నర్మదా పుష్కరాలు
సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావించడం జరుగుతోంది. మన పురాణాలు కూడా అదే విషయాన్ని విపులంగా తెలిపాయి.
నింగి, నేల, నీరు, గాలి మరియు నిప్పు అన్నీ దైవస్వరూపాలే !
అలా భావించడానికి తగిన కారణాలను మన పురాణాలు సోదాహరంగా వివరించాయి.
పంచ భూతాలు ప్రతి ఒక్కటీ మానవ జీవితాలకు తప్పనిసరి. జీవనాధారం. ఒకటి ఉండి మరొకటి లేకపోతే జీవనయానం ఆగిపోతుంది. అంతటి విలువైనవి కనుకనే ప్రతి ఒక్కదానిని గౌరవించడం, పూజించడం, కృతజ్ఞతా భావంతో ఉండటం అవసరమని పెద్దలు తెలిపారు. అలా జరగడం వలననే ఇన్ని యుగాలు, తరాల తరువాత కూడా మనందరం కొంతవరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము.
ఈ పంచ భూతాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి.
ఆకాశంలోని మేఘాల వలన కురిసిన వానలతో భూమి పులకించి చక్కని పంటలు అందిస్తుంది. పచ్చని చేల మీదగా, చెట్ల మీదగా వీచే గాలి ప్రాణవాయువు ఆహ్లదకరం. జీవనావసరం. పండిన పంటలను రుచికరమైన వంటకాలుగా అందిస్తుంది అగ్ని.
ముఖ్యంగా జలం జీవం ! సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీటి తరువాతనే పుడమిని జీవరాశి ఆవిర్భవించింది. జలప్రవాహాల పక్కన జీవనం సాగించడం మొదలైనది. మానవ జీవితాలలో ప్రతి ఒక్కటీ నీటితో ముడి పడి ఉన్నాయి. అందుకే నదీమతల్లులు అని గౌరవిస్తూ వాటిల్లో చేసే తీర్ధ స్నానాలు, మంగళ స్నానాలు పుణ్యప్రదమని భావిస్తుంది హిందూ సమాజం.
ఇంతటి ప్రాముఖ్యం కలిగిన నీరు మనకు ఎలా లభిస్తోంది ?
నదుల ద్వారా ! అందుకే వాటిని నదీమతల్లులు అని పిలుస్తాము. నది అనగా సహజమైన జల ప్రవాహం. హిమాలయాలలో పుట్టినవి కొన్ని అయితే , మరికొన్ని ఎత్తైన పర్వతాలలో జన్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి.
మన దేశంలో వేల నదులు ఉన్నాయి. వీటిలొ నిరంతరం నీటిని అందించేవాటిని జీవ నదులు అన్నాము. అవి గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమ, తపతి, తుంగభద్ర సింధు మరియు ప్రాణహిత.
నదులను గౌరవించడానికి హిందువులు ఎంచుకొన్న మరో గొప్ప విధానం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో నదికి గౌరవసూచకంగా పుష్కరాలను జరపడం. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి ఆ సంవత్సరం పుష్కరంగా నిర్ణయిస్తారు. దీని వెనుక ఒక పురాణ గాథ వినపడుతుంది.
పుష్కరుడు
ప్రజలు పుణ్య స్నానాలు, తీర్ధ స్నానాల పేరిట పవిత్ర నదులలో స్నానం చేసి పాపాలను వదిలించుకోవడం వలన అవి ఆ పావన నదీమ తల్లులకు సంక్రమించి ఇబ్బందులు పెడుతున్నాయట. వారి ఇక్కట్లను గమనించిన "తుందిలుడు" అనే ఈశ్వర భక్తుడు స్వామిని గూర్చి తీవ్ర తపమాచరించాడట. భక్త సులభుడైన పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు ఈశ్వరునిలో శాశ్విత స్థానం అనుగ్రహించామన్నాడట. అలా ఈశ్వర అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్విత్త్వం పొందాడట. ఆకారణంగా అతను పుడమిలోని కోట్లాది పుణ్యతీర్ధాలకు అధిపతిగా మారి సకల జీవరాశిని పోషించే శక్తి లభించినది.
సంస్కృతంలో "పుష్కర" అంటే "పోషించే శక్తి" అని అర్ధం చెబుతారు. అలా తుందిలుడు పుష్కరునిగా పిలబడుతున్నాడు. బృహస్పతి ఒక్కో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో పుష్కరుడు కూడా ఒక నదిలో ప్రవేశిస్తాడు అని వాయు పురాణం చెబుతోంది.
పుష్కరకాలం ప్రతి నదికి ఒక సంవత్సరం ఉంటుంది. పుష్కరుడు నదిలో ప్రవేశించే సమయాన్ని ఆది పుష్కారాలు అని, పుష్కరుడు నది నుంచి నిష్క్రమించే సమయాన్ని అంత్య పుష్కరాలు అని పిలుస్తారు.
నదులకు కాకుండా పుష్కరణులకు కూడా పుష్కరాలు జరుగుతాయి. అలాంటి కోనేరులు భరత దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ లోని పుష్కర సరస్సు. ఈ సరస్సు ఒడ్డున ప్రఖ్యాతమైన శ్రీ బ్రహ్మ ఆలయం ఉన్నది. రెండవ కోనేరు ఆలయాల నగరంగా కీర్తించబడే కుంభకోణం లోని "మహామహం". తమిళనాడులోని కుంబకోణంలోనూ చుట్టుపక్కలా అనేక పురాతన ఆలయాలు కలవు.
గత సంవత్సరం పుష్కరుడు బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగానదిలో ప్రవేశించాడు. ఈ సంవత్సరం వృషభరాశిలోనికి బృహస్పతి మారుతున్న సమయంలో పుష్కరుడు నర్మదా నదిలో ప్రవేశిస్తాడు.ఇలా ప్రతిసంవత్సరం ఉన్న పన్నెండు జీవ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి.
నర్మదా నది
నర్మద అనగా ఆహ్లాదం కలిగించేది అని అర్ధం. మన భారతదేశంలోని అతి పెద్ద నదులలో అయిదవ స్థానంలో ఉన్న నర్మద నిజంగా పేరుకు తగినట్లుగా ఆహ్లాదాన్నిఅందించేదే !
మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ వద్ద మూడువేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఆరంభమయ్యే నర్మదా నది ప్రవాహ ప్రస్తానం కొండలు, లోయలు, అడవులు, జన పదాల గుండా సుమారు పదమూడు వందల కిలోమీటర్ల దూరం సాగి చివరకు గుజరాత్ రాష్ట్రం బారూచ్ జిల్లాలోని "గల్ఫ్ ఆఫ్ ఖంబట్" వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది.
ఎన్నో ప్రత్యేకతలు నర్మద సొంతం. నదీ తీరంలో లభించిన అనేక జీవుల శిలాజాల వలన ఇక్కడ వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే జీవులు నివశించేవని తెలుస్తోంది. నర్మదా నాగరికత ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కినది.
అమర్ కంటక్ పర్వతాలలో నర్మద పుట్టిన ప్రదేశంలో జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య స్వయంగా నర్మదా కుండాన్ని నిర్మింపచేశారని చెప్తారు. అసలు నర్మదను పరమేశ్వర పుత్రిక ఆయన స్వేదం నుండి ఉద్భవించినది అని పురాణాలు తెలుపుతున్నాయి. నర్మదా నదిలో లభించే "బాణ లింగాలు" పరమ పవిత్రమైనవిగాను, పూజనీయమైనవిగాను భావిస్తారు.
పురాణగాథ
చంద్ర వంశ రాజైన పురూరవుడు తెలియక చేసిన పాపం వెంటాడసాగిందట. దాని బారి నుండి ఎలా బయటపడాలి అని పండితులను అర్ధించారట. వారి సలహా మేరకు గంగాధరుని గురించి తపస్సు చేసి సాక్షాత్కారం పొందారట. దివిన ఉన్న నర్మదను భువికి పంపితే పావన ప్రవాహంలో పాపపంకిలమైన దేహాన్ని, మనస్సును శుద్ధి చేసుకొని పుణ్యలోకాలకు వెళ్లే అవకాశాన్ని పొందగలను అని సెలవిచ్చారట పురూరవుడు.
అంగీకరించిన పరమేశ్వరుడు కానీ ప్రవాహ వేగాన్ని నిలువరించేది ఎవరు ? అని ప్రశ్నించారట. అప్పుడు పురూరవుడు తన మిత్రుడైన వింధ్యుని సంప్రదించగా పర్వతరాజు తన కుమారుడైన అమర్ కంటక్ దివి నుంచి భువికి తరలివచ్చే నర్మద వేగాన్ని నిలువరించగలడని హామీ ఇచ్చారట.
ఆ ప్రకారం నేలకు వచ్చిన నర్మద కొన్ని లక్షల ఎకరాల భూమిని సాగుయోగ్యం చేస్తూ, కొన్ని కోట్ల మంది దాహార్తిని తీరుస్తోంది.
నర్మద ప్రవాహమార్గం
భారతదేశంలో చాలా మటుకు నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ మూడు నదులు మాత్రమే తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తాయి. అవి నర్మద, తపతి మరియు మహి నదులు. వీటిల్లో అతి పవిత్రమైనది నర్మద.
నర్మద తన ప్రవాహమార్గంలో తొలి భాగాన్ని పూర్తిగా సాత్పురా శ్రేణులలో మాండ్ల పర్వతాల మీద ప్రవహిస్తుంది. జబల్పూర్ దగ్గర పాలరాతి పర్వతాల మధ్య తన మలి ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
అక్కడ నుండి సాగుతూ నర్మదలోయ నుండి మైదాన ప్రాంతాలకు చేరుకొంటుంది. ఈ గమనంలో సుమారు నలభై రెండు ఉపనదులు నర్మదలో కలుస్తాయి.
మానవ అవసరాల నిమిత్తం ఎన్నో నీటి పారుదల నియంత్రణ నిర్మాణాలు నర్మద మీద నిర్మించడం జరిగింది. ముఖ్యమైనవి మహేశ్వర్ ఆనకట్ట, ఇందిరాసాగర్ ఆనకట్ట మరియు సర్దార్ సరోవర్ ఆనకట్ట.
నర్మదా పరిక్రమ
పరిక్రమ అనగా ప్రదక్షిణ. సహజంగా ప్రదక్షిణ ఆలయాలలో, గోవులకు, దేవతా వృక్షాలకు మరియు అరుణాచలం లాంటి పవిత్ర పర్వతాలకు చేస్తుంటారు. కానీ ఒక నదికి చేయడం అన్నది ఒక్క నర్మద విషయంలోనే వింటాము.
కొన్ని వందల పవిత్ర నదులున్న మన దేశంలో ఒక్క నర్మద గురించి స్కాంద పురాణం ప్రత్యేకంగా "రేవా కాండం" లో సంపూర్ణంగా వివరిస్తుంది. నర్మదకు ఉన్న మరో పేరు "రేవా".
నర్మద ఉత్తర మరియు దక్షిణ తీరాలను కలిపితే రెండు వేల ఆరువందల కిలోమీటర్ల పైచిలుకు మార్గం. నది సముద్రంలో కలిసే బారూచ్ నుండి ప్రారంభించి ఉత్తర తీరంగా ప్రయాణించి నది ఉద్భవించిన అమర్ కంటక్ చేరుకొని తిరిగి దక్షిణ తీరంగా సాగి బారూచ్ చేరుకోవడంతో నర్మదా పరిక్రమ పూర్తి అవుతుంది. ఇదే విధంగా అమర్ కంటక్ నుంచి కూడా ప్రారంభిచవచ్చును. ఎటు నుంచి ప్రదక్షిణ చేసినా కుడి వైపున నది ఉండేలా చూసుకోవాలి. నర్మద పూర్తి పరిక్రమ చెయ్యడానికి మూడు సంవత్సరాల, మూడు నెలల పదమూడు రోజులు పడుతుంది. ఈ ఈ పరిక్రమను "ముండమల్ పరిక్రమ" అని పిలుస్తారు. పూర్తి నర్మద పరిక్రమ నదీమతల్లికి వేసే పూలహారంలాంటిది. సహజంగా చాతుర్మాసంలో పరిక్రమ చేసే సాధుసంతులు ఒక చోట ఉండిపోతారు.
ఈ పరిక్రమ సరదాకోసమో లేక సాహసయాత్ర గా భావించి చేయరు. నర్మద పరమ పవిత్రమైనది. ప్రత్యక్ష దేవత నర్మద. నది నీరు పరిక్రమవాసి శరీరాన్ని మరియు మనస్సును శుభ్రం చేస్తుంది. ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తుంది. అహాన్ని తొలగిస్తుంది. నిరాపేక్ష జీవితం జీవించేలా చేస్తుంది. ఎందుకంటే పరిక్రమవాసులు ధనాన్ని తీసుకొని వెళ్ళరాదు. అదే విధంగా ఈ రోజు నిత్యజీవన అవసరాలైన మొబైల్ ఫోన్స్ లాంటివి ఉపయోగించకూడదు. ఎక్కడ ఎవరు బిక్ష ఇస్తే దానిని స్వీకరించాలి. లభించక పోతే నిరాహారంగా ఉండాలి. ప్రతి నిత్యం నర్మద లో రెండు పూటలా సంధ్యా సమయంలో స్నానమాచరించి నదికి పూజచేయాలి. ఒకవేళ మార్గంలో నదికి దూరంగా వెళ్ళవలసి వస్తే ఒక సీసాలో నీటిని దగ్గర ఉంచుకొని ఆ నీటికి పూజ చేయాలి. పరిక్రమ కాలంలో పరిక్రమవాసి పూర్తిగా సన్యాస లేదా వానప్రస్థ జీవితం గడపాలి.
అమర్ కంటక్ లేదా బారూచ్ దగ్గర కానీ ప్రారంభించాలి. నర్మదా నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ పూజలలో "మాకి కడాయి" అంటే అమ్మవారి పెనం అని అర్ధం. దీనిలో తీపి హల్వా వండి నదికి నివేదన చేసి ప్రసాదాన్ని తానూ తీసుకొని తోటివారికి పెట్టాలి.
పరిపూర్ణ విశ్వాసంతో భక్తి భావంతో నర్మద పరిక్రమ చేసినవారు నిత్య జీవితంలో మరియు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుత విజయాలను సొంతం చేసుకొన్నారు అని తెలుస్తోంది.
గతంలో పూర్తి నర్మదా పరిక్రమ మాత్రమే చేసేవారు. ప్రస్తుతం వివిధ కారణాల వలన నర్మదా ఉత్తర వాహిని పరిక్రమ, నర్మదా పంచక్రోశి పరిక్రమ కూడా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా రెండు రకాల పరాక్రమ నిర్వహిస్తున్నారు. ఒకటి జబల్పూర్ నుండి ప్రారంభం అవుతుంది. ఈ పరిక్రమ ముందుగా అమర్ కంటక్ వెళ్లి అక్కడి ఆలయాలను సందర్శించుకొని ఉజ్జయిని మీదగా ఓంకారేశ్వర మరియు మహేశ్వర్ సందర్శించుకొని తిరిగి జబల్పూర్. రెండవది ఇండోర్ లేదా భోపాల్ నుండి పార్రంభం అవుతుంది. ఈ పరిక్రమలో ఓంకారేశ్వర్ , మహేశ్వర్, ఉజ్జయిని మీదుగా అమర్ కంటక్ చేరి తిరిగి ఓంకారేశ్వర్ వరకు వెళ్లి ముగిస్తారు. ఈ పరిక్రమ చెయ్యడానికి పదిహేను రోజులు పడుతుంది. పంచక్రోశి యాత్ర సుమారు అయిదు రోజులలో పూర్తి అవుతుంది. ఇంకా కొన్ని రకాల పరిక్రమల గురించి కూడా పెద్దలు తెలుపుతున్నారు.
ఆ విషయాలు తెలుసుకొందాము.
నర్మదా పరిక్రమ మార్గంలో అడవులు,గుట్టలు,కొండలు,పల్లెలు, సరస్సులు, ఆలయాలు ఇలా ఎన్నోవస్తాయి. మార్గంలో ఎందరో సాధుసంతులను కలిసే అవకాశం కూడా లభిస్తుంది.
జలహారి పరిక్రమలో పరిక్రమవాసి ఎట్టి పరిస్థితులలో నదిని దాటరు. ఒక తీరంలోనే రెండుసార్లు నడుస్తారు. అంటే మాములుగా నడిచే దూరానికి రెండింతలు.
దండావత్ పరిక్రమ మనము అడుగు దండాలు అని అంటూ ఉంటాము కదా ! అలాంటిదే ఈ పరిక్రమ. దీనిలో రోజుకు వెయ్యి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. దీనిని ఎక్కువగా సాధువులు చేస్తుంటారు. పూర్తి చేయడానికి నిర్ణయించిన కాలం కన్నా ఎక్కువపడుతుంది.
మార్కండేయ పరిక్రమ అని మరొక పరిక్రమ కూడా సాధుసంతులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ పరిక్రమలో నర్మద ఉపనదుల చుట్టూ కూడా చేస్తారు. ఈ పరిక్రమ కూడా ఎక్కువకాలం తీసుకొంటుంది.
పర్యాటకులు ఎక్కువగా చేసే వాటిలో హనుమాన్ పరిక్రమ అనగా నడిచినంత దూరం నడిచి ఎక్కడ కావాలంటే అక్కడ నదిని దాటి ముగించడం. కొన్ని సంవత్సరాల క్రిందట నర్మదా వాయు పరిక్రమ మరియు జల పరిక్రమ గురించి కొందరు ప్రయోగాలు చేశారు. రానున్న కాలంలో అవి కూడా రావచ్చేమో !
ఆలయాలు
పరిక్రమ మార్గంలో అనేక పుణ్యక్షేత్రాలు వస్తాయి. సుమారు నాలుగు వందల పైచిలుకు శివాలయాలే ఉన్నాయి అంటే మిగిలిన దేవీ దేవతల ఆలయాలు ఉంటాయో ! వీటిలో ముఖ్యమైన ఆలయాల వివరాలు కూడా తెలుసుకొందాము.
అమర్ కంటక్
అమర్ కంటక్. తీర్ధ రాజ్ గా ప్రసిద్ధి. నర్మద పుడమిని తాకిన పవిత్ర ప్రదేశం. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం. సమీప "పండ్ర" వరకు రైలు మరియు బస్సు సౌకర్యాలు లభిస్తాయి. వసతి సౌకర్యాలు కూడా ! అమర్ కంటక్ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. వాటిల్లో పురాతనమైనవి కాల్చురీ రాజవంశం వారు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన నర్మదా ఉద్గమన మందిరం, శ్రీ నర్మదేశ్వర్ ఆలయం, త్రిమూర్తి ఆలయం, మహామేరు శ్రీ చక్ర (యంత్ర)మందిరం,జోషిల మందిర్, పంచ మఠ్ (అయిదు ఆలయాల సమాహారం), శ్రీ మచేంద్రనాథ్ ఆలయం, శ్రీ కేశవ్ నారాయణ ఆలయం వీటిల్లో కొన్ని.
మరో విశేష శివ మందిరం శ్రీ పాతాళేశ్వర స్వామి వారిది.
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు నర్మదా కుండ్ నిర్మించిన తరువాత క్రింద ఒక శివ లింగాన్ని ప్రతిష్టించారట. కాల్చురీ రాజులు పదకొండవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. చక్కని ఆలయంగా ప్రసిద్ధి. వీటిల్లో చాలామటుకు నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.
ఓంకారేశ్వర్
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ప్రసిద్ధ పుణ్యతీర్థ క్షేత్రం.
నది మధ్యలో ఓం ఆకారంలో ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం నర్మద దక్షిణ తీరంలో ఉన్న శ్రీ మామలేశ్వర్ స్వామి ఆలయం ఉంటాయి.
కొందరు పూర్తి పరిక్రమ ఇక్కడ నుండి ప్రారంభిస్తారు. మిగిలిన చిన్న చిన్న, అర్ధ, పంచ క్రోశి చేసే చాలా మంది కూడా ఇక్కడి నుండి ప్రారంభం చేస్తారు. వీటిల్లో సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి (అవంతిక) ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన ఉజ్జయిని కూడా వెళతారు. శ్రీ మహాకాళేశ్వర్ కొలువైన ఈ క్షేత్రంలో స్వామికి సమర్పించే భస్మ హారతి మహా ప్రసిద్ధి.
ఇలా మార్గంలో వచ్చే జబల్పూర్ లాంటి ప్రదేశాలలో కూడా విశేష ఆలయాలు ఉన్నాయి.
పరిక్రమవాసులకు స్థానికులు అమిత గౌరవం ఇస్తారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మర్యాద పూర్వక ఆహ్వానం పలుకుతారు.
పుష్కర విధులు మరియు దానధర్మాలు
హిందువులు పుష్కరాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. పుష్కర సమయంలో సమస్త దేవతలు నదిలో ఉంటారు అన్న విశ్వాసంతో పుష్కర స్నానం చేయడం పవిత్రమైనదిగా తలుస్తారు. పుష్కర స్నానం చేయడం వలన ఒకేసారి పన్నెండు పుణ్య నదులలో చేసిన ఫలితం లభిస్తుంది అని స్కాంద పురాణం తెలుపుతోంది.
బ్రాహ్మణులకు అనేక దానాలు సమర్పించుకొంటారు. స్వర్ణం, రజతం, దానం, ధాన్యం, గోవులు ఇలా ఎన్నో రకాల దానాలు నదీతీరంలో చేస్తారు.
గతించిన తమ పెద్దలకు, ఆత్మీయులకు పిండ ప్రధానం చేయడం పుష్కర సమయంలో విధాయకంగా భావిస్తారు.
సుమంగళిగా ఉండాలి అని అనేక మంది పుణ్యస్త్రీలు నదికి వాయినాలు కూడా సమర్పించుకొంటారు.
పుష్కర స్నానం ఏమిటి ?
నీరు నారాయణ స్వరూపం . పుణ్యనదులలో చేసే స్నానం జన్మజన్మల పాపాన్ని ప్రక్షాళన చేస్తుంది అన్నది పురాణ వాక్యం.
నీరు మహా శక్తివంతమైనది. ఆ శక్తులు "మేధ్యం మరియు మార్జనం" అని వేదం తెలుపుతోంది.
నదిలో స్నానం చేసి మూడు మునకలు వేయడం వలన తెలిసీ తెలియక చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి అన్నది "మేధ్యం".ద్రవ్య శుద్ధికి నీటిని సంప్రోక్షణ చేయడాన్ని"మార్జనం" అంటారు.
అడవులు గుండా ప్రవహించే జీవనది అనేక ఔషధీయ గుణాలు కలిగి ఉంటుంది. నదీస్నానం వలన అనేక శరీర రుగ్మతలు తొలగిపోతాయని చెబుతారు.
పుష్కర నదీ జలాన్ని స్వీకరించడం, పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణం తెలుపుతోంది.
కానీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందించే నదిని కలుషితం చేయకుండా ఉండటం అన్నింటికన్నా గొప్ప విషయం. పుష్కరాల సమయంలో నదీతీరాలలో వదిలిపెట్టే పూజా ద్రవ్యాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, విడిచిపెట్టే బట్టలు తీరాన్ని నదిని ఎంత కలుషితం చేస్తాయో ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొని వాటిని తగ్గించే విధంగా నడుచుకొంటే నదులు, పరిసరాలు మరియు మనం అందరం కాలుష్యరహిత పుష్కరం చేసుకొన్నవారము అవుతాము. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని, పరిసరాలను అందించేవారం అవుతాము.
నర్మదా పుష్కరాలు మే నెల ఒకటవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు.
పుష్కరస్నానాలకు అనువైన ప్రదేశాలు మహేశ్వరం, ఓంకారేశ్వర్ , అమర్ కంటక్, నెంవార్ శ్రీ సిద్దేశ్వర మహాదేవ్ మందిర్, శ్రీ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, భోజపూర్. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.