1, అక్టోబర్ 2019, మంగళవారం

World Elephant Day

                           ప్రపంచ ఏనుగుల దినోత్సవం 

                                                 
                                                                                                     




మానవులుగా జన్మించిన మనందరికీ ఒక జన్మ దినోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం తాహతుకు తగ్గట్టుగా జరుపుకొంటాము. పుడమి మీద జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక రకంగా సంఘానికి ఉపయుక్తంగా ఉంటారు. అది మంచి కానీ చేడు  కానీ ! మనతో పాటు అనేక జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటి మూలంగా ప్రకృతికి జరిగే మేలు ఎంతో ! మరి అలాంటి పరోపకారులను, అవి చేస్తున్న సేవని, వాటి  వలన ఒనగూడే లాభాలను మర్చిపోదామా ! ఈ మూగ జీవాల నిష్కల్మష సేవను గుర్తించి విదేశీయులు వాటికి కూడా సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. వీటిల్లో ఏనుగులు, సింహాలు, పెద్దపులులు లాంటి పెద్ద మృగాలతో పాటు చిన్న చిన్న పక్షుల వరకూ ఉన్నాయి. ఇలా కేటాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
తగ్గుతున్న జంతువుల మరియు పక్షుల సంతతిని, వాటి వలన జరిగే పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధి, శుద్ధమైన గాలి, సకాలంలో వర్షాలు ఆదిగా గల విషయాల పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించడానికి ఇదో మార్గంగా వారు భావించి  నిర్ణయించారు.
ఉదాహరణకు పిన్నలను, పెద్దలను ఆకర్షించే గజరాజునే తీసుకోండి. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న అవి నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల లోపలే ఉన్నాయి. రోజుకు ఎన్ని జన్మిస్తున్నాయో తెలీదు గానీ వంద వరకు వేటగాళ్ల క్రూరత్వానికి బలి అవుతున్నాయి అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చును. అందుకే వీటిని 1986 నుండి అంతరించి పోతున్న జంతువుల జాబితా అగ్రస్థానంలో ఉంచారు. ఏనుగు దంతాలు, చర్మం తో తయారయ్యే వస్తువుల అమ్మకాన్ని నిషేదించారు. అయినా ఫలితం లేకపోవడంతో వినియోగదారులైన ప్రజలకు పర్యావరణ పరిరక్షణకు ఏనుగుల అవసరాన్నిగురించి తెలియచెప్పి, వారికి దంతపు వస్తువుల పట్ల గల వ్యామోహాన్ని వదిలించడానికి అన్ని దేశాలలోని ఏనుగుల అభిమానులు, ప్రభుత్వాలు  అనేక మార్గాలను ఎంచుకొంటున్నారు.
భారత దేశంలో 1992 వ సంవత్సరంలో "ప్రాజెక్ట్ ఎలిఫెంట్" అన్న కార్యక్రమాన్ని ఆరంభించారు. ముప్పయి రెండు గజ సంరక్షణ కేంద్రాలను ఏనుగులు ఎక్కువగా తిరుగాడే  రాష్ట్రాలలో   నెలకొల్పారు. దీని వలన ఏనుగులు హంతకుల బారిన పడటం తగ్గింది కానీ సంఖ్యలో పెద్దగా అభివృద్ధి లేదనే లెక్కలు చెబుతున్నాయి. అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోవడం తో గ్రామాల మీద గజ దాడులు ఎక్కువ అయ్యాయి.






భారతదేశం తరువాత పెంపుడు ఏనుగులు ఎక్కువగా ఉన్న థాయిలాండ్ దేశంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది అని అక్కడి అధికారుల రూపొందించిన పత్రాలు తెలుపుతున్నాయి.
శతాబ్దం క్రిందట లక్షకు పైగా తిరుగాడిన ఏనుగుల సంఖ్య నేడు నాలుగు వేలకు దిగజారి పోయింది. అందులో మూడువేలకు పైగా పెంపుడు ఏనుగులే ! వన్యప్రాణి సంరక్షకుల లెక్క ప్రకారం థాయిలాండ్లో సంవత్సరానికి మూడున్నర శాతం చొప్పున ఏనుగులు తగ్గిపోతున్నాయి. . ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు దశాబ్దాల తరువాత ఆ దేశంలో ఏనుగులన్నవి కనపడని తేల్చి చెప్పారు. దీనిని అరికట్టడానికి థాయిలాండ్ మహారాణి "సిరి కీత్" స్వయంగా నడుం బిగించారు.
రెండువేల రెండో సంవత్సరంలో "ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్" ను స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం పెంపకందారుల  దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న ఏనుగులను ఉచితంగా కానీ, ఖరీదు చేసి కానీ తీసుకొని, వాటికి అవసరమైన వైద్య సేవలను అందిస్తారు. పూర్తి స్వస్థత చేకూరిన తరువాత వాటిని అడవిలో వదులుతారు. దీని కోసం థాయిలాండ్ ప్రభుత్వం మూడు   అభయారణ్యాలను, ఇరవై ఎనిమిది మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించినది. ఒక్కోప్రాంతం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రభుత్వం దీని కొరకు ప్రత్యేక నిధులను కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా గజాభిమానుల నుండి విరాళాలను సేకరించారు.
అలాంటి సమయంలో కెనడాకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు " పాట్రికా సిమ్స్" నటుడు  "విలియం షాట్నర్" జత కలిశారు. వీరిరువురూ గజాల పట్ల మక్కువ, ప్రేమ, అభిమానం కలిగిన వారు. ఏనుగు పెంపక దారులలో చైతన్యం కలిగించడానికి ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ స్థాపించిన దశాబ్ద కాలం పూర్తి అయిన సందర్బంగా "రిటర్న్ టు ది ఫారెస్ట్" అన్న అరగంట నిడివి గల డాక్యూమెంటరీ నిర్మించారు. ఎంతో హృద్యంగా నిర్మించిన ఈ చిత్రానికి వ్యాఖ్యాత నటుడు విలియం షాట్నర్. ఆయన తన నవరసాలు పలికే గొంతుతో గొప్పగా చిత్రములోని అసలు ఉద్దేశ్యాన్ని హృదయాలను కదిలించేలా చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం విడుదల సమయానికి ఈ సంస్థ వారు వంద ఏనుగులను పెంపకందారులు నుండి తీసుకొని అరణ్యాలలో వదిలారు. ఈ విజయానికి గుర్తుగా సిమ్స్ 12.08.2012ని "ప్రపంచ ఏనుగుల దినోత్సవం"గా ప్రకటించారు.నాటి నుండి ఆగస్టు పన్నెండవ తేదీని ఏనుగుల దినోత్సవంగా పరిగణిస్తున్నారు.







విడుదలై వనాలలో విహరిస్తూ స్వతంత్రాన్ని అనుభవిస్తున్న గజరాజులు, రాణులకు  ఇరవై అయిదు మంది సంతానం కలిగారు. అన్ని కుటుంబాలు సుఖంగా ఉన్నాయని సంబంధిత వర్గాల వారు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఎందరో ప్రముఖులు,వన్యప్రాణి       ప్రేమికులు, స్వచ్చంద సేవా సంస్థల వారు కలిశారు. ఎందరో ఏనుగుల అభిమానులు, ప్రకృతికి మానవాళికి వాటి అవసరాన్ని గుర్తించిన వారు కూడా విరాళాలుఇస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
 ఏనుగుల సంతతి వృద్ధి చెందడానికి దర్శకురాలు సిమ్స్ తమ తరుఫున నుండి చేస్తున్న కృషిని మరింత ముందుకు కొసాగిస్తూ 2015వ సంవత్సరంలో "వెన్ ఎలెఫెంట్స్ వర్ యంగ్" అన్న రెండో డాక్యూమెంటరీ నిర్మించారు. వాయువ్య థాయిలాండ్ ప్రాంతంలోని ఒక కుగ్రామం లో నివసిస్తున్న ముఫై అయిదు మంది ఏనుగుల పెంపకం దారులలో ఒకడైన ఇరవై అయిదు సంవత్సరాల "ఓక్" మరియు అతని "నోంగ్ మయి" అనే పెంపుడు ఏనుగు గురించిన కధ. ఎంతో వ్యయప్రయాసలకోర్చినిర్మించిన ఈ చిత్రం అనేక చిత్రోత్సవాలలో ప్రశంసలు మరియు బహుమతులు అందుకొన్నాది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కూడా విలియం షాట్నర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ! రెండు చిత్రాలు కూడా థాయిలాండ్ నేపథ్యంలోనే నిర్మించడం మరో విశేషం !
ఈ సంస్థ వారు పెరిగిపోతున్నజల, వాయు, భూమి  కాలుష్యంగురించి దానికి విరుగుడుగా చెట్ల పెంపకం ఎంతగా దోహదపడుతుందో అన్న విషయాన్నీ సవివరంగా తెలుపుతారు.రోజుకు పాతిక కిలోమీటర్లు ఆహారం కోసం తిరిగే ఏనుగులు తమ మలం ద్వారా విత్తనాలను విసర్జించి అడవుల అభివృద్ధికి ఎలా  తోడ్పడతాయో అన్న విషయాల గురించి సదస్సులను నిర్వహించి, ప్రజలకు   ఏనుగుల గురించి అవగాహన కలిగిస్తున్నారు. వాటి వలన పర్యావరణానికి జరిగే మేలు గురించి వివరిస్తారు.








దర్శకురాలు సిమ్స్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ వర్గాల వారిని కలుస్తూ తమ సంస్థ గురించి వివరిస్తుంటారు. ఆమే కాదు సంస్థలోని సభ్యులందరూ ఏనుగులను కాపాడుకోవడం గురించి ప్రజలకు తెలుపుతుంటారు. ఒక్క ఏనుగే కాదు ప్రతి ఒక్క జీవి ప్రకృతి మరియు పర్యావరణానికి సహకరిస్తాయి. అందుకని మనం కూడా వారితో జత కలుద్దాం. ఎందుకంటే మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాము. మనకీ స్వచ్ఛమైన పరిసరాలు, ఆహారం, నీరు, గాలి కావాలి కదా మరి !
(12.08. 2018 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్బంగా )



Saptha Karai kanda sthalams

                 కుమారుడు ప్రతిష్టించిన కైలాసనాధుడు 


  భరత ఖండం అనాదిగా దైవభూమి. ప్రతి పల్లె, పట్టణం, నగరం, అరణ్యం, పర్వతాలు ఇలా అన్నీ కనీసం ఒక హిందూ దైవం యొక్క ఆలయాన్ని కలిగి ఉండటం ప్రస్తావించవలసిన విషయం. ఇవన్నీ కూడా ఏదో ఒక విశేష కారణం వలన ఏర్పడినవి అన్న సంగతి ఆయా క్షేత్రాల పురాణ గాధలను పరిశీలించినప్పుడు అవగతమౌతుంది. విచారించవలసిన అంశం ఏమిటంటే వీటిల్లో చాలా క్షేత్రాలు కాలగతిలో మరుగున పడిపోయి స్థానికంగా ఒక సాధారణ ఆలయంగా పరిగణింపబడటం. కాకపోతే సంతోషించదగ్గ విషయం మాత్రం అన్ని ఆలయాలలో నిత్య దీపధూప నైవేద్యాలు జరగడం.
ఈ ఆలయాలలో శ్రీ మహావిష్ణు, శ్రీ కైలాసనాధ, శ్రీ వినాయక, శ్రీ షణ్ముఖ మరియు దేవీ ఆలయాలు ఎక్కువగా కనపడతాయి. అలానే వీటిల్లో కొన్ని ఒకే దేవతామూర్తి కొలువైన గొలుసు కట్టు ఆలయాలు కూడా కనపడతాయి.                                                     
వీటిల్లో అధిక శాతం నిరాకారుడైన నటరాజ స్వామి కొలువైనవే కనపడతాయి. గొలుసు కట్టు   అంటే ఒకే అంశం లేదా ఒకే క్షేత్ర గాధ కలిగిన ఆలయాలన్న మాట. ఇలాంటి విశేష ఆలయాలు అధికంగా ఆలయాల రాష్ట్రం తమిళనాడులో కనపడతాయి. నవ కైలాసాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు ఇలా ఎన్నో ! వాటిల్లో ప్రత్యేకమైనవి చెయ్యారు నది ఉత్తర దక్షిణ తీరాలలో నెలకొని ఉన్న సప్త కారై కాంద మరియు సప్త కైలాసాలు (కైవల్య/ కళ్యాణ) క్షేత్రాలు.
ఇవన్నీ శ్రీ కుమారస్వామి ప్రతిష్టగా ఆలయ గాధలు తెలుపుతున్నాయి.
పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా, స్వయం సర్వేశ్వరుడే పర్వతరూపంలో వెలసిన దివ్య స్థలం తిరువణ్ణామలై (అరుణాచలం). ఈ శిఖరానికి చేసే గిరిప్రదక్షణ ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా ఎన్నో పురాణ గ్రంధాలలో ఉదాహరించబడింది. ఈ కారణంగా ప్రతి నిత్యం విశేషించి పౌర్ణమి రోజులలో భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గదర్శకులెందరికో ఈ క్షేత్రం అంతిమ గమ్యంగా పేరొందినది. శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి లాంటివారు ఎందరికో మార్గదర్శకత్వం చేశారు. అంతటి విశేష స్థలమైన తిరువణ్ణామలై కి యాభై కిలోమీటర్ల పరిధిలో ఈ పదునాలుగు ఆలయాలు ఉండడం ఈ స్థల పాశస్త్యాన్ని తెలుపుతుంది. ఈ ఆలయాల క్షేత్ర గాధ కూడా తిరువణ్ణామలైతో ఆది దంపతులతో ముడి పడి  ఉండటం ఉదాహరించవలసిన సంగతి.

క్షేత్ర గాధ 

తెలియక చేసిన అపరాధానికి శివాజ్ఞ మేరకు కాంచీపురంలో తపస్సు చేసిన పార్వతీదేవి దేవసేనాని అయిన కుమారుడు శ్రీ కుమారస్వామి, మహర్షులు, ఇతర గణాలతో కలిసి తిరువణ్ణామలై పయనమయ్యారట. దారిలో "వళై పాండాల్" అనే ప్రదేశం వద్దకు చేరుకునేసరికి సంధ్యా సమయ పూజకు వేళయ్యిందిట. యధాప్రకారం సైకత లింగాన్ని చేయడానికి ఉపక్రమించిన భవానికి కనుచూపు మేరలో నీటి జాడ కానరాలేదుట. తల్లి కి కావలసిన జలం కొఱకు షణ్ముఖుడు తన వేల్ ని దూరంలో ఉన్న పర్వతాల పైకి విసిరారట. కొద్దీ సేపటిలోనే నీరు ప్రవహించిందిట. కానీ రక్థవర్ణంలో ఉండటంతో విషయం తెలుసుకోడానికి వేలాయుధుడు పర్వతాల వద్దకు వెళ్ళాడట.
 "పుతిరందన్, పురుహూదన్, పాండురంగన్, బోధవన్, బోధన్, కొమన్ మరియు వామన్" అనే ఏడుగురు గంధర్వులు శాపవశాత్తు భూలోకంలో జన్మించారట. శివకుమారుని అనుగ్రహంతో  శాపవిమోచనం పొందడానికి అక్కడి కొండ గుహలలో తపస్సు చేస్తున్నారట. వేల్ వారి శరీరాల లోనికి  దూసుకొని పోవడంతో నీరు రంగు మారింది అన్న విషయం గ్రహించారట దండాయుధ పాణి. సప్త మునీంద్రులు కుమారుని స్తోత్రం చేసి విముక్తి పొంది తమ లోకానికి వెళ్లి పోయారట. కానీ పుత్రుడు అనుకోకుండా బ్రహ్మ హత్యాదోషానికి గురికావడంతో బాధపడిన లోకపావని అతనిని ఉద్భవించిన నదీతీరంలో శివలింగాలను ప్రతిష్టించి దోషాన్ని తొలగించుకోమని ఆదేశించారట.అలా మునుల రక్తం నుండి పుట్టిన చెయ్యారు నది ఉత్తర మరియు దక్షిణ తీరాలలో స్కందుడు లింగాలను ప్రతిష్టించారన్నది స్థానికంగా వినిపించే గాధ.

క్షేత్ర విశేషాలు

చెయ్యారు నదికి ఉత్తరం పక్క ఉన్న క్షేత్రాలను "కార్తె కాండ స్థలాలు" అని, దక్షిణం పక్క ఉన్న వాటిని "సప్త కైవల్య/ కళ్యాణ/ కైలాస స్థలాలు" అని పిలుస్తారు. ఇవన్నీ తొమ్మిది మరియు పదో శతాబ్దాల మధ్య కాలంలో చోళరాజులచే నిర్మించబడి అనంతర కాలంలో "శాంభవరాయ మరియు విజయనగర రాజుల" కైంకర్యాలతో నేటి రూపును సంతరించుకొన్నట్లుగా శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.
సప్త కార్తె కాండ స్థలాలలో  కొలువైన ఆదిదంపతులను "శ్రీ బృహన్నాయకీ సమేత శ్రీ కార్తె కాండేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక దక్షిణం పక్కన వెలసిన స్వామిని శ్రీ కైలాసనాథర్, శ్రీ అగ్నీశ్వర స్వామి అని, అమ్మవారిని కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రధమ పూజితునిగా విఘ్ననాయకునికి అన్ని ఆలయాలలో సముచిత స్థానం ఏర్పాటయింది. కానీ ఇవన్నీ శరవణుని ప్రతిష్ట కావడం వలన అన్ని చోట్లా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన ఉపాలయాలలో భైరవ, సప్త మాతృకలు, దక్షిణామూర్తి, చెండికేశ్వర స్వామి ఉండగా అన్ని చోట్లా నవగ్రహ మండపం ఉంటుంది. కొన్ని ఆలయాల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాయణ పెరుమాళ్, శ్రీ వరద రాజ స్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరివార దేవతలలో కనిపిస్తారు. మరికొన్ని చోట్ల అర్ధనారీశ్వర, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప లతో పాటు శివగాయక భక్తులైన అరవై మూడు మంది నయన్మారులలో ప్రముఖులైన తిరు జ్ఞాన సంబందార్, సుందరార్ మరియు అప్పార్ దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయాల వేటిల్లో నయన్మార్లు ఎవరూ పాటికాలను గానం చేయలేదు. అందువలన ఇవి "పడాల్ పేట్ర లేదా తేవర వైప్పు స్థలా"లలో గాని లేవు.
అన్ని గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ మహావిష్ణు, శ్రీ లింగోద్భవ మూర్తి, శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ దుర్గ ఉపస్థితులై ఉంటారు.
అన్ని చోట్ల నిర్దేశిత విధానంలో దినానికి నాలుగు పూజలు, అభిషేకాలు, అలంకరణ, అర్చన మరియు ఆరగింపులు ఉంటాయి. మాసశివరాత్రి, త్రయోదశి ప్రదోష పూజ, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో విశేష పూజలు, ఆరుద్ర ఉత్సవం, ఫల్గుణి ఉత్తిరాయణం, నెలకొక విశేష ఉత్సవం, మహాశివరాత్రికి, గణేశ మరియు దుర్గా నవరాత్రులలోతొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా అలంకారాలు, పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. స్థానికులు ఎక్కువగా విద్యార్థులుగా, వివాహార్ధులుగా, సంతానాభిలాషులుగా, గ్రహ దోష నివారణకు పూజలు చేయించుకొంటున్నారు.  ఈ పదునాలుగు క్షేత్రాలలో చెయ్యారు నది ఉత్తరాభిముఖంగా ప్రవహించడం వలన వీటిని కాశీ సమాన క్షేత్రాలుగా భక్తులు భావిస్తారు. నదిలో స్నానం చేసి ఏదో ఒక ఆలయంలోని స్వామి దర్శనం చేసుకోవడం వలన జన్మజన్మల కర్మ ఫలం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం.

సప్త కార్తె కాండ స్థలాలు 

ఇవి వరుసగా కంజి, కదలాడి, మాంబాక్కం, తెన్మతి మంగళం, ఎళ త్తూరు, పూండి మరియు కురివిమలై. ఈ ఏడు క్షేత్రాలు చెయ్యారు నదికి ఉత్తర దిశన ఒకదాని తరువాత ఒకటిగా ఉంటాయి. వీటిల్లో కొన్ని పురాతన నిర్మాణాలుగానే ఉండగా కొన్ని నూతన రూపును సంతరించుకొన్నాయి. 

శ్రీ కారై  కాండేశ్వర స్వామి ఆలయం, కంజి 

తిరువణ్ణామలై కి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం నుండి చతుర్దశ క్షేత్రాల సందర్శన యాత్ర ఆరంభం అవుతుంది. స్వామి తూర్పుముఖంగాను, అమ్మవారు పెరియనాయకి దక్షిణ ముఖంగాను కొలువుతీరి దర్శనం ప్రసాదిస్తారు. గణేష, అయ్యప్ప, శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉపాలయాలతో పాటు మిగిలిన ఆరు సప్త కారైకాండ క్షేత్రాల లింగాలు కూడా ఉంటాయి. విశాల ప్రాకారంలో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు. చక్కని నిర్మాణాలు, పరిశుభ్రమైన వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక అనుభూతులలో ఉంచుతాయి. ఉదయం ఆరు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి ఏడు గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, కదలాడి 

చాలా చిన్న పురాతన సాదా సీదా ఆలయం పచ్చటి పొలాల మధ్య, పర్వతాల ముందు చక్కని ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. కంజికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోవెల ఉదయం ఆరు నుండి తొమ్మిది తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు తెరిచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, మాంబాక్కం 

పదో శతాబ్దంలో చోళరాజుల చేత నిర్మించబడిన ఈ ఆలయాన్ని శాంభవరాయ మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ప్రశాంత ప్రకృతి ఒడిలో అలరారే ఈ క్షేత్రంలో ఎలాంటి విశేష నిర్మాణాలు కనపడవు. శివ కుమారులు మాత్రమే పరివారదేవతలుగా దర్శనమిస్తారు. కదలాడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఉదయం ఏడు నుండి పది వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు వరకు మాత్రమే తెరచి ఉంటుంది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, తెన్మతి మంగళం 

తెన్ మహాదేవ మంగళం గా కూడా పిలవబడే ఈ క్షేత్రం ఏడు ఆలయాలలో మధ్యది. చూడబోయే మిగిలిన మూడు క్షేత్రాల లింగాలు ఒక మండపంలో దర్శమిస్తాయి. శ్రీ విశాలాక్షీ సమేత కాశీ విశ్వనాధ స్వామి కూడా దర్శనమిస్తారు. రెండు ఎకరాల విశాల స్థలంలో ఉన్న ప్రాంగణంలో చక్కని శోభ ఉట్టిపడే నిర్మాణాలు కనపడతాయి. కదలాడి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మధ్య కారై కాండ క్షేత్రం. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, ఎళత్తూరు 

దక్షిణ ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న  ఆలయంలో గర్భాలయం ఉత్తర దిశగా ఉంటుంది. అమ్మవారు పెరియనాయకి తూర్పు దిశగా కొలువుతీరి ఉంటారు. ప్రధాన ఆలయ విమానంతో పాటు ఉపాలయాల విమానాలు కూడా స్వర్ణవర్ణమయంగా శోభిస్తుంటాయి. 
పూండికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఈ క్షేత్రం. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, పూండి 

పూండి స్వామిగళ్ గా ప్రసిద్ధికెక్కిన అవధూత నడయాడిన ప్రాంతమిది. స్వామి జీవ సమాధిని దర్శించుకోవచ్చును. బాల వినాయక మరియు బాల సుబ్రహ్మణ్య సన్నిధులుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఈ ఊరిలో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపిన తరువాత శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయాన్ని తెరుస్తారు. ఈ సాదాసీదా ఆలయం ఎళత్తూర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 

శ్రీ కారై కాండేశ్వర స్వామి ఆలయం, కురువిమలై 

ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో  ఉన్న రెండు ఆలయాలను కలిపి ఒక కారై కాండ స్థలంగా పరిగణిస్తారు. పక్కపక్కనే ఉండే ఆలయాలలో ఒకటి శ్రీ ఆది కారై కాండేశ్వర స్వామి కొలువైనది కావడం ప్రత్యేకం. రెండు ఆలయాలలో అమ్మవారు పెరియనాయకి దేవే ! పూండికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం సప్త కారై కాండ క్షేత్రాలలో ఆఖరిది. 
సప్త కారై కాండ క్షేత్ర దర్శన వివరాల తరువాత తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడితో సప్త కాండేశ్వర ఆలయాలు పూర్తి అవుతాయి. కురువిమలై నుండి సప్త కైలాస క్షేత్రాలలో ఆఖరుదైన మందకొళుత్తుర్ నుండి మొదలు పెట్టవచ్చును. కానీ స్వంత లేదా అద్దె వాహనంలో వెళితే ఉత్తరం పక్కన ఒక ఆలయాన్ని, దక్షిణం పక్కన ఒక ఆలయాన్ని దర్శించుకొంటూ శీఘ్రగతిన మొత్తం ఆలయాలను సందర్శించే అవకాశం కలదు. మార్గం గురించి స్థానిక అద్దె కార్ల డ్రైవర్లకు పూర్తి అవగాహన ఉంటుంది.

సప్త కైలాస / కళ్యాణ/ కైవల్య క్షేత్రాలు 

శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి ఆలయం, వాసుదేవంపట్టు 

స్థానిక పాలకుడైన వాసుదేవవర్మ పేరు మీద ఏర్పడిన ఊరు ఇది. ఆయన నిర్మించిన శిధిల కోట, శ్రీ వీరనారాయణ పెరుమాళ్ ఆలయం చూడవచ్చును. ఈ ఆలయంలో ఎనిమిది అడుగుల శ్రీ ఆంజనేయ విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది. పురాతనమైన శ్రీ మార్గసహాయేశ్వర స్వామి ఆలయం కూడా ఈ ఊరిలో ఉన్నది.  సప్త కార్తె కాండ క్షేత్రాలలో మొదటిదైన కంజి కన్నా ముందు వస్తుంది. తిరువణ్ణామలైకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నిర్మించబడినది. దక్షిణ ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే సప్త మాతృకల రూపాలను  చక్కగా మలచిన ద్వాదశ  స్తంభాలతో ఆస్థాన  మండపం కనపడుతుంది. గర్భాలయానికి ముందు ద్వారపాలకులను, నలవర, కాశీ లింగం, భైరవుడు, శ్రీ దక్షిణామూర్తిలతో పాటు నందీశ్వరుడు కొలువై దర్శనమిస్తారు. వినాయక, షణ్ముఖ ఉపాలయాలతో పాటు నవగ్రహమండపం, ప్రాంగణ ఈశాన్యంలో శ్రీ చిత్ర విచిత్ర గతుల సన్నిధి కూడా ఉంటుంది. భక్తులు దీర్గాయువు కొరకు వీరికి ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. అమ్మవారు శ్రీ సౌందర్యనాయకి విడిగా సన్నిధిలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 

శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం, తామరై పాక్కం 

శ్రీ త్రిపుర సుందరీ సమేత శ్రీ అగ్నీశ్వరస్వామి కొలువైన ఈ ఆలయం కుళోత్తుంగ చోళుడు పదో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. చూడచక్కని శిల్పాలు కనపడతాయి. నర్తన గణపతి, దక్షిణామూర్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరద రాజా స్వామి, శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రమణ్య స్వామి పరివార దేవతలుగా కొలువై ఉంటారు. ప్రధాన ఆలయ విమానంతో పాటు అన్ని ఆలయాల విమానాలు స్వర్ణవర్ణంతో శోభాయమానంగా కనపడతాయి. 
కంజికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ స్థలం. 

శ్రీ కైలాసనాథర్ ఆలయం, నర్తన పూండి 

దక్షప్రజాపతి ఇచ్చిన శాపాన్ని తొలగించుకోడానికి త్రిలోక సంచారి ఐన నారద మహర్షి ఈ క్షేత్రంలో పుష్కర కాలం తపమాచరించారట. ఈ క్షేత్ర విశేషాలు స్కంద పురాణంలో ఉన్నట్లుగా చెబుతారు. అందువలన తొలినాళ్లలో నారద పూండి అని పిలువబడి కాలక్రమంలో నర్తన పూండి గా మారినట్లుగా తెలుస్తోంది. 
సువిశాల ప్రాంగణానికి తూర్పున అయిదు అంతస్థుల రాజ గోపురం నిర్మించబడినది. ఉపాలయాలలో గణపతి, స్కందుడు, ఆదిగా గలవారు ఉంటారు. ప్రాంగణ పడమరలో ఉన్న "కోతలత్తు వినాయకుడు" అధికారాన్ని అనుగ్రహించేవానిగా ప్రసిద్ధి. ముఖ్యంగా రాజకీయ వర్గాల వారు ఎన్నికల సమయంలో విజయానికి ఈయనకు పూజలు చేయించుకొంటుంటారు. భక్తులు విద్యలలో విజయానికి, వివాహానికి, సత్సంతానానికి శ్రీ పెరియ నాయకీ సహిత శ్రీ కైలాసనాథర్ స్వామికి ప్రత్యేక పూజలు చేయించుకొంటుంటారు. 
చోళ  రాజులు నిర్మించిన ఆలయాన్ని హొయసల మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేయించినట్లుగా ఇక్కడి శాసనాలు తెలుపుతాయి. కంజికి పదునాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నర్తన పూండి. 

శ్రీ కైలాసనాథర్ ఆలయం, తెన్ పళ్లి  పట్టు 

శ్రీ కనకాంబికై సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి కొలువుతీరిన ఈ మధ్య కళ్యాణ క్షేత్రం పూండి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాతన నిర్మాణం. చిన్న ఆలయంలో శ్రీ గణేశుడు, శ్రీ సుబ్రమణ్య స్వామి సహా ఆది దంపతులు విడివిడిగా సన్నిధులలో దర్శనమిస్తారు. యోగ విశారదుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన శ్రీ మహాన్ సభాపతి స్వామి జన్మస్థలం. ఆలయానికి సమీపంలోనే ఆయన జీవ సమాధి ఉంటుంది. 

శ్రీ బాలక్రడేశ్వర స్వామి ఆలయం, పళం కోవిల్ 

దూరానికి ప్రస్ఫుటంగా కనిపించే అయిదు అంతస్థుల రాజగోపురంతో విరాజిల్లే ఈ ఆలయంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ బాలక్ర డేశ్వర స్వామి లింగరూపంలో, అమ్మవారు శ్రీ బాలాంబిక స్థానిక భంగిమలో రెండు సన్నిధులలో కొలువై దర్శనం ప్రసాదిస్తారు. స్వామివారు అనారోగ్యాన్ని హరించేవానిగా ప్రసిద్ధి. అమ్మవారు సుమంగళత్వం ప్రసాదిస్తారు అన్నది భక్తుల తరతరాల విశ్వాసం. పదవ శతాబ్ద చివరి కాలంలో మధురాంతక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఎన్నో విలువైన వస్తువులను కైంకర్యంగా సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. 2001 వ సంవత్సరం ఆలయ బావి పూడిక తీసే సమయంలో పురాతన పంచలోహ ఉత్సవిగ్రహాలు,పాత్రలు లభించాయి. నాయన్మారులతో సహా ఎందరో దేవీదేవతలు ఉపాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం పూండికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

శ్రీ ధర్మనాథేశ్వర స్వామి ఆలయం, మండకొళత్తూర్ 

ద్వాపరయుగంలో తమ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారట. పాండవాగ్రజుడు ధర్మరాజు నిత్య లింగరాజును నియమంగా అర్చించేవారట. అందువలన కాలగతిలో ఆయన పేరు మీదగా స్వామివారిని ఈ పేరుతొ పిలవడం ఆరంభమైనట్లుగా చెబుతారు. అమ్మవారు శ్రీ ధర్మసంవర్ధనీ దేవి. గత యుగం నుండి పదిహేనవ శతాబ్దం వరకు ఈ ఊరు గొప్ప వేద విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందినట్లుగా పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొన్నట్లుగా తెలియవస్తోంది. ఆలయ గోడల పైన తమిళనాట విశేష ఆలయాలుగా గుర్తింపు పొందిన అష్ట వీరట్ట స్థలాల నటరాజ మూర్తులను సహజ వర్ణాలతో సుందరంగా చిత్రించారు. 
ప్రణాళిక సిద్ధం చేసుకొని కారులో ఉదయాన్నే తిరువణ్ణామలై నుండి బయలుదేరితే మధ్యాహన్నానికల్లా అన్ని ఆలయాలను సందర్శించే అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చును. 
తిరువణ్ణామలై నుండి రానూ పోను కలిపి ప్రయాణ మార్గం వంద కిలోమీటర్లు ఉంటుంది. 


నమః శివాయ !!! 

 

  

Lord Ganesha

                                     విఘ్ననాయక వినాయక 







































Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...