27, మార్చి 2022, ఆదివారం

Tirukoli (Urayur) Divya Desam

   శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్ సన్నిధి, ఉరయూర్   


శ్రీ  రంగనాథ స్వామి కొలువు తీరిన శ్రీ రంగ క్షేత్రం శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో అగ్రస్థానంలో ఉన్నది. దాని తరువాత వరుసలో ఉన్న అయిదు దివ్య దేశాలు అన్నీ కూడా తిరుచునాపల్లి (తిరుచ్చి) చుట్టుపక్కల ఉండటం విశేషం. 
తిరుకోళి(ఉరయూర్ ), తిరుకరంబనూర్ (ఉత్తమార్ కోయిల్), తిరువెళ్ళరాయి, తిరుప్పర నగర్( కొయిలాడి). ఈ అయిదు దివ్య క్షేత్రాలు సుమారు శ్రీ రంగం లేదా తిరుచునాపల్లికి ఇరవై అయిదు కిలోమీటర్ల లోపల  దూరంలో ఉండి తమవైన ప్రత్యేకతలను కలిగి ఉండటం విశేషం. 
రెండవ స్థానంలో ఉన్న "తిరుకోళి" తిరుచునాపల్లి నగరంలోనే ఉన్నది. గతంలో చోళ రాజుల రాజధానిగా " తిరుకోళి లేక నిచ్చలా పూరి" పిలవబడిన ఈ ప్రాంతం ప్రస్తుతం "ఉరయూర్" గా పిలవబడుతోంది. 
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుండి చరిత్ర పుస్తకాలలో చోటు చేసుకొన్న ఉరయూర్ అంటే "నివాస గృహం" అని అర్ధం. కావేరి నదికి దక్షిణ తీరంలో ఉన్న ఉరయూర్ ఒకటో శతాబ్దంలో తొలి నాటి చోళుల రాజధానిగా ఉండినది. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని శాసనాలలో ఉరయూర్ ప్రస్తాపన ఉండటం దీనిని బలపరుస్తుంది. తిరిగి తొమ్మిదో శతాబ్దంలో తిరిగి ఉరయూర్ ని తమ రాజధానిగా ఎంచుకొన్నారు. 
ఉరయూర్ శివ కేశవ క్షేత్రం. శ్రీ మానవళ్ పెరుమాళ్ ఆలయానికి సమీపంలోనే శ్రీ పంచావర్ణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం నయనారులు తమ ఆరాధ్య దైవం అయిన కైలాస వాసుని కీర్తిస్తూ పాటికాలు గానం చేసిన పవిత్ర క్షేత్రాలైన రెండువందల డెబ్బై అయిదు పెడాల్ పెట్ర స్థలాలలో ఒకటి. గతంలో ఉరయూర్ వేదాధ్యయనానికి ప్రసిదికెక్కిన అగ్రహారం. 
ఉరయూర్ లో శ్రీ మానవళ్ పెరుమాళ్ కొలువు తీరడానికి సంబంధించిన గాధ శ్రీ రంగంలోనే లోకనాధుడు శ్రీ రంగనాధుడు స్థిరంగా కొలువై ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఉన్నది. 
శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ఇలలో కళ్యాణం జరిగిన ప్రదేశంగా ఉరయూర్ ప్రసిద్ధి. 

స్థల పురాణం  

చోళ రాజ్య స్థాపకుడైన ధర్మవర్మ చోళుడు ఒకనాడు కావేరి నాదీ తీరంలోని "కారారణ్యము"  లో వేట నిమిత్తం వచ్చారట. అప్పట్లో ఆ ప్రాంతం ఒక ముని వాటిక. ఎందరో తాపసులు, మునులు, వేదాధ్యయనం చేసే పండితులు అక్కడ నివాసముండేవారట. 
పవిత్ర నదీ తీరంలో ప్రశాంతతకు మారు పేరుగా, మనస్సుకు శాంతిని చేకూర్చే పరిసరాలు రాజు ను మైమరపించి వేట నుండి దృష్టిని మరల్చాయట. 
మహర్షులను భక్తితో సేవించి వారి యోగక్షేమాలను విచారించారట మహారాజు. వారు తమకు దాపుల ఉన్న కొండలలో నివాసముంటున్న దుండగుల నుండి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపారట. 
దుండగుల బారి నుండి పూజ్యులను, అమాయక ప్రజలను కాపాడటం రాజధర్మం కనుక చోళుడు సైన్యంతో వెళ్లి దుండగులను నిర్మూలించారట. మహర్షులు సంతసించి రాజును ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకోమన్నారట. అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం రాజా దంపతులకు ఉన్న ఏకైక చింత. అదే రాజు మునులకు విన్నవించుకొన్నారట. 
వారు దివ్యదృష్టితో రాజుకు సంతాన యోగం ఉన్నదని, దానికి లక్ష్మీ తంత్ర యాగం చేస్తే  ఒక కుమారుడు జన్మిస్తారని, ఒక కుమార్తె లభిస్తుందని  తెలిపారట. 
చోళుడు కుంభకోణంలో ఉన్న రాణి ని మిగిలిన పరివారాన్నీ అక్కడికి రప్పించారట. 
అలా రాజు రాణి , పరివారం అంతా అక్కడ ఉండటంతో కొద్ది కాలంలోనే  చిన్న నగరం ఏర్పాటైనదిట. దానిని రాణి గారి పేరు మీద "నిచ్చలా పురి" అని పిలవసాగారట.  
యాగ ఫలితంగా మహారాణికి మగ బిడ్డ జన్మించారట.చంద్ర తిలకన్ అని పిలవసాగారట. అంతకన్నా ముందు రాజు గారు మరోసారి వేట కోసం అడవి లోనికి వెళ్లారట. ఓకే సరస్సులో కలువ పూల మీద ఒక బాలిక కనిపించిందట. ఆమెను రాజభవనానికి తీసుకొని వచ్చి కమలవల్లి లేదా వాస లక్ష్మి అని పిలవసాగారట.  పండితులు అమ్మాయి జాతకం చూసి ఆమె మహాలక్ష్మీ అంశతో జన్మించినది అని సాక్షాత్ శ్రీ రంగనాధుడే ఆమెకు భర్త అవుతారని తెలిపారట.
చిన్ననాటి నుండి శ్రీ మహావిష్ణు గాధలు వింటూ పెరిగిన రాజకుమార్తె ఆయననే వివాహం చేసుకోవాలని సంకల్పించుకొన్నదట.  
కుమార్తె యుక్తవయస్సుకు చేరుకోవడంతో మహారాజు స్వయంవరం ప్రకటించదలచారట. నాటి రాత్రి ఆయనకు స్వప్నంలో శ్రీ రంగనాధుడు దర్శనమిచ్చి "నీ కుమార్తెను నేను స్వయంవరంలో చేపడతాను" అని తెలిపారట. ఆయన సంతోషంతో కుమార్తెకు ఆ విషయం తెలిపారట. 
రాజకుమార్తె అందచందాలు, గుణగణాలను విన్న ఎందరో రాజులు తరలి వచ్చారట. శ్రీమన్నారాయణుని రూప విశేషాలను మనస్సులో నిలుపుకొన్న బాలిక మారు వేషంలో ఉన్న స్వామిని గుర్తించి వరమాల వేసిందట. 
అప్పుడు తన నిజరూపంలో స్వామి ఆ సభామండపంలో సాక్షాత్కరించారట. ఆయన రూపాన్ని చూసిన అందరూ "అళగియ మానవళ్ పెరుమాళ్" (అందమైన మానవ రూపంలో ఉన్న పెరుమాళ్) అని కీర్తించారట. 
చోళుడు తన అదృష్టానికి పరవశించి  అల్లుని అక్కడే ఉండమని అర్ధించారట. ఆయన కోరిక మన్నించిన పెరుమాళ్ సతీ సమేతంగా ఉరయూర్ లో స్థిర నివాసం ఏర్పరుచుకొన్నారట. 
స్వామి ఇల్లరికం వచ్చినందున ఇక్కడ తొలి  ప్రాధాన్యత అమ్మవారికే !
ఊరేగింపులలో మొదట అమ్మవారి పల్లకీ వెళితే, దాని వెనుక స్వామివారిది అనుసరిస్తుంది. 

ఆలయ విశేషాలు 

విశాల ప్రాంగణంలో ఉత్తర ముఖంగా ఆలయం ఉంటుంది. ఒకరకంగా దక్షిణ ముఖంగా ఉండే శ్రీ రంగ నాధ స్వామి పెరియ కోవెలకు ఎదురుగా అన్నమాట. 
రెండు ప్రాకారాలతో ఉండే ఆలయానికి తొలి ప్రాకారానికి రాజగోపురం ఉంటుంది. 
ఉపాలయాలలో శ్రీ ఆంజనేయ, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ ఆండాళ్ కొలువుతీరి ఉంటారు.

తిరుప్పాన్ ఆళ్వార్ 

 ఆ రోజులలో ఆలయ ప్రవేశ అర్హత లేని కుటుంబంలోజన్మించారు. చిన్నతనం నుండి విష్ణు భక్తి కలిగి ఉండేవారు. మెడలో వీణ ధరించి తన ఇష్ట దైవాన్ని కీర్తిస్తూ పాటలు పాడుతూ తిరుగుతుండేవారు. ఆలయ ప్రవేశం  లేదు కనుక ప్రతి రోజు తెల్లవారు జామున  కావేరి ఒడ్డున నిలబడి ఆలయం వైపుకి తిరిగి కీర్తనలు గానం చేస్తుండేవారు. 
ఒకరోజు కీర్తన పావశ్యంలో మునిగి శ్రీ రంగనాథుని సేవ కోసం నది నీరు తీసుకొని పోవటానికి వచ్చిన ఆలయ ప్రధాన అర్చకులైన సారంగ మునిని గమనించలేదు. ఆయన అంటరానివాడివి అడ్డు తొలుగు అంటూ ఒక రాయిని ఆళ్వార్ మీదకు విసిరారట. రాతి దెబ్బకు అతని నుదిటి నుండి రక్తం రావడంతో ఇహం లోనికి వచ్చి క్షమించమని కోరి అడ్డు తొలిగారు. 
ఆలయానికి వెళ్లిన సారంగ ముని స్వామి నుదిటి నుండి రక్తం కారడం చూసి భయకంపితుడయ్యారు. అది కూడా తాను నది ఒడ్డున రాయితో నిలబడిన వ్యక్తిని ఎక్కడైతే కొట్టాడో అక్కడ నుండి కారడంతో మరింత మధనపడ్డారు. నాటి రాత్రి కలలో రంగనాధుడు కనపడి "నది ఒడ్డున ఉన్న వ్యక్తి నా నిజ భక్తుడు వానిని నీ భుజాల మీద కూర్చోపెట్టుకొని నా సమక్షానికి తీసుకొని రావాల్సినది" అని ఆదేశించారట. 
మరుసటి రోజు ఉదయాన్నే నదీ తీరానికి వెళ్లిన సారంగ ముని అక్కడ గానం చేస్తున్న తిరుప్పాన్ కు స్వామి ఆదేశం తెలిపి ఆలయానికి రమ్మని కోరారు. కానీ అతను నమ్మలేదు. దానితో అతనిని బలవంతంగా తాన్ భుజాల మీద ఉంచుకొని ఆలయానికి చేరుకొన్నారు ముని. 
నాటి నుండి మొదలైనదే "ముని వాహన సేవ". 
ఇంతకాలం ఊహలలో చూసుకొన్న దివ్యమంగళ రూపం కనుల ముందు కనపడటంతో పరవశించి పోయారు తిరుప్పాన్. బ్రహ్మ కడిగిన పాదాల నుండి శిరస్సు వరకు తదేకంగా చూస్తూ ఆశువుగా పది పాశురాలను గానం చేసి స్వామిలో లీనం అయిపోయారు తిరుప్పాన్ ఆళ్వార్.
తిరుప్పాన్ ఆళ్వార్ జన్మస్థలం ఉరయూర్.
ఆలయంలో ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు శ్రీ తిరుప్పాన్ ఆళ్వార్. 
ఆలయ స్తంభాల పైన శ్రీహరి అవతారాలను, శ్రీ ఆంజనేయుని రూపాలను సుందరంగా మలిచారు. గోడల పైన సహజ వర్ణాలతో చూడచక్కని శ్రీమన్నారాయణుని చిత్రాలను చిత్రించారు. 
గర్భాలయంలో శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్ స్థానక రూపంలో ప్రయోగ చక్ర భంగిమలో చక్కని పుష్ప అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ కమల వల్లి నాంచారి పక్కనే ఉపస్థిత భంగిమలో కనిపిస్తారు. ప్రధాన అర్చనామూర్తులను ఒకే సన్నిధిలో దర్శించుకో గలగడం చాలా అరుదు. 
ప్రస్తుత ఆలయం తొమ్మిదో శతాబ్దంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. తరువాత పాండ్యులు, విజయనగర రాజులు, నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కైకార్యాలను సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. 
శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్ ఆలయంలో ప్రతి నిత్యం ఒక ప్రత్యేక పూజ జరుగుతుంది. నియమంగా ఆరు పూజలు నిర్వహిస్తారు. ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనాల కొరకు తెరిచి ఉంచ బడుతుంది. అన్ని స్థానిక మరియు హిందూ పర్వదినాలలో విశేష సేవలను జరుపుతారు. వైకుంఠ ఏకాదశి ముఖ్య పర్వదినం. సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 

పాశుర గానం 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో తిరుమంగై ఆళ్వార్ మరియు కులశేఖర ఆళ్వార్ శ్రీ అళగియ మానవళ్ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేశారు. ఆ కారణంగా ఈ ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో సుస్థిర స్థానం పొందినది. 
తిరుచ్చి నగరంలోనే ఉన్న ఈ దివ్య దేశానికి సులభంగా చేరుకోడానికి ఆటోలు, సిటీ బస్సులు లభిస్తాయి. తిరుచ్చిలో, చుట్టుపక్కల  ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి.  
సమీపంలోని శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయ దర్దనం తప్పనిసరి. 

జై శ్రీ మన్నారాయణ !!!!
   


Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...