18, డిసెంబర్ 2016, ఆదివారం

Tiruttani


            శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తణి 

తమిళనాడులో ఆదిదంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధికం. ప్రతి శివ, శక్తి, గణపతి ఉప దేవతగా మరియు మరెన్నో ఆలయాలలో ప్రధాన అర్చా మూర్తిగా సేవలందుకొంటున్నారు షణ్ముఖుడు. 
అలాంటి వాటిల్లో ఆరు పాడై వీడు ఆలయాలు ముఖ్యమైనవి. అవి పళని, స్వామిమలై,  తిరుప్పరం కుండ్రం, పళముదిర్చోళై, తిరుత్తణి మరియు తిరుచ్చెందూర్.
గమనించదగిన అంశం ఏమిటంటే మొదటి అయిదు ఆలయాలు పర్వతాల మీద నెలకొని ఉండగా, ఆఖరిదైన తిరుచ్చెందూర్ మాత్రం సముద్ర తీరాన ఉండటం. ఒకప్పుడు ఇక్కడ కూడా పర్వతం ఉండేదట. సముద్ర అలల తాకిడికి కరిగిపోయింది అని చెబుతారు. ఆలయ అంతర్భాగంలో ఆ కొండా తాలూకు చిన్న భాగాన్ని చూడవచ్చును.  
సుబ్రహ్మణ్య షష్టి లాంటి విశేష పర్వదినాలలోనే కాకుండా  ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు ఈ ఆలయాలకు తరలి వస్తుంటారు.
ఈ ఆరు ఆలయాలు  తమవైన పురాణ, చారిత్రక నేపధ్యం కలిగి ఉంటాయి. 







ఆరు పాడై వీడు ఆలయాల వరుసలో ఐదవది అయిన తిరుత్తణి ఆలయానికి సంబంధించిన పురాణగాథ తొలి యుగానికి చెందినది. ఈ వివరాలు  సంగమ కాలానికి చెందిన తమిళ గ్రంధాలైన  " తిరుమురుగ తిరుప్పాది"  మరియు "తణికై పురాణం"లలో సవివరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే కాలానికి చెందిన ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు అయిన శ్రీ అరుణగిరినాథర్ తన  ఆరాధ్య దైవాన్ని కీర్తిస్తూ ఎన్నో  గీతాలను గానం చేశారు. అసురుని సంహరించిన సమయంలో కలిగిన ఆగ్రహాన్ని శ్రీ కుమారస్వామి ఇక్కడ వదిలేశారట. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని తొలుత "తిరుతణికై"
అని పిలిచేవారట. కాలక్రమంలో అది "తిరుత్తణి" గా మారింది అంటారు. 
తిరుచెందూర్ లో అసురుడైన సూరపద్ముని సంహరించిన తరువాత షణ్ముఖుడు ఈ ప్రాంతానికి వచ్చి సేదతీరారట.కురువ వంశానికి చెందిన గిరిజనుల నాయకుడు నంబిరాజన్. అతనికి అడవిలో లభించిన వల్లీ దేవిని ఇక్కడే శ్రీ సుబ్రమణ్య స్వామి వివాహ మాడారు అని చెబుతారు.
కళ్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి. అవివాహితులు వివాహం కావలెనని, సంతానం లేని వారు సత్సంతానం కోరుకుంటారు ఇక్కడ.






తారకాసురునితో జరిగిన యుద్ధంలో కుమారుని ఛాతి భాగంలో లోతైన గాయం అయ్యినదట. స్వామి వారి పెద్ద భార్య దేవసేన తండ్రి దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు ఒక గంధపు చెట్టు తాలూకు భాగాన్ని అరగదీయడానికి కావలసిన రాతిని ఇచ్చి గంధం తీసి గాయం మీద రాయమన్నారట. నేటికీ కోవెలలో గంధం తీసే రాయి ఇంద్రుడు ఇచ్చినదిగా పరిగణిస్తారు.
అదే విధంగా మూలవిరాట్టుకు అలంకరించే చందనంలో అద్భుత ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. దానినే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. 
ఇలా ఎన్నో గాధలు ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి.





చిన్న కొండ మీద ఈ ఆలయాన్ని తొలుత ఎవరు నిర్మించారో తెలియదు గానీ ప్రస్తుత నిర్మాణాలను తొమ్మిదో శతాబ్దాల ప్రాంతాలలో పల్లవ రాజులు నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలియ వస్తోంది. వారి తరువాత చోళులు, విజయనగర మరియు ఇతర రాజ వంశాలు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది.




ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత గమనించవలసి ఉన్నది. సహజంగా వాహన మూర్తులు మూలవిరాట్టుకు అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామి వారి వాహనాలైన మయూరం మరియు ఐరావతము రెండూ వ్యతిరేక దిశగా అంటే తూర్పు ముఖం వైపు తిరిగి ఉంటాయి.
దీని గురించి ఒక గాథ స్థానికంగా ప్రచారంలో ఉన్నది.
అల్లుడికి వివాహ కానుకగా లెక్కలేనన్ని కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా ఇచ్చేశాడట దేవేంద్రుడు. ఆయన వైభవానికి కారణమైన తెల్ల ఏనుగు దేవలోకాన్ని వదిలి వెళ్లడంతో ఇంద్రుడు తన సంపదలను కోల్పోవడం ప్రారంభమైనది. మామగారి పరిస్థితి తెలుసుకొన్న షణ్ముఖుడు ఐరావతాన్ని అమరావతి వైపుకు తిరిగి ఉండమన్నారట. దానితో స్వర్గాధిపతి పరిస్థితి స్థిరపడింది.





ప్రతి నిత్యం ఎన్నో పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు అర్చనలు స్వామికి జరుగుతున్నా అన్నిటిలోనికి ముఖ్యమైనది ఆడి కృతిక. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్వయంగా  దేవేంద్రుడు ఆరంభరించినట్లుగా చెబుతారు. ఐరావతాన్ని తన లోకం వైపు చూసేలా చేసి తనకు పూర్వస్థితి దక్కేలా చేశారు అన్నకృతజ్ఞతతో ఇంద్రుడు కలువ పూలతో అర్చించారట.అందుకే ఈ ఉత్సవాల సందర్భంగా  ఈ పూలతో అర్చన, అలంకరణ చేస్తారు. కావడి ధరించి భక్తులు వేలాదిగా తరలివస్తారు. పర్వత పాదాల వద్ద ఉన్న శరవణ పుష్కరణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.







ఎన్నో ఉపాలయాలతో అలరారే ఈ ఆలయంలో ప్రధాన అర్చనా మూర్తికి ఇరువైపులా దేవేరులైన శ్రీ వల్లీ మరియు దేవసేన కొలువుతీరి ఉంటారు. రాత్రి పూట  చేసే పల్లకీ సేవలో ఒకరోజు శ్రీ వల్లీ దేవితో మరో రోజు దేవసేన దేవితో స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
అదేవిధంగా చైత్ర మాసంలో దేవసేనతో , మాఘ మాసంలో శ్రీ వల్లీతో స్వామి వారి  వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.







పర్వత పైభాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. మెట్ల మార్గంలో సంవత్సరం లోని రోజులకు నిదర్శనంగా మూడువందల అరవై అయిదు మెట్లు ఉండటం విశేషం. ప్రతి ఆంగ్ల సంవత్సరాది అయిన జనవరి ఒకటో తారీఖున అన్నిమెట్లను కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వేలాదిగా స్త్రీలు ఈ పడి పూజలో పాల్గొంటారు.











ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు గంటలవరకూ తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుందీ ఆలయం !
దేవస్థానము ఆధ్వర్యంలో వసతి సౌకర్యం మరియు ఉచిత అన్నదాన సదుపాయం భక్తులకు లభిస్తాయి.














పర్వతం పైనుండి చూస్తే చక్కని ప్రకృతి కనిపిస్తుంది. చల్లని గాలి ఆధ్యాత్మిక సౌరభాన్ని తీసుకొని వస్తుంది. ఇవన్నీ మనస్సును ఆహ్లాదపరుస్తాయి. చంచలమైన మదిని అదుపుచేస్తాయి.
తిరుపతికి అరవై ఆరు కిలోమీటర్ల దూరం, చెన్నై నుండి అరక్కోణం నుండి, కాట్పాడి నుండి కూడా బస్సు రైలు మార్గాలలో సులభంగా తిరుత్తణి చేరుకోవచ్చును. వేలాదిగా తెలుగు భక్తులు వస్తుండటం, మన రాష్ట్ర సరిహద్దులలో ఉండటం వలన తెలుగు భాష మాట్లాడేవారు అధికంగా కనపడతారు. అదే విధంగా దేవాలయంలో అన్ని చోట్ల తెలుగులో భక్తులకు సూచనలు రాసి ఉంచడం ఆనందదాయకం. 

16, నవంబర్ 2016, బుధవారం

Sri Chitra Gupta Temple, Kanchipuram


                               శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం 



ఈ పేరు వినగానే మన కనుల ముందు ఒక చిత్రమైన రూపం మెదులుతుంది. పెదవుల మీదకు నవ్వు వస్తుంది. కానీ చిత్రగుప్తుడు సామాన్యుడు కాదు. సృష్టికర్త బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించినవాడు.  విధాతకు తెలియ కుండా ఆయన కాయంలో (దేహంలో) దాగి ఉండి ఆయనకు తెలియ కుండా బయటకు వచ్చిన చిత్ర మైన వాడు గనుక ఈయనకు చిత్రగుప్తుడు అన్న పేరొచ్చినది.
భూలోకం లోని ప్రాణులు తమ జీవితాలలో చేసిన అన్ని పనులను నమోదు చేసేవాడు.వాటిని బట్టి మరణానంతరం నరకమా ? స్వర్గమా ? అన్నది తెలిపేవాడు. అత్యంత మేధావి. సునిశిత పరిశీలన గలవాడు.అసలు చిత్రగుప్తుడు అంటే అన్ని విషయాలను గుప్తంగా ఉంచేవాడు అని కదా అర్ధం ! దానిని నిరంతరం నిలబెట్టుకునే వాడు చిత్రగుప్తుడు.
అసలు తొలిసారి అక్షర మాలను, సంఖ్యలను రాసినవాడు చిత్రగుప్తుడే !
ఇన్ని విశేషాలు ప్రత్యేకతలు కలిగి చతుర్ముఖుని దేహం నుండి ఆవిర్భవించిన వాడు నరకంలో ఉంటూ సతతం జీవుల పాపపుణ్యాలను లిఖించడం ఏమిటి ?










ఈయన జన్మ వృత్తాంతం మరియు లక్ష్యం  గురించిన కధలు అనేక పుస్తకాలలో ఉన్నాయి.
జీవుల  పాపపుణ్యాలను లెక్క కట్టడంలో త్రీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు యమధర్మ రాజు. కొన్ని వేల జీవుల గురించి సరి అయిన విధానం లేక పాపులను స్వర్గానికి, పుణ్య జీవులను నరకానికి పంపుతూ అవస్థపడుతున్న సమవర్తికి  తన కర్తవ్య నిర్వహణ సరిగ్గా ఉండాలంటే ఏమిచేయాలో పాలుపోలేదు. మార్గదర్శకత్వం కొరకు సత్యలోకం వెళ్లి హంసవాహనుని వేడుకొన్నాడు. ఆయనకు కూడా ఏమి చేయాలో తోచలేదు. సుదీర్ఘ ధ్యానం లోనికి వెళ్లి పోయి కొన్ని సంవత్సరాల తరువాత కనులు తెరువగా ఎదురుగా ఘంటం తాళపత్రాలు పట్టుకొని ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరు నీవు అని ప్రశ్నించగా తాను  చాలాకాలం ఆయన శరీరంలో గుప్తంగా ఉన్నానని తెలిపాడు.


 





యముని సమస్యకు పరిష్కారం ఇతని వలన లభిస్తుంది అని అర్ధం చేసుకొన్నాడు బ్రహ్మ.  తనకు తెలియకుండా తన శరీరంలో గుప్తంగా ఉన్నఅతనికి చిత్రగుప్తుడు అని నామకరణం చేసి నరక లోకానికి వెళ్లి యమధర్మరాజుకు జీవుల పాప పుణ్యాల లెక్కలలో సహాయ పడమని ఆదేశించారు. ఆ ప్రకారం చిత్రగుప్తుడు నాటి నుండి తనకు అప్పగించిన పని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు.
మన దగ్గర తక్కువ కానీ ఉత్తరాదిలో చిత్రగుప్త ఆరాధన చాలా ఎక్కువ. కాయస్థ కులస్థులు ఈయనను తమ వంశ మూలపురుషునిగా భావించి కొలుస్తారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, రాష్ట్రాలలో ఎన్నో చిత్రగుప్త ఆలయాలు ఉన్నాయి.
తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా ఒక చిత్రగుప్త ఆలయం ఉన్నది.
తమిళనాడు రాష్ట్రంలో ఆలయాల నగరం సప్త ముక్తి ముక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో ఒక విశిష్ట ఆలయం తొమ్మిదో శతాబ్దంలో చాలా రాజుల చేత నిర్మించబడినది కలదు.










కంచి బస్టాండ్ కు అత్యంత సమీపంలో ఉన్నఈ ఆలయం అత్యంత అరుదైనది. తూర్పు ముఖంగా ఉన్న మూడు అంతస్థుల రాజ గోపురం కొద్దీ దూరానికి స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నదైనా ముఖమండపం లోనికి ప్రవేశించగానే ఎదురుగా గర్భాలయంలో ఉపస్థితః భంగిమలో కుడి చేతిలో ఘంటం, ఎడమ చేతిలో తాళపత్రాలు పట్టుకొని నయన మనోహర పుష్పాలంకరణలో దర్శనమిస్తారు మూలవిరాట్టు శ్రీ చిత్రగుప్తులవారు.
ప్రతి నిత్యం ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో వివిధ రకాల పూజలు, అర్చనలు, అలంకారాలు మరియు ఆరగింపులు జరుగుతాయి. స్వామి ఆరాధన జన్మజన్మల పాపాల నుండి ఉపశమనం కలిగిస్తుంది అన్నది తరతరాల నమ్మకం.
చిత్రగుప్తుని జన్మ దినమైన చైత్ర పూర్ణిమ రోజున విశేష పూజలు నిర్మహిస్తారు. అదే రోజున చిత్రగుప్త కళ్యాణం కూడా జరుపుతారు.తిరువణ్ణామలై (అరుణాచలం)లోని అమ్మవారు శ్రీ ఉణ్ణామలై అమ్మన్ ఆలయ ఆస్థానమండపంలోని నవగ్రహ సన్నిధి వద్ద శ్రీ చిత్ర గుప్త సన్నిధి ఉన్నది. అక్కడ కూడా చైత్ర పౌర్ణమికి విశేష పూజలు జరుపుతారు.
నవగ్రహాలలో కేతు గ్రహానికి అధిపతి చిత్రగుప్తుడు. ఈయనకు చేసే పూజల వలన కేతు గ్రహ ప్రభావం వలన కలిగే ఇబ్బందులైన అయినవారితో ఆస్తి తగాదాలు, దురభ్యాసాలకు లోను కావడం, వివాహ సంబంధిత ఇబ్బందులు, గౌరవం కోల్పోవడం లాంటి వాటి నుండి బయట పడవచ్చును. కేతు అనుగ్రహం మనిషిని భగవంతునిగా మారుస్తుంది అని శాస్త్ర వాక్యం.
ప్రధాన ఆలయం వెనుక అమ్మవారి చిత్రగుప్తుని దేవేరి శ్రీ కర్ణగీ అమ్మవారు కొలువుతీరి ఉంటారు.








ఆలయాలకు ప్రసిద్ధి చెందిన కంచిలో తప్పనిసరిగా దర్శించవలసిన అరుదైనది శ్రీ చిత్రగుప్త ఆలయం. 

29, అక్టోబర్ 2016, శనివారం

Greetings






వెలుగులు చిందే ఈ దీపావళి అందరికీ శుభాలు చేకూర్చాలని, సుఖ శాంతులు అందించాలని, జీవితాలలో సరికొత్త కాంతులు నింపాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. 

14, అక్టోబర్ 2016, శుక్రవారం

Sri Manakula Vinayaka Temple, Puducherry

                           శ్రీ మనకూల వినాయక ఆలయం 

తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది.










ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు  చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట  హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.
 శ్రీ మనకూల వినాయక కోవెల వీధిగా పిలవబడుతున్న వీధిని అప్పట్లో ఒర్లేన్ స్ట్రీట్ అని పిలిచేవారు. శ్రీ అరోబిందో ఆశ్రమానికి సమీపంలో ఉన్న ఆలయ వీధిలో పెద్ద మండపం భక్తులకు స్వాగతం పలుకుతుంది.
ఈ మండప పై భాగాన సిద్ది మరియు బుద్ది దేవేరులతో వినాయక వివాహ వేడుక వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడినది.











 ఉత్తర దక్షిణాలలో ఉండే ఈ మండపం గుండా తూర్పు దిశలో ఉన్న ప్రధాన ద్వారం గుండా మహా మండపం లోనికి ప్రవేశించవచ్చును. ద్వారం పైన గణేశుని వివిధ రూపాలు, ప్రియ పుత్రునితో ఉపస్థిస్థులైన శివ పార్వతులు, శ్రీ కుమార స్వామి ఆదిగా గల మూర్తులను సుందరంగా మలిచారు .
మహా మండపంలో దక్షిణ గోడకు హేరంభుని ముప్పై రెండు రూపాలను,వివిధ దేశాలలో నెలకొన్న మూషిక వాహనుని ఆలయాల వివరాలు చక్కగా చిత్రించి ఉంచారు.
స్వర్ణ శోభిత విమాన గోపురంతో ఉన్న గర్భాలయంలో గణేశుడు చతుర్భుజాలతో ఉపస్థితః భంగిమలో స్వర్ణ కవచ, ఆభరణ, పుష్పాలంకృతులై దర్శనమిస్తారు.గణేశునికి ఉన్న పదహారు రూపాలలో సాగరతీరాన తూర్పు ముఖంగా కొలువైన స్వామిని "భువనేశ్వర గణపతి"అంటారు.కానీ మనల అంటే ఇసుక,కులం అంటే కోనేరు అని తమిళంలో అర్ధం.ఒకప్పుడు ఇసుకతో నిండిన పుష్కరణి పక్కన కొలువైనందున ఈశపుత్రుని "మనకూల వినాయకుడు" అని పిలుస్తారు.







గర్భాలయం వెనుక ఉపాలయాలలో శ్రీ బాలగణపతి, శ్రీ బాల సుబ్రహ్మణ్యం ఉంటారు.మండప ఉత్తరం వైపున ఉత్సవ మూర్తుల మండపంలో వివిధ రూపాల ఏకదంతుడు,పక్కనే వెండి మరియు బంగారు రధాలతో పాటు మిగిలిన వాహనాలు ఉంటాయి. ఆలయంలో కనిపించే స్వర్ణ, రజత విమానాలు, రథాలు, ఇతర మూర్తులు అన్నీ భక్తులు తమ మనోభీష్టాలు నెరవేరడం  వలన మనస్ఫూర్తిగా సమర్పించుకున్నవి కావడం విశేషం.
ఉత్తరం పక్కనే విశాల ఉత్సవ మండపం నిర్మించారు. పర్వ దినాలలో ముఖ్య కార్యక్రమాలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ మండపం వైపున గోడల పైన సుందర  చిత్రాలను చిత్రించారు.
ప్రతి నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరిచి ఉంటుంది.



  

స్థానిక భక్తులు తన శిశువులను తొలిసారి ఈ ఆలయానికి తీసుకొని వచ్చిన తరువాతే మరెక్కడికన్నా తీసుకొని వెళతారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం లాంటి వాటికి శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రసిద్ధి.  గణపతి నవరాత్రులు, తమిళ ఉగాది, మహా శివరాత్రి మరియు ఇతర హిందూ పర్వదినాలలో భక్తుల\తాకిడి అధికంగా ఉంటుంది. 
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ మనకూల వినాయకుడు !!!

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...