24, డిసెంబర్ 2018, సోమవారం

Singa perumal koil

                                 త్రినేత్రుడీ నరసింహుడు 





లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం శ్రీ నృసింహ స్వామి 32 క్షేత్రాలలో వివిధ రూపాలలో పలు కారణాల మూలంగా కొలువుదీరి కొలిచిన వారిని కాపాడుతున్నారు అని భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఆధారం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ నృసింహ గాథా లహరి.
ఈ ముప్పై రెండు క్షేత్రాలలో మొదటిదిగా అహోబిలం కాగా చివరిది విశాఖ జిల్లాలోని సాగరతీర పట్టణం భీమిలిలో సౌమ్య గిరి మీద ఉన్న ఆలయం. చివరి ఆలయంలో నృసింహుడు మానవరూపంలో కనపడతారు. మిగిలిన వాటిలో అధిక శాతం మనరాష్ట్రంతో పాటు తమిళనాడు లో ఉన్నాయి.
వాటిల్లో ఒకటి చెంగల్పట్టు కు చేరువలో ఉన్న సింగ పెరుమాళ్ కోయిల్. గతంలో పాదాలాద్రి పురం, ఆళ్వార్ నరసింగ దేవర, నరసింగ విన్నగర్ ఆళ్వార్, పాదాలాద్రి నరసింగ పెరుమాళ్ కోయిల్ గా పిలువబడి చివరికి సింగపెరుమాళ్ కోయిల్ గా స్థిరపడింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ నృసింహ స్వామి వారి మూలంగానే ఈ ఊరికి ఇన్ని పేర్లు వచ్చాయి.









ప్రళయ భీకర రూపంలో అసురుని సంహరించిన శ్రీహరి అవతార రూపం గురించి విన్న జాపాలి మహర్షిలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక సారి దర్శించుకోవాలి అన్న కోరిక తలెత్తినది. దట్టమైన అటవీ ప్రాంతమైన ఈ క్షేత్రానికి చేరుకొని ఇక్కడి శుద్ధ పుష్కరణి ఒడ్డున తీవ్ర తపస్సు చేశారు. సంతుష్టులైన వైకుంఠ వాసుడు మహర్షికి తన నృసింహ రూపంలో సాక్షాత్కారం ప్రసాదించారు. కానీ స్వామివారి భీకర రూపాన్ని చూడలేక శాంతించమని స్తోత్రపాఠాలు చేశారు జాపాలి మహర్షి. భక్తుని కోరికను మన్నించిన స్వామి రాక్షస రక్తంతో తడిసిన తన హస్తాలను పుష్కరణిలో శుభ్రం చేసుకొని పక్కనే ఉన్న కొండ గుహలో స్థిర పడ్డారు. ఈ కారణంగా కోనేరులో నీరు నేటికీ రక్తవర్ణంలో కనపడతాయి.









క్షేత్ర ప్రాముఖ్యాన్ని తెలుసుకొన్న పల్లవరాజులు ఆరవ శతాబ్దంలో ఇక్కడ గుహాలయాన్ని నిర్మించారు. తొలినాళ్లలో పల్లవ రాజులు ఎక్కువగా గుహాలయాలను నిర్మించారు. కాంచీపురం చుట్టుపక్కల ఆ కాలం నాటి  గుహాలయాలు ఎన్నోకనపడతాయి. పల్లవులు నాటి బాష అయిన గ్రంథ లిపిలో వేసిన శాసనం ఈ ఆలయ నిర్మాణ విధానాన్ని తెలుపుతోంది. తదనంతర కాలంలో చోళులు మరియు విజయనగర రాజులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారని వారు వేసిన తమిళ మరియు తెలుగు శాసనాల ద్వారా అవగతమౌతుంది.










మూలవిరాట్టు కొలువు తీరిన కొండ గుహ చుట్టూ రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందీ ఆలయం. ధ్వజస్థంభం, బలిపీఠాలు, గరుడ, ఆంజనేయ సన్నిధులతో పాటు మహా మండపం, కళ్యాణ మండపం, అర్ధ మండపం మరియు ఉపాలయాలు ఉంటాయి ప్రాంగణంలో. మండపాల పైన దశావతార మరియు భిన్న నృసింహ రూపాలను ఏర్పాటు చేశారు.
గర్భాలయంలో శ్రీ ఉగ్రనారసింహ స్వామి ఉపస్థితులై శంఖు చక్రాలను ధరించి, అభయ మరియు ఉరు (తొడ మీద చెయ్యి వేసుకోవడం) హస్త భంగిమలలో స్వర్ణ పుష్పాలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. మరే  నృసింహ లేదా శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో కనపడని విశేషము ఇక్కడి మూలవిరాట్టులో కనపడుతుంది. అది స్వామి మూడో నేత్రం. ఫాలభాగాన ఉన్న కంటిని పాపటి బిళ్ళ లాంటి ఆభరణంతో కప్పి ఉంచుతారు. హారతి సమయంలో అర్చకస్వామి ఆభరణాన్ని తొలగించి నేత్రదర్శనం కలిగిస్తారు. భక్తులు మహదానందంతో హరిహర రూపాన్ని దర్శించుకొంటారు.











మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రదక్షణ అంటే గిరి ప్రదక్షిణే. కొండ చుట్టూ తిరగాల్సిందే. మరో ప్రదక్షిణా మార్గం లేదు. తమ కోర్కెలు తీరిన తరువాత భక్తులు తక్కువలో తక్కువగా నలభయ్ ఒక్క ప్రదక్షణలు చేసి నేతి దీపాలను వెలిగిస్తారు. ప్రదక్షిణా పధంలో కొండ వెనక పక్కన అనేక ఆయుర్వేద సుగుణాలు కలిగిన అంకోల వృక్షం కనిపిస్తుంది. ఈ వృక్షం తాలూకు బెరడు, ఆకులు, కాయలు, గింజలు, వేరు అన్నీ ఆరోగ్యప్రదాయనులే. ముఖ్యంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, జంతువుల కాటు, కుష్టు వ్యాధి నివారణలో ఈ వృక్షం అపర సంజీవని అని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటుంటారు. ఈ చెట్టు గింజలు ఒక గమ్మత్తయిన ప్రక్రియను కనపరుస్తాయి. నేలమీద రాలిన తరువాత  అవి ఆకాశం మేఘావృతమై మెరుపులు మెరుస్తున్నప్పుడు నెమ్మదిగా వృక్షం వైపుకు కదులుతాయి. అలా కదిలి కదిలి చివరకు వృక్ష కాండానికి లేదా కొమ్మలకు అంటుకొనిపోతాయి. మరే చెట్టు గింజలు ఇలా కదలవు.
వివాహం లేదా సత్సంతానం కొరకు భక్తులు నూతన వస్త్రాలతో బంధాలను ఈ చెట్టుకు కడుతుంటారు. ఈ వృక్షం గురించి గోదాదేవి (ఆండాళ్) తన నాంచారీ తిరుమొళి లో వర్ణించినట్లుగా తెలుస్తోంది.
స్వామివారు అలంకార ప్రియులు. ముఖ్యంగా పారిజాత పుష్పాల అర్చన లేదా మాలలు అంటే ప్రీతి. వాటిని సమర్పించిన భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు. ఆలయ వృక్షం పారిజాతమే !










అమ్మవారు శ్రీ అహోబిల వల్లి ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి ఉంటారు. ఉపాలయాలలో శ్రీ గోదాదేవి, శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్, శ్రీ హరి ప్రియ భక్తులైన శ్రీ రామానుజ, శ్రీ మానవళ మహామునితో పాటు వైకుంఠునుని సేనాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు కొలువై ఉంటారు.










ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉండే ఆలయంలో ఉష పూజ, కలశ శాంతి, సాయరక్ష, అర్ధజాము పూజ అనే నాలుగు పూజలు నియమంగా జరుపుతారు. ప్రతి పూజానంతరం అలంకరణ, నైవేద్యం మరియు హారతి తప్పనిసరి.
నృసింహ, వామన, పరుశురామ జయంతులు , స్వాతి నక్షత్ర పూజలు, శ్రీరామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర మాసంలోలో బ్రహ్మోత్సవాలను, ఆని మాసంలో పవిత్రోత్సవాలు, మాసి మాసంలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడు నుండే కాక కర్ణాటక మరియు ఆంధ్రా ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు.
మరెక్కడా కానరాని విశేష రూపంలో శ్రీ నరసింహ స్వామి కొలువు తీరిన సింగ పెరుమాళ్ కోయిల్ చెన్నై నుండి చెంగల్పట్టు వెళ్లే మార్గంలో ఉంటుంది. అన్ని లోకల్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలయం. నడిచి వెళ్లవచ్చును. చుట్టుపక్కల , చెంగల్పట్టు పరిసర ప్రాంతాలలో ఎన్నో అపురూప ఆలయాలు నెలకొని ఉన్నాయి.

నమో నారాయణాయ !!!!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...