Sri Bhavannarayana Swamy Temple, Bapatla

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని పురాతన ఆలయాలలో ఒకటి బాపట్ల లో ఉన్న శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం. శ్రీ మహావిష్ణు అవతారాలైన శ్రీ భావన్నారాయణ మరియు చెన్నకేశవ స్వామి ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. బాపట్ల, పొన్నూరు, పెద్ద గంజాం (ప్రకాశం జిల్లా ), భావదేవరపల్లి (కృష్ణాజిల్లా. అవనిగడ్డ నుంచి 15కిలోమీటర్లు), సర్పవరం (కాకినాడ దగ్గర) ఈ అయిదు చోట్ల పురాతన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు కలవు. నైమిశారణ్యంలో అగస్థ్య మహర్షి మునులకు శ్రీ భావన్నారాయణ తత్వం గురించి విశిదీకరించారని బ్రహ్మ వైవర్తన పురాణం పేర్కొంటోంది. స్వామి భక్త రక్షకుడు. నిత్య జీవితంలో అనుకోకుండా ఆపదలలో లేదా అపవాదాలు ఎదుర్కొనే వారిని కాపాడేవాడు. దీనికి ప్రమాణం పొన్నూరు సాక్షి భావన్నారాయణ స్వామి. స్వామివారి పేరు మీదగా భావపురి గా పిలువబడి, కాలక్రమంలో బాపట్లగా మారిన ఈ ఊరిలో స్వామి కొలువు తీరడం వెనక ఉన్న పురాణ గాధ ఇదుమిద్దంగా తెలియరాలేదు. కానీ ఆలయాన్ని ఆంధ్రదేశం మీద లభించిన విజయానికి నిదర్శనంగా చోళ రాజులు నిర్మించారని తెలుస్తోంది. ...