శ్రీ వేదగిరీశ్వర స్వామి ఆలయం- పక్షి తీర్థం
తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక క్షేత్రం పవిత్రమైనదిగా ప్రఖ్యాతి చెందడానికి అక్కడి పురాణ గాధ, కొలువైన దేవదేవుడు, దైవానుగ్రహం పొందిన భక్తులు, ఆలయ నిర్మాణ విశేషాలు మొదలగున్నవి ప్రధాన కారణాలవుతాయి.
కానీ చిత్రంగా కైలాసనాధుడు శ్రీ వేదగిరీశ్వరునిగా పూజలందుకొంటున్న ఈ క్షేత్రం పైన పేర్కొన్నవి అన్ని ఉన్నా కూడా "పక్షి తీర్ధం" గా పేరు పొందినది. మనలో చాలా మందికి ఈ క్షేత్రం గురించి తెలుసు. కొందరు స్వయంగా పక్షులు అర్చక స్వామి చేతుల మీదగా ప్రసాదం స్వీకరించడం చూసిన వారు కూడా ఉండే ఉంటారు. కానీ ఆ రెండు పక్షులకు, ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం తెలిసి ఉండక పోవచ్చును. తమిళనాడులోని అనేక విశేష శైవ క్షేత్రాలలో అగ్రస్థానంలో ఉన్నవాటిలో పక్షి తీర్థం ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చును.
ఈ క్షేత్రంతో ఎన్నో గాథలు ముడిపడి ఉన్నాయి.
పక్షి తీర్థం
అందుబాటులో లభిస్తున్న కథనాల ఆధారంగా ఈ పక్షులు గత జన్మలో మానవులుగా పుట్టి మహర్షులుగా మారి చేసిన దైవ ధిక్కారానికి ప్రతిగా పొందిన శాప ఫలాన్ని తొలగించుకొనే క్రమంలో సత్య యుగం నుండి కలియుగం దాకా ఇక్కడ స్వామిని దర్శించుకోడానికి వస్తున్నాయి అని తెలుస్తోంది.
"పూష మరియు విధాధ" అనే ఇద్దరు మహర్షులు మహేశ్వరానుగ్రహం ఆపేక్షిస్తూ తపస్సు చేశారట. వారి దీక్షకు సంతసించిన భోళాశంకరుడు వారి ఎదుట సాక్షాత్కరించారట. తమ తపస్సు ఫలించినందుకు ఆనందించిన వారు స్తోత్రపాఠాలతో స్వామిని కీర్తించారట. మరింత పొంగిపోయిన పశుపతి వారి కోరిక ఏమిటి అనడిగారట. ఋషులు ఇరువురు తమను ఆయనలో ఐక్యం చేసుకోమని కోరారట. దానికి పరమేశ్వరుడు "మీ కర్మ ఫలం ఇంకా పూర్తి కాలేదు. మీరు మరికొన్ని జన్మలు ఎత్తాలి. కానీ మీ తపస్సు నన్ను సంతుష్టుడిని చేసింది. అందుకొని కొంతకాలం మీకు నా సాయుజ్యం ప్రసాదిస్తాను. స్వీకరించండి" అన్నారట.
కానీ వారు తమ కోరిక నెరవేర్చాల్సినదే అని ఆయనతో వాదం చేసేసారట. ఆగ్రహించిన రుద్రుడు వారిని పక్షులుగా మారి పొమ్మని శపించారట. తమ తప్పు తెలుసుకొన్న మహర్షులు స్వామిని స్తుతించి, చేసిన అపరాధాన్ని క్షమించి శాపవిమోచన మార్గాన్ని తెలుపమని వేడుకొన్నారట. భక్తవశంకరుడు శాంతించి నిత్యం వేదగిరి మీద కొలువు తీరిన తనను దర్శించుకొని ప్రసాదం స్వీకరిస్తే కలియుగంలో శాపవిమోచనం లభిస్తుందని తెలిపారట.
ఆ కారణంగా పక్షులుగా జన్మించిన మహర్షులు కృత యుగంలో సందన్, ప్రసందన్ గా, త్రేతా యుగంలో సంపాతి, జటాయువులుగా స్వామిని సేవించుకొన్నారని అంటారు. వీరే కలి యుగంలో "శంభుక్తన్, ముకుందన్" అన్నపేర్లతో గ్రద్దల రూపంలో రోజూ వస్తుంటారన్నది స్థానిక నమ్మకం.
ఈ కృష్ణ గరుడ పక్షులు ఉదయం వారణాసిలో గంగా స్నానం చేసి మధ్యాహన్నం ఇక్కడికి వచ్చి మహాదేవ ప్రసాదం స్వీకరించి సాయంత్రానికి రామేశ్వరం చేరుకొనేవని చెబుతారు. వేదగిరి శిఖరం పైన ఉన్న చిన్న కోనేరు పక్కన ఒక ప్రత్యేక ప్రదేశంలో అర్చక స్వామి వీటికి పాల పాయసం పెట్టేవారు. ఆ ప్రసాదాన్ని తిని వెండి గిన్నెలో ఉన్న నీటిని త్రాగి అవి దక్షణ దిశగా యెగిరి పోయేవి .
క్రమం తప్పకుండా ప్రతి నిత్యం ఇక్కడికి వచ్చే ఈ దివ్య విహంగాల రాక సుమారు రెండు దశాబ్దాలుగా ఆగిపోయింది. బహుశా కర్మఫలం తీరి కైలాసానికి చేరుకొన్నాయేమో ! కానీ నేటికీ అర్చక స్వాములు కొండ పైన కోనేరు పక్కన ప్రసాదం, నీటితో నిండిన పాత్రలను పెట్టడం కొన్ని సంవత్సరాల అనుబంధంతో ఏర్పడిన నమ్మకమే కారణంగా చెప్పుకోవాలి.
ఈ పక్షుల మూలంగానే శిఖరం పైన ఒక ఆలయం, పర్వత పాదాల వద్ద ఒక ఆలయం ఉన్నా కూడా ఈ క్షేత్రాన్ని తమిళంలో "తిరుకళు కుండ్రం" (పక్షి తీర్థం) అని పిలుస్తారు.
అసలు ఈ పర్వతానికి వేదగిరి అన్న పేరు రావడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది.
వేదగిరి
భరద్వాజ మహర్షి గంగాధరుని గూర్చి తీవ్రమైన తపస్సు చేశారట . దర్శనమిచ్చిన నంది వాహనుడు మహాముని కోరిక ఏమిటని ప్రశ్నించారట. దానికి భరధ్వాజుడు తాను సంపూర్ణంగా నాలుగు వేదాలను అధ్యయనం చేయదాల్చానని దానికి కావలసిన ఆయుర్దాయాన్ని అనుగ్రహించమని వేడుకొన్నారట. మందహాసం చేసిన మహేశ్వరుడు నాలుగు శిఖరాలతో కూడిన మహా పర్వతాన్ని సృష్టించారట.దాని నుండి గుప్పెడు మట్టిని తీసుకొని నిర్ఘాంతపోయి చూస్తున్న భరద్వాజునితో " నాయనా ! ఇది అనంతమైన వేద రాశి. దీనిని పరిపూర్ణంగా అధ్యయనం చేయడం ఎవరి వలన కాదు. అందువలన ఈ వేద భాగం నేర్చుకొనే వరకు నీవు జీవించి ఉంటావు" అని అన్నారట.
ఆ పిడికెడు మన్నును స్వీకరించి సంతసించిన మహర్షి స్వామిని ఇక్కడే కొలువు తీరమని అర్ధించారట. ఆనాటి వేద మహా పర్వతమే నేటి "వేదగిరి". నాలుగు శిఖరాలు నాలుగు వేదాలకు ప్రతి రూపాలు. స్వయంభూగా ఈ శిఖరాల మధ్య వెలసిన స్వామిని "శ్రీ వేదగిరీశ్వరుడు" అని పిలుస్తారు. అమ్మవారు శ్రీ చొక్క నాయకి.
వేదగిరి అన్న పేరు సరిగ్గా సరిపోతుంది అన్న విషయాన్ని తెలిపే ఒక గాధ ప్రచారంలో ఉన్నది. సృష్టికర్త బ్రహ్మ లో అహంకారం పెరిగిపోయిందట.సహధర్మచారిణి,సకల విద్యలకు అధి దేవత అయిన శ్రీ సరస్వతి దేవిని నిర్లక్ష్యం చేయసాగారట. దానితో ఆయనకు గల వేదపరిజ్ఞానం మరియు సృష్టి నైపుణ్యం క్షీణించసాగాయట. అదే సమయంలో మధు కైటభులు అనే అసురులు వేదాలను అపహరించారట. దిక్కు తోచని విధాత భూలోకానికి వచ్చి ఈ వేదగిరి మీద తపమాచరించారట. అనుగ్రహించిన పరమేశ్వరుడు ఆయనను శ్రీ మహావిష్ణువును శరణు కోరుకోమన్నారట. అప్పుడు వైకుంఠుడు హయగ్రీవ అవతారం ధరించి రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందించారట.
ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే దేవతల అధిపతి ఇంద్రుడు పుష్కరానికి ఒకసారి వచ్చి శ్రీ వేదగిరీశ్వరుని సేవించుకొంటారట. ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద మెరుపు మెరుస్తుందట. ఆ వెలుగులో గర్భాలయం స్వర్ణమయ కాంతులతో వెలిగిపోతుంది. ఆ మెరుపు ప్రభావంతో మండప కప్పుకు రంధ్రాలు ఏర్పడతాయట . అలా ఏర్పడిన రంధ్రాలను ఆలయంలో చూడవచ్చును.
కొండ పైకి చేరుకోడానికి సుమారు ఏడు వందల సోపానాలతో కూడిన మార్గం ఉన్నది. పైనుండి చూస్తే క్రింద ఆలయం, ఊరు, నలుదిక్కులా పచ్చని పొలాలు నేత్ర పర్వంగా కనపడతాయి.
ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది.
వేదగిరి అనేక వనమూలికలతో నిండి ఉంటుంది. ఆరోగ్యాన్ని కోరుకొంటూ భక్తులు ప్రతి పౌర్ణమికి గిరి చుట్టూ ఏర్పాటు చేసిన అయిదు కిలోమీటర్ల మార్గంలో ప్రదక్షిణ చేస్తారు.
ఒరుక్కళ్ మండపం
శ్రీ వేదగిరీశ్వరుని సన్నిధికి వెళ్లే మెట్ల మార్గంలో కొద్దిగా క్రిందగా ఉంటుందీ ఈ ఏడవ శతాబ్దపు నిర్మాణం. గుహాలయాలకు ప్రసిద్ధి తొలి పల్లవ రాజుల కాలం. ఈ గుహాలయం క్రీస్తుశకం 610 - 640 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజు మొదటి మార్తాండ వర్మ పల్లవ చెక్కించినవిగా తెలుస్తోంది.
కొండను తొలచి నిర్మించిన రెండు గదులు ఉంటాయి. ఒక్కో గది లో పై కప్పుకు ఆధారంగా నాలుగు బలయిన రాతి స్తంభాలను అమర్చారు. ఒక గదిలో పెద్ద లింగానికి ఇరుపక్కలా నిలువెత్తు రూపాలలో బ్రహ్మ మరియు విష్ణుమూర్తి ఉంటారు. రెండో గదిలో స్వర్ణమయ ఆభరణాలతో సుందరంగా మలచబడిన రెండు విగ్రహాలు కనపడతాయి. ఒక్కో విగ్రహం ఒక్కో రాతి మీద చెక్కినది కావడం వలన దీనికి"ఒరుక్కాళ్ (ఒకే రాతి)మండపం" అన్న పేరొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పురావస్తుశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నదీ మండపం.
శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి ఆలయం
కొండ క్రింద ఉన్న పెద్ద ఆలయం శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ భక్తవత్సలేశ్వర స్వామివారి స్థిర నివాసం. తిరువణ్ణామలై లో కొలువైన శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని పోలి వుండే ఈ ఆలయం నాలుగు దిక్కులలలో ఏడు అంతస్థుల గోపురాలు కలిగి ఉంటుంది. చక్కని శిల్పాలు మండపాలలో, స్తంభాల పైన నేత్రపర్వంగా కనిపిస్తాయి.
ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ జంబుకేశ్వర, శ్రీ ఏకాంబరేశ్వర, శ్రీ అరుణాచలేశ్వరలతో పాటు అరవై మూడు మంది గాయక శివ భక్తులైన నయనారులలో మొదటి వారుగా పేర్కొనబడే "సుందరా ర్, సంబందార్, అప్పర్ మరియు మాణిక్యవాసగార్ సన్నిధి కూడా ప్రాంగణంలో కనపడుతుంది.
తొలి ప్రాకారంలో ఉన్న పెద్ద నంది వేదగిరి వైపు తిరిగి ఉండటం విశేషం. కొండపైన నంది ఉండదు. గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ భక్త్వత్సలేశ్వర స్వామి రమణీయ పుష్ప చందన కుంకుమ అలంకరణలో దర్శనమిస్తారు. సహజంగా గర్భాలయ వెనుక భాగాన కనిపించే లింగోద్భవ మూర్తి ఉండదు. దాని బదులు శ్రీ సోమస్కంద మూర్తి కనపడుతుంది.
అమ్మవారు శ్రీ త్రిపుర సుందరీ దేవి విడిగా కొలువై ఉంటారు . స్వయంవ్యక్త మూర్తి. ప్రతి నిత్యం పాదాలను మాత్రమే కడుగుతారు. ఫల్గుణి ఉత్తరాయణం, ఆషాఢమాస పౌర్ణమి నాడు మరియు నవరాత్రులలో ఆఖరి రోజున మాత్రమే అభిషేకం నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలో పల్లవ, చోళ, రాష్ట్రకూట, విజయనగర, నాయక రాజుల కాలాలకు చెందిన శాసనాల ఆధారంగా వీరంతా ఆలయాభివృద్దికి పాటు పడినట్లుగా తెలుస్తోంది. ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది.
ఈ ఆలయంలో కనపడే మరో విశేషం శంఖు తీర్ధం.
శంఖు తీర్ధం
శ్రీ వేదగిరీశ్వర మరియు శ్రీ భక్తవత్సలేశ్వర స్వామివార్లు కొలువైన ఈ క్షేత్రంలోని ఆలయాలు రెండు కూడా పన్నెండు తీర్ధాలను కలిగి ఉన్నాయి. ఇవి కొండ మీద, క్రింది ఆలయంలో మరియు చుట్టుపక్కల కలవు. ఇంద్ర, శంభు,రుద్ర, వశిష్ఠ, అగస్త్య, మార్కండేయ, నంది, కౌశిక,వరుణ, అగ్ని, పక్షి తీర్ధాలు. వీటిల్లో పక్షి తీర్ధం వేదగిరి పైన ఉంటుంది
ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది తీర్ధం జలాన్నిస్వామి వారి పూజాదికాలు ఉపయోగిస్తారు. ఈ పుష్కరణిలో స్నానమాచరించి స్వామిని సేవించుకొంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు.
ఆలయానికి కొద్ది దూరంలో సముద్రాన్ని తలపించేలా సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే దానిని మార్కండేయ లేదా శంఖు తీర్ధం అని పిలుస్తారు.
ఒకసారి మార్కండేయ మహర్షి ఈ క్షేత్రానికి విచ్చేశారట. ఈ పుష్కరణి ఒడ్డున పూజాదికాలు నిర్వహించదలచారట. కానీ అభిషేకం చేయడానికి శంఖం లేకపోయిందట. అప్పుడు ఆయన తన తపః శక్తితో కోనేటి నుండి ఒక శంఖాన్ని సృష్టించి అభిషేకం చేశారట.
అప్పటి నుండి ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఒక శంఖం ఈ తీర్ధం నుండి ఉద్భవిస్తుందట. శంఖాలు సహజంగా లవణ సాంద్రత అధికంగా గల సముద్రాలలో ఏర్పడతాయి. కానీ మంచి నీటి కోనేరు అయిన దీనిలో ఆవిర్భవించడం దైవలీలగా భావిస్తారు భక్తులు. ఆలయంలో సుమారు వెయ్యి దాకా శంఖాలు ఉన్నాయని అంటారు. ఆలయ కార్యాలయం దగ్గర కొన్ని శంఖాలను ప్రదర్శనగా ఉంచారు.
శంఖు తీర్ధానికి మరో విశేషం ఉన్నది. అదే పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు. జీవనదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరగడం హిందూ సంప్రదాయంలో జలాన్ని గౌరవించడంలో ఒక విధానం.
శివాజ్ఞ మేరకు దేశంలోని అందరు నదీమ తల్లులు ఈ శంఖు తీర్ధంలో గురుడు కన్య రాశి లోనికి సమయంలో స్నానమాచరిస్తారని స్థలపురాణం తెలుపుతోంది. ఆ సమయంలో రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పుష్కరమేళా లో పాలుపంచుకోడానికి తరలివస్తారు.
లక్షలాది దీప కాంతులలో సాయం సంధ్యాసమయంలో శంఖు తీర్ధం శోభాయమానంగా దర్శనమిస్తుంది. కుంభకోణంలో ఉన్న మహామాఘం పుష్కరణి తరువాత పుష్కర హోదా పొందిన మరో పుష్కరణి శంఖు తీర్ధం.
ఇన్ని విశేషాల సమాహారమైన శ్రీ వేదగిరీశ్వర స్వామి కొలువైన పక్షి తీర్ధం మహాబలిపురానికి ఇరవై, కాంచీపురానికి యాభై, చెంగల్పట్టు కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ప్రతి నిత్యం విశేష పూజలు నిర్వహించే ఈ క్షేత్రంలో పర్వదినాలలో భక్తుల సందడి విశేషంగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి