శ్రీ కుంతీ మాధవ స్వామిఆలయం, పద్మనాభం
ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉన్న హస్తినా పురి కి చెందిన పాండవుల నిర్మాణాలుగా పేర్కొనే ఎన్నో ఆలయాలు దక్షిణ భారత దేశంలోని అయిదు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉండటం ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది.
రవాణా సదుపాయాలు అతి తక్కువగా, ప్రయాణంలో లెక్కలేనన్ని ఇబ్బందులు ఉండే ఆ కాలంలో వారు ఇంత దూరాలు ఏ విధంగా ప్రయాణించారో !!!
తమిళనాడు మహాబలిపురం లోని పంచ పాండవ రధాలు, కేరళ లోని పంచ పాండవ శ్రీ కృష్ణ ఆలయాలు వీటిల్లో కొన్ని ! మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పాండవ నిర్మిత ఆలయాలు కనపడతాయి.
మన రాష్ట్రంలో ఒడిస్సా సరిహద్దులలో ఉన్న మహేంద్ర గిరులలో ఉన్న పెక్కు పురాతన నిర్మాణాలను పాండు నందనులచే నిర్మించబడినవిగా తెలుస్తోంది.
అదే కోవకు చెందిన మరో చరిత్ర ప్రసిద్ద స్థలం "పద్మనాభం".
సుందర సాగర తీర నగరం విశాఖ పట్టణానికి సుమారు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభంలో తమ తల్లి కుంతీ దేవితో పాటు పంచ పాండవులు వనవాస కాలంలో కొంత కాలం ఇక్కడ నివసించారని స్థానికంగా ప్రచారంలో ఉన్న గాధలు తెలుపుతున్నాయి.
ఆ సమయంలో నిత్య పూజల నిమిత్తం వారు విగ్రహ రూపంలో ప్రతిష్టించుకొన్న శ్రీ మహా విష్ణువు నేడు శ్రీ కుంతీ మాధవ స్వామిగా పూజలందుకొంటున్నారు.
ఈ ఆలయాన్ని విజియనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన పూసపాటి వంశపు రాజులు నిర్మించారు. వారి అధీనంలో ఉన్న నూటికి పైచిలుకు దేవాలయాలలో పద్మనాభం లోని శ్రీ కుంతీ మాధవ స్వామి కూడా ఒకటి.
సువిశాల ప్రాంగణంలో కళింగ నిర్మాణ శైలిని ప్రదర్శించే నిర్మాణాలతో ఉన్న ఈ ఆలయం చరిత్రతో విడదీయలేని బంధం కలిగి ఉన్నది.
కప్పం కట్టడానికి నిరాకరించిన స్థానిక పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు మీద వలస పాలకులైన ఆంగ్లేయులు యుద్ధం ప్రకటించారు. 09. 07. 1794 వ సంవత్సరంలో ఇక్కడ జరిగిన సమరంలో గజపతి రాజు వీర మరణం పొందినట్లుగా తెలుస్తోంది.
కప్పం కట్టడానికి నిరాకరించిన స్థానిక పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు మీద వలస పాలకులైన ఆంగ్లేయులు యుద్ధం ప్రకటించారు. 09. 07. 1794 వ సంవత్సరంలో ఇక్కడ జరిగిన సమరంలో గజపతి రాజు వీర మరణం పొందినట్లుగా తెలుస్తోంది.
ఆంద్ర ప్రాంతంలో ఆంగ్లేయులతో జరిగిన భీకర పోరాటాలలో ఒకటిగా చరిత్రకారుల గుర్తింపు పొందినది పద్మనాభంలో జరిగిన ఆ యుద్ధం.
ఈ ఆలయాభివృద్దికి విజయనగర రాజులు యెనలేని'కృషి చేసారు.
రాయి సున్నంతో నిర్మించిన ఆలయంలో కొద్ది శిల్పాలు గర్భాలయ వెలుపలి గోడలలో కనిపిస్తాయి తప్ప మరెలాంటి శిల్ప సంపద గోచరించదు.
ప్రధాన ఆలయానికి నలువైపులా మండపాలు ( శ్రీ కూర్మం, రామ తీర్ధం, అరసవెల్లి లో మాదిరి) ఉంటాయి.
గర్భాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి స్థానక భంగిమలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు.
ప్రతి నిత్యం నియమంగా పూజలు నిర్వహిస్తారు.శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామ నవమి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో పాటు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇతర పూజలతో పాటు ధనుర్మాస పూజలను కూడా ఘనంగా జరుపుతారు.
పక్కనే ఉన్న కొండ మీద సాల గ్రామ శిలా రూపంలో స్వయంవ్యక్త శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటారు.
రెండువేల పైచిలుకు సోపాన మార్గంలో పైకి వెళ్ళే సదుపాయం ఉన్నది. ప్రతి నిత్యం అర్చకులు ఉదయాన్నే పర్వత పై భాగానికి వెళ్లి అర్చన, నివేదన జరిపి తిరిగి వస్తారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఆఖరి అమావాస్య రోజున సహస్ర దీపారాధన పేరిట అత్యంత ఘనంగా మెట్ల పూజ ఏర్పాటు చేస్తారు.
ప్రతి మెట్టు మీదా దీపాలు వెలిగిస్తారు. అమావాస్య నాటి చీకట్లను తొలగిస్తూ దేదీప్య మానంగా వెలిగిపోయే పద్మనాభం పర్వతాన్ని ఆ రోజున వీక్షించడం ఒక జీవిత కాల అనుభవంగా పేర్కొనాలి.
స్థానిక, దూరప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి'వస్తారు.
విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన పద్మనాభం గ్రామంలో శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయానికి దగ్గరలో పురాతన శివాలయం ఉంటుంది. నిత్య పూజలు జరుగుతాయి.
ఇంతటి విశేషమైన గుర్తింపు కలిగి ఉన్నపద్మనాభం క్షేత్రానికి విశాఖపట్నం నుండి మరియు సింహాచలం నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకొనే సదుపాయం ఉన్నది. బస్సులు లభిస్తాయి.
కానీ ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు కనుక దర్శనం చేసుకొని తిరిగి వచ్చేయడం ఉత్తమం.
ఒక అద్భుత పురాతన ఆలయ సందర్శన భాగ్యం పద్మనాభం ఆలయం కలిగిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి