శ్రీ యోగానంద నరసింహ ఆలయం, వేదాద్రి
పావన కృష్ణానదీ తీరంలో వెలసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది వేదాద్రి. అరుదుగా కనిపించే ఒక గొప్పదనం ఈ పవిత్ర క్షేత్రంలో కనిపిస్తుంది. అదేమిటంటే అవతారస్వరూపుడు ఒకటి కన్నాఎక్కువ రూపాలలో కొలువైన అతి తక్కువ ప్రదేశాలలో ఒకటిగా ఖ్యాతి గడించినది వేదాద్రి.
శ్రీ నారసింహుడు జ్వాలా, సాలగ్రామ, యోగానంద, శ్రీ లక్ష్మీ నరసింహ మరియు శ్రీ వీర నారసింహ మూర్తిగా వేదాద్రిలో పూజలందుకొంటున్నారు. ఇలా ఒకటికన్నా ఎక్కువ రూపాలలో శ్రీ నరసింహుడు కొలువైన మరో క్షేత్రం మన రాష్ట్రం లోని అహోబిలం. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహ రూపంతో కలిపి అక్కడ మొత్తం పది ఆలయాలు ఉంటాయి.కొండలలో,అడవులలో కాలినడకన ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ప్రహ్లాద వరద, క్రోడా, జ్వాలా, మాళోల, పావన, కారంజ, యోగానంద, చాత్రవట, భార్గవ నరసింహునిగా కొలువుతీరి దర్శనమిస్తారు స్వామి అహోబిలంలో !
శ్రీ వైష్ణవులకు పవిత్ర దర్శనీయ క్షేత్రాలైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి అహోబిలం.
ఇక వేదాద్రి లో స్వామి ఈ ప్రకారం అయిదు రూపాలలో కొలువు తీరడానికి సంబంధించిన పురాణ గాధ తొలి యుగం నాటిది.
శ్రీ హరి లోక సంరక్షణార్ధం ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. విధాత వద్ద ఉన్న వేదాలను అపహరించుకొని పోయాడు సోమకాసురుడు. సృష్టి కొనసాగడానికి వేదాలు తప్పనిసరి ! బ్రహ్మ దారి తోచక శ్రీ మహావిష్ణువును శరణు కోరాడు. ఆయనకు అభయమిచ్చి సముద్రంలో దాగి ఉన్న అసురుని మత్స్య రూపంలో వెళ్లి హతమార్చారు శ్రీమన్నారాయణుడు. ఆయన స్పర్శతో పురుషాకృతిని పొందిన వేదాలు, తమను శాశ్వితంగా తరింప చేయమని అర్ధించాయి. దానికి వైకుంఠుడు మీరు సాలగ్రామాల రూపంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో ఉండండి. నేను భవిష్యతులో అక్కడ వెలసి మీకు శాశ్వితత్వాన్ని ప్రసాదిస్తాను అని అనుగ్రహించారు. అలా వేదాలు శిలల రూపాలను దాల్చి ఇక్కడ ఉండిపోయారు. నదీమ తల్లి నిత్యం తన నీటిలో స్నానమాడి తనను మానవులు పాపపంకిలం చేస్తున్నారు. దాని నుండి తప్పించుకొనే మార్గం అనుగ్రహించమని పరంధాముని కోరింది. తప్పక ఆమె కోరిక తీరుస్తానని అభయమిచ్చారు.
తదనంతర కాలంలో హిరణ్యకశ్యపుని నారసింహ అవతారంలో సంహరించిన తరువాత స్వామి ఇక్కడ పర్వతం మీద జ్వాలా నారసింహునిగాను, నదీ గర్భంలో సాలగ్రామ నారసింహునిగాను, ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాచలం పైన శ్రీ వీర నారసింహునిగా ప్రకటనమైనారు. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి కొంతకాలం తపస్సు చేశారు. ఆ సమయంలో ఆయన శ్రీ యోగానంద నారసింహ మూర్తిని, పీఠం పైన శ్రీ లక్ష్మీ నారసింహ ముద్రను ప్రతిష్టించారు. ఈ దివ్య క్షేత్రంలో వేదవ్యాసుని ఆదేశం ప్రకారం మహర్షులు తపస్సు చేసి ముక్తి పొందారు. వేదాలు పర్వతాలుగా వెలసి పరమాత్ముని శిరస్సున ధరించిన ప్రదేశంగా వేదాద్రి అన్న పేరు పొందినది.
తొలుత కొండవీడును పాలించిన రెడ్డి రాజులు స్వామివారి ఆలయాన్నినిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. తదనంతర కాలంలో మరెందరో రాజుల, స్థానిక సామంతరాజులు, ,జమీందారులు ఆలయాభివృధికి తమ వంతు కృషి చేశారు.
కొండవీటి రాజుల వద్ద ఆస్థాన కవులుగా ఉన్న ఎర్రాప్రగడ , శ్రీ నాధ కవిసార్వభౌముడు ఇరువురూ శ్రీ యోగానంద నారసింహుని సేవించుకొన్నారని తెలుస్తోంది. ఎఱ్ఱనామాత్యుడు స్వామి వారి గురించి దండకం రచించారట. శ్రీనాధుని కాశీ ఖండంలో వేదాద్రి క్షేత్ర ప్రస్తాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. మరెందరో కవులు స్వామివారి మహిమల గురించి కృతులు, కీర్తనలు, రచనలు చేశారు.
సువిశాల ప్రాంగణంలో పడమర ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ యోగానంద నారసింహ స్వామి సర్వాభరణ అలంకృతులై నయనమనోహరంగా కొలువై ఉంటారు. పీఠం పైన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించు కొనవచ్చును. శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు, శ్రీ చెంచులక్ష్మీ ప్రత్యేక సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. క్షేత్రపాలకుడు కైలాసనాధుడు. శ్రీ విశ్వేశ్వర స్వామి, దేవేరి పార్వతీ దేవి మరో ఆలయంలో తూర్పు ముఖంగా కొలువై ఉంటారు. పక్కనే ఉన్న పర్వతం పైన శ్రీ జ్వాలా నారసింహ స్వామి సన్నిధి కలదు. పైకి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. కృష్ణవేణి మధ్యలో పెద్ద సాలగ్రామ రూపంలో శ్రీ సాలగ్రామ నారసింహ స్వామి కనిపిస్తుంటారు. ఈ సాలగ్రామ రూప దర్శనం నదీ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడే లభిస్తుంది.
చుట్టుపక్కల గ్రామాల, పట్టణాల నుండి ప్రతి నిత్యం భక్తులు స్వామివారి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ముఖ్యంగా శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు కొంత కాలం ఇక్కడే ఉండి నిత్యం కృష్ణానదిలో స్నానమాచరించి, నియమంగా స్వామివారిని సేవించుకొంటుంటారు. దాని వలన ఆరోగ్యం పొందుతారన్నది తరతరాల విశ్వాసం.
తూర్పు మరియు పడమరలలో నిర్మించిన రాజగోపురాలు శోభాయ మానంగా ఉంటాయి.
ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత ఉన్నది. గర్భాలయం వెనుక గుండ్రటి శిలలు మూడు ఉంటాయి. వీటిని దిక్పాలక శిలలు అంటారు. తమ సమస్యకు లేదా కోరుకొంటున్న పని సానుకూలంగా నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలకు ఈ శిలల ద్వారా జవాబు పొందవచ్చు అని స్థానికులు నమ్ముతారు. ఆ రాతి మీద రెండు చేతులను ఆనించి, బొటన వేళ్ళను ఆనించి ఉంచాలి. కొద్దిసేపటికే చేతులు తమంతట తామే శిల చుట్టూ తిరుగుతాయట. అలా జరిగితే ఫలితం అనుకూలం. లేకపోతే పని కాదు, అని అంటారు. రోజూ ఎందరో ఆ శిలల వద్ద కూర్చొని కనిపిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి