పందళం
హరిహర సుతుడు శ్రీ ధర్మశాస్త పందళ రాజకుమారునిగా ప్రసిద్దికెక్కారు. శ్రీ మణి కంఠునిగా ఆయన పావన పంపాతీరాన రాజు రాజశేఖరునికి పసి బాలునిగా లభించారని గాధలు తెలుపుతున్నాయి.
దైవాంశ సంభూతుడు రాజమహల్ లో తన బాల్యాన్ని గడపడం వలన పందళం ఒక పవిత్ర దర్శనీయ స్థలంగా గుర్తించబడినది. ముఖ్యముగా కార్తీక మాసం నుండి పుష్యమాసం వరకు అంటే మూడు నెలల కాలం దేశం నలుమూలల నుండి భక్తులు శబరిమలకు తరలి వస్తుంటారు. అందరూ తప్పనిసరిగా పందళం సందర్శించుకొంటారు.
మహిషి సంహారం తరువాత పందళ వంశం వారు శ్రీ మణికంఠుని తమ కులదైవంగా భావించారు. ఆయనకొక ఆలయాన్ని రాజ భవన సముదాయం మధ్యలో నిర్మించారు. అదే "వళియ కోయిక్కల్ ఆలయం".
అసలు పందళం రాజ వంశీకులు మధురైని పాలించిన "పాండ్య వంశీ"కులని అంటారు. ఏవో కొన్ని కారణాల మూలంగా పాండ్య వంశీకులు కొందరు ఇక్కడికి తరలివచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించారని చరిత్రకారులు చెబుతున్నారు.
క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో నేటి కేరళలోని అత్యధిక భూభాగం వీరి ఆధీనంలో ఉండేదట. కాలక్రమంలో క్రమంగా క్షీణించి పదో శతాబ్దానికి ట్రావన్కోర్ రాజులకు సామంతులుగా మారి, వారిచ్చే భరణంతో జీవించాల్సి వచ్చినది.
వారి కాలంలో గొప్పగా ఉన్న రాజభవనాలు నేడు చాలా మటుకు శిధిలమై పోయాయి. మిగిలిన వాటిల్లో ముఖ్యమైనవి వళియాక్కోయిక్కల్, తేవరపురాస్, స్రంప్రికాల్ భవనం మరియు పూతేంకోయిక్కల్ ఈ ఒడ్డున ఉండగా, అచ్చెంకొయిల్ నదికి ఆ ఒడ్డున కైపుళా ఆలయము మరియు భవన సముదాయం ఉంటాయి.
వళియ కోయిక్కల్ ఆలయ ప్రవేశ ద్వారం
వళియ కోయిక్కల్ ఆలయంలో పందళ రాజకుమారుడు కొలువై ఉంటారు. నిత్యపూజలు జరుగుతుంటాయి. తిరువాభరణాలను ఉంచే "స్రంపిక్కాల్ భవనం" ఈ ఆలయానికి పక్కనే ఉంటాయి.
మకర సంక్రాంతికి మూడు రోజుల ముందు ఆభరణాలను ఈ ఆలయానికి చేర్చుతారు. పూజాదికాలు నిర్వహించి మధ్యాహాన్నం ఒంటి గంట వరకు భక్తుల సందర్శనార్ధం ఉంచుతారు.
రాజవంశంలో అందరిలోకీ పెద్దవారైన మగవారిని "వళియ తంపురన్" అని పిలుస్తారు. ఈయన భక్తులకు విభూతి ఇస్తారు. నగలను తీసుకొని వెళ్లే బృందానికి నాయకత్వం వహించే వ్యక్తికి దీక్ష ఇస్తారు. ఆ వ్యక్తి రాచ బంధువు కానీ రాజ కుటుంబ సభ్యుడు కాకుండా ఉండాలి.
స్రంప్రికాల్ భవనం
గరుడ పక్షి ఒకటి వచ్చి భవన సముదాయం పైన ఎగరడం చేస్తుంది. అంటే ఆభరణాలను శబరిమలకు తీసుకొని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనది అన్న సంకేతం అందినట్లుగా భావిస్తారు.
ఈ పక్షి ఆభరణాలు శబరిమల చేరిన దాకా తీసుకొని పోయే బృందాన్ని అనుసరిస్తుంది. రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన తరువాత వేలాదిమంది భక్తులు వెంట రాగా దివ్యాభరణాలను ఉంచిన మూడు పెట్టెలను తీసుకొని బృందం బయలుదేరుతుంది.
ఈ మూడు పెట్టెలను తిరువాభరణ పెట్టి, వెల్లి (వెండి)పెట్టి మరియు కొడి (ధ్వజాల)పెట్టి అని పిలుస్తారు. పేర్లకు తగినట్లుగానే బంగారు తిరువాభరణ పెట్టిలో స్వామి వారికి అలంకరించే బంగారు ముఖ కవచం,రెండు చిన్న పెద్ద ఖడ్గాలు, చిన్న చిన్న రూపాలలో తీర్చిదిద్దిన పులి, ఏనుగు రూపాలు, లక్ష్మి రూపు, ప్రభామండలం, వెండి తొడుగు ఉన్న శంఖం, పూజా పుష్పాలు ఉంచే స్వర్ణ పాత్ర, నవరత్న ఉంగరం, సరపోలి మాల, మణిమాల, వెళుక్కు మాల అని పిలిచే మూడు హారాలు, ఇరుక్కుమ్ పూమాల అనే పెద్ద గొలుసు ఉంటాయి.
వెండి పెట్టెలో కలశం మరియు ఇతర వెండి పూజా సామగ్రి ఉంటాయి. మూడవదైన కొడి పెట్టెలో రకరకాల ధ్వజాలు ఉంటాయి.
పందళం నుండి బయలుదేరిన తిరువాభరణ యాత్ర ఎనభై మూడు కిలోమీటర్లు కాలినడకన వెంట భక్త బృందాలు మరియు రక్షక భటులు అనుసరిస్తుండగా రెండు రోజులు వివిధ గ్రామాలు, పర్వతాలు, అరణ్యాలు గుండా ప్రయాణించి పంబా నదీ తీరానికి మకర సంక్రాంతి రోజు మధ్యాహన్నానికి చేరుకొంటాయి.
మొదటి రోజు సాయంత్రానికి ఈ యాత్ర ఐరూర్ దేవి ఆలయానికి చేరుతుంది. ఇక్కడికి చేరే క్రమంలో కైపుల, కులనాడ, ఉల్లనూరు, పరయంకర,కూడివెట్టిక్కాళ్, ఆరాన్ముల గ్రామాల భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు.
రెండో రోజు పెరూర్చల, మందిరం, ఎదక్కాలం, పేరునాడ్ మీదగా సాగుతుంది. మూడో రోజు ప్లాపల్లి, నీళక్కాల్ , అట్ఠతోడు, చెరియానవట్టం, నీలిమల, అప్పాచిమేడే, శరంగుత్తి మీదగా సన్నిధానం చేరుతుంది.
ఆభరణాలను శ్రీ ధర్మశాస్త స్వామికి అలంకరించిన తరువాత హారతి ఇస్తారు మెల్ సంతి. అదే సమయానికి మకర నక్షత్రం దానిని అనుసరిస్తూ మకర జ్యోతి పొన్నాంబల మేడు మీద దర్శనమిస్తుంది. శబరి కొండలు "స్వామియే శరణం అయ్యప్పా ! మకర జ్యోతి స్వరూప శరణం అయ్యప్పా " అన్న భక్తుల శరణ ఘోషతో ప్రతిధ్వనించిపోతాయి.
మంగళ తంబురాతి
మకర సంక్రాంతి తరువాత నాలుగు రోజులు ధర్మశాస్త ఆలయం తెరిచి ఉంటుంది. జ్యోతి దర్శనం తరువాత పందళ రాజు సన్నిధానం చేరుకొంటారు. ఆలయ అధికారులు శరంగుత్తి వద్ద రాజుకి స్వాగతం పలుకుతారు.
పందళ రాజ వంశీకులు యెరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు అధిరోహించవచ్చును. ధ్వజస్థంభం వద్ద ఆలయ పూజారులు రాజుని సాదరంగా ఆహ్వానిస్తారు. మాలికాపురత్తమ్మ ఆలయం వెనక ఉన్న మండపంలో కొంతసేపు ధ్యానం చేస్తారు.
తరువాత రెండు రోజులు ఆలయాలలో జరిగే వివిధ పూజలలో పాల్గొంటారు.
ఆ సంవత్సరానికి ఆలయాన్ని మూసివేసే జనవరి ఇరవై తారీఖున సాయంత్రం రాజు ఒక్కరే సన్నిధానంలో స్వామి సన్నిధిలో గడుపుతారు.
అనంతరం రాజానుమతితో ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఫిబ్రవరి నెల పూజలకు తెరుస్తారు.
తిరువాభరణాలతో రాని రాజు వాటి తిరుగు యాత్రలో పాల్గొంటారు.
ఈ తిరుగు యాత్ర సన్నిధానం నుండి నేరుగా రేణి పేరునాడ్ వద్ద శబరిమల ఆలయంతో బాటు నిర్మించబడిన శ్రీ ధర్మశాస్త ఆలయం చేరుకొంటుంది. శబరిమల ధర్మశాస్త కాకుండా తిరువాభరణాలను ధరించే వాడు ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామే! చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా మహిళలు తిరువాభరణాలను ధరించిన "కక్కట్టు కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త" దర్శనానికి తరలి వస్తారు.
ఒక రోజు అనంతరం తిరువాభరణాలను స్రంపిక్కాల్ భవనానికి చేర్చి భద్రపరుస్తారు.
వళియ కోయిక్కల్ నుండి అచ్చన్ కోయిల్ నది మీద నిర్మించిన వ్రేలాడే వంతెన మీదగా ఆ పక్కకు చేరుకొంటే ప్రశాంతతకు మారు పేరైన పల్లె వాతావరణం మధ్య కైపుళా ఆలయం మరియు భవనం ఉంటాయి. సువిశాల ప్రాంగణంలో శ్రీ మహాదేవ మరియు శ్రీ కృష్ణ ఆలయాలు వారి మధ్య నవగ్రహ మరియు శ్రీ ధర్మశాస్త ఆలయాలుంటాయి.
పందళం రాజ వంశీకుల నియంత్రణలో ఉన్న ఈ ఆలయాలలో నిత్య పూజలు జరుగుతాయి. సన్నిధానానికి బయలుదేరే ముందు రాజు ఈ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కైపుళా భవనంలో కొంత సమయం గడిపి, తేవర పుర గా పిలిచే ప్రార్ధనా మందిరంలో ఉండే రాజ వంశానికి చెందిన వృద్ధురాలైన "తంబురాతి" నుండి శుభాశీస్సులు పొంది శబరి యాత్ర ఆరంభిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆమె పేరు "మంగళ తంబురాతి".
ఇక్కడికి దగ్గరలోనే ఉన్న గురునాథన్ ముఖాడి అన్న ప్రదేశంలో శ్రీ మణి కంఠ స్వామి గురువు నుండి విద్యలను అభ్యసించారని చెబుతారు. సుందర వాతావరణంలో ఉండే ఆ ఆలయం కూడా తప్పకుండా దర్శనీయ స్థలం.
ఈ బ్లాగ్లో శ్రీ అయ్యప్పన్ గురు శ్రీ గురునాథం, పందళం మరియు పేరునాడ్ perunad(RANNY) రెండు ఆలయాల వివరాలను చూడవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి