28, నవంబర్ 2013, గురువారం

sri agastheeswara swamy temple, Mukkoti

                   శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం, ముక్కోటి, తిరుపతి 


సప్త మహా ఋషులలో శ్రీ అగష్య మహర్షి ప్రత్యేకత వేరు.
సదా శివుని ఆజ్ఞ మేరకు కాశి నగరాన్ని వదిలి దక్షిణ భారత దేశానికి సతి, శిష్య ప్రశిష్య సమేతంగా తరలి వెళ్ళారు. మార్గంలో కాల గతిని నిర్ణయించే సూర్య చంద్రుల గతిని అడ్డుకొనే విధంగా పెరిగిన వింధ్య పర్వతాన్ని సాధారణ స్థితికి తెచ్చారు.
దక్షిణ దేశంలో ప్రతి పుణ్య తీర్థ స్థలిని సందర్శించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు.
ఈ కారణంగానే నేడున్న అనేక శివాలయాలలో పూజలం దుకొంటున్న లింగరాజును శ్రీ అగస్థీస్వర స్వామిగా పిలవబడుతున్నారు.
తన దక్షిణ భారత దేశ పర్యటనలో విడిది చేసిన అనేక స్థలాలు నేడు పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్ది పొందాయి.
అలాంటి వాటిల్లో కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న పోదిగై పర్వతాలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి.
విధాత ఆనతి మేరకు మహా ముని ఈ ప్రాంతంలోనే సంస్కృత, తమిళ భాషలను సృష్టించారని తెలుస్తోంది.
అద్భుత ప్రకృతి సౌందర్యానికి, మనసులకు ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ పోదిగై పర్వతాలు ప్రసిద్ది.
అంతటి ప్రాముఖ్యతను పొందినా వెలుగులోనికి రాని ఒక మహా క్షేత్రం మన రాష్ట్రంలో కూడా ఉన్నది.
అదే కలియుగ వైకుంఠమ్ తిరుమలకు దగ్గరలో స్వామి  శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా కొలువు తీరిన శ్రీనివాస మంగాపురంకి చేరువలో ఉన్న " ముక్కోటి".
తన దక్షిణ భారత యాత్రలో ఈ ప్రదేశానికి చేరుకొన్నారు మహర్షి. 
కళ్యాణి, భీమ, సువర్ణ ముఖి నదులు కలిసే ఈ క్షేత్రం త్రివేణి సంగమం గా, పరమ పవిత్ర స్థలంగా గుర్తించి ఆశ్రమం నిర్మించుకొని, నిత్య పూజలకు శివ లింగాన్ని ప్రతిష్టించుకొని నివాసముండసాగారు. 
అదే సమయంలో ఆకాశ రాజ పుత్రిక పద్మావతిని వివాహమాడిన శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చారు. 
మహాముని స్వామివారికి అతిధి సత్కార్యాలు చేసి కొంత కాలం తమతో ఉండమని కోరారు. 
అంగీకరించిన భక్త వత్సలుడు సతీ సమేతంగా వారికి తమ సాంగత్య భాగ్యాన్ని ప్రసాదించారు. 
దీనికి గుర్తుగా నదీ గర్భంలో ఉన్న మండపంలో శ్రీ వారి పాద ముద్రను చూడవచ్చును. 
శ్రీ అగస్త్య మహా ముని నివసించి, ప్రతిష్టించిన శివ లింగం మూలాన శ్రీ అగస్తీశ్వర క్షేత్రం పేరొందినది. 
అనంతర కాలంలో ఈ హరిహర క్షేత్రం భక్తులలో అంతులేని ఆదరణ పొందినది. 
దక్షిణ భారత దండయాత్రలో ఏడుకొండల వాని దర్శనానికొచ్చిన విజయనగర సార్వ భౌముడు శ్రీ కృష్ణ దేవ రాయలు ఈ క్షేత్ర విశేషం తెలుసుకొని ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 






ఆలయ విశేషాలు : 

త్రివేణి సంగమ తీరంలో, విశాల ప్రాంగణంలో నిర్మించ బడినది. 
శాఖోపశాఖలుగా పెరిగిన వృక్షాలతో, ప్రశాంత వాతావరణంతో, అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకొని దర్శన మిస్తుంది శ్రీ అగస్తీశ్వర క్షేత్రం. 
ప్రధాన ఆలయానికి నలువైపులా ఎత్తైన ప్రహరి నిర్మించబడినది. 
ఉత్తరం వైపున ఉన్నమూడు అంతస్తుల చిన్న రాజ గోపురానికి ఉన్న ప్రధాన ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించవచ్చును. 
గోపురానికి ఇరు ప్రక్కలా వినాయక, సుబ్రమణ్య విగ్రహాలను ఉంచారు. 
ప్రాంగణంలోశ్రీ గణేశ, శ్రీ దుర్గ, శ్రీ మహా లక్ష్మి, శ్రీ సుబ్రమణ్య, శ్రీ కాల భైరవ ఉప ఆలయాలు, నవగ్రహ మండపం నెలకొల్పారు. 
గర్భాలయంలో ఉత్తర ముఖంగా శ్రీ అగస్తీశ్వర స్వామి, లింగ రూపంలో చందన, కుంకుమ, విభూతి లెపనాలతొ, వివిధ వర్ణ పుష్పాలంకరణతో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. పక్కనే ఉన్న మరో సన్నిధిలో శ్రీ ఆనంద వల్లీ అమ్మవారు పడమర ముఖంగా కొలువుతీరి ఉంటారు. 
ప్రతి శివాలయంలో ఉత్తర దిశగా ఉండే  గోముఖి ఇక్కడ తూర్పు దిశగా ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
గర్భాలయ వెలుపలి గోడలకు తూర్పున విధాత శ్రీ బ్రహ్మ, దక్షిణాన శ్రీ మహా విష్ణువు, పడమర శ్రీ దక్షిణా మూర్తి కొలువు తీరి ఉంటారు. 




ఆలయ వెలుపల వట వృక్షం క్రింద శ్రీ అగస్థ్య మహర్షి విగ్రహాన్ని నూతనంగా ప్రతిష్టించారు. 


ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి. 



పడమర వైపున కొత్తగా శ్రీ దాసాంజనేయ, శ్రీ వేణుగోపాల ఆలయాలను నిర్మించారు. 


నదీ గర్భంలో ఉన్న పురాతన మండపంలో అగస్త్య మహర్షి కొలిచిన శ్రీవారి పాదం ఉంటుంది. 
అక్కడే నిలువెత్తు నల్ల రాతిలో ఒక వైపున కలియుగ వరదుని, మరో వైపు కైలాస నాధుని రూపాలను సుందరంగా మలచారు. 
శివ కేశవుల మధ్య భేదం లేదన్న సత్యాన్ని తెలుపుతుంది ఈ మూర్తి. 
పక్కనే హరిహర సుతుడు శ్రీ ధర్మ శాస్త ( అయ్యప్ప ), పడునేట్టంబడి, సోదరులు శ్రీ గణేశ, శ్రీ షణ్ముఖ సమేతంగా పూజలందుకొంటుంటారు. 
ఇక్కడ కూడా కొన్ని నాగ ప్రతిస్తాలున్నాయి. 



శ్రీ వారి పాదం 

ఆలయ వెలుపలి గోడలకు శివ లీలల వర్ణ చిత్రాలను రమణీయంగా చిత్రించారు. 
అదే విధంగా ఆలయ విశేషాలను, నిత్య పూజల వివరాలను, వివిధ అభిషేక ఫలితాలను భక్తుల సౌకర్యార్ధం లిఖించి ఉంచారు. 



ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడున్నర  గంటల వరకు తెరిచి వుండే ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, నిత్య పూజలు నియమంగా జరుగుతాయి. 
మాస శివరాత్రికి,  పౌర్ణమికి, ఆరుద్ర నక్షత్రం రోజున, అమావాస్య, పౌర్నమిల తరువాత వచ్చే త్రయోదశి నాడు జరిగే ప్రదోష కాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుపుతారు. 
కార్తీక మాసంలో ఆది,సోమ, శని వారాలలో ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, కుంకుమ పూజ, లాంటి విశేష సేవలు స్వామి వారికి, అమ్మవారికి, జరుగుతాయి. 
మహా శివ రాత్రి తో సమంగా వైకుంట ఏకాదశిని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. 
వినాయక చవితి, సుబ్రమణ్య షష్టి, శ్రీ రామ నవమి, నవరాత్రులు, హనుమత్ జయంతి, శ్రీ కృష్ణాష్టమి, ఉగాది రోజులలో ప్రజలు విశేషంగా తరలి వచ్చి వివిధ సేవలలో పాల్గొంటారు. 
ఇంతటి పురాణం ప్రాచుర్యం ఉన్న ముక్కోటికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడిపే తిరుపతి ఆలయాల పర్యటన ప్రత్యేక బస్సులలో చేరుకొనవచ్చును. 
శ్రీనివాస మంగా పురం నుండి విడిగా ఆటోల ద్వారా కూడా దర్శించుకొనవచ్చును. 

నమః శివాయ !

Photos by Mr. Gopinath, Tirupati







2 కామెంట్‌లు:

  1. Chaalaa baavundi. Manchi vishayaalu cheppaaru.ee kshetram tirupati ki intha daggaralo vundani teliyadu.
    ee saari darsinchukovaali......
    " mahima" lu vunte gaani mana vaallu vellarugaa.
    kaakapothe idi mahaa mahimaanvitha kshetramanipisthondi

    రిప్లయితొలగించండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...