5, అక్టోబర్ 2017, గురువారం

Dhanushkodi

                                          ధనుష్కోడి 


అవతార పురుషుడు శ్రీ రామచంద్రుడు తన ధనుస్సు తో తట్టి ఎక్కడ వారధి కట్టాలో నిర్ణయించారు. అదే విధంగా రావణ సంహారం తరువాత అదే ధనుస్సు కొనతో ఆ వారధిని కూల్చారట !
అందుకనే "ధనుష్కోడి" అన్న పేరు వచ్చినది. 






భారత భూభాగం నుండి సముద్ర జలాల కారణంగా విడిపోయిన రామేశ్వరం లేదా పాంబన్ ద్వీపకల్పంలోని తూర్పుకోనన ఉంటుంది ధనుష్కోడి.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రామేశ్వరాన్ని ప్రధాన భూభాగముతో కలిపేందుకు 1914 వ సంవత్సరంలో "పాంబన్ బ్రిడ్జి"అని పిలిచే రైలు వంతెన నిర్మించారు. ఇదొక అద్భుత నిర్మాణం. ఎంతో  లోతైన సముద్రజలాలలో నిర్మించారు.
ఈ రెండున్నర కిలోమీటర్ల వంతెన మధ్య భాగంలో, జలాల్లో పడవలు వచ్చినప్పుడు పైకి లేచి దారి ఇస్తుంది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం. 1988 దాకా రామేశ్వరం చేరడానికి ఒక్క రైలు మార్గమే ఉండేది. 1974లో రోడ్డు బ్రిడ్జి కట్టడానికి శంకుస్థాపన జరిగింది. ప్రకృతి విపత్తులు ఇతర ఇబ్బందులను ఎదుర్కొని 1988 నాటికి అది పూర్తి అయినది. దాని పేరు "అన్నై ఇందిరా గాంధీ రోడ్ బ్రిడ్జి".
ఆంగ్లేయుల కాలంలో శ్రీ లంకతో వ్యాపార సంభందాలు నెలకొల్పడంలో ధనుష్కోడిది ముఖ్య పాత్ర గా చెబుతారు. ఎందుకంటే శ్రీలంక లోని "తలైమన్నార్" ఇక్కడికి కేవలం 29 కిలోమీటర్ల దూరం !
అప్పట్లో ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండేది.
వేలమంది మత్స్యకారులు ఇక్కడ  నివసించేవారు.







కానీ దురదృష్టవశాత్తు 1964 వ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవైరెండో తారీఖున వచ్చిన భయంకరమైన తుఫాను ధాటికి ఈ ప్రాంతం అంతా సముద్రంలో మునిగిపోయింది. 280 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అన్ని నిర్మాణాలు మరియు 700 మంది ప్రయాణీకులతో ఉన్న ఒక రైలుసహా సుమారు 2000 మంది బలి అయ్యారు.
బంగాళాఖాతం మరియు హిందూ మహా సముద్ర సంగమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం భీకర తుఫాన్లకు ప్రసిద్ధి. ఇంతకూ ముందు 1948 మరియు 1949 సంవత్సరాలలో సంభవించిన గాలివానలకు మరియు భూప్రకంపనలు కొంత ప్రాంతం సముద్రంలో మునిగిపోయిందిట.








2006వ సంవత్సరంలో వచ్చిన సునామీ కారణంగా సముద్రం వెనక్కి వెళ్లడంతో మునిగిపోయిన ధనుష్కోడి ప్రాంతం బయల్పడినది. నాటి శిధిల నిర్మాణాలు కూడా బయటపడ్డాయి. అదే విధంగా శ్రీ రాముని వానర సేన "రామ సేతు"నిర్మించినది ఇక్కడే అన్న పురాణ గాధల కారణంగా ఇదొక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది.
ఇక్కడ మరో విశేషం కూడా ఉన్నది. పాంబన్ బ్రిడ్జి మొదలయ్యే ప్రదేశాన్ని "మండపం" అంటారు.
1986 వ సంవత్సరంలో తూత్తుకుడి నుండి ధనుష్కోడి వరకు గ 160 కిలోమీటర్ల (ఇందులో 20 దాకా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి) ప్రాంతాన్ని "గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్"ను అభివృద్ధి చేశారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రాంతం లోని అంతరించి పోతున్న జల జీవాలను కాపాడటం.
ఈ ప్రాంతం లోని సముద్ర జలాల్లో అరుదైన జాతుల డాల్ఫిన్స్, సొర చేపలు, తిమింగలాలు, దుగోంగ్, ఎన్నోరకాల పీటలు, చేపలు కనపడతాయి.
వీటిని చూడటానికి మండపంలోని నేషనల్ పార్క్ లో క్రింది భాగం అద్దాలతో నిర్మించిన పడవలు ప్రయాతాకుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తగిన రుసుము చెల్లించి పర్యాటకులు సముద్ర అంతర్భాగంలో విహారం చేస్తూ అరుదయిన జల జీవాలను చూడవచ్చును.
ఇదొక అద్భుత అనుభవంగా చెప్పుకోవచ్చును.





నీటి నుండి బయల్పడిన ధనుష్కోడిలో ఆ నాటి శిధిల గృహాలు, చర్చి, రైల్వే స్టేషన్ ఇతర నిర్మాణాలు కనిపిస్తాయి. సముద్రంలో చేపల వేట నిషిద్దమైన కొంత మంది మత్స్యకారులు
నివసిస్తుంటారు.
వారే గవ్వలతో పూసలతో, శంఖాలతో  చేసిన వస్తువులను అమ్ముతుంటారు.
రామసేతు నిర్మించిన తేలియాడే రాళ్లను ఇక్కడ అమ్ముతుంటారు.
ప్రస్తుతం చక్కని రోడ్డు రామేశ్వరం నుండి ధనుష్కోడి దాకా నిర్మించారు.
వెళుతుంటే ఒకపక్క ఎగిసిపడే అలలతో ఉన్న హిందూ మహా సముద్రాన్ని, మరో పక్క ఎలాంటి అలలు లేకుండా ప్రశాంతంగా పెద్ద ఉప్పు నీటి కోనేరులాగా కనిపించే బంగాళా ఖాతం. పురాణ గాధలను తప్పకుండ విశ్వసింపచేసే ప్రకృతి అద్భుతం.
ధనుష్కోడి చివర ఒక స్థూపం నిర్మించారు.
ఇక్కడ నుంచి ఇసుకలో నడుచు కొంటూ సముద్ర తీరానికి చేరితే అలలు తక్కువగా ఉంటె రేఖా మాత్రంగా రామసేతు చూసే అదృష్టం దక్కుతుంది అంటారు.









ప్రస్తుతం ఇక్కడ పితృకార్యాలు కూడా నిర్వస్తున్నారు. సముద్ర సంగమ ప్రదేశం కనుక !
రామేశ్వరం వెళ్లే ప్రతి ఒక్కరు తప్పక దర్శించుకొవలసిన ప్రదేశం ధనుష్కోడి.
వెళ్లే దారిలో విభీషణుడు కట్టించిన రామ ఆలయం వస్తుంది. దర్శనాస్థలం.



అలలతో కూడిన హిందూ మహా సముద్రం 

ప్రశాంతంగా అలలు లేకుండా బంగాళా ఖాతం 








విభీషణ ఆలయం 

జైశ్రీరామ్ !!!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...