శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయం, కాంచీపురం
సహస్రాధిక ఆలయాల నగరం కాంచీపురం. ఊరిలో ప్రతి వంద అడుగులకి ఒక చిన్న పెద్ద ఆలయం కనపడుతుంది నేటికీ ! ఎన్నో పురాతన ఆలయాల, మండపాల శిధిలాలు నగరం నలుమూలలా దర్శనమిస్తారు.
కాలగతిలో కొన్ని కలిసిపోగా, మరి కొన్ని వివిధ దండయాత్రలలో ధ్వసం అవ్వగా మిగిలిన కొన్ని ఆలయాలలో శ్రీ కచ్చభేశ్వర ఆలయం ఒకటి. నగర నడిబొడ్డున విశాలమైన ప్రాగణంలో ఉండే ఈ ఆలయం అన్నిరకాలుగా భక్తులను ఆకర్షిస్తుంది. శుచీ శుభ్రతలతో ప్రశాంత వాతావరం లో ఉండే ఈ ఆలయం యొక్క చరిత్ర క్షీరసాగర మధన సమయానికి చెందినదిగా తెలుస్తోంది.
దేవదానవులు కలిసి చేపట్టిన పాల సముద్ర మధనం లో మందార పర్వతం పదే పదే మునిగి పోతుండటంతో వారంతా శ్రీ హరి శరణు కోరారు. సాయం చేయడానికి అంగీకరించిన వైకుంఠ వాసుడు కూర్మ (తాబేలు)రూపం ధరించారు.ఆరూపం లోనే సాగర మధనం కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుతూ లయకారుని లింగ రూపంలో ఆరాధించారట ఇక్కడ.ఈ కారణం చేత ఈ స్వామిని శ్రీ కచ్చభేశ్వరుడు" అని పిలుస్తారు.ఉదంతానికి నిదర్శనంగా ప్రధాన ఆలయ మండపం వద్ద ఈ పురాణ గాధ మొత్తం తెలిపే ఒక చిత్ర పటాన్ని ఉంచారు.
తొలుత పల్లవ రాజులు తరువాత చోళులు, విజయనగర రాజులు నిర్మించిన పెక్కు నిర్మాణాలు ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి.శ్రీ గణపతి, శ్రీ సరస్వతి, శ్రీ భైరవ, శ్రీ చంద్రముఖేశ్వర, శ్రీ ధర్మశాస్త ఉపాలయాలతో పాటు అమ్మవారు శ్రీ సుందరాంబిక దేవి లేక శ్రీ అంబుజాక్షి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. భక్తులను తన కంటిలో పాపల్లాగా కాపాడే దేవిగాను మరియు అత్యంత సుందర రూపం కలదానిగా అమ్మవారికి ఈ రెండు పేర్లు వచ్ఛాయి.అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ చక్రానికి విశేష పూజలు జరుపుతుంటారు. అమావాస్య, పౌర్ణమి శుక్రవారం రోజులలో పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వస్తుంటారు.
ఎత్తైన రాజ గోపురానికి ఉన్న ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా కనిపిస్తుంది శ్రీ సత్యమొళి వినాయక సన్నిధి. విఘ్ననాయకునికి మొక్కి లోనికి వెళ్ళాలి.
కుడి పక్కన శ్రీ షణ్ముగ సన్నిధి ఉంటుంది.
ప్రాకారపు గోడలో కొలువైన శ్రీ ధర్మశాస్త అరుదైన ప్రత్యేక భంగిమలో ఉపస్థితులై దర్శనమిస్తారు.
ఆయనకు ఇరువైపులా పూర్ణ మరియు పుష్కలా దేవేరులు స్థానక భంగిమలో కొలువుతీరి దర్శనమిస్తారు.
ఆలయం లోనికి ప్రవేశించగానే కుడి పక్కన కనిపించే ఇష్ట సిద్ది పుష్కరణి నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. తమిళనాడులోని అన్ని ఆలయాలకు ఒక పుష్కరణి అన్నా ఉంటుంది. ఇంత శుభ్రంగా ఉండే కోనేరు దాదాపుగా అరుదు. కోనేటికి నాలుగు పక్కలా ధర్మ, కామ, అర్థ మరియు మోక్ష సిద్దేశ్వర స్వామిగా పిలవబడే కైలాసనాధుని ఆలయాలు ఉంటాయి. ఒకపక్కన లెక్కలేనన్ని నాగ ప్రతిష్టలు వట వృక్షం క్రింద ప్రతిష్టించబడి ఉంటాయి. సంతానాన్ని ఆకాంక్షించే దంపతులు నాగప్రతిష్ఠ చేయడం తమిళనాడులో ఒక పురాతన ఆచారం. మన రాష్ట్రంలో కూడా ఈ ఆచారం ఉన్నది.
ప్రతి నిత్యం స్థానిక దూర ప్రాంత భక్తులతో కళకళలాడే ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌలభ్యం కొరకు తెరచి ఉంటుంది. ప్రతి నిత్యం నియమంగా ఆరు పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల విశేష ఉత్సవాలు, చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు.
పౌర్ణమి కి, అమావాస్యకి, త్రయోదశికి, సోమవారాలు విశేష అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
కంచి బస్సు స్టాండ్ నుండి కంచి మఠం మీదగా శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉంటుందీ ఆలయం. నగర నడి మధ్యలో ఉన్నా ప్రశాంత వాతావరణం మరియు శుచి శుభ్రతలతో ఆకట్టుకొంటుంది శ్రీ కచ్చభేశ్వర ఆలయం. కంచిలో తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఇదొకటి.
నమః శివాయ !!!