నవగ్రహ క్షేత్రాలు - నవ కైలాసాలు
కైలాసనాధుడు ఇలలో పెక్కు క్షేత్రాలలో స్వయంభూలింగ రూపంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయాలన్నీ భక్తులకు భువిలో కైలాస సమానంగాను,దర్శనీయ క్షేత్రాలుగా ప్రసిద్దమయ్యాయి.
కానీ ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని దక్షిణ భాగాన ఉన్న తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలను సస్యశ్యామలం చేసే నది తమిరపారాణి. ఆ నదీతీరంలో ఉన్న నవ కైలాస క్షేత్రాలు మిగిలిన వాటికి భిన్నమైనవి.
పురాణ గాధలలో పేర్కొన్న ప్రకారం నవ కైలాసాలు ముక్తి ప్రసాదాలు.
శివ పార్వతుల కళ్యాణం వీక్షించడానికి ముల్లోకాల నుండి తరలి వస్తున్న వారితో భూమి ఉత్తర భాగంలో భారం పెరిగి ఒక పక్కకు ఒరగసాగిందట. పరమేశ్వరుడు సప్తమహర్షులలో ఒకరైన అగస్థ్య మునిని పిలిచి, శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ భాగానికి వెళ్ళమని ఆదేశించారట. చెమ్మగిల్లిన కనులతో "స్వామి!తమరి వివాహం వీక్షించే భాగ్యం నాకు లేదా ?" అని విషాదముగా ప్రశ్నించారట మహర్షి. ఆశీర్వదించిన మహేశ్వరుడు "నీవు ఎక్కడ ఉన్నా అక్కడ నుండి నా వివాహాన్ని చూడగలవు" అని వరం ప్రసాదించారట. త్రినేత్రుని ఆదేశం కాదనలేక వింధ్య పర్వతాలను దాటి దక్షిణాదిలో తాను ఎక్కడ విడిది చేశారో అక్కడ నిత్య పూజ నిమిత్తం ఒక లింగాన్ని ప్రతిష్టించేవారట. వాటినే నేటికీ మన రాష్ట్రంతో పాటు, కర్ణాటక మరియు తమిళనాడులలోని చాలా శివాలయాలలో కొలువైన లింగరాజుని "అగస్తేశ్వరుడు" అని పిలుస్తుంటారు.
పవిత్ర నదులలో స్నానమాడుతూ పుణ్య క్షేత్రాలనుసందర్శించుకొంటూ చివరికి పశ్చిమ కనుమలలో ఉన్న పొదిగై పర్వతాలను చేరుకొన్నారట. ఇక్కడే ఆయన సంస్కృత తమిళ భాషలకు లిపిని సృష్టించారని పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొనబడినది. అగస్త్య మలై మీద అగస్త్య మహర్షి ఆలయం ఉన్నది.
ఈ కొండల పైనుండే కైలాసనాధుని కరుణతో స్వామివారి కల్యాణ సంబరాలను కమనీయంగా దర్శించుకొన్నారట అగస్త్యుడు. ఈ ఉదంతం గురించి వరాహ, స్కాంద పురాణాలలో, రామాయణ మరియు మహాభారతాలలో విశదీకరించబడినది. రోమశ ముని అగస్త్యుని ప్రధమ శిష్యుడు. తపస్సు చేసి నందివాహనుని సాక్షాత్కారం పొందారు. కానీ అతను కోరిన మోక్షాన్ని ప్రసాదించలేనని, దానికి గురువాజ్ఞ కావాలన్నారట. తిరిగి వచ్చి గురువునకు జరిగింది తెలిపి ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశించమని అర్ధించారట రోమశ ముని. అగస్త్యుడు శిష్యుని ఆకాంక్షకు ఆనందించి తొమ్మిది కమలాలను తమిరబారాణి నదీప్రవాహంలో విడవమన్నారట. అవి తీరాన్ని తాకి శివలింగాలుగా మారిపోతాయి. ఆ దివ్య క్షేత్రాలలో సర్వేశ్వరుని అర్చించి, చివరగా నది సముద్రునితో కలిసే సంగమ స్థలంలో తపస్సు చేస్తే కోరిక సిద్ధిస్తుంది అని తెలిపారట.
శిష్యుడు అదే విధంగా చేసి ముక్తిని పొందారు. అలా రోమశ మహర్షి వదిలిన పుష్పాల నుండి ఉద్భవించిన లింగాలు కొలువైన క్షేత్రాలు నవ కైలాసాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పాపనాశం, చేరన్ మహాదేవి, కొడగనల్లూరు, కూనత్తూరు, మూరప్పనాడు, శ్రీ వైకుంఠం, తెందూరిపెరై, రాజపతి మరియు సెందపూమంగళం. శైవ సంప్రదాయం ప్రకారం ఇవి మానవ జీవితాలను ప్రభావం చేసే నవ గ్రహాలకు ప్రతీక.జాతకరీత్యా ఏ గ్రహ ప్రభావంతో జీవితంలో ఎదుర్కొంటున్న ఒడుదుడుకులు ఆ గ్రహ క్షేత్రాన్ని సందర్శించుకొంటే తొలగిపోతాయి అన్న విశ్వాసంతో ప్రతి నిత్యం ఎందరో ఈ క్షేత్రాలను సందర్శించుకొంటుంటారు.చోళలు నిర్మించిన ఆలయాలను, పాండ్య మరియు నాయక రాజులు అభివృద్ధి చేసినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి.
నవ కైలాస క్షేత్రాలన్నీ విశేష పురాణ నేపథ్యం కలిగినవి. అన్ని క్షేత్రాలలో (పాపనాశం తప్ప) కొలువైన ఆదిదంపతులను శివగామి సమేత కైలాసనాథర్ అనే పిలుస్తారు. కైలాస సమాన ప్రదేశాలు కదా ! కార్తీకమాసం,ఆరుద్రోత్సవం,నవరాత్రులు,గణేశ చతుర్థి,స్కంద షష్టి, శివరాత్రి, త్రయోదశి ప్రదోష పూజలు, పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు. అన్ని చోట్లా శైవాగమన విధానాన్ని అనుసరించి రోజుకు ఆరు పూజలు జరుపుతారు.
మరో విశేషం ఏమిటంటే పావన తమిరబారాణి నదీతీరంలో ఆళ్వారుల పాశురాలతో దివ్యదేశాల హోదా పొందిన తొమ్మిది శ్రీమన్నారాయణుని ఆలయాలు కూడా ఉన్నాయి.వీటిని నవ తిరుపతులు అని పిలుస్తారు.చిత్రమైన విశేషం ఏమిటంటే ఇవి కూడా నవగ్రహ క్షేత్రాలే. కాకపోతే శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు.
పాపనాశం శ్రీ పాపనాశనాథర్ స్వామి అర్ధాంగి లోకనాయకి (ఉళగమ్మాళ్) సమేతులై కొలువైన ఈ క్షేత్రం రోమశ ముని వదిలిన పుష్పాలలో తొలి పుష్పం తీరాన్ని తాకడంతో ఏర్పడినది. స్వామివారు ఆరోగ్యప్రదాత. అందుకని సూర్యగ్రహానికి సంకేతమీ ఆలయం.
దేవతలను నాశనం చేయాలన్న ఉదేశ్యంతో తపమాచరిస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుని కుమారుడైన ద్వస్థ అనే వాడిని సంహరించారు దేవేంద్రుడు. దాని వలన సంక్రమించిన బ్రహ్మహత్య పాపాన్ని తొలిగించుకోడానికి నీలకంఠుని ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి పాపాన్ని తొలగించుకున్నారు. ఆ కారణంగా స్వామిని పాపనాశనాథర్ అని పిలుస్తారు.
సుందర జలపాతాలు, నదీ తీరం, వనాల మధ్య ప్రకృతి పూర్ణస్వరూపంగా దర్శనమిచ్చే పాపనాశం క్షేత్రంలో వినాయక, షణ్ముఖ, దక్షిణామూర్తి, దుర్గ ఆదిగా గల దేవీ దేవతలు ఉపాలయాలలో కొలువై ఉంటారు. విజయనగర మరియు నాయక రాజులు పునః నిర్మించిన ఈ ఆలయంలో రమణీయమైన శిల్పకళ కనపడుతుంది. ఆలయం ఉదయం ఆరు నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటుంది. జిల్లా కేంద్రమైన తిరునెల్వేలికి అరవై కిలోమీటర్ల దూరం. పాపనాశంలోని శ్రీ నారాయణ స్వామి, శ్రీ కాళీ అమ్మన్ ఆలయాలు తప్పక దర్శించుకోవలసినవి.
ప్రకృతి ప్రేమికులకు ఈ క్షేత్ర సందర్శన ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలుగ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అంబ సముద్రం, విక్రమసింగ పురం,మన్నార్ కోయిల్, శివశైలం గ్రామాలలో గొప్ప పురాతన ఆలయాలను దర్శించుకోవడం అదనపు అవకాశం.
చేరన్ మహాదేవి శ్రీ కైలాసనాథర్ శివగామీ అంబాళ్ సమేతులై కొలువు తీరిన చేరన్ మహాదేవి నవ కైలాసాలలో రెండవది. ఇది చంద్ర క్షేత్రం. రోమశ మహర్షి తొలుత తపస్సు చేసి శివ దర్శనాన్ని పొందినది ఈ క్షేత్రంలోనే . అందుకే మహర్షి ఒక ఉపాలయంలో కొలువై ఉంటారు.
గర్భాలయానికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇక్కడ కొద్దిగా పక్కకు ఉంటాడు. దీనికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. అంటరాని కులానికి చెందిన నందనార్ గొప్ప శివభక్తుడు. దళితులకు ఆ రోజులలో ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అయినా నందనార్ శైవ క్షేత్రాలను సందర్శించి వెలుపలి నుండే తన ఆరాధ్యదైవాన్ని ప్రార్ధించుకొనేవాడు. ఒకనాడు నందనార్ ఇక్కడికి వచ్చి వెలుపల నిలిచి ప్రార్ధిస్తున్నాడు. భక్తవత్సలుడు తన భక్తుడు చూడటానికి వీలుగా నందిని పక్కకు జరగమన్నారు. అందుకని నంది పక్కకు ఉంటాడు.
ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ విశ్వనాథ, నటరాజ, సప్త మాతృకలు దర్శనమిస్తారు. నవగ్రహ మండపం ఉంటుంది. ఆలయం ఉదయం ఏడు నుండి పది వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి ఆరువరకు మాత్రమే తెరిచి ఉంటుంది. చేరన్ మహాదేవి లో శ్రీ వైద్యనాథర్ , శ్రీ భక్తవత్సల పెరుమాళ్, శ్రీ మారియమ్మన్ ఆలయాలు దర్శనీయాలు. పాపనాశం నుండి చేరన్ మహాదేవికి పాతిక కిలోమీటర్లు.
కొడగనల్లూరు చేరన్ మహాదేవికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగనల్లూరు నవ కైలాసాల్లో మూడవ క్షేత్రం. ఈ ఆలయం మహాభారతంతో ముడిపడి ఉన్నట్లుగా క్షేత్ర గాధ తెలుపుతోంది. పరీక్షిత్తు మహారాజు మృతికి కారకుడైన తక్షకుడు (కర్కోటకుడు) పాపపరిహారార్ధం శ్రీ కైలాసనాథర్ ని ప్రార్ధించి అనుగ్రహం పొందాడట. అంగారక క్షేత్రం. కుజ గ్రహ వక్ర దృష్టితో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నవారి ఉపశమనార్ధం పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో వృశ్చిక మరియు మేష రాశి వారికి కూడా దర్శనీయం. సాదాసీదాగా ఉండే ఈ ఆలయంలో ఒక విశేషం కనపడుతుంది. దీర్ఘకాలంగా వివాహం కాని యువతీయువకులు యాభై యెనిమిది పసుపు కొమ్ములు కట్టిన దండ నంది మెడలో వేస్తారు. దీని వలన కళ్యాణ ఘడియలు తొందరగా వస్తాయని విశ్వసిస్తారు. లెక్కలేనన్ని పసుపు కొమ్ముల దండలతో నంది నిండుగా కనపడతాడు.
బృహదీశ్వర ఆలయం తరువాత అంత పెద్ద లింగాన్ని ఇక్కడ చూడవచ్చును. గర్భాలయంలోని కైలాసనాథర్ లింగానికి కట్టడానికి ఎనిమిది గజాల ధోవతులు ఎనిమిది కావాలంటే లింగ పరిమాణాన్ని ఊహించుకోవచ్చును.అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది.
ఈ ఊరిలోని శ్రీ బృహన్ మాధవ స్వామి ఆలయం, శ్రీ అభిముక్తేశ్వర స్వామి ఆలయాలు పురాతనమైనవి. తప్పక సందర్శించవలసినవి.
కున్నత్తూర్ కొడగనల్లూరు కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్నత్తూర్ నవ కైలాసాలలో నాలుగవది. ఇక్కడ కొలువైనదీ శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి. కానీ స్థానికంగా శ్రీ గోత పరమేశ్వరస్వామి కోవెలగా పిలుస్తారు. సాధారణంగా కనిపించే ఈ క్షేత్రం రాహు గ్రహ పరిహార క్షేత్రం మరియు పూజలకు ప్రసిద్ధి. జాతక రీత్యా రాహు వక్రదృష్టితో ఇక్కట్లు పడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు.
మరెక్కడా చూడని విశేషం ఇక్కడ కనపడుతుంది. లింగం మీద సర్పాకృతి ఉంటుంది. ఇలాంటి విశేష లింగాన్ని మరెక్కడా చూడలేము. సాదా సీదా గా ఉండే ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది.
మూరప్పనాడు నవ కైలాసాలలో అయిదవది. కున్నత్తూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి కొలువై ఉంటారు. గురు గ్రహ క్షేత్రం. ధను మరియు మీన రాశిలో జన్మించినవారికి కూడా దర్శనీయ క్షేత్రం. ఇక్కడ తమిర బారాణి నది ఉత్తర వాహిని. ఇక్కడ స్నానం సమస్త పాపహరం. గంగా స్నానముతో సమానం. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో అదే విధంగా నెల చివరి శుక్ర, శని వారాలలో వేలాదిగా భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు.మరో విశేషమేమిటంటే గర్భాలయం వద్ద నిలబడి చూస్తే నదిలో స్నానమాచరించి భక్తులు కనపడతారు. దక్షిణ గంగలో స్నానమాచరించే వారిని గంగాధరుడు లోపలి నుండే ఆశీర్వదిస్తున్న అనుభూతి కలుగుతుంది భక్తజనులకు.
విజయనగర మరియు నాయక రాజులు యుద్దానికి తరలి వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా గురువుకు పూజలు చేసేవారట. గురు అనుగ్రహం విజయాన్ని అదృష్టాన్ని తెస్తుంది అన్నది తరతరాల విశ్వాసం.
సూరపద్ముని అరాచకాల నుండి కాపాడమని మునులు నదీతీరంలో వరుసలో నిలబడి నందివాహనుని ప్రార్ధించారట. అందుకని ఈ పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ సమయంలో మునులు ప్రతిష్టించిన "మురంబేశ్వర స్వామి" లింగం ఈ సంఘటనకు గుర్తుగా చూపుతారు.
ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. ద్వారపాలకులుగా వినాయకులు ఉంటారు. భైరవ సన్నిధిలో రెండు భైరవ మూర్తులు ఉంటాయి. శునకంతో ఉన్నరూపాన్ని కాలభైరవగా లేకుండా ఉన్న మూర్తిని వీరభైరవగా ఆరాధిస్తారు.
ఈ ఆలయంలో కనపడుతుంది మరెక్కడా కనిపించని ప్రత్యేకత నంది విగ్రహంలో. వృషభ (ఎద్దు) మొహానికి బదులు అశ్వవదనంతో కనిపిస్తాడు శిలాద తనయుడు.దీనికి సంబంధించిన కధ ఇలా ఉన్నది. ఒక చోళ రాజుకు అశ్వవదనంతో కుమార్తె జన్మించినది. తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ఇక్కడికి వచ్చి తదైకదీక్షతో తపమాచరించి కైలాసనాథుని ప్రసన్నం చేసుకొన్నాడు. ఆయన నందిని బాలిక మోమును స్వీకరించమని ఆదేశించారు. అలా బాలిక మోము నందికి వచ్చింది.
ఉపాలయాలలో సూర్య, అష్టలక్ష్మి, నయమ్మార్లు, పంచ ముఖ లింగం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వర స్వామి, శని భగవాన్ కొలువై ఉంటారు. గురు మరియు నవగ్రహ అనుగ్రహం కొరకు భక్తులు దక్షిణామూర్తి, శని భగవానునికి తొమ్మిది చొప్పున ప్రదక్షణాలు చేస్తారు.
ఏనుగు, నెమలి మరియు గోమాత శివపూజ చేస్తున్నచెక్కడం, ఆంజనేయ మూర్తి, కన్నప్ప శిల్పం జీవకళ ఉట్టిపడుతూ చూపరులను నిలబెట్టేస్తాయి. ఈ విశేష ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది.
శ్రీ వైకుంఠం పేరు తెలుపుతున్నట్లుగా ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ క్షేత్రం. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ కోవెల నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో సూర్య క్షేత్రం.
ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది నవ కైలాసాలలో ఆరవది శని క్షేత్రమైన
శ్రీ కైలాసనాథర్ స్వామి ఆలయం. చోళ, పాండ్యులు నిర్మించిన ఆలయాన్ని నాయక రాజులు అభివృద్ధి చేశారు అని శాసనాలు తెలియజేస్తున్నాయి. చక్కని శిల్పాలకు నిలయం. జన్మ, అర్ధాష్టమ,ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు విశేష సంఖ్యలో వస్తుంటారు.
పరివార దేవతలుగా వినాయక, సుబ్రహ్మణ్య, దుర్గ, దక్షిణామూర్తి కనపడతారు. శని దేవుడు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఆలయ కావలి దేవత భూతనాథర్ విగ్రహం చెక్కతో చేసినది కావడం ఒక విశేషంగా పేర్కొనాలి.
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది. మూరప్ప నాడు నుండి శ్రీ వైకుంఠం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తెందురి పెరై ఈ క్షేత్రం కూడా నవ కైలాసాలు మరియు నవ తిరుపతులలో స్థానం పొందినది.
శ్రీ మకర నెడుంకులైనాథ పెరుమాళ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది శ్రీ శివగామీ సమేత శ్రీ కైలాసనాథర్ ఆలయం. నవ కైలాసాలలో ఏడవది. ఇది బుధ క్షేత్రం.
ప్రాంగణ నలుదిక్కులా వల్లభ గణపతి,శక్తి వినాయక,కన్నెమూల గణపతి, సిద్ది వినాయక కొలువై ఉంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, దక్షిణామూర్తి ఆదిగా గలవారు పరివార దేవతలుగా కొలువుతీరి ఉంటారు. వేదరూపిగా పేర్కొనే అష్టభుజ భైరవునికి అష్టమి మరియు పౌర్ణమినాడు విశేష పూజలు చేస్తారు. బుధుడు ప్రత్యేక సన్నిధిలో ఉంటారు. బుధ శాంతికి భక్తులు పెసలు, పచ్చ వస్త్రాలు సమర్పించుకొంటుంటారు.
నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఉదయం ఎనిమిది నుండి పది వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీ వైకుంఠం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది.
రాజపతి తెందురి పెరై కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేతు క్షేత్రమైన రాజపతి.
రోమశ మహర్షి వదిలిన తొమ్మిది పుష్పాలలో ఆఖరి పుష్పం ఆగిన స్థలం ఇదే ! కేతువు శివానుగ్రహం కొరకు ఇక్కడ తపస్సు చేశారట.
అవివాహితులు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, సంతానం లేని దంపతులు అధిక సంఖ్యలో వస్తుంటారు.కేతు పరిహార పూజలు ఆదివారాలు మధ్యాహన్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర దాకా నిర్వహిస్తారు. తిరిగి మంగళవారాలు ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు జరుపుతారు. మంగళ వారాలు హోమం కూడా ఉంటుంది.
గర్భాలయంలో శ్రీ కైలాసనాథర్ లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఉపాలయాలలో ఆది కైలాసనాథర్, శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, నటరాజ స్వామి, దక్షిణామూర్తి, నయమ్మారులలో ప్రముఖులైన సంబందర్, సుందరార్, అప్పార్, మాణిక్యవాసగర్ కొలువై ఉంటారు.
దక్షిణ కాళహస్తీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది.
సెంద పూమంగళం నవ కైలాసాలలో ఆఖరిది. శుక్ర క్షేత్రం. ఇక్కడ కుబేరుడు శివగామి సమేత కైలాసనాథర్ ని ఆరాధించారట. గర్భాలయం విమాన గోపురం పైన సతులైన శంఖనిధి, పద్మనిధిలతో పాటు ఉన్న కుబేరుని చూడవచ్చును.
ఉపాలయాలలో గణపతి, మురుగన్, చొక్కనాథర్, చండికేశ్వరార్, దక్షిణామూర్తి, భైరవుడు, కొలువై ఉంటారు. నవగ్రహాలు, సప్త మాతృకలు మరియు అరవై మూడు మంది నయమ్మార్లు విడిగా మండపాలలో ఉంటారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ నవ కైలాసాల లింగాలను సందర్శించుకొనవచ్చును.
ఈ క్షేత్రం రాజపతి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక్కడితో నవగ్రహ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచిన నవ కైలాసాల సందర్శనం ముగిసినట్లే. సెంద మంగళం నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరుపాడై వీడు లలో ఒకటైన తిరుచెందూర్ ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సాగరతీర ఆలయం ఆధ్యాతిక భావాలతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
తిరుగు ప్రయాణంలో కొత్తగా నిర్మించిన వన తిరుపతి శ్రీ బాలాజీ ఆలయాన్ని,నవ తిరుపతులను దర్శించుకొని రాత్రికి తిరునెల్వేలి చేరుకోవచ్చును. తిరునెల్వేలిలోని శ్రీ నెల్లిఅప్పార్ ఆలయం శిల్పకళకు ప్రతిరూపం. సరైన ప్రణాళిక తో వెళితే దగ్గరలో ఉన్న టెంకాశీ, కుర్తాళం లాంటి క్షేత్రాలను కూడా సందర్శించుకునే అవకాశం లభిస్తుంది.
నమః శివాయ !!!!