Sri Kunti Madhava Swamy Temple, Padmanabham

శ్రీ కుంతీ మాధవ స్వామిఆలయం, పద్మనాభం ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉన్న హస్తినా పురి కి చెందిన పాండవుల నిర్మాణాలుగా పేర్కొనే ఎన్నో ఆలయాలు దక్షిణ భారత దేశంలోని అయిదు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉండటం ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది. రవాణా సదుపాయాలు అతి తక్కువగా, ప్రయాణంలో లెక్కలేనన్ని ఇబ్బందులు ఉండే ఆ కాలంలో వారు ఇంత దూరాలు ఏ విధంగా ప్రయాణించారో !!! తమిళనాడు మహాబలిపురం లోని పంచ పాండవ రధాలు, కేరళ లోని పంచ పాండవ శ్రీ కృష్ణ ఆలయాలు వీటిల్లో కొన్ని ! మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పాండవ నిర్మిత ఆలయాలు కనపడతాయి. మన రాష్ట్రంలో ఒడిస్సా సరిహద్దులలో ఉన్న మహేంద్ర గిరులలో ఉన్న పెక్కు పురాతన నిర్మాణాలను పాండు నందనులచే నిర్మించబడినవిగా తెలుస్తోంది. అదే కోవకు చెందిన మరో చరిత్ర ప్రసిద్ద స్థలం "పద్మనాభం". సుందర సాగర తీర నగరం విశాఖ పట్టణానికి సుమారు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభంలో తమ తల్లి కుంతీ దేవితో పాటు పంచ పాండవులు వనవాస కాలంలో కొంత కాలం ఇక్కడ నివసించారని స్థానికంగా ప్రచారంలో ఉన...