24, ఫిబ్రవరి 2018, శనివారం

Swetharka Sri Hanuman Temple, Machilipatnam

      శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 






శ్రీ గణపతి, శ్రీ దుర్గ, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్ర స్వామి, శ్రీ హనుమంతుడు వీరి ఆలయాలు లేని ఊరు భారత దేశంలో కనపడదు. ముఖ్యంగా రామదూత హనుమాన్ శివకేశవ బేధం లేకుండా అన్ని ఆలయాలలోనే కాదు, పెద్ద పెద్ద వటవృక్షాల క్రింద, రహాదారుల ప్రక్కన అడుగు రూపం నుండి వంద అడుగుల విరాట్రూపాలలొ కనపడుతుంటారు. 
వానర వీరుడు కేసరికి, అంజనా మాతకు వాయుదేవుని అంశతో జన్మించిన మారుతి,రుద్రాంశగా పేర్కొంటారు. వాయునందనుడు వరపుత్రునిగా జన్మించిన అంజనాద్రి ప్రఖ్యాత చారిత్రక ప్రదేశం అయిన హంపీ దగ్గరలోని అనెగొంది. విజయనగర రాజుల తొలి రాజధాని. తుంగభద్రా నాదీ తీరంలో, పంపా సరోవరానికి చేరువలో ఉన్న అంజనాద్రి పర్వతం మీద శ్రీ అంజనాదేవి ఆలయం ఉంటుంది.












కోతి అంటే చంచలత్వానికి ప్రతీక. ఒక చోట కాలు నిలువదు. దానికి అవసరం లేక అనవసరం అనదగ్గ విషయం లేదు. అన్నింటిలో వేలు పెడుతుంది. మన మనసు కూడా అంతే కదా ! వానరం అత్యంత చంచలమైన మానవ ఆలోచనలకు, మనస్సుకు ప్రతిరూపం. హనుమంతుడు  అనగా నిశ్చల భక్తికి, ఏకాగ్రతకు, స్పష్టతకు, వాక్కుకు నిలువెత్తు రూపం. ఈ కారణంగానే పెద్దలు "బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం - మరోగతా ! అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!" అని తెలిపారు. సంపూర్ణ భక్తి భావంతో సేవిస్తే ఇవన్నీ భక్తులకు లభిస్తాయి. 
హనుమంతుడు అనేక రూపాలలో దర్శనమిస్తుంటారు. దాసాంజనేయుడు, భక్త ఆంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు, సంజీవరాయ స్వామి, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, ధ్యానాంజనేయుడు, దక్షిణాముఖ ఆంజనేయుడు ఇలా ఎన్నో ! ఒక్కో రూపానిది ఒక్కో విశిష్టత. తమిళనాడులో మరియు ఉత్తర భారత దేశంలో కొన్ని చోట్ల గానాంజనేయునిగా, నాట్య ఆంజనేయునిగా, శ్రీరాముని, శ్రీ లక్ష్మణ స్వామిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని కూడా దర్శనమిస్తుంటారు. ఇప్పుడు ఒక్కో రూపం యొక్క విశేషాలను తెలుసుకొందాము. 
 వినమ్రంగా చేతులు జోడించి ఉపస్థిత లేదా స్థానిక భంగిమలో  కనిపించే "దాసాంజనేయుడు" తన రూపంతో నమ్రతకున్నప్రాముఖ్యాన్ని తెలుపుతారు.











అభయ హస్తం, మెలి తిరిగి స్థిరంగా ఉండే వాలం, ప్రశాంత వదనం, వామ హస్తంలో గద ధరించి దర్శనమిచ్చేవాడు "అభయ ఆంజనేయుడు". ఉత్తర భారత దేశంలో "సంకట మోచన హనుమాన్"అని పిలుస్తారు. భక్తుల ఏకాగ్రతను భగ్నం చేసి వికారాలను ప్రేరేపించే గ్రహ, భూత, పిశాచ పీడలను తొలగించే వానిగా వీరాంజనేయుడు ప్రసిద్ధి. విశ్వాసంతో ప్రార్ధిస్తే మానసిక స్థిరత్వాన్ని, సుఖశాంతులను అనుగ్రహిస్తారన్నది ఎందరో మహానుభావుల అనుభవాల ద్వారా అవగతమవుతున్నది.



 





రామరావణ సంగ్రామంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్ర ప్రభావంతో బాహ్య స్పృహ కోల్పోయిన లక్ష్మణుని స్వస్థత కొరకు సంజీవనీ పర్వతాన్ని తెచ్చారు మారుతి. ఎన్నో అపురూప ఔషధాలకు నిలయమా పర్వతం. అంతటి మహిమాన్విత ఔషధ గిరిని ధరించి నిలిచిన స్వామిని "సంజీవరాయడు " అని పిలుచుకొంటారు భక్తులు. సంపూర్ణ నమ్మకంతో ప్రార్ధిస్తే సమస్త వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తారు అని నమ్ముతారు.











ధ్యాన ముద్రలో, నేత్రాలను మూసుకొని పద్మాసనంలో ఉండే ధ్యానాంజనేయుడు చంచల మనస్సుకు, బుద్ధికి స్థిరత్వాన్ని ప్రసాదిస్తారు.
 తూర్పు, పడమర లేదా ఉత్తర దిశలలో ఉన్న ఆలయాల్లో కొలువైన అంజనాసుతుని వదనం మాత్రం యమస్థానమైన దక్షిణ దిశగా ఉంటే ఆయన భక్తులలో నెలకొనే శత్రు మరియు అపమృత్యు భయాన్ని తొలగిస్తారు అని అంటారు. జాతక రీత్యా ఎదురవుతున్న గ్రహ పీడల ప్రభావాన్ని అదుపు చేస్తారు.













హనుమంతుని అన్ని రూపాల లోనికి భక్తులపై విశేష మంగళకరమైన ప్రభావాన్ని చూపేది శ్రీ పంచముఖ ఆంజనేయ రూపం. అయిదు భిన్న వదనాలతో, దశ భుజాలతో, ఖడ్గం, డాలు, పరశువు, గద, త్రిశూలం, చక్రం, చిరుకత్తి, పాత్ర, కలశం ధరించి, అభయ ముద్రతో విరాట్స్వరూపంగా దర్శనమిస్తారు. 
తూర్పు దిశగా ఉండే వానర వదనం సకల పాప విముక్తిని కలిగించి, మానసిక శాంతి ప్రసాదిస్తూ , ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తుంది. పడమర ముఖంగా ఉండే గరుడ వదనం భూత పిశాచ పీడల నుండి విముక్తి కలిగిస్తుంది. దక్షిణ దిశను చూస్తుండి సింహ వదనం శత్రు మరియు మృత్యు భయాలను తొలగించడమే కాకుండా అన్ని కార్యాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తర దిశను చూసే వరాహ వదనం గ్రహదోషాలు హరిస్తుంది. సర్వసంపదలను ప్రాప్తిస్తుంది. ఊర్ధ్వ దిశగా ఉండే హయగ్రీవ వదనం విద్య, జ్ఞాన, దైవభక్తిని పెంపొందిస్తుంది. మానవ జీవితాలలో కావలసినవి అన్నీ అనుగ్రహించేది శ్రీ పంచముఖ హనుమాన్ ఆరాధన.
వీటన్నింటికన్నా గొప్పది శ్వేతార్క ఆంజనేయ ఆరాధన. మనం శ్వేతార్క గణపతి విగ్రహాల గురించి విని ఉన్నాము. తెల్ల జిల్లేడుతో చేసిన వినాయక మూర్తి గృహంలో ఉంచుకొని నిత్యం భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే శివానుగ్రహం లభిస్తుంది. చేపట్టిన పనులలో విజయం, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, శత్రు మరియు అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది అని మన పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి. నిష్టగా ఆరాధిస్తే ఇవే వరాలను అనుగ్రహిస్తారు శ్వేతార్క హనుమంతుడు.
శ్వేతార్క వినాయక ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు శ్వేతార్క ఆంజనేయ ఆలయం ఒక్కటే ఉన్నది. అదీ మనరాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం లోని పరాశు పేటలో, పోలీసు ప్రధాన కార్యాలయం పక్కనే ఉంటుందీ అరుదైన ఆలయం.















మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురువు శ్రీ సమర్ధ రామదాస్. ఈయన గొప్ప హనుమంతుని భక్తులు. స్వామివారు శ్రీరామునితో కలిసి సమర్ధ రామదాసుకు సాక్షాత్కారం అనుగ్రహించారని చెబుతారు. ఈయన పదిహేడో శతాబ్దంలో (1645-60)మహారాష్ట్ర నుండి బయలుదేరి భారతదేశం అంతటా పర్యటించారు. ఆ సమయంలో తన ఆరాధ్య దైవం యొక్క ఆలయాలను వెయ్యికి పైగానే స్థాపించారు. వాటిల్లో వారణాశి, తంజావూరు లాంటి పవిత్ర ప్రదేశాలలో ప్రతిష్టించారని తెలుస్తోంది. 
ఆ పర్యటనలో ఆయన సముద్ర తీర ప్రాంతమైన "మసూల"(నేటి మచిలీపట్నం నాటి పేరు)కు 1653వ సంవత్సరంలో విచ్చేశారు. నేడు ఆలయం ఉన్న ప్రాంతంలో విడిది చేశారు. నాటి రాత్రి అంజనాసుతుడు తన ప్రియ భక్తునికి స్వప్న దర్శనం అనుగ్రహించి తాను సమీపంలోనే తెల్ల జిల్లేడు మూలంలో ఉన్నట్లుగా తెలిపారు. మరునాడు అక్కడకు వెళ్లి చూడగా వాయునందనుని దివ్యమంగళ రూప సందర్శనం కలిగింది.















తనకు లభించిన అదృష్టానికి సంతసించిన సద్గురువు స్వామివారికి ఆలయం నిర్మించారు. విశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా ఉండే ఆలయంలో రామభక్త హనుమాన్ శ్వేతార్క మూలంలో సింధూర వర్ణంలో రమణీయ పుష్ప అలంకరణతో దర్శనమిస్తారు. ఉపాలయాలేవీ ఉండవు. ప్రాంగణంలో ఆంజనేయుని చిత్రాలతో పాటు  శ్రీ రామచంద్ర, శ్రీ కృష్ణ, శ్రీ నరసింహ చిత్రాలను చిత్రించారు. సుమారు 1970  ప్రాంతలకు  శిధిలావస్థ లోనికి వెళ్లిపోయిన ఆలయాన్ని స్థానిక భక్తులు పునః నిర్మించారు.
ప్రతి నిత్యం ఎందరో భక్తులు స్వామివారి దర్శనార్ధం వస్తుంటారు. శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి విశేషంగా నిర్వహిస్తారు. ఉగాది నాడు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తారు. హనుమద్జయంతిని పెద్ద ఎత్తున జరుపుతారు.
భక్తుల సహకారంతో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. 



 








భారతదేశంలోని ఒకే ఒక్క శ్వేతార్క ఆంజనేయ ఆలయం మచిలీపట్నం బస్సు స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ, గుడివాడ, ఏలూరు పట్టణాల నుండి ప్రతి పావుగంటకీ బస్సులు లభిస్తాయి. 

శ్రీ ఆంజనేయం !!!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...