13, ఫిబ్రవరి 2016, శనివారం

Lord Sun Temples in Varanasi

                                 కాశీలో కొలువైన కాశ్యపేయుడు 

                                                                                                         
హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ సందర్శించాలని ఆశిస్తారు. సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్న వారణాశి శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల నివాసం. పావన గంగా తీరంలో లోని ఈ పుణ్య క్షేత్రంలో బహుళ సంఖ్యలో దివ్యారామాలు నెలకొని ఉన్నాయి. 
శివ, విష్ణు, గణపతి, దేవి, భైరవ ఆదిగా గల దేవీ దేవతల ఆలయాల వెనుక ఉన్న విశేషాలను పురాణ ప్రాశస్తాన్ని కాశీ ఖండం విపులంగా వివరిస్తుంది. 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 
ప్రత్యక్ష నారాయణుడు ఈ మందిరాలలో వర్తులాకార గ్రహ రూపంలో (అంటే ముఖము మాత్రమే) అధికంగాను, రెండు చోట్ల సంపూర్ణ రూపంలోనూ దర్శనమిస్తారు. అన్నిచోట్లా స్వామి సింధూర వర్ణ శోభితులే ! ఈ ద్వాదశ ఆదిత్య మందిరాలు అన్నీ దాదాపుగా ఉన్దయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా తెరిచే ఉంటాయి. 
ఆదివారాలు సూర్యోపాసనకు తగినది, ఆ రోజున పూజిస్తే సాధకులకు, భక్తులకు అత్యంత ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్నది జ్ఞానుల వాక్యం. శ్రీ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఈ పన్నెండు మందిరాల పురాణ గాధలు ఎక్కువగా స్వస్థత పొందిన భక్తుల గురించి తెలిపేవే కావడం విశేషం. 
దివాకరుని జన్మ దినం అయిన "రధ సప్తమి"  సందర్భంగా ద్వాదశ ఆదిత్యుల ఆలయ సంగతులు తెలుసుకొని తరిద్దాం. 

కేశవాదిత్యుడు 

సప్తాశ్వ రధం మీద బయలుదేరిన ప్రభాకరుడు భువిలో నదీ తీరాన శివ లింగాన్ని అభిషేకిస్తున్న శ్రీ మహా విష్ణువును చూసి చకితుడయ్యాడు. సర్వాంతర్యామి అయిన శ్రీ మన్నారాయణుడు మహేశ్వరుని అర్చించడం లోని అంతరాద్దాన్ని తెలుసుకోవాలని స్వామి దగ్గరికి వెళ్లి తన సందేహం వెలి బుచ్చాడు. 
"కాశీకి శివుడే అధిపతి. ఈ మంగళకర క్షేత్రంలో ఈశ్వరుని ఆరాధిస్తే శుభాలు కలుగుతాయి"అని తెలిపారు శ్రీ హరి. దివ్యోపదేశం చేసిన  శ్రీ కేశవుని గురువుగా స్వీకరించి ఆదిత్యుడు తపమాచరించి శివానుగ్రహం పొందారు. 
అందుకే ఈయన కేశవాదిత్యుడు. 
శ్రీ ఆది కేశవ స్వామి ఆలయం ( రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర)లో కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది అన్నది పెద్దల మాట. (ఇక్కడ ఫోటోలు తీయడానికి ఒప్పుకోరు )

మయుఖాదిత్యుడు 

వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ సూర్యుడు మహోగ్ర తపస్సు చేయసాగారు. 
లోకాలలో వేడి పెరిగి పోసాగింది. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. 
గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుని చల్ల పరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. 
నేటికీ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. 
పంచ గంగా ఘాట్ వద్దనున్న శ్రీ మంగళ గౌరీ మందిరంలో కొలువైన ఈ స్వామిని ఆరాధించిన వారిని అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు. ఆలయం  లోపల ఉండటం  ఫోటోలు తీయడానికి అవకాశం / అనుమతి లేవు )

గంగాదిత్యుడు  

జలం జీవం. గంగా మాత జీవులకు ప్రాణ దాత. పవిత్ర నదీమతల్లి గొప్పదనాన్ని కీర్తించడానికి అరుణుడు తన రధాన్ని తీరంలో ఆపుతారని అంటారు. లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న శ్రీ గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం తలెత్తదన్నది పురాణాలు  తెలుపుతున్న విషయం.




అరుణాదిత్యుడు 

కశ్యప మహర్షి భార్యలు కద్రువు, వినత. 
కద్రువ నాగులకు తల్లి.  వినత ప్రసవించిన రెండు అండాల నుండి ఎంత కాలానికీ బిడ్డలు రాలేదు. అసహనం తట్టుకోలేక వినత ఒక గుడ్డును పగల కొట్టినది. అందులో ఉన్న నడుము క్రింద భాగం రూపొందని సుందర బాలుడు ఆగ్రహంతో తొందరపాటుతో ప్రవర్తించిన తల్లిని దాసీగా జీవించమని శాపమిచ్చాడు. బిడ్డల ఆలనా పాలనలతో మురిసిపోవాలన్న తపనతో తొందరపడ్డానని భాదపడిన వినతతో "రెండో గుడ్డు నుండి జన్మించే వాడు నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు.." అని తెలిపి కాశీ చేరుకొన్నాడు. 
నూపురాలు లేకుండా జన్మించిన ఇతనిని "అనూపుడు" ( అరుణుడు)అని పిలుస్తారు. 
గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించారు.





త్రిలోచన ఘాట్ శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని   విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన  పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుంది అని పెద్దలు చెబుతారు. 

ఖగోళాదిత్యుడు 

కుమారుని శాపం వలన, సవతి చేసిన మోసం కారణంగా వినత ఆమెకు దాసీ గా మారవలసి వచ్చింది. 
రెండో అండం నుండి జన్మించిన గరుత్మంతుడు అమిత బలవంతుడు. తల్లి దాస్య విముక్తికి సవతి తల్లి కోరిన అమృతం తెచ్చినట్లే తెచ్చి దక్కకుండా చేసిన కద అందరికీ తెలిసినదే!
కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత వినత కుమారునితో కలిసి కాశీ చేరుకొని తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించారు.






మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారు అన్నది తరతరాల విశ్వాసం. 

లోలార్కాదిత్యుడు 

తులసీ ఘాట్ వద్ద ఆసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. సంగమ జాలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకొంటుంది.






కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రం గా నెరవేరతాయని చెబుతారు. 

సాంబాదిత్య 

శ్రీ కృష్ణుని కుమారుడు సాంబ ప్రతిష్ట కావడాన సాంబాదిత్యునిగా పిలుస్తారు. 
కలహ కారణుడు నారదుని కారణంగా తండ్రి ఆగ్రహానికి శాపానికి గురి అయ్యాడు జాంబవతీ తనయుడు. 
కటక మహర్షి సలహా మేరకు కాశీ చేరి శ్రీ విశ్వేశ్వరునితో పాటు సూర్యనారాయణ స్వామిని నియమంగా ఆరాధించాడు.






ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోయింది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ రూప ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని చాలామంది అనుభవాల ద్వారా తెలుస్తోంది. 

ద్రౌపది ఆదిత్యుడు 

వనవాస కాలంలో వెంట నడిచిన వారికి భోజన ఏర్పాట్లు ఎలా చేయాలా అన్న సమస్య వచ్చింది పాండవులకు. 
శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భావానుని ధ్యానించినది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించారు. 
అక్షయ వాట్ లో కొలువైన ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. (అన్నపూర్ణ దేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం లోనికి  ఏ వస్తువూ తీసుకొని వెళ్ళడానికి భద్రతా కారణాల రీత్యా కాపలాదారులు ఒప్పుకోరు).  శ్రీ అన్నపూర్ణ దేవి ఆలయ ప్రాంగణంలో మరో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉపాలయము ఉంటుంది. సప్తాశ్వ రధంలో కూర్చున్న భంగిమలో దినకరుడు దివ్య దర్శనం ప్రసాదిస్తారు. 

ఉత్తరార్క ఆదిత్యుడు 

జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు  ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే నిలబడేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. 
సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. 
బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్విత కైలాస నివాస యోగ్యం ప్రసాదించారు. 
మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. 
స్థానికంగా "బకరీ కుండ్"అని పిలిచే కోనేరులో స్నానమాచారించి ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయని తెలుస్తోంది. 
వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలం పూర్ లో ఉంటుందీ మందిరం. (ఫోటోలు తీయడానికి అనుమతి లేదు)

విమలాదిత్యుడు 

అంతు తెలియని చర్మ వ్యాధితో భాద పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. 
స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది.




విమలుడు ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. 
ఖారీకువా గల్లీ లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య భాదలు దరి చేరవు. 

వృద్దాదిత్యుడు 

హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు.







శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ ఛిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య భాధలు ఉండవన్నది పెద్దల మాట. 

యమాదిత్య 

సూర్యుని పుత్రుడు యమ ధర్మరాజు. 
తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. 
యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే నరక ప్రవేశం ఉండదు. శాశ్విత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది.





ఒక ఆదివారం నాడు ఉపవాసం ఉండి  సూర్యాస్తమయం లోపల ఈ ద్వాదశ ఆదిత్యులను దర్శించుకొంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, వంశాభివృద్ది కలుగుతాయన్నది శతాబ్దాలుగా వస్తున్న విశ్వాసం. 
"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం  మాహాద్యుత
 తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం "




Sri Jalakhanteswara Swami Temple, Vellore

                 శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం, వెల్లూరు 


  

   భారత దేశంలో ఎన్నో పురాతన కోటలు దర్శనమిస్తాయి. అవన్నీ వివిధ వంశాల రాజులు రాజ్య రక్షణ, ప్రజా క్షేమం కోరి నిర్మించినవి. కొన్ని ఆడంబరాలకు, మరికొన్ని విశ్రాంతి మందిరాలుగా కూడా ఉపయోగించబడినాయి. 
ఎన్నో ప్రత్యేకతలకు ప్రసిద్ది చెందిన అవన్నీ నేడు ప్రముఖ సందర్శక ప్రదేశాలుగా మారి దేశ విదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.    

                                       




అలాంటి వాటిల్లో తమిళనాడు లోని వెల్లూరు, వేలూరు లేదా రాయ వేలూరు గా పిలవబడే ప్రముఖ కూడలి లోని కోట ఒకటి.
భౌగోళికంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలను సరిహద్దులలో ఉంటుందీ పట్టణం.
పూర్వ కాలంలో రాజకీయంగా అత్యంత కీలక సైనిక స్థావరంగా పరిగణించ బడినది.
ఈ ఊరి చరిత్రలానే పేరు కూడా ఎన్నో కధలను తెలుపుతుంది.






క్రీస్తు పూర్వం నుండీ పాలారు నదీ తీరంలో జనావాసాలు ఉండేవని త్రవ్వకాలలో లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
తమిళ సంగమ కాల రచనల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రిందట "వేలన్" అనే వృక్షాలతో నిండి ఉండేదట. అలా వేలూరు వచ్చినది అని పేర్కొనబడినది. వేలన్ అంటే తెలుగులో నల్ల తుమ్మ చెట్టు.







పురాతన తమిళ గ్రంధం "పరిపాడల్ " ప్రకారం ఈ ప్రాంతాన్ని "కురింజి నాడు" అని దీనికి అధిపతి "శ్రీ కుమార స్వామి". ఆయన ఆయుధం "వేల్ ". అలా వేలూరు అని పిలవసాగారు.
ప్రముఖ శివ భక్తుడు, కవి, గాయకుడు అయిన "అరుణ గిరి నాథర్" ఇక్కడికి సమీపంలోని తిరువన్నమలై దివ్య క్షేత్రంలో నివాస మున్నారు.  అక్కడే ఆయనకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారం లభించినది. ఆయన కూడా తన కీర్తనలో ఈ క్షేత్రాన్ని వేలూరు అనే ఉదహరించారు.







చాలా కాలం విజయనగర రాజుల అధీనంలో ఉండడం వలన "రాయ వేలూరు " అని కూడా పిలుస్తారు.
ఈ వంశానికి చెందిన సదాశివ రాయలు కట్టించినదే వేలూరు కోట. రాజుగారి ఆదేశం ప్రకారం సామంత రాజైన "చిన్ని బొమ్మ నాయకుడు" 1566 వ సంవత్సరంలో నిర్మించాడు అని శాసనాలు తెలియజేస్తున్నాయి.
అత్యంత ఊహాత్మక, దుర్భేద్యమైన, సంపూర్ణ రక్షణ నిచ్చే కోటగా చరిత్రకారుల ప్రశంసలు పొందిన కోట.





నూట ముప్పై ఆరు ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ కోట చుట్టూ గ్రైనేట్ రాళ్ళతో బురుజులతో కూడిన పటిష్టమైన గోడ నిర్మించారు. గోడ చుట్టూ లోతైన కందకం త్రవ్వించారు. నేటికీ నీటితో నిండి ఉండే ఈ కందకంలో ఒకప్పుడు వేల సంఖ్యలో మొసళ్ళు ఉండేవట. గోడల మీద నిరంతరం సైనిక పహారా ఉండేదిట. నాడు ఉన్న సైనికుల ప్రదేశాలలో సిపాయిల బొమ్మలను ఉంచారు.





గత అయిదు శతాబ్దాలలో విజయనగర రాజులు, సుల్తానులు, మరాఠాలు, నవాబులు చివరగా ఆంగ్లేయులు తమ అధీనంలో ఉంచుకొన్నారు. ప్రస్తుతం పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకొన్న ఈ కోట ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి.
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో జారిన యుద్దంలో మరణించాడు. ఆయన తల్లి, భార్య మరియు కుమారులను ఇక్కడ బంధించారు.





అదే సమయంలో ఇంగ్లీష్ వారి వద్ద సైనికులుగా పనిచేస్తున్న భారతీయులు అనేక అవమానాలకు గురి అయ్యారు.
మత సంబంధిత వస్తువులను ధరించరాదు. విశ్వాసాలకు అతీతంగా మీసం గడ్డం లేకుండా ఉండాలి. తలపాగాలను తీసి వేసి ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలను పెట్టు కోవాలి అని అధికారులు ఆదేశించారు.
అదే సమయంలో టోపీలు ఆవు లేదా పండి చర్మాలతో తయారు చేసారు అన్న వార్త ప్రబలింది. అప్పటికే అసహనంతో రాలుగుతున్న సైనికుల సహనం ఈ వార్తతో పూర్తిగా హద్దులు దాటింది.





1806 జూలై పదో తారీకున తిరగబడిన సిపాయిలు ఆంగ్లేయ అధికారులను, సిపాయిలను అంతం చేసి కోటను తమ అధీనం లోనికి తెచ్చుకొన్నారు. నిర్బంధంలో ఉన్న టిప్పు సుల్తాన్ కుమారులను తమకు సారధ్యం వహించమని కూడా కోరారట. కానీ ఆర్కాట్ నుండి తరలి వచ్చిన మరో ఇంగ్లిష్ సైనిక బృందం అత్యంత క్రూరంగా తిరుగుబాటును అణిచి వేశారు.  తిరగబడిన సైనికులను దారుణంగా చంపివేశారు.
ఒకరకంగా ఇది ఆంగ్లేయుల మీద భారతీయుల తొలి తిరుగుబాటుగా పేర్కొనవచ్చును.





టిప్పు సుల్తాన్ కుమారులను కలకత్తా తరిలించారు. ఆయన తల్లి, భార్య కొందరు బంధువులు ఇక్కడే మరణించారు.
శ్రీలంకను పాలించిన ఆఖరి నాయక రాజ వంశపు పాలకుడు "శ్రీ వికారం రాజ సింఘే" ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో ఓడిపోయి పట్టుపడ్డారు. ఆయనను కుటుంబంతో సహా భారత దేశానికి తెచ్చి వేలూరు కోటలో బంధించారు
అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల నిర్బంధం అనంతరం ఆయన ఈ కోట లోనే తుది శ్వాస విడిచారు. పాలారు నది వడ్డున ఉన్న "ముత్తు మండపం"లో ఆయన సమాధిని సందర్శించవచ్చును.







ఇలా ఎన్నో చారిత్రక సంఘటనలు చోటు చేసుకొన్న వేలూరు కోటలో మూడు మతాలకు చెందిన ప్రార్ధన స్థలాలు ఉన్నాయి. చర్చిని రాబర్ట్ క్లైవ్ నిర్మించగా, ఆర్కాట్ నవాబు మసీదును ఏర్పాటు చేసారు. మూడవది శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం, ఎన్నో విశేషాలకు నిలయం.
కోటకు ఎంత చరిత్ర ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఈ ఆలయానికి ఉన్నది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
తొలుత పల్లవులు, పాండ్యులు, చోళులు ఈ ఆలయ నిర్మాణాన్ని అంచెలంచెలుగా చేపట్టారు.
కోట నిర్మించిన తరువాత చిన్నిబొమ్మి నాయుడు రాజానుమతితో ఆలయ నిర్మాణం చేపట్టారు. అందుకే అణువణువునా విజయనగర నిర్మాణశైలి ప్రస్పుటంగా కనపడుతుంది.








కోటలో దాదాపుగా ఈశాన్య భాగంలో కొద్దిగా క్రిందకి ఉండే ఈ ఆలయానికి అయిదు ప్రాకారాలు ఉంటాయి. 
వెలుపలి ప్రాకారానికి దక్షిణాన ఏడు అంతస్థుల రాజగోపురం దానికి అనుసంధానంగా ఎత్తైన గోడలు. ఈ గోడల మీద నంది మరియు శృంగి బృంగి రూపాలను చెక్కారు. 
రాజగోపురం వద్ద ఆలయ చరిత్రను ఆంగ్ల మరియు తమిళ భాషలలో లిఖించి భక్తుల సౌకర్యార్ధం ఉంచారు. 
రెండో ప్రాకారంలో మరో గోపురం ఉంటుంది. మరో వరుస ప్రహరి గోడలను నిర్మించారు. వాటి మీద కూడా నంది గణపతి, ప్రమధ గణాల రూపాలను చెక్కారు. 






అసలు విశేషం ఈ ప్రాంగణంలోనే ఉన్నది. ముందు తరాల శిల్పులకు ఒక పాఠ్య గ్రంధంగా పరిగణింపదగిన కళ్యాణ మండపం.
దక్షిణ భారత దేశంలోని ఆలయాలలో మధురై ,హంపి, తిరునెల్వేలి, కోయంబత్తూర్ సమీపంలోని పేరూర్ లోని ఈశ్వరన్ కోవెల లలోని కళ్యాణ మండపాలు అత్యంత సుందరమైనవిగా ప్రసిద్ది.
శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం లోని కళ్యాణ మండపం వాటితో సరి పోల్చతగినది.









యలి లాంటి పురాణ కాల జీవుల నుండి అశ్వాలు, గజాలు, సింహాలు లాంటి మృగాలు, అనేకానేక దేవీ దేవతల రూపాలు, రామాయణ భాగవత దృశ్యాలు ఇలా రాతిని ఒక చిన్న ముక్క కూడా వృధాకాకుండా మలచిన శిల్పులు ఎంత నేర్పరులో కదా అనిపిస్తుంది.











ఈ మండప గొప్పదనాన్ని తెలియచెప్పే ఒక విశేషం స్థానికంగా వినిపిస్తుంది.
ఆంగ్లేయులు ఈ శిల్ప సౌందర్యానికి పరవశులై మండపాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇంగ్లండు తరలించడానికి పధకం రచించారు. దానికి రాణీ గారి అనుమతి కూడా లభించినదట. కానీ కొన్ని అనుకోని ఘటనల వలన వారు ఈ తరలింపు యత్నాన్ని విరమించుకోన్నారట.









కొద్దిగా ఎత్తులో ఉండే వేదిక పైన చెక్కిన కూర్మ సింహాసనం ఒక అద్భుతం. 
అదే కాదు ఈ మండపానికి అనుబంధంగా ఏర్పరచిన అలంకార మండపాలు మరియు ఆగ్నేయం లో ఉన్న వసంత మండపం దాకా అన్ని వీక్షకులను చకితులను చేస్తాయి. 
పైకప్పుకు చెక్కిన పెద్ద పెద్ద పుష్పాలు మరింత మురిపిస్తాయి. 












అవ్వడానికి ఇది శివాలయం అయినా ఈ మండపంలో ఎక్కువగా శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన శిల్పాలు ఉండటం బహుశా విజయనగర రాజులు వైష్ణ సిద్దాంతాన్ని అనుసరించడం కావచ్చును.
అపురూప శిల్పాలను, అతి సూక్ష్మ చెక్కడాలతో నిండిన ఈ మండపాన్ని అంగుళం అంగుళం వర్ణించడం ఎవరికైన అసాధ్యం. సందర్శించడమే మార్గం !

















ప్రదక్షిణ పూర్తి చేసుకొని మూడో ప్రాకారం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా విఘ్ననాయకుడు. తొండము కుడి వైపు తిరిగి వుండే ఈయనను "వలంపురి వినాయకుడు" అని పిలుస్తారు. కొలిచినంతనే కోర్కెలు సిద్ధింప చేస్తారని ప్రతీతి.
ఎడమ పక్కన ఉన్న మూడు ఉపాలయాలలొ శ్రీ సిద్ది గణపతి, శ్రీ తిరుమల బాలాజీ, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరి ఉంటారు.





















ఆలయ వాయువ్య భాగంలో అమ్మ వారు శ్రీ అఖిలాండేశ్వరి ఉపస్తితులై దర్శనమిస్తారు.
ఎదురుగా నవ అఖండ దీపాలు వెలుగుతుంటాయి. ఇవి నవగ్రహాలకు ప్రతి అని చెబుతారు.
ఇక్కడ మండపంలో పికప్పుకు కంచి లో మాదిరి బల్లులను చెక్కారు. మనిషికి రెండు రూపాయలు చెల్లించి తాక వచ్చును.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి అటు ద్వారం ఉండదు. ఉత్తరం వైపు నుండి ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి.
ముఖ మండపంలో నిలువెత్తు ద్వారపాలకులు, నంది.
అర్ధమండపంలో మరో నంది. ఎదురుగా గర్భాలయంలో విరాట్ లింగరూపంలో శ్రీ జలకంటేశ్వర స్వామి.
నేడు ప్రతి నిత్యం  ఎన్నో అభిషేకాలు పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో 1981 వ సంవత్సరం వరకూ చాలా సంవత్సరాలు ఎలాంటి పూజలూ జరిగేవి కావు అస్సలు ఎలాంటి దేవతా మూర్తు ఉండేవి కావు అని తెలిస్తే నమ్మశక్యం కాదు. కానీ నిజం. ఎవరి పాలనలో జరిగిందో కానీ అన్ని విగ్రహాలను తీసివేసారు.
భక్తులు ఎన్నో ప్రయాసలు పది చివరి 16. 03. 1981 న పునః ప్రతిష్ట చేసారు.





తూర్పున ధ్వజస్తంభం, నటరాజ మండపం, అరవై మూడు మంది నయమ్మారులు , సప్త మాతృకలు ప్రత్యేక స్థలాలలో దర్శనమిస్తారు.
ఇన్ని విశేషాల శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం వేలూరు పట్టణం నడి బొడ్డున ఉన్న "కొట్టై " (స్థానికంగా కోట ను అలా అంటారు.)లో ఉంటుంది.
ప్రముఖ కూడలి అయిన "కాట్పాడి" రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.అన్ని సదుపాయలు లభిస్తాయి. 





పురాతన నిర్మాణాలు, ఆలయాలు, శిల్పాలను చూడాలి అనే ఆకాంక్ష ఉన్నవారినే కాదు ప్రతి ఒక్కరిని ఆకర్షించే వేలూరు కోట మరియు శ్రీ జలకంటేశ్వర స్వామి ఆలయం తప్పక సందర్శించవలసిన గొప్ప నిర్మాణాలు. 
నమః శివాయ !!!! 



Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...