18, జనవరి 2015, ఆదివారం

Ethipothala


                          ఎత్తిపోతల - శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం  

"యతి తపో స్థలం" అంటే ఎవరికీ తెలియక పోవచ్చును. అదే ఎత్తి పోతల అంటే అందరికీ తెలుస్తుంది. 
గుంటూరు జిల్లాలో పేరొందిన పర్యాటక స్థలం. 
ఇక్కడి జలపాతాలు సంవత్సరం పొడుగునా యాత్రికులను ఆకర్షిస్తాయి. 
రాష్ట్ర పర్యాటక శాఖ ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేసింది. 
ప్రతినిత్యం వందలాది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
జల పాతంలో జలకాలాడి నిత్య జీవితాలలో ఎదుర్కొనే చికాకుల నుండి ఒక రోజును జీవిత కాల మధురానుభూతులను నింపుకొని వెళుతుంటారు. 
కాక పోతే చాలా మందికి తెలియని విశేష పౌరాణిక నేపద్యం ఈ క్షేత్రానికి ఉన్నదని !


ఎత్తి పోతల ఒక విధంగా త్రివేణి సంగమం.
చంద్ర వంక వాగు, నక్కల వాగు మరియు తుమ్మల వాగు కలిసి జలపాతంగా కొండల మీద నుండి నయనమనోహరంగా జాలువారుతూ కొంత దూరం ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
ఎత్తిపోతల ఒక దత్తక్షేత్రం.
దత్తావతారాలలో ఒకరైన "శ్రీ పాద శ్రీ వల్లభులు" ఇక్కడ తపమాచారించారని స్థల పురాణం తెలుపుతోంది.
ఆయనే కాదు ఎందరో యతులు ఇక్కడ తపమాచారించడం వలన "యతి తపోస్థలం"గా పిలవబడి కాలక్రమంలో "ఎత్తి పోతల"గా మారిందట. 



ఇక్కడ స్వయం ప్రకటిత రూపంలో శ్రీ పాద శ్రీ వల్లభులు కొలువుతీరడం వెనుక ఒక ఆసక్తికర కధనం వ్యాప్తిలో ఉన్నది.
ఒకప్పుడీ ప్రాంతంలో సుగాలి వారు నివసించేవారు.
పశువులు వారి ముఖ్య సంపద. వారిలో కొందరు ఉప్పు సేకరించి తూర్పు నుండి పడమటి ప్రాంతాలలో విక్రయించేవారు.
ఒక రోజు ఉప్పు మూటలను గోవుల మీద వేసుకొని సుగాలీలు వెళుతుండగా మేడి చెట్టు క్రింద బాల యతి రూపంలో
కూర్చోనివున్న స్వామి వారిని "మూటలలో ఉన్నది ఏమిటి?" అని అడిగారట.
దానికి వారు బాలుడికి సమాధానం ఇచ్చేదేమిటి అనుకోని "ఆకులు అలమలు" అని దురుసుగా పలికి వెళ్లిపోయారట. 



సాయంత్రానికి కృష్ణా నదీ తీరానికి చేరుకొన్న తండా వారు వంట చేసుకోడానికి మూటలు విప్పగా అందులో పాత్రల బదులు ఎండిన ఆకులు కనపడటంతో నిశ్చేష్ట్టులై ఈ మాయకు కారణం ఏమిటా అని ఆలోచించగా మేడి వృక్షం క్రింద కూర్చొని వున్నబాలుడు కనుల ముందు మెదిలాడు. 

సామాన్య బాలుడు కాడు అన్న విషయం తెలుసుకొన్న వారు తిరిగి వెళ్లి తెలియక చేసిన తప్పుకు తమను క్షమించమని వేడుకొన్నారట. 
"ఎవరినీ చిన్న చూపు చూడ కూడదు !" అని తెలిపిన స్వామి ఆశీర్వదించారు. 
అంతే మూటల లోని చెత్త వెండి బంగారాలుగా మారాయట. 
అప్పటి నుండి స్వామి వారిని సుగాలీలు తమ కుల దైవంగా భావించి ఆరాదించసాగారు. 



ఎత్తి పోతల జలపాతాలకు క్రింద ఒక కిలో మీటరు దూరం కొండలలో, వనాలలో నడుచుకొంటూ ప్రకృతి సౌందర్యాన్ని మనసార ఆస్వాదిస్తూ వెళ్ళాలి
దారంతా జలపాత గలగలలు పక్షుల కూతలు వింటూ,  మన పూర్వీకులు తోడుగా వస్తుంటే మార్గాయాసం తెలియదు. 
నీటి ప్రవాహానికి పక్కన చక్కని ఆలయాలు కనపడతాయి.
 ఈ ఆలయాలన్నీ కొండ గుహలలో ఉన్న గర్భాలయాలతో ఉండటం విశేషం. 



ఆది శేషువు మీద పవళించిన శ్రీ రంగనాయక స్వామిభక్తులకు అభయం ప్రసాదిస్తారు. 
 ఎదురుగా చేతులు జోడించి స్వామి  సేవకు సిద్దం అన్నట్లుగా శ్రీ అంజనా సుతుడు మరియు శ్రీ వినతా సుతుడు ఉంటారు. 








శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి పక్కనే కొద్దిగా ఎత్తులో మరో కొండ గుహలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవేరి "శ్రీ మధు మతీ దేవి" సన్నిధి ఉంటుంది.



అమ్మవారిని దర్శించుకొని స్వాగత ద్వారం గుండా మెట్ల మార్గంలో పైకి వెళితే శ్రీ దత్తాత్రేయ స్వామీ సన్నిధికి చేరుకొంటాము. 
చిన్న ద్వారం గుండా లోపలికి వెళితే విశాలమైన గుహాలో లోపల సింధూర వర్ణ శోభిత రూపంలో శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులను ఆశీర్వదిస్తారు. 
నిత్యాగ్ని హోమం జరుపుతారిక్కడ. 
ప్రస్తుతం మూసేసిన గుహ మార్గం శ్రీ శైలానికి దారి తీస్తుందని అంటారు. నేటికీ యతులు మహర్షులు ఈ గుహ మార్గం గుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి స్వామిని సేవిన్చుకొంటారని అంటారు.





ఆవు నెయ్యితో దీపారాధన చేసి, విధివిధానాలతో పూజ చేసి, ఆవు పాలతో పాయసం నైవేద్యంగా ఆరగింపు చేసి  స్వామి వారికి కాషాయం జెండా సమర్పించుకోవాలి. 
లెక్కలేనన్ని జెండాలు కనపడతాయి. 
సుగాలీ మహిళ స్వామి వారి పాదుకలతో భక్తుల భుజాల మీద తలమీద తాకిస్తారు. 
ఈ చర్య వలన దుష్ట గ్రహ పీడ తొలగిపోతుందని అంటారు. 





 
ప్రశాంత ఆద్యాత్మిక మరియు ప్రకృతి సౌందర్యంతో నిడిన ఎత్తి పోతల మాచర్ల నుండి లేదా నాగార్జున సాగర్ నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకొనవచ్చును. 
యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్ లో లభిస్తాయి. 
ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక దత్త క్షేత్రం ఎత్తి పోతల ప్రతి వక్కరూ సందర్శించవలసిన సుందర ఆధ్యాత్మిక క్షేత్రం. 

జయదత్త శ్రీ దత్త జయ జయ దత్త !!!

శ్రీ పాద శ్రీ వల్లభ ! శ్రీ నృసింహ సరస్వతి ఏ నమః !!!



Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...