కేశవపురం దగ్గర ప్రారంభిస్తారు. నృత్యగానాలతో, భజన కీర్తనలతో పరిపూర్ణ భక్తిభావంతో సాగుతుంది.  చక్రతీర్ధ, నయా, రామ, దశరధ ఘాట్లతో పాటు, జోగియాన్, రణోపాలి, జల్పానల మరియు మహతాబ్ బాగ్ ల మీదగా ఈ పరిక్రమ సాగుతుంది. రెండవది అయోధ్య మరియు పక్కనే ఉన్న ఫైజాబాద్ లో గల ప్రసిద్ధ మందిరాల దర్శనం చేస్తారు. నలభై అయిదు కిలోమీటర్ల ఈ ప్రదక్షణను కూడా ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు.
మూడవది శ్రీరామనవమి నాడు ప్రారంభిస్తారు. శ్రీ రాముని పాలనలో ఉన్న నేటి ఉత్తరప్రదేశం లోని ఆరు జిల్లాల లోని ఎనభై నాలుగు ఆలయాల సందర్శన చేసుకొంటారు. దీనికి ఇరవై ఒక్క రోజలు పడుతుంది.



బ్రజ్ (బృందావనం) పంచ కోశి పరిక్రమ



హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యస్థలం,స్వయం శ్రీ కృష్ణుడు నడయాడిన దివ్యక్షేత్రం బృందావనం. ఇక్కడ కూడా భక్తులు రెండు విధములైన పంచ కోశి యాత్ర చేస్తారు. కార్తీక మాస కృష్ణ పక్షఏకాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి ఇస్కాన్ ఆలయం నుండి ఆరంభించి కృష్ణ బలరామ ఆలయం, గౌతమ మహర్షి ఆశ్రమం,వరాహ ఘాట్ , మోహన్ తీర్, కాళియ ఘాట్, ఇమ్లితల, శృంగార వాట్, కేశి ఘాట్, తేకరి రాణి ఆలయం, శ్రీ జగన్నాధ మందిరం మరియు శ్రీ చైతన్య మహాప్రభు ఆలయం దర్శించుకొని తిరిగి ఇస్కాన్ ఆలయం చేరి యాత్రను ముగిస్తారు. దీనికి ఒక రోజు పడుతుంది.
రెండవది మండలం (41 రోజులు) నుండి రెండు మాసాలు పడుతుంది. గోవర్ధనగిరి, మథుర ఇలా ఎన్నో విశేష స్థలాల లోని పురాతన పురాణ ప్రసిద్ధి చెందిన ఎనభై నాలుగు మందిరాలను దర్శించుకొంటారు. చౌరాసియా పరిక్రమగా పేరొందిన దీనిని ఎక్కువగా సాధువులు చేపడుతుంటారు.



ఉజ్జయిని పంచ కోశి పరిక్రమ



అయోధ్య తరువాత అంత వైభోగంగా పంచ కోశి యాత్ర జరిగేది ఉజ్జయిని లోనే! సంవత్సరానికి ఆరు లక్షల పైచిలుకు ప్రజలు పాల్గొంటారు. కారణమేమిటంటే ఉజ్జయినీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. అలానే అష్టాదశ పీఠాలలో ఒకటి. ఈ క్షేత్ర గొప్పదనం అక్కడితో ఆగలేదు.  సప్త ముక్తి క్షేత్రాలైన అయోధ్య, మథుర, హరిద్వార్, వారణాసి, కంచి, ద్వారకలతో సమానమైన స్థానాన్ని పొందినది. భక్తులు వైశాఖ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి నాడు పంచ కోశి పరిక్రమ  ఆరంభించి అమావాస్య నాటికి  ముగిస్తారు.
 క్షిప్ర నదిలో స్నానమాచరించి శ్రీ మహాకాళేశ్వరుని, శ్రీ ఉజ్జయిని మహాకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షణ శ్రీ నాగచంద్రశేఖర మహాదేవుని అనుమతితో ప్రారంభిస్తారు. ఉజ్జయిని మహానగరానికి నాలుగు ద్వారాలుగా పురాణ ప్రసిద్ధి పొందిన పింగళేశ్వర్ (తూర్పు), విల్వకేశ్వర్ (పడమర), ఉత్తరేశ్వర్ (ఉత్తరం) మరియు కావ్యారోషన్ మహాదేవ్ (దక్షిణం) లతో సహా సుమారు ఎనభై నాలుగు  పురాతన శైవ క్షేత్రాలను సందర్శించుకొని చివరగా  శ్రీ నాగచంద్రశేఖర్ స్వామిని దర్శించుకొంటారు. శ్రీ మహాకాళేశ్వర్ ఆలయం పైన ఉండే శ్రీ నాగ చంద్రశేఖర్ ఆలయం సంవత్సరానికి రెండు సార్లే తెరుస్తారట. మొదట నాగ పంచమికి, తిరిగి పంచ కోశి పరిక్రమ రోజునేనట. చాలా ప్రత్యేకతలు కలిగిన మందిరం.


ఇక దక్షిణాదిన భక్తులు పంచ క్రోశ యాత్ర రెండు క్షేత్రాలలో చేపడతారు. మొదటిది ఆలయాల నగరంగా ప్రసిద్దికి ఎక్కిన కుంభకోణం, రెండవది తిరునెల్వేలి దగ్గర.

తిరునెల్వేలి పంచ క్రోశ యాత్ర 

తమిళనాడు రాష్ట్ర దక్షిణ భాగాన పశ్చిమ కనుమల దగ్గర ఉంటుందీ జిల్లా. ఎన్నో అద్భుత ఆలయాలకు నిలయం. చైత్రమాసంలో కృష్ణ పక్ష ఏకాదశి నాడు పెద్ద సంఖ్యలో పంచ క్రోశ యాత్ర చేపడతారు.
తిరునెల్వేలి కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశం దగ్గర నుండి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. చోళ రాజులు నిర్మించిన పాపనాశర్ స్వామి ఆలయం ఈ జిల్లాలో ఉన్న నవ కైలాసాలలో తొలి క్షేత్రం. సూర్య స్థలం. భక్తులు పావన తమిరబారాణి నదిలో స్నానం చేసి, పాపనాశర్ దర్శనం చేసుకొని వరుసగా శివశైలం,ఆళ్వార్ కురిచ్చి,కడియం,తిరుప్పుదై  మరుదూర్ లోని విశేష శివాలయాలను సందర్శించుకొని తిరిగి సాయంత్రానికి పాపనాశం చేరుకొంటారు. వాహనంలో అయితే ఒక రోజే ! అదే కాలినడకన అయితే రెండురోజులు పడుతుంది. మొత్తం దూరం డెబ్బై రెండు కిలోమీటర్లు.
భక్తులు పంచ క్రోశ యాత్ర తరువాత టెంకాశి, కుర్తాళం, అంబసముద్రం, మన్నార్ కోయిల్ లాంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చును. చిక్కని అడవులు, జలపాతాలతో  సుందర ప్రకృతికి నిలయం ఈ ప్రాంతం.



కుంభకోణం పంచ క్రోశ యాత్ర


తమిళులకు గంగతో సమానమైన కావేరి నదీ తీరాన ఎన్నో అద్భుత ఆలయాలను చోళులు, పాండ్యులు, నాయక రాజులు నిర్మించారు. అడుగడుగునా ఒక చక్కని ఆలయం కనపడుతుంది.
కుంభకోణం పట్టణం ఎన్నో ప్రత్యేక ఆలయాలకు నెలవు. సంవత్సరమంతా యాత్రీకులతో కోలాహలంగా ఉంటుంది. చైత్రమాసంలో భక్తులు చేపట్టే పంచ క్రోశ యాత్ర లో సందర్శించే అయిదు ఆలయాలు విశేషమైనవి. అన్నీ శివాలయాలైనా దేనికదే ప్రత్యేకమైనవి.భక్తులు             మహామాహం పుష్కరణిలో స్నానమాచరించి ఆది కుంభేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆదిదంపతుల కుమారుడు శ్రీ స్వామినాథన్ వల్లీ దేవసేన లతో కలిసి కొలువైన స్వామిమలై చేరుకొంటారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కొలువైన ప్రసిద్ధ ఆరుపాడై వీడు ఆలయాలలో ఒకటి స్వామిమలై.
రెండవ క్షేత్రం శ్రీ ఐరావతేశ్వరుడు కొలువైన ధారాసురం. అద్భుత శిల్పకళకు నిలువెత్తు రూపం ఈ ఆలయం. ప్రస్తుతం పురావస్తుశాఖ అధీనంలో ఉన్నదీ ఆలయం. తరువాత మజిలీ  కరుప్పూర్. శ్రీ అభిరామీ సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వార్లు కొలువై ఉంటారు. కానీ  పేట్టై కాళీయమ్మన్ ఆలయంగా ప్రసిద్ధి.  అక్కడ నుండి నవగ్రహ క్షేత్రాలలో రాహు గ్రహ క్షేత్రం  తిరునాగేశ్వరం చేరుకొంటారు. రాహు లింగంతో పాటు శ్రీ గిరి గుజాంబికా సమేత శ్రీ నాగనాథర్ స్వామిని దర్శించుకొంటారు.
పంచ క్రోశ యాత్రలో ఆఖరి క్షేత్రం తిరువిడై మరుదూర్. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. దీనిని చోళ రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు.తిరువిడై      మరుదూర్ నుండి నేరుగా కుంభకోణం చేరుకొని మరోమారు శ్రీ ఆది కుంభేశ్వర స్వామి కి మొక్కి యాత్ర ముగిస్తారు. మొత్తం దూరం అరవై కిలోమీటర్లు. సహజంగా వాహనంలో ప్రయాణించి ఒకరోజులో పూర్తిచేసుకొంటారు.
స్కాంద పురాణం లో ప్రముఖంగా ప్రస్తావించబడిన పంచ క్రోశ యాత్ర మానవునికి బాల్యం నుండి వృధాప్యం వరకు కావలసిన ఇహపర సుఖాలను ప్రసాదించి అంతిమంగా ముక్తిని అందిస్తుందని విశ్వసిస్తారు. కనుక ప్రతి ఒక్క హిందువు అవకాశం ఉన్న ఏదో ఒక క్షేత్రం నుండి ఈ యాత్ర చేయడం అభిలషణీయం.

నమః శివాయ !!!!








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...