నవరాత్రులతో ముడిపడి ఉన్న సప్త మాంగై స్థలాలు
నిరాకారుడైన నటరాజ స్వామికి భువిలో పెక్కు ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా భక్తులకు దర్శనమాత్రానే ఇహపర సుఖాలను అనుగ్రహించేవి కావడం విశేషం. వీటిల్లో మరింత ప్రత్యేకమైనవి సప్త మాంగై స్థలాలు. అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీక ఈ క్షేత్రాలు.
పావన కావేరీ తీరంలో, విశేష ఆలయాలకు చిరునామా గా ప్రసిద్ధికెక్కిన తంజావూరు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు క్షేత్రాలను భక్తులు నవరాత్రుల సందర్బంగా పెద్ద సంఖ్యలో దర్శించుకొంటుంటారు. కారణం అమ్మలగన్నయమ్మ పార్వతీ దేవి నవరాత్రులలో నిర్ణయించబడింది ఆలయాలను రోజుకొకటి చొప్పున సందర్శిస్తూ అక్కడ కొలువైన సర్వేశ్వరుని సేవించుకొంటారు అని క్షేత్ర గాధలు తెలుపడమే.
సప్త మాంగై స్థలాలు ఎన్నో రకాలుగా ప్రసిద్ధి చెందినవి. ఇవన్నీ సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే చోళ, పాంఢ్య మరియు నాయక రాజులచే నిర్మించబడి, అభివృద్ధి చేయబడినవి. అరవై మూడు మంది గాయక శివ భక్తులైన నయన్మారులు కైలాసనాధుని కీర్తిస్తూ గానం చేసిన పాటికాల వలన పడాల్ పెట్ర స్థలాలుగా గుర్తింపు పొందినవి. సమస్త దేవతలూ మహేశ్వరుని సేవించుకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్క క్షేత్రానికి తనదైన క్షేత్ర గాధ ఉండటం చెప్పుకోదగిన అంశం.
మూల గాధ
తంజావూరు సమీపంలోని అయ్యంపేటలో నివసించే నాధ శర్మ మరియు సుమంగళీ దంపతులకు సంతానం లేదు. ఆర్తితో ఆదిదంపతులను అర్ధించారు.పూర్వజన్మ కర్మ ఫలం వలన ఈ జన్మలో సంతాన యోగం దక్కదని, కానీ ఒక బాలికను పెంచుకొనే అవకాశాన్ని కలిగిస్తామని దీవించారు వారు. ముగురమ్మల మూలపుటమ్మ తానే అయోనిజగా తామర పుష్పాల మధ్య బాలికగా ఆ దంపతులకు లభించినది. ఆనందంతో ఆమెను ప్రేమగా సాక సాగారు శర్మ దంపతులు. చిన్ననాటి నుండి అచంచల శివభక్తి కలిగిన బాలిక ఆ ప్రాంతాలలో ఉన్న శివాలయాలను ప్రతి నిత్యం ఒక్కో ఆలయం చొప్పున దర్శించుకొనేది. ఈమెకు చెలులుగా అదే గ్రామంలో జన్మించిన సప్త మాతృకలలో ఒకరు లోకరక్షకికి తోడుగా వెళ్లే వారట.
కొంతకాలానికి బాలిక పరమేశ్వరునినే పతిగా పొందినదట. ఈమె ముని దంపతులకు లభించినది తిరు విళి మిలై అనే గ్రామంలోని విష్ణు పుష్కరణిలో. ఈ గ్రామంలోనే పరమేష్ఠి పార్వతిని వివాహమాడినది. దీనికి నిదర్శనంగా ఇక్కడి ఆలయంలోని ఉత్సవమూర్తులు కళ్యాణ వేషధారణలో దర్శనమిస్తారు.మైలాడుతురై కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం.
జన్మజన్మల కర్మ ఫలం తొలగిపోవడానికి, చక్కని జీవితానికి, అనుకూలమైన జోడు కొఱకు, సత్సంతానం కోసం, కుటుంబంలో సత్సంబంధాలు కోరుకొంటూ ఎందరో నవరాత్రులలో ఈ సప్త మాంగై క్షేత్రాలను సందర్శిస్తుంటారు. సందర్శనతో కోరుకున్న కోరికలు ఫలిస్తాయి అని విశ్వసిస్తారు భక్తులు. ఆ సమయంలో కుదరని వారు ఏ నెలలో అయినా అమావాస్య లేదా పౌర్ణమి నాటి తరువాత వచ్చే సప్తమి తిధినాడు దర్శించుకొంటారు. ఎంతో పౌరాణిక మరియు చారిత్రిక విశేషాలు కలిగినవి ఈ ఏడు ఆలయాలు.
ఎవరీ సప్త మాతృకలు
బ్రహ్మీ , మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సప్త కన్యలు లేదా సప్త మాతృకలుగా ప్రసిద్ధి. లోకకంటకుడైన అంధకాసుర సంహార సమయంలో రుద్రునికి సహాయంగా బ్రహ్మ, విష్ణు, కుమారస్వామి, మహేంద్రుడు మొదలైన వారి అంశాలతో ఉద్భవించినవారు ఈ సప్త మాతృకలు. దేశంలోని ఎన్నోఆలయాలలో కొలువై ఉండి పూజలను అందుకొంటుంటారు. ఒక్కో దేవత ఒక్కో సిద్ధికి మూలంగా భావించే సిద్దులు వీరిని ఎక్కువగా ఉపాసిస్తుంటారు.
సప్త మాంగై స్థలాలు
చక్రమాంగై (చక్రపల్లి), అరి మాంగై, శూల మంగళం, నంది మాంగై(నల్లి చేరి), తల మాంగై, తిరుపుల్ల మాంగై మఱియు పశు మంగై (పశుపతి కోయిల్). ఈ ఏడు ఆలయాలు తంజావూర్ నుండి కుంభకోణం వెళ్లే మార్గంలో వచ్చే అయ్యంపేట గ్రామ చుట్టుపక్కల ఉంటాయి. తంజావూరు నుండి అయ్యంపేట ఇరవై కిలోమీటర్లు. మాంగై ఆలయాలు సుమారు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. తంజావూరు నుండి వాహనాన్ని అద్దెకు తీసుకొని వెళ్లడం మంచిది. సమయం కలిసి వస్తుంది. మధ్యాహన్నానికి అన్ని ఆలయాలను దర్శించుకోవచ్చును. ఆలయాలు ఉదయం ఆరు నుండి పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు వరకు తెరిచి ఉంటాయి.
చక్ర మాంగై (చక్రపల్లి)
భక్తులు తంజావూరు నుండి బయలుదేరి తొలుత అయ్యంపేట్ లోని చక్ర పల్లి (చక్ర మాంగై స్థలం) చేరుకొంటారు. బస్సుస్టాండ్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. దేవనాయకీ సమేత శ్రీ చక్ర వాకేశ్వర స్వామి కొలువు తీరిన క్షేత్రం. నవరాత్రులలో తొలి రోజైన ప్రతిపత్ నాడు పార్వతీ దేవి, బ్రహ్మి దేవితో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకొంటారట. నాడు స్వామి వారి నేత్ర దర్శనం శుభకరం అని భావిస్తారు భక్తులు. పెద్ద లింగ రూపంలో గర్భాలయంలో శ్రీ చక్ర వాకేశ్వర స్వామి దర్శనమిస్తారు. చలంధరుడు అనే అసురుడు శ్రీ మహా విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని హరించుకొని పోయాడట. దామోదరుడు దిక్కుతోచక నందివాహనుని శరణు కోరాడట. స్వామి రాక్షసుని అంతం చేసి చక్రాన్ని శ్రీహరికి అందచేసినది ఇక్కడే అని అంటారు. వినాయక, దక్షిణామూర్తి, బ్రహ్మ, మురుగ, దుర్గ,సూర్యుడు, చంద్రుడు, భైరవ ఆదిగా గలవారు సన్నిధి దేవతలుగా కనపడతారు.నయమ్మార్లలో ప్రసిద్ధి చెందిన సుందరార్, తిరువుక్కరసు కూడా మహా మండపంలో ఉపస్థితులై ఉంటారు. సుబ్రమణ్య భక్తుడైన మాణిక్యవాసగర్ ఈ క్షేత్రంలోని మురుగన్ ను కీర్తిస్తూ గానం చేశారట. ఆయన సన్నిధి కూడా ఉంటుంది. అమ్మవారు విడిగా కొలువై ఉంటారు. స్వామిమలై మురుగన్ ఆలయం ఆధ్వర్యంలో ఉన్నదీ ఆలయం.
అరిమాంగై
నవరాత్రులలో రెండవ రోజైన విదియ నాడు అమ్మవారు మహేశ్వరి దేవితో కలిసి శ్రీ జ్ఞానాంబిక సమేత శ్రీ హరి ముక్తేశ్వర స్వామిని సేవించుకొంటారన్నది స్థానిక విశ్వాసం. ఆ రోజున లభించే గంగా దర్శనం విశేషంగా పేర్కొంటారు. అయ్యంపేట్ రైల్వే స్టేషనుకు సమీపంలో ఉండే ఈ దేవాలయం సామాన్యంగా ఉంటుంది. శ్రీహరి సుదర్శన చక్రం లభించిన తరువాత ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించి అర్చించారట. ఈ కారణంగా స్వామివారికి ఈ పేరు వచ్చిందని తెలియవస్తోంది. గణేష మరియు సుబ్రమణ్య స్వామి సన్నిధులతో పాటుగా శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ సన్నిధి కూడా ఉంటుంది ప్రాంగణంలో.
సూళమాంగై
తదియనాడు శ్రీ పార్వతీ దేవి, కౌమారీదేవి సమేతంగా అలంకారవల్లి సమేత శ్రీ కీర్తి వాణీశ్వర స్వామిని సేవించి, త్రిశూల దర్శనం చేసుకొంటారట. నాడు త్రిశూల దర్శనం ప్రత్యేకం. ఆలయ ప్రధాన ద్వారం వద్ద త్రిశూలం ధరించిన స్త్రీ శిల్పం ఉంటుంది. గజాసుర సంహారం జరిగినది ఇక్కడ అని స్థల పురాణం తెలుపుతోంది. అందుకని గజచర్మాంబరధరునికి నిరంతరం కవచాన్ని ధరింపచేస్తారు. బ్రహ్మ, విష్ణువుల పూజలు అందుకొన్నారట. పుష్యమాస అమావాస్య నాడు విశేష పూజలు చేస్తారు. ఆ పూజలో పాల్గొంటే అనారోగ్యం, శత్రుభయం, దరిద్రం తొలగి పోతాయని విశ్వసిస్తారు. చోళరాజుల నిర్మితమైన ఆలయంలో వివిధ కాలాలకు చెందిన రాజుల శాసనాలు కనపడతాయి. మరెక్కడా కనపడని దేవతల ఆయుధాలు మరియు అనేక అస్త్రాలను సృష్టించిన అస్త్ర దేవుడు ఇక్కడ దర్శనమిస్తాడు.
నంది మాంగై (నల్లి చెర్రీ)
నవరాత్రులలో నాలుగో రోజైన చతుర్థి నాడు అమ్మవారు శ్రీ వైష్ణవీ దేవితో కలిసి ఈ క్షేత్రం విచ్చేస్తారు. నాడు శివపాద దర్శనం సర్వపాపహరణం అని భక్తులు భావిస్తారు.
శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబునాధ స్వామి కొలువు తీరిన క్షేత్రంలో.మనోభీష్టప్రదాయనిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వైష్ణవీ దేవికి విశేష పూజలు నిర్వహిస్తారు.
శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబునాధ స్వామి కొలువు తీరిన క్షేత్రంలో.మనోభీష్టప్రదాయనిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వైష్ణవీ దేవికి విశేష పూజలు నిర్వహిస్తారు.
ఫాల్గుణమాసంలో మూడు రోజులు వరుసగా సాయం సంధ్యా సమయంలో సూర్యకిరణాలు నేరుగా లింగరాజుకు అభిషేకం చేస్తాయి.ఆలయ గోడల మీద శివలీలల చిత్రాలను సుందరంగా చిత్రించారు. అయ్యంపేట్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది మాంగై ముక్తి క్షేత్రంగా పేరొందినది. స్థానికంగా నంది మాంగై ని నల్లి చెర్రీ అని పిలుస్తారు
పశు మాంగై (పశుపతి కోయిల్)
కావేరి ఉపనది అయిన కుదమురుత్తి నదీ తీరంలో ఉన్న పశుపతికొయిల్ లో మూలవిరాట్టు శ్రీ పశుపతీశ్వర స్వామి. అమ్మవారు లోకనాయకి. స్వామి జ్ఞానప్రదాత. ఆత్మ జీవాత్మల మధ్య బేధం లేదని ఢమరు నాదం ద్వారా తెలుపుతారని నమ్ముతారు భక్తులు. అందుకనే పంచమి రోజున శివ ఢమరు దర్శనం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు. శ్రీ పార్వతీ దేవి, వారాహీ దేవితో కలిసి ఆ రోజున స్వామివారిని సేవించుకొంటారట.పెద్ద ప్రాంగణంలో రాజగోపురంతో ఉన్నఈ ఆలయంలో గణేష, కుమారస్వామి, దక్షిణామూర్తి, దుర్గ, భైరవ మొదలైనవారు పరివార దేవతలు గా కొలువై ఉంటారు. కామధేనువు శ్రీ పశుపతినాధుని సేవించుకొన్న క్షేత్రం ఇదే అని ఆలయ గాధ తెలుపుతోంది. అయ్యంపేట్ కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం.
తల మాంగై
పశుపతి కోయిల్ నుండి ఒక కిలోమీటర్ల దూరంలో, అయ్యంపేట్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో కుదమురుత్తి నదీ తీరంలో నెలకొని ఉన్న ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి కొలువై ఉంటారు. నవరాత్రులలో ఆరవ రోజున పార్వతీ దేవి, ఇంద్రాణీ తో కలిసి ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని చంద్రశేఖరుని శిరస్సున ఉన్న చంద్ర దర్శనం చేసుకొంటారని చెబుతారు. ఈ చంద్ర దర్శనం వలన జీవితాలలో నెలకొన్న అశాంతి ఆందోళనలు తొలగిపోతాయని విశ్వసిస్తారు భక్తులు.
ఋణ భాధలు, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారు మంగళవారాలు, అశాంతి అనారోగ్య సమస్యలతో సతమత అయ్యేవారు శుక్రవారాలు అభిషేకం జరిపించుకొంటే సమస్యలు తొలగిపోతాయన్నది స్థానిక నమ్మకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి