. శాసనాలు తెలిపే సత్యాలు
= ఇలపావులూరి వెంకటేశ్వర్లు
జౌగడ్ ఒడిషా లోని గంజాం జిల్లాలో చాలా మందికి తెలియని చిన్న పల్లెటూరు. కానీ ఒకప్పుడు కళింగ దేశంలో పేరొందిన పట్టణం.గంజాం జిల్లాలోని అత్యధిక శాతం భూములను సస్యశ్యామలం చేసే రుషికుల్యానది జౌగడ్ కు సమీపంలోని పురణ బంధ వద్ద సాగరం (బంగాళా ఖాతం)తో సంగమిస్తుంది. క్రీస్తుపూర్వం నుండి ఇక్కడి రేవు ద్వారా ఉత్కళ దేశస్థులు అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. అసలు ఉత్కళ అంటేనే ఉత్కృష్టమైన కళలకు నిలయం అని అర్ధం. వీరు రూపాందించిన అనేక వస్తువులకు దేశవిదేశాలలో చక్కని ఆదరణ ఉన్నది.
ఓడ్ర దేశ చరిత్రలో అనేక కారణాల వలన జౌగడ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటికి కళింగ ప్రాంతం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేదిట. ఒక్కో దానికి కొందరు పాలనాధికారులుగా ఉండేవారట. ఆ ప్రాంత ప్రజల మంచి చెడ్డలను ఈ పెద్దల బృందం నిర్వహించేదట. ఈ బృందాల వారు అందరూ పరస్పర సహకారంతో ఉత్కళ ప్రాంతం శాంతి సౌభాగ్యాలతో ఉండేలా చూసుకునేవారట.
కళింగ యుద్ధం
పురాణాలలో మరియు చరిత్రలో మగధ సామ్రాజ్యం గా పేరొందిన నేటి బీహార్ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం మూడో శతాబ్ది నుండి "పాటలీపుత్రా"న్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు మౌర్య వంశరాజులు. ఈ సామ్రాజ్య స్థాపకుడు "చంద్ర గుప్త మౌర్యుడు". ఆయన కాలం నుండి మనుమడు అశోకుని కాలం దాకా దక్షిణ ఆసియాలోని పెక్కు రాజ్యాలు వీరి పాలనలో ఉండేవి.కానీ వీరికి లొంగనిది ఒక్క ఉత్కళ ప్రాంతమే !
అశోకుడు సింహాసనాన్ని అధీష్టించిన తరువాత ఎలాగైనా కళింగ రాజ్యాన్నితన అధీనం లోనికి తెచ్చుకోవాలని పెద్ద సైన్యం తో దండయాత్ర చేసాడు. వీరోచితంగా పోరాడినా చివరికి కళింగులు
ఓడిపోక తప్పలేదు.లభించిన శాసనాల ఆధారంగా ఆ కాలంలోనే లక్ష మందికి పైగా మరణించా రని,అంతే సంఖ్యలో సైనికులు గాయపడ్డారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అశ్వాలు, ఏనుగులు కూడా అధిక మొత్తంలో మరణించాయి అంటారు. విజయం సాధించినా కళ్ళ ముందు జరిగిన ఘోర రక్తపాతాన్నిచూసి చలించిపోయిన అశోకుడు,ధర్మాన్ని,ప్రేమను ప్రోత్సహించి హింసను, రక్తపాతాన్ని వ్యతిరేకించే బౌద్ధ మతాభిలాషిగా మారిపోయాడని అంటారు.
అశోకుని శాసనాలు
కళింగయుద్ధం జరిగింది క్రీస్తుపూర్వం 261వ సంవత్సరంలో అని తెలుస్తోంది. ఈ యుద్దానంతరం మౌర్య చక్రవర్తి తరువాతి నలుబది సంవత్సరాల తన పాలనా కాలంలో మరో యుద్ధం చేయలేదు.తమ రాజ్యంలో బౌద్ధ మత సిద్ధాంతాలను భారీ స్థాయిలో ప్రచారం చేయించారు. ధర్మాన్ని ఆచరించడంలోని గొప్పదనాన్ని, జీవహింస చేయకపోవడంలో ఇతర జీవుల పట్ల చూప గల ప్రేమానురాగాల లోని ఆనందాన్ని తెలియచెప్పడానికి తన సొంత బిడ్డలతో సహా ఎందరినో బౌద్ధ ధర్మ ప్రచారకులుగా నియమించాడు. వారిని సుదూర దేశాలకు పంపి అక్కడ కూడా బౌద్ధ ధర్మ గొప్పదనం గురించి ప్రచారం చేయించాడు.
అశోకుని శాసనాలు
సమాజంలో నెలకొనవలసిన సమానత్వాన్ని, దాన్నిపొందడానికి పాటించవలసిన ధర్మం గురించి అశోకుడు తన శాసనాల్లో ప్రముఖంగా పేర్కొన్నారు.జీవహింసను అన్ని సందర్భాలలో నిషేధించారు. పెట్టిన నిబంధనలను ఉల్లంఖించిన వారికి కఠిన శిక్షలు విధించే అధికారం స్థానిక పాలనాధికారులైన "మహా మాత్ర"లకు ఇచ్చారు ఒకవేళ వారు పక్షపాత వైఖరితో ప్రవర్తించినా, లంచగొండులైనా, ధర్మాన్ని తప్పినా అలాంటి వారిని శిక్షించే భాధ్యతను చక్రవర్తిగా తాను స్వీకరించారు.
నమ్మి అనుసరిస్తున్న,ఆచరిస్తూ ప్రభోధిస్తున్న బౌద్ధ మత ధర్మ ప్రచారంలో భాగంగా అశోకుడు ఎన్నో స్థూపాలను, ఆరామాలను, జయ స్థూపాలను నెలకొల్పాడు. వాటి మీద, వాటి సమీపంలో, నాటి ముఖ్య ప్రాంతాలలో తన శాసనాలను వేయించాడు. అలాంటి చిన్న పెద్ద శాసనాలు మన దేశంతో పాటు నేటి ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ లతో కలిపి మొత్తంగా ముప్పైకి పైగా లభించాయి. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 268 - 232 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా చరిత్రకారులు నిర్ధారించారు.
ముఖ్యమని తలచిన ప్రదేశాలలో పెద్ద శాసనాలను, స్థూపాల వద్ద, విజయ స్తంభాల మీద చిన్న శాసనాలను చెక్కించారు. పక్క దేశాలలో లభించిన శాసనాలు ఖర్దోసి, గ్రీక్ మరియు అర్మానిక్ భాషలలో ఉన్నాయి.భారత దేశంలో లభించినవి ప్రాకృత భాషలో ఉండి బ్రహ్మిలిపిలో రాసినవి కావడం విశేషం. ఈ శాసనాలు అన్నీ అశోకుని "దేవనం ప్రియ ప్రియ రాసినో అశోక " (దేవతలకు ప్రియుడైన అశోక చక్రవర్తి) అని సంభోదిస్తాయి.
కళింగ అశోక శాసనాలు
వివిధ ప్రాంతాలలో అశోకుడు వేయించిన పెద్ద శాసనాలు పదునాలుగు లభించగా వాటిల్లో రెండు కళింగలోనే ఉండటం చెప్పుకోదగిన అంశం. అందుకే వీటిని "కళింగ అశోక శాసనాలు" అని పిలుస్తారు. నేటి ఒడిషా రాజధాని భువనేశ్వర్ నగర శివార్లలో "దయానది" తీరంలో ఉన్న"ధౌలీ" ని అప్పట్లో "తోషాలి" అని పిలిచేవారట. అక్కడే ప్రసిద్ధ కళింగ యుద్ధం జరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.నాలుగు దశాబ్దాల క్రిందట ఇక్కడి కొండ మీద జపాన్ ప్రభుత్వం వారు ఒక చక్కని బౌద్ధ స్థూపాన్ని నిర్మించారు.
త్రవ్వకాలలో కొండ క్రింద అనేక రాతి శిల్పాలు, స్తంభాలు లభించాయి.అక్కడే ఉంటుంది అశోకుడు కళింగ ప్రాంతంలో వేయించిన రెండు పెద్ద శాసనాల్లో ఒకటి ఉంటుంది. రెండవది గంజాం జిల్లా ముఖ్య నగరమైన బెర్హంపూర్(బ్రహ్మపుర) కి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జౌగడ్ వద్ద ఉన్నది.
ఈ రెండు శాసనాలు తెలిపే సామ్రాట్ అశోక సందేశం మిగిలిన వాటికి భిన్నంగా ఉండటం చెప్పు కోవలసిన విషయం.అందుకే శాస్త్రవేత్తలు వీటిని ప్రత్యేక శాసనాలుగా పరిగణించారు.ప్రాముఖ్యత కలిగిన శాసనాలుగా పేర్కొంటారు.వీటిని ఈ రెండు చోట్ల వేయించడానికి గల కారణాలను గురించి పరిశోధకులు మొదటిది కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం కావడం కాగా, రెండవది ఎంతో పౌరాణిక మరియు నాటి సమాజంలో పేరెన్నిక కలిగిన రేవు పట్టణం కావడం అని తెలిపారు.
జౌగడ్ ప్రత్యేకతలు
ఈ యుగం లోనే కాదు ద్వాపర యుగంలో కూడా జౌగడ్ గుర్తింపు కలిగిన రేవు పట్టణం మరియు వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందినది అని స్థానికంగా ప్రచారంలో ఉన్న గాధల ఆధారంగా తెలుస్తోంది. తొలుత "సమర" తరువాత "జగత" గా పిలవబడిన ఈ ఊరికి జౌగడ్ అన్న పేరు రావడానికి గల కారణం ఇలా ఉన్నది.
ఒడియా భాషలో జౌ అంటే లక్క అని, గడ్ అంటే కోట అని అర్ధం. మామ శకుని సలహా మేరకు పాండవులను పరిమార్చడానికి దుర్యోధనుడు లక్క ఇల్లు నిర్మింపచేసిన స్థలం ఇదేనని స్థానిక విశ్వాసం.గతంలో ఈ ఊరి చుట్టూ మట్టి కోట ఆనవాళ్లు కనిపించేవట.అదే విధంగా సమీప శివా లయంలో ఉన్న ఒక స్త్రీ, అయిదు పురుష విగ్రహాలను కుంతీ, ఆమె పుత్రులైన పంచ పాండవు లవిగా భావించి నేటికీ పూజలు చేయడం ఈ నమ్మకానికి నిదర్శనంలా కనిపిస్తుంది.
రుషికుల్యా నది సాగరంతో సంగమించే ప్రదేశానికి సమీపంలో వాణిజ్య పట్టణంగా ఏర్పడినది జౌగడ్. అనేక దేశాలతో సముద్ర వర్తకవాణిజ్యాలు ఈ రేవు ద్వారా జరగడం వలన దేశవిదేశాలకు చెందిన వర్తకులు, ఇతర ప్రజలు ఇక్కడికి వచ్చేవారు. ఆ విధంగా క్రీస్తు పూర్వము జౌగడ్ ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందినది అన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఈ విషయాన్నిఇక్కడ జరిపిన త్రవ్వకాలలో లభించిన అశోకునితో సహా వివిధ కాలాలకు చెందిన బంగారు,ఇతర లోహాల నాణాలు ప్రామాణికంగా నిలుస్తూ నిరూపిస్తున్నాయి.కనుక తన మదిలోని భావాల సందేశం సామ్రాజ్యం మొత్తం అదే విధంగా విదేశీయులకు కూడా తెలియాలి అన్న ఉద్దేశ్యంతో అశోకుడు శాసన రూపంలో ఇక్కడ నిలిపాడన్నది పరిశోధనకారుల ఉమ్మడి అభిప్రాయం.
కళింగ శాసనాల ప్రత్యేకత
ఒడిషాలో లభించిన రెండు శాసనాలలో మొదటిది తోశాలి లేదా దౌలీ లో పెద్ద రాతి మీద తల భాగం మాత్రమే చెక్కబడిన ఏనుగు శిల్పం క్రింద లిఖించబడినది. జౌగడ్ శాసనం నాటి నగరం మధ్యలో గల"కఫింగల పర్వతం" మీద పెద్ద రాతి మీద రాయబడినది.
ఈ రెండింటిలో కూడా చక్రవర్తిని"దేవనాం ప్రియ ప్రియ రాసినో అశోక" అనే సంభోధించబడినది. కానీ తరువాతి సందేశంలోనే మార్పులు చోటు చేసుకున్నాయి. "ఇక్కడి ప్రజలందరూ నా సంతానం.వారు ఇహపరాలలో సుఖశాంతులతో గడపాలని నేను కోరుకొంటున్నాను.ప్రస్తుతమే కాదు భవిష్యత్తులో కూడా వారు ఇదే విధమైన సుఖశాంతులతో జీవించాలని నేను ఆశిస్తున్నాను" అని ప్రారంభం అవుతాయి.ఈ పద ప్రయోగం బహుశా కళింగ ప్రాంత ప్రజలలో యుద్దానంతరం నెలకొన్న భయాందోళనలను,తన పట్ల ఏర్పడిన ద్వేష భావాన్నితొలగించడానికి అశోకుడు చేసిన ప్రయత్నంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అనంతర భాగంలో స్థానిక పాలనాధికారులైన మహమాత్రలను ఉద్దేశించి చేసిన సూచనలుగా పేర్కొనబడుతున్నాయి. దీనిలో చక్రవర్తి ఈ ప్రాంత ప్రజలందరినీ శాసన బద్దులుగా ఉంచి, వారి యోగక్షేమాలను పరిరక్షించాలని, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం ఉండరాదని పేర్కొన్నారు. ప్రజలకు కావలసిన వసతులను కల్పించాలని ఆదేశించారు. ఉత్సవాలలో, పర్వదినాలలో, దైనందిన జీవితంలో జీవహింస జరగరాదని, జంతు బలులు జరపరాదని నిర్ధేశించారు. ఏయే జీవులను, పక్షులను చంపరాదో కూడా విడిగా ఒక జాబితాను తయారు చేసి మహా మాత్రలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.సమాజంలో ధనిక పేద వివక్ష ఉండరాదని, కుల వివక్ష చూపరాదని,ప్రజలు అందరూ ధర్మాన్ని పాటిస్తూ మిగిలిన వారిపట్ల,సకల జీవుల యెడ ప్రేమానురాగాలు కలిగి ఉండాలని కోరు కున్నారు.పై వాటిని అతిక్రమించిన వారికి తీవ్ర స్థాయిలో శిక్షలు విధించాలని మహా మాత్రలకు ఆదేశాలిచ్చారు.
జౌగడ్ శాసనం
చిన్నగుట్ట మీద పదిహేను అడుగుల నల్ల రాతి మీద మూడు వరుసలలో చెక్కి ఉంటుంది. కాలక్రమంలో కొంతమేర శిథిలావస్థకు చేరుకొన్నఈ శాసనం స్ఫష్టంగా ఉండదు. మిగిలిన దానిని సంరక్షించడానికి తాకడానికి వీలు లేకుండా ఇనుప తలుపులను అమర్చారు.క్రింద నుండి శాసనం ఉన్న చోటికి చేరుకోడానికి దారి ఉన్నది.ప్రస్తుతం పరిరక్షింపబడుతున్నచారిత్రిక నిర్మాణాల జాబితాలో పురావస్తుశాఖ వారి సంరక్షణలో ఉన్నదీ ప్రాంతం.కానీ ఎలాంటి సౌకర్యాలు కనిపించవు.
అభివృద్ధి పరచి ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ఎన్నో అనుకూల అంశాలు ఇక్కడ కలవు.ఒడిషా లోని ప్రముఖ దేవీ ఆలయాలలో ఒకటి మరియు మహాశక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందిన తారాతరణి క్షేత్రానికి సమీపంలో రుషికుల్యా నదీతీరంలో ఉండటం మరో అదనపు ఆకర్షణీయ అంశం. తారాతరణి మరియు జౌగడ్ లకు బెర్హంపూర్ నుండి ప్రత్యేకంగా వాహనంలో చేరుకోవలసి ఉంటుంది. రానూ పోను కలిపి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం.
క్రీస్తుపూర్వం నాటి విశేషాలను, వివరాలను మనకందించిన జౌగడ్ చుట్టూ పరుచుకొని ఉన్న పచ్చని పంట పొలాలు, ఎత్తైన చెట్లు, మందగమనంతో ప్రవహించే నది కన్నుల విందు చేస్తాయి. ఇలా ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకోవడంతో పాటు మన హృదయాలలో గతం తాలూకు చారిత్రక సంఘటనలను ఆవిష్కరిస్తుంది జౌగడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు .
చరిత్ర పట్ల, అది అందించిన విశేష అవశేషాల పట్ల అభిమానం ఉన్న వారికి జౌగడ్ సందర్శన అనేక అనుభూతులను అందించగలదు.