జాంబవంతుడు ప్రతిష్టించిన జగదభిరాముడు
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే !
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !!
శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర మూర్తి ఆలయం, కనీసం ఒక రామనామ సంకీర్తనా మందిరం లేని ఊరు భారతదేశంలో కనపడదు.
అవతార మూర్తి, సకల గుణధాముడు అయిన శ్రీ రామచంద్రుని పవిత్ర నామాన్ని నిర్మల హృదయంతో, నిశ్చల భక్తితో ఒక్కసారి జపిస్తే వెయ్యి సార్లు జపించిన ఫలితం లభిస్తుంది అన్నది శాస్త్ర వాక్యం. అంతటి మహిమాన్వితుడైన మనోభిరాముని కోవెలలో ఉంచి కొలిస్తే మరెంతటి శుభ ఫలితాలను మనం పొందగలం ?
మనందరికీ శ్రీ రాముడు ఒక ఆదర్శప్రాయుడైన తనయుడు, సోదరుడు, భర్త, పాలకుడు, వీరుడు మరియు దుష్టశిక్షకుడు, ధర్మరక్షకుడు.
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య తో సహా ఎన్నో విశేష ఆలయాలు భారత దేశ నలుమూలలా నెలకొని ఉన్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు తెలుగు వారి అయోధ్య భద్రాచలం.
తరువాత ఆనవాయితీగా నిర్వహించే శ్రీ రామ నవమి, స్వామి వారి కళ్యాణానికి తగిన క్షేత్ర అన్వేషణ జరిగింది.
ఆ సమయంలో అందరి దృష్టినీ ఆకర్షించిన క్షేత్రం "ఏకశిలా నగరం".
"ఒంటిమిట్ట"గా నేడు పిలవబడుతున్న ఈ క్షేత్రం ఎంతో విశిష్ట పౌరాణిక ప్రాశస్త్యం మరియు విశేష చరిత్ర కలిగినది.
పినతల్లి కైకేయి కోరిన కోర్కె మేరకు తండ్రి వాగ్దానం భంగం కాకూడదని సీతా లక్ష్మణ సమేతులై దశరధ రాముడు అడవులకు సాగారు. అనేక ప్రాంతాలను తిరుగుతూ నేడు ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకొని కొంతకాలం ఇక్కడ నివసించారని తెలుస్తోంది.
జాంబవంతుడు ప్రతిష్టించిన జగదభి రాముడు
నేటి ఒంటిమిట్ట గతంలో ఏక శిలానగరంగా పిలవబడేది. ఆ పేరు రావడానికి కారణం జాంబవంతుడు.
వైకుంఠ వాసుడు లోకసంరక్షణార్ధం అనేకానేక అవతారాలను ధరించారు. ప్రధానమైన దశావతారాలలో ఒకటి శ్రీరామావతారం. శ్రీ రాముడు వనవాసం చేయడానికి అడవులకు చేరిన తరువాత సీతా దేవిని రావణుడు అపహరించుకొని పోతాడు. సీతాన్వేషణలో రామలక్ష్మణులు హనుమంతుని ద్వారా సుగ్రీవుని కలుస్తారు.
సుగ్రీవుని అనుంగు సహచరులలో ఒకడు జాంబవంతుడు. కోదండరామునితో సన్నిహితంగా మెలఁగిన వాడు. రామరావణ యుద్ధంలో పాల్గొన్నాడు.
శ్రీ రాముడు అవతారసమాప్తి చేసారు. త్రేతాయుగం ముగిసింది.
ద్వాపర యుగంలో శ్రీహరి శ్రీ కృష్ణునిగా అవతరించారు. శమంతకమణి అన్వేషణలో జాంబవంతుని యుద్ధంలో ఓడించారు మురళీధరుడు. శ్రీరాముడే శ్రీ కృష్ణుడు అన్న సత్యాన్ని గ్రహించిన భల్లూక రాజు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేశారు.
పరమాత్మకే మామను అయ్యాను, రెండు అవతార రూపాలకు సన్నిహితంగా ఉన్నాను అన్న ఆనందంతో లోకానికి శ్రీ రామచంద్రుని గొప్పదనాన్ని చాటి చెప్పాలి అన్న ఆశయంతో భూలోకమంతా తిరిగారట జాంబవంతుడు.
ఆ సమయంలో ఈ ప్రదేశం బ్రహ్మ కడిగిన పాదాలు నడయాడిన స్థలంగా గుర్తించారట. భావితరాలకు ఈ విషయం తెలియాలన్న ఆలోచనతో ఏకశిల మీద సీత లక్ష్మణ సామెత శ్రీ రామచంద్రుని మూర్తి చెక్కించి ప్రతిష్టించారట. క్రమంగా అక్కడ ఒక నగరం వెలిసింది.
కాలగతిలో అనేక కారణాలతో నగరం శిధిలమై ప్రాంతమంతా దట్టమైన అడవిగా మారిందట. జాంబవంతుడు కట్టించిన శ్రీ కోదండరాముని ఆలయం కూడా నేలలో కలిసిపోయింది.
జాంబవంతుడు ఏకశిలతో విగ్రహాన్ని చెక్కించినందున ఏకశిలా నగరం అన్న పేరొచ్చినది.
చారిత్రక విశేషాలు
విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కరాయల కుమారుడు కంపన రాయలు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చారట. అప్పుడు ఆయనకు స్థానికు, సోదరులైన ఒంటోడు, మిట్టోడు అనేవారు సహాయం చేశారట. సంతసించిన రాజకుమారుడు వారికి ఆ ప్రాంతం మీద సర్వహక్కులను రాసి ఇచ్చారట.
నాటి నుండి వారి పేర్ల మీద ఒంటిమిట్ట అన్న పేరొచ్చినట్లుగా తెలుస్తోంది.
పేరుకు కోదండ రాముడు కానీ స్థానికులకు ఆయన అనుగ్రహ రాముడు. అవతారసమయంలో ఇక్కడ ఉన్నప్పుడు రాక్షసుల నుండి, క్రూర మృగాలా నుండి ప్రజలను కాపాడినందున ఆలా ప్రేమగాపిలుచుకొంటారు. నేటికీ ఆలయంలో కోరుకొన్న కోరిక నెరవేరుతుంది కాబట్టి అనుగ్రహ రాముడే అంటారు స్థానికులు.
ఆలయ సమీపంలో రామతీర్థం, లక్ష్మణ తీర్థం అన్న పేర్లతో రేండు చెరువులు కనపడతాయి.
నాడు ప్రాంత వాసుల నీటి కష్టాలను తొలగించడానికి తమ శ్రాలతో దశరధ నందనులు పాతాళ గంగను వెలికి తెప్పించారట
ఆలయ విశేషాలు
చోళ , విజయనగర పాలకులు సంయుక్తంగా అభివృద్ధి పరచిన ఆలయం ఒక శిల్ప ఖజానా గా పేర్కొనవచ్చును. ఎర్ర ఇసుక రాతి మీద శిల్పులు అద్భుతమైన శిల్పాలను మలచారు. రాజగోపురం, మిగిలిన రెండు గోపురాల పైన, మండప స్తంభాల మీద,పై కప్పు కు ఇలా కొంచెం కూడా వదలకుండా రామాయణ, భాగవత ఘట్టాలు, శ్రీ కృష్ణ లీలలు, తాండవ గణపతి, దశావతారాలు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ రామానుజాచార్యుల విగ్రహాలను, లతలు, పుష్పనాలు,రకరకాల పురాణ కాలం నాటి జంతువులను జీవం ఉట్టిపడేలా చెక్కిన శిల్పుల ప్రతిభాపాటవాలను ఎంత పొగిడినా తక్కువే !
ప్రతి శిల్పం తనదైన సోయగాలతో వీక్షకులనుఅబ్బురపరుస్తాయి.
దూరానికి కోటలాగా కనపడే ఆలయానికి తూర్పు, దక్షిణం మరియు ఉత్తరాలలో గోపురాలు ఉంటాయి. దక్షిణ ద్వారం నుండి ఆలయ వాయువ్యం వరకు విశాలమైన మండపాన్ని నిర్మించారు. బహుశా ఈ మార్గం గుండా ప్రయాణించేవారు, యాత్రీకులు విశ్రాంతి తీసుకోవడానికి కాబోలు !
తూర్పున ఉన్న రాజగోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్థంభం, బలిపీఠాలు కనిపిస్తాయి. గరుడాళ్వార్ సన్నిధి దాటి ఊయల మండపం గుండా శిల్పాలను చూస్తూ గర్భాలయం వైపుకి వెళితే ఏకశిల మీద సీతా లక్ష్మణ సమేతులై శ్రీ కోదండరామస్వామి నేత్రపర్వమైన అలంకరణలో దర్శనం ప్రసాదిస్తారు.
సంజీవ రాయడు
సహజంగా రామాలయాలలో స్వామి పాదాల వద్ద సద సేవకు సిద్ధం అంటూ కనిపించే అంజనాసుతుడు ఇక్కడ కనిపించడు. కారణం శ్రీరాముడు ఇక్కడకు వచ్చిన సమయంలో హనుమంతుని పరిచయం కాలేదు.
అలా అని స్వామికి సముచిత స్థానం లేదని కాదు. ఆలయానికి వెలుపల ప్రత్యేక సన్నిధిలో శ్రీ సంజీవ రాయడు అన్న పేరుతొ వాయునందనుడు దర్శనమిస్తారు. ఆంజనేయుని తల రామ పాదాలకు సమంగా ఉంటుంది. రాతిని నాతిగా మార్చిన శ్రీ రామ పాదాలను చూస్తుంటారు అంటారు. అలానే అనిపిస్తుంది ఆలయ నిర్మాణం చూస్తే !
చంద్రుని కోరిక
ప్రతి నిత్య నిర్ణయించిన పూజలు జరిగే ఈ ఆలయంలో దశావతారాల జన్మదినాల సందర్బంగా, ఏకాదశి, హనుమజ్జయంతి, ధనుర్మాస పూజలు ఘనంగా చేస్తారు.
రామాలయాలలో ముఖ్యమైనది శ్రీ రామ నవమి. అన్ని ఆలయాలలో నవమి నాడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది.
కానీ ఇక్కడ మాత్రం అష్టమినాడు మొదలయ్యే నవమి ఉత్సవాలు పౌర్ణమినాడు జరిగే కల్యాణంతో ముగుస్తాయి. అన్నిచోట్లా నవమినాడు జరిగే కళ్యాణం ఇక్కడ పౌర్ణమి నాడు నిర్వహించడానికి కారణం ఏమిటి ?
తగిన కారణమే ఉన్నది.
లక్ష్మీ నారాయణుల కళ్యాణం, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా పగటి పూట జరుగుతాయి.
క్షీరసముద్రారాజ తనయ అయిన శ్రీ మహాలక్ష్మి సోదరుడు చంద్రుడు అక్కతో నేను మీ కల్యాణాన్ని పగలు జరగడం వలన చూడలేకపోతున్నాను. మీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని వాపోయాడట.
దానికి ఆమె నీకోరిక కలియుగంలో ఏకశిలా నగరంలో నెరవేరుతుంది అని వరం ఇచ్చారట.
ఈ కారణంగా ఇక్కడ వెన్నెల వెలుగుల్లో రంగరంగ వైభవంగా జగదభిరాముని కళ్యాణం భూజాతతో జరుగుతుంది.
ప్రస్తుతం మన రాష్ట్ర ప్రధాన ఆలయం కావడాన ప్రభుత్వ లాంఛనాలు కూడా వస్తున్నాయి. వేలాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా కల్యాణ మహోత్సవాన్ని దర్శించడానికి చక్కని ఏర్పాట్లు చేశారు.
ఈ దివ్య ధామం కడప పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కడప నుండి తిరుపతి వెళ్లే ప్రధాన రహదారి మీద ఉండటం వలన చక్కని రవాణా సౌకర్యం లభిస్తుంది. కడపలో వసతి, భోజన సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.