కేరళ లోని తొలి శివ క్షేత్రం
కేరళ రాష్ట్రానికి ఉన్న మరో పేరు "దేవతల స్వస్థలం".
ఈ పేరు రావడానికి గల కథ శ్రీ మహా విష్ణువు లోకసంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ పరశురామావతారం తో ముడిపడి ఉన్నది.
ఏమా కథ అంటే ముందుగా శ్రీ పరశురాముని గురించి తెలుసుకోవాలి.
శ్రీ పరశురాముడు
మహర్షి జమదగ్ని , రేణుక దంపతులకు శ్రీ మహా విష్ణువు భార్గవ రామునిగా జన్మించారని పురాణాలు తెలుపుతున్నాయి.
జమదగ్ని మహర్షి వద్ద "సురభి"అనే ఆవు ఉండేదట. కామధేనువు గర్భాన జన్మించిన సురభి తల్లి మాదిరి కోరినవన్నీ ప్రసాదించే శక్తి కలిగి ఉండేది. వేటకు వచ్చి అలసిపోయి మహర్షి ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరించాడు ఆ ప్రాంత పాలకుడైన కార్తవీర్యార్జనుడు.
సురభి సంగతి తెలిసి తనకు ఇవ్వమని కోరారట. జమదగ్ని మహర్షి నిరాకరించడంతో ఆయనను సంహరించి గోవును బలవంతంగా తీసుకొని పోయారట. ఆ సమయంలో ఆశ్రమంలో లేని పరశురాముడు ఆగ్రహించి ద్వంద యుద్ధంలో కార్తవీర్యార్జుని అంతం చేశారట.
అక్కడితో ఆగకుండా అధికారమదంతో పాలకులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నారు. పాలించే అర్హత లేదు అని నిర్ణయించుకొని ఇరవై ఒక్కమార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్నవారిని సంహరించారు.
చివరకు శాంతించి పాలకులను చంపడం వలన సంక్రమించిన పాపాన్ని తొలగించుకోడానికి యజ్ఞం చేసి తానూ రాజుల నుండి స్వాధీనం చేసుకొన్న భూమిని అర్హులకు దానం ఇచ్చారట.
దానం చేసిన నేలలో ఉండకూడదు అన్న నియమం ప్రకారం ఆ ప్రదేశాన్ని వదిలి సముద్రుని వద్దకు వెళ్లి తనకు కొంత భూమిని ఇవ్వమని కోరారట.
అలా పొందిన ప్రాంతాన్ని "పరశురామ భూమి" అని పిలుస్తారు. ఆ ప్రదేశమే నేటి కేరళ. శ్రీ భార్గవ రాముడు శ్రీహరి అంశ కనుక కేరళను దేవతల స్వస్థలం గా పిలుస్తారు.
కేరళ లోని తొలి శివాలయం
గౌరీనాధుడు అశ్వద్ధ వృక్షం క్రింద స్థిరపడ్డారు అని చెప్పుకొన్నాము కదా ! ఆ క్షేత్రమే కేరళ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన త్రిసూర్.
నగరం నడి మధ్యలో ఉన్న "స్వరాజ్ రౌండ్ " అని పిలవబడే సువిశాల ప్రదేశం మధ్యలో చిన్న పర్వతం ఉంటుంది కేరళ తొలి శివాలయం. వృషాచలం అని అంటారు. ప్రధాన అర్చనామూర్తిని శ్రీ వడక్కునాథర్ స్వామి గా పిలుస్తారు. "వడక్కు" అనగా దక్షిణం. నాథర్ అంటే అధిపతి. అనగా శ్రీ పశుపతి ఉత్తర దేశానికే కాదు దక్షిణ ప్రాంతానికి కూడా అధిపతి.
క్షేత్రాల ఆవిర్భావం
సగరుడు ఇచ్చిన భూమిని తన పాదస్పర్శతో పావనం చేయమని గురువైన పరమేశ్వరుని కోరారట. శిష్యుని కోరిక మన్నించి సపరివార సమేతంగా కైలాసనాధుడు ఉత్తర దేశం నుండి దక్షిణ దేశం వచ్చారట. వచ్చే ముందు ఒక షరతు విధించారట. ఆయనకు నచ్చిన ప్రదేశంలో స్థిరపడి పోతారు. దాని మీద ప్రశ్నించకూడదు. అంగీకరించారట అవతారపురుషుడు.
అశ్వద్ధ వృక్షాలతో నిండిన ప్రశాంత సుందర ప్రదేశం మహేశ్వరుని ఆకర్షించింది. ఒక అశ్వద్ధ వృక్షం క్రింద ధ్యానముద్రలో ఉపస్థితులైన లింగరాజు అక్కడే స్థిరపడిపోయారు.
గురువు అనుమతి పొందిన పరశురాముడు సర్పరాజు వాసుకిని పిలిచి నేలను నివాసయోగ్యం చేయమని కోరారట. సర్పాలు నేలలోని విషపదార్ధాలు తొలగించాయట.
తనకు సహాయం చేసిన సర్పాలకు ప్రత్యేక పూజార్హత కల్పించారు. అందుకే మరెక్కడా కనిపించని విధంగా కేరళలోని ప్రతి ఆలయంలోనూ నాగ దేవత ప్రత్యేక సన్నిధి కనిపిస్తుంది. "మన్నార్ శాల" కేరళలో ప్రసిద్ధ నాగరాజ క్షేత్రం.
అదే విధంగా భార్గవుడు నూట ఎనిమిది శివలింగాలను, నూట ఎనిమిది శ్రీ భగవతీ క్షేత్రాలను, నూట ఎనిమిది శ్రీ ధర్మశాస్త ఆలయాలను ఏర్పాటు చేశారట. క్షేత్ర పాలకునిగా గంగాధరుడు, క్షేత్ర రక్షణ కొరకు శ్రీ భగవతి. క్షేత్ర కావలి దేవతగా శ్రీ ధర్మశాస్త లను నియమించారట. ఈ కారణం చేతనే కేరళ లోని ప్రతి చిన్నా పెద్ద ఆలయాలలో శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతి దేవి ఉపాలయాలలో దర్శనమిస్తారు.
శ్రీ పరశురాముడు ఆలయాలలో పూజాదులు చేయడానికి అర్హులైన బ్రాహ్మణులను కర్ణాటక ప్రాంతం నుండి రప్పించారట.
నేటికీ కేరళలో పరశురామ ప్రతిష్ఠిత శివలింగాలను, శ్రీ భగవతీ ఆలయాలను శ్రీ ధర్మశాస్త కోవెలలను సందర్శించుకోవచ్చును.
ఆలయ గాథ
అశ్వద్ధ వృక్షం క్రింద లింగరూపంలో స్థిరపడిన లయకారుడు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. కేరళను పాలించిన ఒక రాజు ఆలయం నిర్మించాలని నిర్ణయం చేసి ఎదురుగా ఉన్న ప్రదేశంలో నాలుగు ద్వారాలతో పెద్ద ఆలయం నిర్మించి లింగాన్ని గర్భాలయంలో ప్రతిష్టించారట. అది ఎవరు ? ఎప్పుడు ఆలయం నిర్మించారు ? అన్న వివరాలు అందుబాటులో లేవు.
కానీ ఆలయం నిర్మించి వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం అయ్యింది అంటారు. కేరళ లోని అత్యంత పురాతన ఆలయం అని కూడా చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతర కాలంలో కేరళను పాలించిన అందరు పాలకులు శ్రీ వడక్కు నాథర్ ను సేవించారు. ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు.
తొలుత స్వామి స్థిరపడిన అశ్వద్ధ వృక్షం ను " మూల స్థానం" గా ప్రత్యేక హోదాను ఇచ్చి పూజిస్తున్నారు.
సుమారు పది ఎకరాల సువిశాల స్థలంలో నగర నడిమధ్యలో నిర్మించబడిన శ్రీ వడక్కునాథర్ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉంటాయి.
గర్భాలయ వెలుపలి ప్రాకారంలో శ్రీ గోశాల కృష్ణ, శ్రీ సింహాదర, శ్రీ ధర్మశాస్త, శ్రీ వేటక్కారన్, నాగదేవతలు, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఈ ఉపాలయాలలో కొలువై ఉంటారు.
శ్రీ ఆది శంకరుల వృత్తాంతం
హిందూ మతాన్నిపునరుద్దరించడంలో విశేష కృషి చేసిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు శ్రీ వడక్కు నాథర్ వరప్రసాదం.
సంతానం లేని ఆర్యాంబ మరియు శివగురు దంపతులు మండల కాలం నిష్టగా శ్రీ వడక్కు నాథర్ ను సేవించి స్వామినే తమ బిడ్డగా పొందారు అని చెబుతుంది "కేరళీయ శంకర విజయం" అనే పురాతన మలయాళ గ్రంధం.
తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మన కుడి పక్కన కనపడుతుంది శ్రీ ఆది శంకరుల సన్నిధి. పక్కనే ఉన్న ప్రదేశంలోనే శ్రీ శంకరులు విదేహులయ్యారని చెప్తారు.
కానీ శంకరులు కేదారనాథ్ వద్ద దేహం విడిచారని మిగిలిన గ్రంధాలు అన్నీ తెలుపుతున్నాయి. కేదారనాథ్ ఆలయం వద్ద ఆయన సమాధి ఉంటుంది.
ఆలయ విశేషాలు
వృషాచల పర్వతం మీద తొమ్మిది ఎకరాల విశాల స్థలంలో నాలుగు కేరళ శైలిలో నిర్మించబడిన ద్వారాలను కలుపుతూ దుర్బేధ్యమైన కోట గోడలాంటి ఎత్తైన ప్రహరీ ఉంటుంది. తూర్పు ద్వారానికి ఎదురుగా ఆలయం వెలుపల మూల స్థానం ఉంటుంది. తూర్పు మరియు పడమర ద్వారాల గుండానే ఆలయం లోనికి ప్రవేశం. దక్షిణ ద్వారాన్ని ఒక్క త్రిసూర్ పూరం సందర్బంగా మాత్రమే తెరుస్తారు. పూరం సంబరాలను వీక్షించడానికి శ్రీ వడక్కు నాథర్ గజారూఢులై ఆలయం వెలుపలికి ఆ ఒక్క రోజు మాత్రమే వస్తారు.
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది "కూతంబళం".
కూతంబళం
నృత్య సభ అని అర్ధం.
నలువైపులా మూసివేయబడి నాట్య శాస్త్రం నిర్దేశించిన నియమాల ప్రకారం నిర్మించబడిన పవిత్ర స్థలం. భగవంతుని ప్రీత్యర్ధం పురాణాలను గేయ నృత్య పద్దతిలో ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేయబడినట్లు చెబుతారు.
కేరళ లోని ప్రముఖ ఆలయాలలో ఈ కుతంబళం కనపడుతుంది. ఇక్కడ కూడా ప్రతి నిత్య సాయంత్రం ఏదో ఒక నృత్య విధానంలో ప్రదర్శన ఉంటుంది.
శ్రీ గోశాల కృష్ణ సన్నిధి దాటిన తరువాత "వృషభ" సన్నిధి కూడా ఈ ఆలయ ప్రత్యేకత. సహజంగా ముఖ లేదా అర్ధ మండపాలలో దర్శనమిచ్చే నందీశ్వరుడు ఇక్కడ వృషభ గా విడిగా ఉపాలయంలో కొలువై పూజలు అందుకొంటుంటారు.
అక్కడ నుండి వరుసగా శ్రీ సింహోదర, శ్రీ ధర్మశాస్త, శ్రీ వేటక్కారన్, శ్రీ నాగ దేవత, శ్రీ ఆది శంకర ఉపాలయాలు.
శ్రీ వడక్కు నాథర్ ఆలయం లోని వెలుపలి ప్రాకారంలో కనిపించే మరి రెండు ప్రత్యేకతలను తెలుసుకోవాలి.
ఆలయ ప్రతి దిక్కు అనేక తూర్పు, ఈశాన్యం, నైరుతి ఇలా ఆ దిశలో ఏ ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయో ప్రత్యేకించి రాసి ఉంచారు. అనగా చిదంబరం, వారణాశి, రామేశ్వరం ఇలా రాసి ఉంటుంది.
వ్యాస శిల
శ్రీ ధర్మ శాస్త ఆలయం వెనుక పక్కన ఒక అశ్వద్ధ వృక్షం క్రింద మూడు బాషలలో పెట్టబడిన సూచన అందరినీ ఆకర్షిస్తుంది.
సూర్యోదయం అయిన తరువాత సూర్యాస్తమయం లోపల అక్కడ " హరిః శ్రీ గణపతయే నమః" అని చేతి వేళ్ళతో అక్కడ మట్టిలో లో లేదా వృక్షం చుట్టూ నిర్మించిన రాతి గోడ మీద కానీ రాయాలి. అలా రాయడం వలన అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి అని చెబుతారు. అంతకు మించి వివరాలు తెలియరాలేదు.
ప్రదక్షిణ ముగించుకొని లోనికి వెళుతున్నప్పుడు పురాతన మండపంలో నాలుగు వందల సంవత్సర క్రిందట సహజ వర్ణాలతో చిత్రీకరించబడిన నృత్యనాధ, వాసుకి శయన, నందికేశ్వర చిత్రాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వీటికి వారసత్వ సంపద క్రింద పరిరక్షిస్తున్నారు.
అంతర ప్రాంగణంలో మొత్తం మూడు గర్భాలయాలు కనిపిస్తాయి. కేరళలో గర్భాలయాన్ని శ్రీ కోవెల అని పిలుస్తారు. ప్రధాన శ్రీకోవెలలో శ్రీ వడక్కు నాథర్ స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. విశేషం ఏమిటంటే ఇక్కడ నెయ్యి మరియు కొబ్బరి నీటి తో మాత్రమే అభిషేకం జరుపుతారు.. అభిషేకం జరిపిన నెయ్యి సుమారు ఆరు అడుగుల ఎత్తున లింగం పై గడ్డకట్టుకొని మంచు కప్పినట్లుగా కనపడుతుంది.
త్రిసూర్ వేడి ప్రదేశం. లోపల దీపాలు వెలుగుతుంటాయి. అయినా అన్ని అడుగుల ఎత్తున నెయ్యి కరగకుండా ఉండటం ప్రత్యేకత. అదీకాక ప్రతినిత్యం రెండు సార్లు మొత్తం ఆరు అడుగులకు అలంకరణ చేస్తారు.
అప్పుడప్పుడు విరిగి పడిన వాటిని భక్తులకు ఇస్తారు.
స్వామి వారు తూర్పు ముఖంగా కొలువై ఉండగా అదే శ్రీ కోవెలలో వెనుక పక్క శ్రీ పార్వతీ దేవి పడమర ముఖంగా దర్శనం ప్రసాదిస్తారు. కేరళలో కనిపించే ప్రత్యేకతలో ఇదొకటి. ఒకే గర్భాలయంలో రెండుపక్కలా అమ్మవారు అయ్యవారు కొలువై ఉండటం. ఆది దంపతులు అర్ధనారీశ్వరులు కదా !
శ్రీ వడక్కు నాథర్ సన్నిధికి ఎదురుగా శ్రీ గణపతి, దక్షిణం పక్కన శ్రీ శంకరనారాయణ మరియు శ్రీ రామ సన్నిధులు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వృషాచలం శ్రీ వడక్కు నాథర్ ఆలయం హరిహర క్షేత్రం.
కేరళ క్షేత్రాలలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ హరి శ్రీ రాముడు, శ్రీ కృష్ణ ఇలా ఏ రూపంలో ఉన్నా చతుర్భుజాలతో ఒక్కరే గర్భాలయంలో దర్శనమిస్తారు.
కేరళలో శ్రీ రామ ఆలయాలతో పాటు ఆయన సోదరులైన భారత, లక్ష్మణ, శత్రుఘ్నుల ఆలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మూలవిరాట్టు చతుర్భుజాలతో కొలువై ఉంటారు.
ఆలయ పూజలు - ఉత్సవాలు
ఉదయం నాలుగు నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. అమావాస్య, పౌర్ణమి, సోమవారాల్లో, శబరిమల ఆలయం తెరిచి ఉంచే రోజులలో రద్దీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. విడి రోజులలో స్థానిక భక్తులు మాత్రమే వస్తుంటారు.
ఓనం, విషు లాంటి స్థానిక పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేస్తారు.భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శ్రీ వడక్కు నాథర్ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు నాలుగు.
మహా శివరాత్రి
పరమేశ్వరునికి విశేషమైన రోజు. శివరాత్రి పర్వదినాన రోజంతా లేత కొబ్బరి నీటితో నిరంతరాయంగా స్వామికి అభిషేకం జరుపుతారు. సాయంత్రం ఆలయం చుట్టూ ఉన్న వేలాది దీపాలను వెలిగిస్తారు. శ్రీ వడక్కు నాథర్ ఆలయం దీప కాంతులతో శోభాయమానాంగా వెలిగి పోతుంది.
పూరం
కేరళ రాష్ట్రంలో అనేక ఆలయాలలో "పూరం " నిర్వహిస్తారు. పూరం అనగా సంబరం అని అర్ధం. అందరూ కలిసి చేసుకొనే ఉత్సవ సంబరం.
కేరళలో గత మూడు వందల సంవత్సరాలుగా నిర్వహిస్తున్న త్రిసూర్ పూరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.
చాలా చిత్రంగా త్రిసూర్ పూరం ప్రారంభం అయ్యింది.
గతంలో అంటే పద్దెనిమిదో శతాబ్దం వరకు కేరళలో ఆరట్టుపుళ పూరం ప్రసిద్ధి. త్రిసూర్ చుట్టుపక్కల ఉన్న ఆలయాల వారు అందులో పాల్గొనేవారు. ఒక సంవత్సరం కొన్ని కారణాల వలన శ్రీ వడక్కునాథర్ ఆలయం మరియు మరికొన్ని ఆలయాల వారు ఆరట్టుపుళ పూరంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరించబడినది.
అప్పుడు కొచ్చిన్ రాజు అయిన "రామ వర్మ కుంజి పిళ్ళై థంపురం" (శాక్తన్ థంపురం అని పిలుస్తారు) త్రిసూర్ లోని వడక్కు నాథర్ ఆలయూయం వద్దనే ఎందుకు పూరం నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకొన్నారు.
చుట్టుపక్కల ఉన్న పది ఆలయాలను తీసుకొని వాటిని రెండు జట్లుగా విడతీసారు. ఒకటి తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం రెండవది శ్రీ పరమేక్కవు భగవతీ ఆలయం. మొదటి త్రిసూర్ పూరం 1796 వ సంవత్సరంలో జరిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ నిరంతరాయంగా త్రిసూర్ పూరం జరుగుతోంది.
సుందరంగా అలంకరించబడిన దేవస్థాన ఏనుగులు. వందల సంఖ్యలో నేర్పరులైన చండామేళం మరియు పంచ వాయిద్య కళాకారులు, నృత్యకారులు చివరగా లక్షలాదిగా ప్రజలు ఈ పురంలో భాగస్వాములు అవుతారు.
ఏనుగుల విన్యాసాలు, వాయిద్య కారుల ప్రతిభ, టపాసుల మోత మరియు ప్రజల ఉత్సాహం అన్నీ కలిసి త్రిసూర్ పూరం కేరళ జాతీయ పర్వదినంగా మార్చాయి. ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా పూరం చూడటానికి వస్తున్నారు అని నిర్ధారించబడినది.
ముఖ్యంగా పటాసుల మోతతో త్రిసూర్ పట్టణం దద్దరిల్లిపోతుంది అంటే అతిశయోక్తి లేదు.
తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం మరియు పరమెక్కవు శ్రీ భగవతీ ఆలయం రెండు కూడా శ్రీ వడక్కు నాథర్ ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. అదేవిధంగా శాక్తన్ థంపురం త్రిసూర్ లో విడిది చేసిన రాజభవనం కూడా దగ్గరలోనే ఉంటుంది.
అనయోట్టు
ఏనుగులతో కేరళ ప్రజల ఉన్న అనుబంధం వర్ణింపలేనిది. అవిభాజ్యమైనది.
వారి ప్రతి ఆలయ ఉత్సవం ఏనుగులతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ ఆలయానికి ఏనుగు లేకపోతే మరో ఆలయం నుండి లక్షల రూపాయల అద్దె కట్టి మరీ తెస్తారు. దానిని వారు ఆలయ మరియు ఊరి గౌరవంగా భావిస్తారు.
అలాంటి ఏనుగులతో జతపడిన ఉత్సవం అనయోట్టు. ఈ పదానికి అర్ధం ఏనుగులకు ఆహరం. గజం అంటే గణపతి ప్రతి రూపం.
ప్రతి సంవత్సరం కేరళ పంచాంగం ప్రకారం "కర్కాటక మాసం"(జులై, మన ఆషాఢమాసం) మొదటి రోజున శ్రీ వడక్కు నాథర్ ఆలయంలో అష్టద్రవ్య మహా గణపతి హోమం చేస్తారు. హోమం లో పాల్గొన్నభక్తులు తరువాత గజ పూజ చేస్తారు. అనంతరం ఏనుగులకు నిర్ణయించబడిన ఆరోగ్యకరమైన ఆహరం అందిస్తారు.
వేలాదిగా భక్తులు అనయోట్టు లో పాల్గొంటారు.
తిరువదిరై
శ్రీ వడక్కు నాథర్తి ఆలయంలో నిర్వహించే నాలుగవ ఉత్సవం తిరువదిరై లేక ఆరుద్ర దర్శనం.
శ్రీ నటరాజ స్వామి జన్మదినంగా భావిస్తారు.
తమిళనాడులోని చిదంబరంలో అత్యంత ఘనంగా చేస్తారు.
మార్గశిర మాసంలో వచ్చే తిరువదిరై ఉత్సవం సందర్బంగా పెద్ద ఎత్తున ప్రజలు శ్రీ వడక్కు నాథర్ దర్శనానికి తరలి వస్తారు.
ఇలా ఎన్నో విశేషాల నిలయమైన శ్రీ వడక్కు నాథర్ ఆలయం కేరళలో దర్శనీయ ఆలయాలలో ఒకటి. ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం అయిన గురువాయూర్ వెళ్లాలంటే త్రిసూర్ నుండే వెళ్ళాలి.
త్రిసూర్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరం స్వరాజ్ రౌండ్.
స్టేషన్ దగ్గరలో వసతి భోజన సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి.
నమః శివాయ !!!!