29, అక్టోబర్ 2021, శుక్రవారం
28, ఆగస్టు 2021, శనివారం
Sri Sundara Kamakshi Amman Temple, Sirukarambur
అరుదైన విశేషాల శ్రీ సుందర కామాక్షి అమ్మన్ ఆలయం
తమిళనాడు రాష్ట్ర పటంలో ఈ గ్రామానిది చాలా చిన్న స్థానం. అనేకానేక పల్లెలలో ఒకటి. కానీ గతంలో ఒక గొప్ప స్థానం పొందిన గ్రామంగా చరిత్రలో సుస్థిర కీర్తి పొందినది సిరుకరంబనూర్. దానికి ముఖ్యకారణం ఇక్కడ ఉన్న శ్రీ సుందర కామాక్షీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వార్ల ఆలయం.
సుమారు పది లేదా పదకొండవ శతాబ్దాల కాలానికి చెందిన ఈ ఆలయం చోళ రాజుల నిర్మితంగా తెలుస్తోంది. నిర్మాణశైలి, లభించిన ఒకటవ రాజరాజ చోళుని శాసనాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. గొప్ప చరిత్ర, ఆకర్షించే శిల్పకళ, అనేక ప్రత్యేకతలు కలిసి ఈ ఆలయాన్ని ఒక విశేష దర్శనీయ స్థలంగా మార్చాయి.
సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు భూమిలో ఉండిపోయినది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1958వ సంవత్సరంలో పెద్ద ఇసుక గుట్ట క్రింద ఉన్న ఈ నిర్మాణాన్ని వెలికి తీశారు. ఇలా ఆలయాన్ని భూమిలో దాచిపెడటానికి గల కారణం ఏమిటంటే ఆ సమయంలో నిరంతరం జరిగిన పరాయి మతస్థుల దండయాత్రలు. వాటి నుండి తమ ఆరాధ్య దైవం కొలువు తీరిన కోవెలను రక్షించాలన్న ఆ తరం వారి ఆకాంక్ష. దాని వలననే మనం ఈ నాడు ఈ అద్భుత నిర్మాణాన్ని దర్శించుకోగలుగుతున్నాము.
వెలికి తీసిన తరువాత జరిపిన కుంభాభిషేకంలో పాల్గొన్న అప్పటి కంచి పీఠాధిపతులు మహాపెరియవ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ ఆలయ చరిత్రను తెలిపారని తెలుస్తోంది.
వెల్లూర్ నుండి చెన్నై వెళ్లే ప్రధాన రహదారి నుండి సుమారు అర కిలోమీటరు దూరం సిరుకరంబనూర్ గ్రామం లోనికి వెళ్లే దారిలో ఉంటుంది ఈ ఆలయం. వెలుపల నుండి చూస్తే అతి సాధారణ గ్రామదేవత సన్నిధి లాగా కనిపిస్తుంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణం లోనికి దక్షిణ పక్క ఉన్న ద్వారం గుండా వెళ్లవచ్చును.
పక్క పక్కనే తూర్పు ముఖంగా ఉన్న రెండు సన్నిధులలో ఒక దానిలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూ లింగ రూపంలో దర్శనమిస్తారు. మరో దానిలో అమ్మవారు శ్రీ కామాక్షీ దేవి కొలువై ఉంటారు.
సహజంగా ఆలయాలలో రావి చెట్టు మరియు వేప చెట్టు రెండు కలిసి ఉండటం చూస్తాము. కానీ ఈ క్షేత్రంలో ఆలయావృక్షం అయిన బిల్వం మూలం నుండి రెండు కాండాలుగా ఉండగా మధ్యలో వేప చెట్టు పెరగడం వలన మూడూ కలిసి త్రిశూలం లాగా కనపడతాయి. ఈ విశేషం ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎడమ పక్కన కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిష్టించిన లింగం వద్ద సంతానం లేని దంపతులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
అలా చేయడం వలన పరమేశ్వర అనుగ్రహంతో వారికి సత్సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
అరుదైన గజపృష్ఠ విమానం కలిగిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణపతి , శ్రీ దక్షిణామూర్తి, శ్రీ విష్ణు, శ్రీ దుర్గ కొలువుతీరి ఉంటారు. ముఖ్యంగా శ్రీ దక్షిణామూర్తి విగ్రహం విశేషంగా ఉంటుంది.
ఉపస్థిత భంగిమలో దర్శనమిచ్చే జ్ఞానబోధకుని జటాజూటాలను పరీక్షగా చూస్తే అక్కడ వరుసలో అరవై మూడు చిన్న చిన్న శివలింగాలు కనపడతాయి. ఇవి ఒకొక్కటి ఒక్కో నయనారుకి ప్రతీకగా చెబుతారు. శివగాయక భక్తులైన అరవైమూడు మంది నయనారులు ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే కదా ! మరే ఆలయంలోనూ ఇలాంటి ప్రత్యేకమైన శ్రీ దక్షిణామూర్తి విగ్రహం కనపడదు.
గర్భాలయంలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి చందన విబూది, కుంకుమ లేపనాలతో, చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు.
శ్రీ సుందర కామాక్షీ అమ్మన్
లోకేశ్వరుడు కొలువైన ఆలయాన్నిశ్రీ సుందర కామాక్షీ అమ్మన్ ఆలయం అని పిలుస్తారు. దానికి తగినట్లే అమ్మవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంటుంది. అరుదైన మరకత రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం వెలుపల, ముఖ మండపం లోపల ఎన్నో అరుదైన అద్భుత చెక్కడాలు కనపడతాయి.
వెలుపలి గోడల మీద కుంభాలు, లతలు, రకరకాల జంతువులు, పక్షులు, కల్పవృక్షము, కామధేనువు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, గంగ, యమున, శ్రీ మహావిష్ణువు, సప్త మాతృకలు, సప్త మహర్షులు ఇలా ఎందరో దేవతామూర్తులు నేత్రపర్వంగా దర్శనమిస్తాయి.
సహజంగా శ్రీ కామాక్షీ దేవి మిగిలిన ఆలయాలలో ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. కానీ ఇక్కడ గర్భాలయంలో అమ్మవారు స్థానక భంగిమలో చిద్విలాసంగా చిరునవ్వుతో చక్కని అలంకరణలో దర్శనమిస్తారు. అత్యంత అరుదైన భంగిమ ఇది. అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రం ప్రతిష్టించబడి ఉంటుంది. దీనిని ఆదిశంకరులు స్థాపించారని చెబుతారు.
గర్భస్థ శిశువు
ఈ ఆలయంలోని శిల్పాల గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది. వాటిల్లో ముఖ్యమైనది నేటి వైద్యులను కూడా అబ్భురపరచే గర్భస్థ శిశువు శిల్పం.
ఆధునిక వైద్య విధానం అందుబాటులోనికి వచ్చిన తరువాత సామాన్యులకు కూడా గర్భంలో శిశువు ఎలా ఉంటుందో తెలిసింది. అప్పటి దాకా వైద్యులు కూడా పూర్తి సమాచారం తెలిసి ఉండేవారు కాదు.
కానీ నేడు చెబుతున్న ఆధునిక వైద్య విధానం అందుబాటులో లేని సమయంలో (సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట)ఒక శిల్పి గర్భస్థ శిశువు ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోగలిగారు ? సమాధానం చెప్ప లేని ప్రశ్న ! కానీ ఆ రోజులలో శిల్పకళలో మానవ శరీర నిర్మాణం మరియు మార్పులు అనే పేరుతొ ఒక అధ్యాయం ఉంది ఉండాలి. ఆ కారణంగానే శిల్పి గర్భస్థ శిశువు శిల్పాన్ని రాతి మీద చెక్కగలిగారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన లేక పోతే మనలను అబ్బురపరుస్తుంది ఈ శిల్పం.
భూమిలో ఉన్న ఆలయాన్ని వెలికితీసే క్రమంలో కొన్ని భాగాలు విడిపోయాయి. వాటిని ప్రాంగణంలో విడిగా ఉంచారు. వాటిల్లో ఉంటాయి నాటి శిల్పుల వైద్య శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలిపే గర్భస్థ శిశువు, తల్లి బిడ్డ శిల్పాలు. ఆ రోజులలో ప్రతి ఒక్కరికి వారికి ఇష్టమైన విద్యాజ్ఞానం తో బాటు మిగిలిన విషయపరిజ్ఞానం నేర్పేవారని కూడా మనం అర్ధం చేసుకొని తీరాలి అని తెలుపుతాయి ఈ రెండు శిల్పాలు.
ఎన్నో అరుదైన శిల్పాలను ప్రదర్శించే శ్రీ సుందర కామాక్షీ అమ్మన్ ఆలయ శిల్పాలకే తలమానికం ఈ రెండు శిల్పాలు అని పేర్కొని తీరాలి.
ఉపాలయాలు
ప్రధమ పూజితుడు శ్రీ గణపతి, శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వీర భద్రుడు ఉపాలయాల్లో కొలువుతీరి ఉంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే వీరందరి వాహనాలు అపసవ్య దిశగా కొలువు తీరి ఉండటం. సహజంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయిన మయూరం స్వామివారి వెనుక ఉండి కుడి పక్కన శిరస్సు కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ నెమలి తల విగ్రహానికి ఎడమ పక్కన ఉంటుంది. అదే విధంగా వినాయక, వీరభద్ర వాహనాలు కూడా !
పూజలు మరియు ఉత్సవాలు
మాస శివరాత్రి, అష్టమి, దశమి, త్రయోదశి ప్రదోష పూజలు, చవితి, షష్టి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి, నవ రాత్రులలో విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుపుతారు.
మార్గం
విశేషమైన శ్రీ సుందర కామాక్షీ అమ్మన్ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివార్ల కొలువైన సిరుకరంబూరు వెల్లూర్ కి 45, చెన్నైకి 95, ఆర్కాట్ కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం చెన్నై ముంబై జాతీయ రహదారి మీద ఉండటంతో అన్ని బస్సులు ఇక్కడ ఆగవు. అందువలన అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరిపాక్కంలో దిగి ఆటోలో వేళ్ళ వచ్చును. సమీపంలో ఉన్న తిరుప్పార్కడల్, కావేరిపాక్కం మరియు తుఱైపెరుంబాక్కం గ్రామాల లోని పురాతన ఆలయాలను చూడాలంటే వెల్లూర్ నుండి అద్దెకారు మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం. రానూపోనూ మొత్తం 120 కిలోమీటర్ల దూరం వస్తుంది.
నమః శివాయ !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Only One Brahma Temple, Chebrolu
శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...
-
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ...
-
శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నది. వయా ఓబులాపురం మీ...
-
శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే...