22, నవంబర్ 2014, శనివారం

Sri Konniyamman Temple, Coimbatore

                         శ్రీ కొన్నియమ్మన్ ఆలయం , కోయంబత్తూర్ 

కోయంబత్తూర్ గ్రామ దేవత "శ్రీ కొన్నియమ్మన్".
సుమారు అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని "ఇరుల" కులానికి చెందిన రాజులు పాలించేవారట.
తీవ్ర కరువు సంభవించి పంటలు పండలేదట.
ప్రజల కష్టాలు చూసిన రాజు దైవమే తన రాజ్యాన్ని కాపాడగలదని అమ్మల గన్న అమ్మను ప్రార్ధించాడట.
నాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చిన తల్లి తనకు ఉత్సవం జరిపించమని తెలిపిందట.
ఆలయం లేని లోకపావనికి ఉత్సవం ఎలా చేయాలి ?
సర్వాంతర్యామి మరియు సర్వ రూపి అయిన త్రిభువన పాలికను ఒక రాతి లోనికి ఆవాహన చేసి ప్రతిష్టించి కొలుపులు జరిపించారట.
ముగిసిన వెంటనే వర్షాలు కురిసి పంటలు వేయడానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయట.
నేటికి ప్రధాన ఆలయం వెనుక చిన్న ఉపలయంలో ఉన్న రూపం లేని రాతిని సందర్శించుకోవచ్చును.
"ఆది కొన్నియమ్మన్" అని పిలుస్తారు. 




పడమర ముఖంగా ఉన్న రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మరో చిన్న గోపురం  మరియు ప్రవేశ ద్వారం ఉంటాయి. 
అన్నిటి మీదా దేవీ పురాణ ఘట్టాలను, అష్టాదశ రూపాలను సుందరంగా చెక్కారు.  






ఆరోగ్యాన్ని కోరుకుంటూ భక్తులు ఇక్కడ పెద్ద కుప్పగా ఉప్పు మరియు మిరియాలు పోస్తారు.
దీనిని ప్రసాదంగా స్వీకరించినా ఆరోగ్యం సిద్దిస్తుందన్నది స్థానిక నమ్మకం. 












దక్షిణా ముఖుడై కొలువైన పంచ ముఖ గణపతి ఇక్కడ పూజలు స్వీకరిస్తారు. 


భక్తుల విరాళాలతో నూతనంగా నిర్మించిన ఆలయ సముదాయంలో ప్రదక్షిణా ప్రాంగణంలో మొట్ట మొదట నవగ్రహ మండపం ఉంటుంది. 
ఇక్కడ సతీ సమేతంగా నవ గ్రహులు ఉండటం ఒక విశేషం. 





తరువాత విఘ్న నాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఆది కొన్నియమ్మన్ ఉపాలయాలు ఉంటాయి. 








ముఖ మండపంలో నవ విధ దుర్గా రూపాలను సుందరంగా మలచారు. 
గర్భాలయంలో అష్ట భుజిగా అమ్మవారు ఉపస్థిత భంగిమలో భక్తులకు అభయం ప్రసాదిస్తుంటారు. 
ధ్వజస్తంభం మరియు బాలి పీఠం ఉండవు. 


నిత్యం ఎన్నో పూజలు శ్రీ కొన్నియమ్మన్ కు చేస్తారు. 
అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. 
ముఖ్యంగా శుక్ర వారాలలో, అమావాస్య, పౌర్ణమి రోజులలో  మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు. 
నవరాత్రులు మరియు మాసి నెల (ఫిబ్రవరి - మార్చి )లో పదునాలుగు రాలుల ఆలయ ఉత్సవాలలో జిల్లా నుండే కాకుండా రాష్ట్ర మొత్తం నుండి భక్తులు విచ్చేస్తారు. 
ఆఖరి  రోజున రధ యాత్ర అంగ రంగ వైభవంగా జరుపుతారు. 

ఆషాడ మాసంలో నెలంతా  జరిగే ప్రత్యేక పూజలలో ప్రతి నిత్యం అమ్మవారికి ఊంజల్ సేవ జరుపుతారు.
అమ్మవారిని సేవించడంతో పాటు ప్రాంగణంలో ఉన్న ఆలయ వృక్షాలైన వేప, మారేడు, శివ లింగం పూలకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.
నగర ప్రజల గృహాలలో జరిగే అన్ని శుభ కార్యక్రమాల తోలి ఆహ్వానం శ్రీ కొన్నియమ్మన్ కే!
ఆరోగ్యాన్ని, వివాహం, సంతానం మరియు వ్యాపార అభివృద్దిని కోరుకొంటూ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
వారి కోర్కెలను తీర్చి వారి నుండి పొంగలి నైవేద్యాన్ని నూతన వస్త్రాలను స్వీకరిస్తారు అమ్మవారు.





ఇంతటి విశేష ఆలయం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో టౌన్ హాల్ కు వెళ్ళే మార్గంలో ఉన్నది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...