శ్రీ మనకూల వినాయక ఆలయం తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది. ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. శ్రీ మ...