14, అక్టోబర్ 2016, శుక్రవారం

Sri Manakula Vinayaka Temple, Puducherry

                           శ్రీ మనకూల వినాయక ఆలయం 

తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది.










ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు  చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట  హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.
 శ్రీ మనకూల వినాయక కోవెల వీధిగా పిలవబడుతున్న వీధిని అప్పట్లో ఒర్లేన్ స్ట్రీట్ అని పిలిచేవారు. శ్రీ అరోబిందో ఆశ్రమానికి సమీపంలో ఉన్న ఆలయ వీధిలో పెద్ద మండపం భక్తులకు స్వాగతం పలుకుతుంది.
ఈ మండప పై భాగాన సిద్ది మరియు బుద్ది దేవేరులతో వినాయక వివాహ వేడుక వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడినది.











 ఉత్తర దక్షిణాలలో ఉండే ఈ మండపం గుండా తూర్పు దిశలో ఉన్న ప్రధాన ద్వారం గుండా మహా మండపం లోనికి ప్రవేశించవచ్చును. ద్వారం పైన గణేశుని వివిధ రూపాలు, ప్రియ పుత్రునితో ఉపస్థిస్థులైన శివ పార్వతులు, శ్రీ కుమార స్వామి ఆదిగా గల మూర్తులను సుందరంగా మలిచారు .
మహా మండపంలో దక్షిణ గోడకు హేరంభుని ముప్పై రెండు రూపాలను,వివిధ దేశాలలో నెలకొన్న మూషిక వాహనుని ఆలయాల వివరాలు చక్కగా చిత్రించి ఉంచారు.
స్వర్ణ శోభిత విమాన గోపురంతో ఉన్న గర్భాలయంలో గణేశుడు చతుర్భుజాలతో ఉపస్థితః భంగిమలో స్వర్ణ కవచ, ఆభరణ, పుష్పాలంకృతులై దర్శనమిస్తారు.గణేశునికి ఉన్న పదహారు రూపాలలో సాగరతీరాన తూర్పు ముఖంగా కొలువైన స్వామిని "భువనేశ్వర గణపతి"అంటారు.కానీ మనల అంటే ఇసుక,కులం అంటే కోనేరు అని తమిళంలో అర్ధం.ఒకప్పుడు ఇసుకతో నిండిన పుష్కరణి పక్కన కొలువైనందున ఈశపుత్రుని "మనకూల వినాయకుడు" అని పిలుస్తారు.







గర్భాలయం వెనుక ఉపాలయాలలో శ్రీ బాలగణపతి, శ్రీ బాల సుబ్రహ్మణ్యం ఉంటారు.మండప ఉత్తరం వైపున ఉత్సవ మూర్తుల మండపంలో వివిధ రూపాల ఏకదంతుడు,పక్కనే వెండి మరియు బంగారు రధాలతో పాటు మిగిలిన వాహనాలు ఉంటాయి. ఆలయంలో కనిపించే స్వర్ణ, రజత విమానాలు, రథాలు, ఇతర మూర్తులు అన్నీ భక్తులు తమ మనోభీష్టాలు నెరవేరడం  వలన మనస్ఫూర్తిగా సమర్పించుకున్నవి కావడం విశేషం.
ఉత్తరం పక్కనే విశాల ఉత్సవ మండపం నిర్మించారు. పర్వ దినాలలో ముఖ్య కార్యక్రమాలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ మండపం వైపున గోడల పైన సుందర  చిత్రాలను చిత్రించారు.
ప్రతి నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరిచి ఉంటుంది.



  

స్థానిక భక్తులు తన శిశువులను తొలిసారి ఈ ఆలయానికి తీసుకొని వచ్చిన తరువాతే మరెక్కడికన్నా తీసుకొని వెళతారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం లాంటి వాటికి శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రసిద్ధి.  గణపతి నవరాత్రులు, తమిళ ఉగాది, మహా శివరాత్రి మరియు ఇతర హిందూ పర్వదినాలలో భక్తుల\తాకిడి అధికంగా ఉంటుంది. 
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ మనకూల వినాయకుడు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...