16, జనవరి 2015, శుక్రవారం

Tiruvannamalai

                               అరుణాచల.... శివ.... అరుణాచల 

తిరువన్నామలై అంటే చాలా మందికి వెంటనే తట్టక పోవచ్చు. అదే అరుణాచలం అంటే ప్రతివక్కరూ పరవశులవుతారు. 
యుగ యుగాలుగా, శతాబ్దాలుగా స్కాంద పురాణము తో సహా అనేక పురాతన తమిళ గ్రంధాలలో, కీర్తనలలో ప్రముఖంగా పేర్కొన్న క్షేత్రం "అరుణాచలం". 
అరవై మూడు మంది నయమ్మారులలొ దాదాపుగా అందరూ తమ తేవరాలలో అన్నామలయ్యను కీర్తించిన వారే !
ఎందరో ముముక్షువులకు మోక్ష మార్గం చూపిన మహోన్నత క్షేత్రం అరుణాచలం. నటరాజ స్వామి వాహనమైన నందీశ్వరుడు " సాక్షాత్తుగా సర్వేశ్వరుడు స్థిర నివాసమేర్పరచుకొన్న అరుణాచల వైభవాన్ని ఎంత వర్ణించినా తరగనిది" అని అన్నారంటే ఇక ఈ దివ్య క్షేత్రం గురించి ఏమని తెలపాలి. 




అన్నామలై అంటే దుర్భరమైన లేదా అధిరోహించ లేని పర్వతం అని అర్ధం. 
నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమేశ్వరుని సన్నిధి చేరడం అన్నది అంత సులభ సాధ్యమైన విషయం కాదు కదా !
అరుణాచలం అంటే ఎఱ్ఱని కొండ అని అర్ధం. 
పంచ భూత స్థలాలలో అరుణాచలం అగ్ని క్షేత్రం. 
మిగిలినవి కంచి ( భూమి), జంబుకేశ్వరం ( జలం ), శ్రీ కాళ హస్తి ( వాయువు), చిదంబరం ( ఆకాశం). 
ఉషోదయంలో ప్రత్యక్ష నారాయణుని అరుణారుణ కిరణాల కాంతిలో మెరిసిపోయే అరుణాచల శోభ ఇంతని చెప్పలేము. 
అసలు కృత యుగంలో అగ్ని రూపంలో, త్రేతాయుగంలో రత్న శిఖరంగా, ద్వాపర యుగంలో కంచు మయంగా ఉన్న పర్వతం కలియుగంలో అపురూప ఔషధాలతో నిండిన శిలా రూపంగా మారింది అంటారు. 






అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారే ఆలయం ఉన్నా కొండనే కైలాసనాధునిగా కొలుస్తూ ప్రదక్షిణచెయ్యడం ఇక్కడే చూస్తాము. 
మానవులను శారీరకంగా భాధించే అనేక వ్యాధులను తొలగించేది ఒక ప్రదక్షిణం. 
అరుణాచల స్వామి దివ్య నానమస్మరణ మానవ జీవితాలలో దుర్భరమైన జనన మరణాలు అనే వ్యాధి నుండి విముక్తి కలిగించే అద్భుత ఔషధం.






ఈ గిరిని సాక్షాత్తు గౌరీ నాదునిగా గౌరవించడానికి సంభందించిన గాధ తొలి యుగం నాటిది. 
ఒక సారి సృష్టి కర్త బ్రహ్మ దేవునికి, వైకుంఠ వాసుడైన శ్రీ మహా విష్ణువుకు, మధ్య ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తి ఎంతకీ సమసి పోక పోగా తీవ్ర రూపం దాల్చినదట. 
ఆ సమయంలో వారిరువురి మధ్య భూమి ఆకాశాలను తాకుతూ అగ్ని రూపంలో ప్రత్యక్షమైన అంబా పతి వారిని శాంతపరచి తన ఆది అంతాలలో ఒక దానిని కనుగొన్నవారు ఇరువురిలో గొప్ప వారు అని చెప్పారట. 
అంతట వరాహ రూపంలో శ్రీ హరి అధో ముఖంగా వెళ్ళడం, హంస వాహనం మీద విధాత ఊర్ధ్వ దిశగా వెళ్లి తమ ప్రయత్నంలో విఫలమవ్వడం అంతా అందరికి తెలిసిన గాదే !







ఎంతటి వారికైనా అహం తగదు అన్న విషయాన్ని తెలిపే ఈ ఉదంతం తరువాత ముక్కంటి వారితో త్రిమూర్తులమైన
తమ మధ్య అధీక్యత అన్న అంశానికి తావులేదు అని తెలిపి పర్వత రూపంలో వెలిసారట. 
అందుకే పర్వతమే పరమేష్టి !
కానీ దేవతలు కొండంత దేవుని కొలవడం సామాన్య మానవులకు అసాధ్యం కనుక కరుణించమని కోరగా నేడు ఆలయంలో ఉన్న శ్రీ అన్నామలయ్య గా వ్యక్తమయ్యారట భక్త సులభుడు. 
సంతసించిన దేవతలు దేవ శిల్పి విశ్వ కర్మను ఆలయం నిర్మించ వలసినదిగా ఆజ్ఞాపించారట. 
అలా తొట్ట తొలి అన్నామలేశ్వరుని ఆలయం దేవ నిర్మితం. 








తొలి మూడు యుగాలలో పూజలందుకొన్న అరుణాచల స్వామికి కలియుగంలోని ఆరో శతాబ్దం నుండి క్రమంగా అనేక విధాలైన నిర్మాణాలను అనేక రాజ వంశాల రాజులు నిర్మించినట్లుగా ఆలయం లోని శాసనాల ద్వారా అవగతం అవుతుంది. 
చోళ, పాండ్య, పల్లవ, హొయసల, విజయనగర, నాయక వంశాలతో సహా అనేక మంది స్థానిక పాలకులు, ధనిక భక్తులు, సాధువులు  ఆలయ అభివృద్దిలో పాలుపంచుకొన్నారు. 





పాతిక ఎకరాల సువిశాల స్థలంలోని ప్రతి నిర్మాణం మరియు ఉపాలయాల వెనుక ఆసక్తికరమైన కధనాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉన్న ఆలయానికి మొత్తం తొమ్మిది గోపురాలు, ఆరు ప్రాకారాలు ఉన్నాయి. 
ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా ఉండే పదకొండు అంతస్థుల   రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు తో రాజ గోపురం పూర్తిగా శివ లీలల మరియు అనేక పురాణ ఘట్టాల సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. 
గోపురానికున్న ద్వారానికి రెండువైపులా అనేక నాట్య భంగిమల శిల్పాలను రమణీయంగా చెక్కారు. 














పడమర పక్కన ఉన్నది "పేయి " ( పిశాచ ) గోపురం (144 అడుగులు), దక్షిణ పక్కన "తిరుమంజన గోపురం"( 157 అడుగులు), ఉత్తరాన "అమ్మణి గోపురం" (171 అడుగులు)ఉంటాయి. 
అన్నిటికన్నా లోపల ఉన్న రెండు ప్రాకారాలు మొదటి నిర్మాణాలు గాను, మూడో ప్రాకారాన్ని కులోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్లుగాను, మిగిలిన వెలుపలి నిర్మాణాలు పదునాలుగు మరియు పదిహేను శతాబ్దాల కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. 
రాజ గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మొట్ట మొదట ఎడమ వైపున "కంబత్ ఇల్లియన్నార్" ( శ్రీ సుబ్రహ్మణ్య స్వామి) దేవేరులు వల్లీ దేవసేన సమేతంగా కొలువుతీరి దర్శనమిస్తారు. 








పవిత్ర స్థలంగా భావించి అనేక మంది ఇక్కడ ధ్యానం చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా భక్తులు ఈ స్వామిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. 
కుడివైపున విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో నిర్మించిన వేయి స్థంభాల మండపం చక్కని సూక్ష్మ నుండి విరాట్ చెక్కడాలతో నిండి వుంటుంది. 
విజయనగర నాయక రాజుల ప్రతిమలతో సహా ఎన్నో దేవతా శిల్పాలతో స్థంభాలు శోభాయమానంగా కనిపిస్తాయి. 
ఉత్సవాలలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. 
ఈ మండపానికి చివర "పాతాళ లింగం" ఉంటుంది. 
శ్రీ రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తొలినాళ్ళలో ఎక్కువ సమయం ఇక్కడే ధ్యానంలో గడిపేవారు. 
రమణుల జీవితంలోని ముఖ్య ఘట్టాల చిత్రాలను ఇక్కడ ఉంచారు. 







దీనికి ఎదురుగా "కంబతు అయ్యనారు "( కుమార స్వామి), పక్కనే " శ్రీ సర్వ సిద్ది వినాయక స్వామి" ఉపాలయాలు  వెనుక స్వామి వార్ల అభిషేకాల నిమిత్తం నిర్మించిన "శివగంగ తటాకం " కనపడతాయి. 
వీటికి మధ్యలో సుందర మండపంలో "వల్లల రాజు" స్థాపించిన అతి పెద్ద నంది కొలువుతీరి ఉంటారు. 
ఇక్కడొక విశేషం గురించి ప్రస్తావించాలి. ఈ ఆరు అడుగుల నందీశ్వరునితో ప్రాంరంభమయ్యి ప్రాకారానికి ఒకటి చొప్పున నంది కొలువుతీరు ఉండటం. కాకపోతే వాటి ఆకార పరిమాణం తగ్గుతూ చివరికి గర్భాలయం ఎదుట చిన్న నంది గా కనపడటం.
ఈ పెద్ద నంది మరియు అయిదో ప్రాకారంలో ఉన్న ప్రదోష నంది సజీవ కళ ఉట్టి పడుతూ ఉంటాయి.














రెండో ప్రాకారం లోనికి వెళ్ళే ముందు వచ్చే "వల్లాల గోపురానికి ఒక పక్కన " గోపుర అయ్యనార్ " మరో పక్క "కళ్యాణ సుందరార్ సన్నిధి" ఉంటాయి.
గోపుర అయ్యనార్ తో కలిపి ప్రధమ ప్రాకారంలో ఉన్న మూడు కుమార స్వామి సన్నిధులు మహాకవి అరుణగిరి నాథర్ జీవితంతో ముడిపడి ఉండటం మరో ప్రత్యేకత.
దీని గురించి ఎన్నో గాధలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.
వల్లాల గోపురం దాటి రెండో ప్రాకారం లోనికి వెళితే అక్కడ శ్రీ కాల భైరవ స్వామి ఉపాలయం పక్కనే బ్రహ్మ తీర్థం ఎడమ పక్కన కనిపిస్తాయి.






దక్షిణ గోపురానికి దగ్గర చిన్న నంది, బ్రహ్మ, విద్యాధరేశ్వర, నలేశ్వర మరియు వినాయక ఉపాలయాలు.
ప్రాంగణం మధ్యలో ఉన్న విశాల పురవి మండపంలో ఆలయ నమూనా అద్దాల పెట్టెలో ఉంచబడినది.
ఈ మండపం లోనే పూజా సామాగ్రి, ప్రసాదాలు మరియు స్వామి వారి చిత్ర పటాలు విక్రయించే దుకాణాలు ఉంటాయి.
ఆలయ గజ రాజు ఇక్కడే భక్తులను అలరిస్తుంది.
మూడో ప్రాకారం లోనికి వెళ్ళే ముందు మండపంలో రెండో నందిని దర్శించుకోవచ్చును.






ఇక్కడ కొద్ది ఎత్తులో ఉండే కిళ్ళీ గోపురానికి ఇరు పక్కలా శ్రీ షణ్ముఖ మరియు శ్రీ గణపతి ఉపాలయాలుంటాయి.
ఒక రాజు తాను చేసిన పాపాల ప్రక్షాళన ఆశిస్తూ ఏనుగులను ఈ వినాయకుని సమర్పించుకొన్నారట ఆ కారణంగా ఈయనకు " తిరై కొండ వినాయకర్ "  అన్న పేరొచ్చినది.
కిళ్ళీ లేదా చిలక గోపురం అన్న పేరు రావడానికి సంభందించిన గాధ కూడా కవి అరుణ గిరి నాథర్ తో ముడి పడి ఉండటం చెప్పుకోవలసిన విషయం.







అరుణగిరి నాథర్ ఒక పని మీద శరీరం విడిచి చిలక రూపం ధరించారట. ప్రజలు ఆయన మరణించారని భావించి శరీరాన్ని దహనం చేసారట. దానితో మహా కవి చిలక రూపంలో ఈ గోపురంలో ఉంటూ మధుర గీతాలను గానం చేసారట. దీనికి గుర్తుగా ఒక చిలక బొమ్మ ఈ గోపురం మీద నేటికీ చూడవచ్చును. 
కిళ్ళీ అంటే తమిళంలో చిలక.
మెట్ల మార్గంలో గోపురం దాటి వెళితే వచ్చే "కట్చిమండపం"లో అరుణాచలం లో విశేష మాసం అయిన కార్తీకంలో జరిగే ఉత్సవాల సందర్భంగా ఉత్స విగ్రహాలను ఉంచుతారు.
















ఈ ప్రాకారంలో చిదంబర, జంబుకేశ్వర, ఏకాంబరేశ్వర, పిడారి, కాలతీశ్వర లింగాలు మరియు శ్రీ రేణుకా దేవి ఉపాలయాలుంటాయి.
యాగ శాల ఇక్కడే ఉంటుంది.
ఎదురుగా స్వర్ణమయ ధ్వజస్తంభం, బలి పీఠం కనపడతాయి.
ప్రధాన ఆలయ మండప దక్షిణ పక్క సింధూర వర్ణ శోభితులైన పెద్ద గణపతి కొలువై ఉంటారు.
ప్రదక్షిణా పదంలో ఆలయ వృక్షం "మగిళం" ( పొగడ చెట్టు), విజయ నగర రాజుల నిర్మిత సుందర కళ్యాణ మండపం ఇతర పురాతన కట్టడాలు  కనిపిస్తాయి.
ఇక్కడ గోడల పైన అనేక తమిళ శాసనాలు కనపడతాయి.
కొన్ని తెలుగు శాసనాలు కూడా కనపడటం విశేషం.








ప్రదక్షిణ పూర్తి చేసుకొని వరస క్రమంలో లోనికి వెళితే ప్రాకారం లోపల అరవై మూడు మంది నయమ్మారులు,అనేకానేక శివ లింగాలు, పంచ భూత లింగాలు, గౌతమ, దుర్వాస మహా మునుల విగ్రహాలు, సోమస్కంద మూర్తి, శ్రీ వేణుగోపాల స్వామి, అర్ముగ, స్థల వినాయక, ఆదిత్యుడు, ఆంజనేయుడు, శ్రీ లక్ష్మి రూపాలు ఇంకా అనేక అద్భుత శిల్పాలు ఉంటాయి.
అయిదో ప్రాకారంలో దక్షిణా మూర్తి, లింగోద్భవ మూర్తి, బ్రహ్మ, దుర్గ, చండికేశ్వర వివిధ గణేష రూపాలు ఆలయ వెలుపలి గోడల పైన ప్రతిష్టించారు.
ఇక్కడే సుందర ప్రదోష నంది దర్శనమిస్తారు. త్రయోదశి నాటి పూజలలో  ఈ నందికే అధిక ప్రాధాన్యత. 























































"ఆరోం హర " అంటూ ముందుకు సాగుతూ ద్వార పాలకులను దాటి గర్భాలయం వైపు కదిలితే రమణీయ పుష్పాలంకరణలో శ్రీ అన్నామలయ్య ఆపన్నులను ఆశీర్వదిస్తుంటారు.
అయ్యవారిని దర్శించుకొని వెలుపలికి వచ్చి పక్కనే ఉన్న శ్రీ "ఉన్నామలై అమ్మన్"సన్నిధికి చేరుకొంటే విశాల మండపంలో నవగ్రహ మండపం, ద్వజస్థంభం మరియు బలి పీఠం, నంది ఉంటారు.
ద్వారం వద్ద సింధూర వర్ణ విజయ రాఘవ వినాయక, దక్షిణా మూర్తి, షణ్ముఖ, భైరవ రూపాలను నెలకొల్పారు.
గర్భాలయానికి ఎదురుగా రమణీయ అష్ట లక్ష్మీ మండపం.
లోపల అత్యంత సంప్రదాయ అలంకరణలో "ఉన్నామలై అమ్మన్ " భక్తులను అనుగ్రహిస్తుంటారు.




















ప్రతినిత్యం ఎన్నో పూజలు అభిషేకాలు అలంకరణలు అరుణాచలేశ్వరునికి జరుపుతారు. ప్రతి రోజు ఒక పర్వమే అరుణాచలేశ్వరునకు. 
కార్తీకం, మార్గశిరం, పుష్యం ఇలా ప్రతి మాసం లోను ఉత్సవాలను నిర్వహిస్తారు.
ప్రతి నెలా అమావాస్య, త్రయోదశి నాడు ప్రదోష పూజలు, శుక్ర సోమ వారాలలో జరిపే ప్రత్యేక ఉత్సవాలను "పంచ పర్వ విళా" అంటారు.
అన్నింటి లోనికీ అరుణాచలేశ్వరునికి కార్తీకం ప్రత్యేకమైనది. ప్రతి రోజు ఒక శివరాత్రి పర్వదినమే !!
పరమ పవిత్రమైన ఆ మాసంలో ప్రతినిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 
గిరి వలయం చేస్తుంటారు. 
కార్తీక పౌర్ణమి నాడు జరిగే "దీప దర్శన ఉత్సవం " లో లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వచ్చి పాల్గొంటారు. 
అడుగడుగునా ఆలయాలు కనిపించే తిరువన్నామలై లో ప్రధాన ఆలయం కాకుండా తప్పక దర్శించవలసిన ఆలయాలు మూడు ఉన్నాయి. 
గిరి వలయంలోని ఆరవ మైలు వద్ద ఉన్న "ఆది అన్నామలై ఆలయం" మొట్టమొదటిది. 
సృష్టి కర్త ప్రతిష్ట గా చెబుతారు. 
రెండవది ఇంద్ర తీర్థం దగ్గర ఉన్న "శ్రీ సంజీవ రాయ స్వామి ఆలయం" ( ఆంజనేయ). మూడోవది తిరువన్నామలై గ్రామ దేవత "శ్రీ దుర్గా దేవి ఆలయం".  ప్రధాన ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. 
ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. 
ఎందరో కారణ జన్ములకు మార్గదర్శనం చేసిన తిరువన్నామలై లో విధిగా దర్శించవలసిన ఆశ్రమాలలో శ్రీ రమణ మహర్షి , శ్రీ శేషాద్రి స్వామి మరియు శ్రీ రామ సూరత్ కుమార్ ముఖ్యమైనవి. 
తిరువన్నామలిలో భక్తుల కొరకు ప్రతి ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేసారు. 
ఉండటానికి అందుబాటు ధరలో వసతి గృహాలు లభ్యం అవుతాయి. 
చెన్నై, సేలం కాట్పాడి ల నుండి సులభంగా తిరువన్నామలై చేరుకొనవచ్చును.  
హర అంటే శివుడు. 
అర అంటే అమ్మవారు పార్వతి. 
అన్నామలయ్యను భక్తులు అర్ధనారీశ్వర రూపంగా ఆరాధిస్తారు. 
ఒకరిలో ఒకరై చెరి సగమై ప్రకృతీ పురుషులైన ఆదిదంపతులను భక్తులు తమ స్మరణలో కూడా విడదీయడానికి ఇష్టపడక కలిపి జ"ఆరోం హర"అని కైవారాలు చేస్తారు. 
తిరువన్నామలై కే ప్రత్యేకమైన ఈ ఆరోం హర నేడు తమిళ నాడు మొత్తంలో ప్రాముఖ్యం సంతరించుకొన్నది. 
తమిళ నాడులో ఒక పురాతన నానుడి ప్రకారం తిరువారూరులో జన్మిస్తే, తిల్లై (చిదంబరం) సందర్శిస్తే, కాశీలో మరణిస్తే లభించే ముక్తి తిరువన్నామలై అని స్మరిస్తే ముక్తి తధ్యం!! మోక్షం నిక్షయం !!!

అన్నామలయారుక్కు ఆరోం హర !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...