20, మార్చి 2018, మంగళవారం

Nandi Kalyanam

                                    నందీశ్వర కళ్యాణం 

                                                                                                      


శ్రీ మహా విష్ణు సేవకులలో గరుత్మంతుడు ఎలా అగ్రగణ్యుడో  అదే విధంగా మహా శివుని సేవకులలో మొదటి వాడు నందీశ్వరుడు.శిలాద మహర్షి తపస్సు చేసి పరమేశ్వరుని వర ప్రసాదంగా నందిని కుమారునిగా పొందారు.చిన్నతనం నుండి అచంచల శివభక్తి  పరాయణుడైన నంది, తపస్సు చేసి అర్ధాయుష్యుకు బదులు మహేశ్వరుని ఆశీర్వాదంతో చిరంజీవత్వాన్నిఅందుకొన్నారు. అంతే కాకుండా వాహనంగా నిరంతరం ఆరాధ్య దైవం సేవలో ఉండే వరం పొందారు.తమ అనుంగు అనుచరునికి స్వహస్తాలతో వివాహం చేశారు ఆది దంపతులు అని తమిళ పురాతన గ్రంధాలు తెలుపుతున్నాయి. అలా నందీశ్వరుని కళ్యాణంతో ముడిపడి ఉన్న ఎనిమిది దివ్య క్షేత్రాల గురించి తెలుసుకొందాము.

తిరువయ్యారు 


 కావేరి నదీ తీరంలో కాశీ క్షేత్రంలో సమానంగా స్థానికులు భావించే ఆరు ఆలయాలున్నాయి. అవి  శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం, తిరువిడైమరుదూర్, శ్రీ మయూరనాథేశ్వర స్వామి ఆలయం, మైలాడుతురై, శ్రీ ఛాయవనేశ్వర స్వామి ఆలయం, సాయవనం, శ్రీ శ్వేతారణ్యేశ్వర స్వామి ఆలయం, తిరువేంకాడు, శ్రీ వంజినాథ స్వామి ఆలయం, శ్రీ వంజియం మరియు శ్రీ ధర్మ సంవర్ధనీ సమేత శ్రీ పంచనాథేశ్వర స్వామి కొలువైన తిరువయ్యారు. ప్రతి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు. తంజావూరు నుండి తిరువైయ్యారు తో ప్రారంభించి తిరువేంగాడుతో ఆరు క్షేత్రాల దర్శనం ముగించవచ్చును.రాను పోను సుమారుగా రెండు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది.ఒక్కరోజులో సందర్శన పూర్తి చేయవచ్చును.   
తిరువయ్యారుకు అరిశలూరు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు మరియు కవిరియారు అనే  అయిదు నదుల మధ్య ఉన్నందున ఈ పేరొచ్చినది. స్వామి వారిని "ఐయరప్పన్"(అయిదు నదుల మధ్య ఉన్నవాడు)అని పిలుస్తారు. చోళ రాజులచే నిర్మించబడిన ఆలయం చక్కని శిల్పకళకు నిలయం. అయిదు ప్రాకారాలు, నలుదిక్కుల రాజగోపురాలతో అలరారు తుంటుందీ ఆలయం.సువిశాల ప్రాంగణంలో దక్షిణ కైలాసం మరియు ఉత్తర కైలాసం అని పిలిచే రెండు భాగాలుంటాయి. దక్షిణ కైలాసాన్ని నైమిశ మహర్షి నిర్మించగా, రాజేంద్ర చోళుని సతీమణి మర్మత్తులు చేయించారు. ఉత్తర కైలాసాన్ని రాజరాజచోళుడు నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. ఊరు చుట్టూ అయిదు నదులున్నట్లే ఆలయంలో సూర్య, చంద్ర, నంది, గంగ, పాలరు అనే అయిదు పుష్కరుణులు ఉంటాయి. ప్రాంగణంలో ఉన్న  మండపాలలో ముక్తి  మండపం ప్రసిద్ధి చెందినది.ఎందరో భక్తులు ఇక్కడ శివ నామ ధ్యానం చేస్తుంటారు. శ్రీ కాల సంహార మూర్తి సన్నిధి సమీపంలోఉండే హోమకుండాన్నిశ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య వెలిగించినట్లు పేర్కొంటారు. ప్రాంగణంలో నిర్దేశించిన ఒక ప్రదేశంలో నిలబడి స్వామివారి పేరును పెద్దగా పలికితే ఏడు సార్లు ప్రతిధ్వనిస్తుంది అని అంటారు. ఆలయాలలో ప్రదక్షణ తప్పనిసరి. కానీ ఈ ఆలయంలో ప్రదక్షణ నిషేధం. గర్భాలయం చుట్టూ కపర్ది జటాజూటాలు పరుచుకొని ఉంటాయన్న భావనతో ప్రదక్షణలు చేయరు.అరవై మూడు మంది నయమ్మారులలో ముఖ్యుడైన "అప్పార్" శ్రీ పంచనాథేశ్వర స్వామి గురించి తన పాటికాలలో ప్రస్తుతించారు. అందువలన ఈ క్షేత్రం పడాల్ పేట్ర స్థలాలలో ఒకటిగా గుర్తించబడినది.

శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

 భారత దేశ సంగీతానికి అనన్య సేవ చేసిన శ్రీ త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి లను కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేర్కొంటారు. శ్రీ త్యాగరాజ స్వామి కొన్ని గొప్ప కీర్తనలను  తిరువయ్యారులో రచించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆ సమయంలో నివసించిన గది ఆలయం పక్కనే ఉంటుంది. ఆ శ్రీరామ భక్తుడు ఇక్కడే తన ఆరాధ్య దైవంలో లీనమై పోయారు.కావేరీ తీరంలో ఉన్న ఈ మహాగాయక భక్తుని సమాధి వద్ద  జనవరి నెలలో నిర్వహించే శ్రీ త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి  వేలాది మంది సంగీతకారులు వస్తారు.తమ మార్గదర్శకునికి నివాళులు అర్పిస్తారు.ఈ  ఆరాధనోత్సవాలను 171 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.









నంది వృతాంతం  

శిలాద మహాముని కుమారుడైన నంది జన్మించినది తిరువయ్యారు లోనే ! వాహనంగానే కాకుండా కైలాస గణాలకు అధిపతి నంది. నంది బొమ్మతో కూడిన ధ్వజం శైవసంప్రదాయానికి చిహ్నంగా గుర్తించబడినది. నేడు ప్రపంచవ్యాప్తంగా శైవమతాభిమానులు తమ సమావేశాలకు అధికార చిహ్నంగా నంది ధ్వజాన్నేస్వీకరించారు. నంది ఆది గురువు శ్రీ దక్షిణా మూర్తి  నుండి సకల వేదసారాన్ని, శివతత్వాన్ని నేర్చుకొన్నారు. అతను ఆ విషయాలను తన శిష్యులైన సనక, సనాతన,సనందన, సనత్కుమార, తిరుమూలార్, వ్యాఘ్రపాద, పతంజలి మరియు శివయోగ మునులకు ధారపోసి వారిని ఎనిమిది దిక్కులకు వెళ్లి "నందినాధ సంప్రదాయా"న్ని ప్రచారం చేయమని ఆదేశించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి. 
నంది యొక్క తెల్లని రంగు స్వచ్ఛతకు, న్యాయానికి నిదర్శనం అని, ఆలయాలలో ఉపస్థిత భంగిమలో కూర్చున్న నంది రూపం నిరంతరం జీవాత్మ దృష్టి పరమాత్మ వైపు  ఉండాలని, సంపూర్ణ శరణాగతితో, పరిపూర్ణ భక్తి భావంతో జీవి జీవనం సాగించాలన్న దానికి సంకేతం అని పెద్దలు చెబుతారు.  
శివాలయాలలో నందికి విశేష ప్రాధాన్యత ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా నంది లేని శివ సన్నిధి కానరాదు. అమావాస్య మరియు పౌర్ణమి కి ముందు వచ్చే త్రయోదశి నాడు జరిగే ప్రదోష  కాల పూజలో అగ్ర తాంబూలం నందీశ్వరునిదే ! ఉత్సవాలలో నిర్వహించే వాహన సేవలో తొలి స్థానం నందిదే ! తమిళనాడులో చోళులు, పల్లవులు, పాండ్యులు, నాయక రాజులు నిర్మించిన లెక్కలేనన్ని ఆలయాలలో నంది యొక్క భిన్న రూపాలను వీక్షించవచ్చును. మన దగ్గర లేదు కానీ తమిళనాడులో నందీశ్వర కళ్యాణం మహా ఘనంగా నిర్వహిస్తారు. తమిళ సంప్రదాయాలకు పట్టుకొమ్మ అయిన తంజావూరు చుట్టుపక్కల ఉన్న"సప్త స్దాన స్థలాంగళ్" అని పిలిచే ఏడు పురాతన ఆలయాలు నందీశ్వరుని వివాహంతో ముడిపడి ఉన్నాయి. 
అవి తిరువయ్యారు,తిరుప్పూన్తురుత్తి,తిరుఫళనం,తిరువేదకుడి,తిరునెయ్యిట్ఠానం, తిరుచోట్టుతురై మరియు తిరుఖండియూర్. ఈ క్షేత్రాలన్నీ నంది జన్మస్థలమైన తిరువయ్యారు చుట్టూ నెలకొని ఉన్నాయి. వివాహం జరిగే వధువు జన్మస్థలమైన "తిరుమిళపాడి"తో కలుపుకొంటే అన్ని ఆలయాలు సుమారు నలభై కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి.సులభంగా దర్శించుకొనవచ్చును. 
ఈ ఎనిమిది ఆలయాలు చోళరాజుల నిర్మాణాలే ! చక్కని శిల్పాలతో కూడిన మండపాలతో, ఎత్తైన రాజగోపురాలతో  ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పునర్వసు నక్షత్రం నాడు జరిగే నందీశ్వర కళ్యాణం ఈ గ్రామాల ప్రజలకు వారి ఇంటిలో జరిగే వివాహంతో సమానం. ఎనిమిది ఆలయాల ఉత్సవ మూర్తులతో పాటు ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ వేడుకలలో పాల్గొన్న అవివాహిత యువతీ యువకులకు కోరుకొన్నవారితో  కళ్యాణ ఘడియలు సమీపిస్తాయి అని స్థానికులు విశ్వసిస్తారు.

తిరుమిళపాడి 

నందీశ్వరునకు  తగిన వధువుగా నిర్ణయించబడిన "స్వయంప్రకాశిని" జన్మించినది తిరుమిళపాడి గ్రామంలో ! పెళ్లి కుమార్తె గృహంలోనే వివాహం జరగడం విధాయకం కదా !
సుందరాంబికా మరియు బాలాంబికా సమేత శ్రీ వైద్యనాధ స్వామి ఆడపెళ్ళివారి తరుఫున నిలబడతారు. పేరుకు తగినట్లుగా స్వామివారు వైద్యులే ! దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నవారు ఆలయ పుష్కరణిలో స్నానమాచరించి, శ్రీ వైద్యనాధునికి అభిషేకం జరిపించుకొంటే గుణం కనపడుతుందని చెబుతారు. ముఖ్యంగా జ్వరంతో అవస్థపడే వారు ఉప్పుడు బియ్యంతో వండిన అన్నం మరియు రసం శ్రీ జ్వర హరహరునికి నివేదనగా సమర్పించుకొంటే తగ్గిపోతుందని విశ్వసిస్తారు.
ఈ ఆలయంలో ఇద్దరు అమ్మవార్ల మరియు రెండు దక్షిణామూర్తి సన్నిధులు కలిగి ఉండటం ఒక విశేషంగా పేర్కొనాలి. మరెక్కడా ఇలాంటిది కనపడదు. అరుదుగా కనిపించే శ్రీ బ్రహ్మదేవుని ఉపాలయం కూడా ఇక్కడ ఉంటుంది. విధాత విగ్రహం నాలుగు పక్కలా  ఉన్న నాలుగు నందులను వేదాలకు ప్రతీకగా పరిగణిస్తారు.మిగిలిన ఏడు ఆలయాలు కొల్లిడాం నదికి దక్షిణం వైపునుండగా తిరుమిళపాడి ఉత్తరం పక్కన ఉంటుంది. పెళ్ళివారు నదిని దాటి రావాలి.
పెళ్లి సందర్బంగా ఊరుని, ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. వియ్యాలవారికి స్వాగతసత్కార్యాలు చేయడానికి సకల ఏర్పాట్లు చేస్తారు.

తిరుప్పూన్తురుత్తి 

వరునితో కలిసి శ్రీ ధర్మసంవర్ధనీ సమేత శ్రీ పంచనాథేశ్వర స్వామి వారు అందంగా అలంకరించిన పల్లకీలో బయలుదేరి తొలి మజిలీగా తిరుప్పూన్తురుత్తి లో ఆగుతారు. అక్కడ కొలువైన శ్రీ సౌందర్య నాయకీ సమేత శ్రీ పుష్పవనేశ్వరస్వామి వార్లను వివాహానికి ఆహ్వానిస్తారు. శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు, ఇంద్రుడు,సూర్యుడు ఆదిగా గలవారు ఇక్కడి స్వామివారిని సేవించుకొన్నట్లుగా పురాణగాధలు తెలుపుతున్నాయి. 
నయమ్మారులలో ప్రముఖులైన జ్ఞాన సంబందార్ మరియు అప్పార్ శ్రీ పుష్పవనేశ్వరస్వామి వారిని కీర్తిస్తూ తేవరాలు గానం చేశారు. పెళ్లి పెద్దల ఆహ్వానాన్ని మన్నిస్తూ శ్రీ పుష్పవనేశ్వర స్వామి సతీసమేతులై సుందరంగా తీర్చ్చిదిద్దిన పల్లకీలో ఉపస్థితులై కళ్యాణానికి కావలసిన పుష్పాలను తీసుకొని బయలుదేరుతారు.

తిరునెయుత్తానం (తిళైస్థానం)

రెండు జంటలు మేళతాళాలతో శ్రీ వలాంబికై సమేత శ్రీ నెయ్యాదిఅప్పార్ కొలువైన తిళైస్థానం చేరుకొంటారు. శ్రీ నెయ్యాది అప్పార్ సకలవిద్యలకు అధినేత్రి అయిన సరస్వతీ దేవి పూజలందుకొన్నారని స్థలపురాణం తెలుపుతోంది. సంబందార్ మరియు అప్పార్, స్వామివారిని ప్రస్తుతిస్తూ కీర్తనలు గానం చేశారు. అతిధుల కోసం ఏర్పాటు చేస్తున్న విందు భోజనానికి కావలసిన  నెయ్యి ని తీసుకొని కళాత్మకంగా అలంకరించిన పల్లకీలో తిళైస్థానం దేవర కూడా దేవేరితో కలిసి వివాహానికి బయలుదేరుతారు.











తిరుప్పళనం

వైకుంఠ వాసుడు, చంద్రుడు, కుబేరుడు మొదలైన వారి పూజలందుకున్న పెరియనాయకీ సమేత శ్రీ ఆపత్సహాయేశ్వర స్వామి, అతిధులను ఆహ్వానించి, వారి పిలుపు మేరకు పెళ్ళికి బయలుదేరుతారు. వివాహానికి విచ్చేసిన వారికి  సమర్పించుకొనే తాంబూలంలో ఉంచడానికి కావలసిన ఫలాలను తీసుకొని చక్కగా అలంకరించిన పల్లకీలో బయలుదేరుతారు. అలా నాలుగు జంటలు తమ పరివారం చేస్తున్న కైవారాల నడుమ తరువాతి గమ్యానికి కదులుతారు. 
ఈ ఆలయంలో గొప్ప నిర్మాణ చతురత కనపడుతుంది. దక్షిణాయనంలో అలానే ఉత్తరాయంలో అంటే మార్చిలో మరియు అక్టోబర్ లో వచ్చే పౌర్ణమి రోజులలో తన వెన్నెలను నేరుగా చంద్రశేఖరుని పైకి ప్రసరింపచేస్తాడు.   

తిరుఖండియూర్ 

శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో మరియు పడాల్ పేట్ర స్థలాలలో ఒకటిగా కీర్తించబడిన తిరుఖండియూర్ లో శ్రీ హర శాప విమోచన పెరుమాళ్ ఆలయం మరియు శ్రీ మంగలాంబిక సమేత శ్రీ బ్రహ్మశిర ఖండీశ్వర స్వామి వారి ఆలయం ప్రముఖమైనవి. ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం మరో విశేషం. సృష్టికర్త చేసిన తప్పుకు ఆగ్రహించిన పరమేశ్వరుడు ఆయనకున్న అయిదో శిరస్సును ఖండించారట. అలా స్వామివారికి ఈ పేరొచ్చినట్లుగా పేర్కొంటారు. ప్రాంగణంలో చతుర్ముఖాలతో సరస్వతీ సమేతులై కొలువైన విధాతను సేవించుకోవచ్చును. అలా ఖండించిన శిరస్సు మహేశ్వరుని చేతిలో ఉండి పోయిందట. అంతే కాక ఆయనకు బ్రహ్మ హత్య పాతకం సంక్రమించిందట. అప్పుడు సదాశివుడు శ్రీమన్నారాయణుని  ఆశ్రయించారట. శ్రీహరి సహకారంతో కైలాసనాధుడు శాపవిమోచనుడయ్యాడట. ఈ కారణంగా వైకుంఠునికి ఆ పేరు వచ్చినట్లుగా క్షేత్రగాధ వెల్లడి చేస్తోంది. తిరు ఖండీయూర్ అష్ట వీరట్ట క్షేత్రాలలో ఒకటిగా కీర్తించబడుతోంది. 
ఆహ్వానాన్ని అందుకొన్న ఖండీశ్వర స్వామి సతీసమేతులై కళ్యాణానికి కదులుతారు. ఇక్కడ అందరు అమ్మవార్లు వివాహానికి కావలసిన నగలను సేకరిస్తారు. అలా ఒక్కోటి సిద్దం చేసుకొంటూ, ఒక్కొరిని పిలుస్తూ అందరూ కలిసి తరువాతి మజిలీ వైపుకు బయలుదేరుతారు. 

చోటుతురాయి

శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ఓధనవనేశ్వర స్వామి కొలువైన చోటుతురాయి సప్త స్దాన స్థలాలలో ఆరవది. ఇక్కడి ఆలయ మండప స్థంభాలపైన నందీశ్వర కల్యాణానికి చేసిన విందుభోజనం ఏర్పాట్లను చెక్కారు. ఈ కారణం వలన ఆదిదంపతులు ఇక్కడే వివాహానికి కావలసిన వంటల తయారీకి ఏర్పాట్లు చేసుకొన్నారని అంటారు. చోటు తురాయి దేవీదేవతలు కూడా రమణీయంగా తయారు చేసిన పల్లకీలో పరిణయ వేడుకకు బయలుదేరుతారు. 

తిరువేదకుడి 

శ్రీ మంగయార్ కరశి సమేత శ్రీ వేదపురీశ్వర స్వామి వివాహ తంతు నిర్వహించడానికి తగిన వేద పండితుని సిద్ధం చేయగా, ఆయనతో కలిసి మొత్తం ఏడు జంటలూ నదిని దాటి వివాహ వేదికను చేరుతారు.  
భక్తుల జయజయ ధ్వానాల మధ్య సప్త రూపాలలో కొలువైన పార్వతీ సమేత సర్వేశ్వరుని సమక్షంలో శ్రీ నందీశ్వరుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 
అత్యంత అరుదైన ఈ ఉత్సవాన్ని వీక్షించడం ఒక మధురానుభూతిగా అభివర్ణించవచ్చును.

నమః శివాయ !!!!

19, మార్చి 2018, సోమవారం

Sri Trivikrama Swamy Temple, Cherukuru

               


                 శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, చెరుకూరు 


                                                                                                   




లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించారని మనందరికీ తెలుసు.  తెలియని విషయం ఏమిటంటే ఆ దశావతారాల ఆలయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరే రాష్ట్రానికి ఆ గౌరవం దక్కలేదంటే అతిశయోక్తి కాదు. కొందరు కేరళలో కూడా దశావతార ఆలయాలు ఉన్నాయి అని అంటారు. కానీ అది సరి కాదు. అక్కడ శ్రీ కల్కి అవతార ఆలయం లేదు. (ఆ పది ఆలయాల వివరాల కొరకు  ఈ బ్లాగ్లో Rare Temples of Andhrapradesh చూడగలరు). 
సహజంగా మనం రామ, కృష్ణ లేక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఎక్కువగా చూస్తుంటాము. కొంత వరకు అనంతశయన లేక శ్రీ రంగనాయక స్వామి ఆలయాలు కూడా కనపడతాయి మనరాష్ట్రంలో ! కానీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ ఆదిగాగల అవతార ఆలయాలు మన రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్నాయి. అదే విధంగా అత్యంత అరుదైన వామన లేదా త్రివిక్రమ ఆలయం ఒకటి మన రాష్ట్రంలోని బాపట్ల దగ్గర లోని చెరుకూరు గ్రామంలో కలదు.
తమిళనాడులోని కంచి మరియు తిరుక్కోవిలూరు లలో కూడా శ్రీ త్రివిక్రమ ఆలయాలున్నాయి. ఆ రెండు ఆలయాలలో స్వామివారు పాతిక అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో కొలువై  ఉంటారు.  కేరళలో కూడా వామన మరియు త్రివిక్రమ ఆలయాలున్నాయి. కానీ అక్కడ చతుర్భుజ శ్రీ మహా విష్ణువు రూపంలో పూజలందు కొంటుంటారు. (ఈ ఆలయాల వివరాలు కూడా ఈ బ్లాగ్ లో కలవు)
కానీ చెరుకూరులో వెలసిన శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం చాలా ప్రత్యేకతలు కలిగినది.




   


గతంలో చెరుకూరుని  "ఇక్షు పురి" అని పిలిచేవారు. ఇక్షు అంటే చెఱకు. అదే కాలక్రమంలో చెరుకూరుగా మారింది అని చెబుతారు. చోళులు, పల్లవులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చారిత్రక మరియు శాసనాధారాలు తెలుపుతున్నాయి.
ద్వారసముద్రం (హళిబేడు)ని రాజదానిగా చేసుకొని పాలించిన హొయసల వంశ రాజులలో ప్రఖ్యాతుడు విష్ణువర్ధన్ మహారాజు. దక్షిణాదిన ఎన్నో ప్రాంతాలను తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు. దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వెళుతూ ఇక్కడ బస చేశారు. 
అప్పుడు సరస్సు ఒడ్డున చెట్టు నీడన లేత గులాబీ వర్ణంలో  ఏకశిలా విగ్రహ రూపంలో శ్రీ త్రివిక్రమ స్వామి దర్శనమిచ్చారు. శ్రీ రామానుజాచార్యులు శిష్యుడైన విష్ణువర్ధనుడు భక్తితో ప్రణమిల్లి పూజాదులు నిర్వహించాడు.










అనంతరం తనతో ఉన్న శిల్పులను పిలిచి విగ్రహాన్ని కదిలించకుండా ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. కారణమేమిటంటే విగ్రహం భూమిలో యెంత లోతుగా ఉన్నదో తెలియకపోవడమే ! శిల్పులు తొలుత నాలుగు  దిశలా మండపాలను నిర్మించారు. తదనంతరం రామాయణ, భాగవత మరియు భారత గాధల శిల్పాలను రమణీయంగా చెక్కిన రాళ్లతో గర్భాలయాన్ని నిర్మించారు. రాజు ఆలయ నిర్వహణకు కొన్ని గ్రామాల ఆదాయాన్ని తన వంతు కైకర్యంగా సమర్పించుకున్నాడు.
















తదనంతర కాలంలో ఎన్నో రాజవంశాలు వారు శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆలయం లో లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయి. అలా తరతరానికి అభివృద్ధి చెందిన ఆలయం నరసరావుపేట జమీందారు శ్రీ వేంకట నరసింహారావు బహద్దూర్ గారి కాలంలో శిఖరాగ్రానికి చేరుకొన్నది. ప్రస్తుతం కనపడుతున్న పెక్కు నిర్మాణాలు ఆయన కాలంలో నిర్మించబడినవి. 









ఆస్థాన మండపంలో ఉన్న గరుడ స్థంభం పైన చెక్కబడిన శాసనం ఆలయం గురించి పెక్కు సమాచారం అందిస్తోంది. ధ్వజస్థంభం పక్కనే అంజనాసుతుడు స్వామివారి సేవకు సిద్ధం అన్నట్లుగా ముకుళిత హస్తాలతో స్థానిక భంగిమలో కొలువై ఉంటారు. 
గర్భాలయంలో సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల లేత గులాబీ వర్ణ శిల మీద కుడి పాదం వద్ద ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, శుక్రాచార్యుడు
ఉండగా, ఆకాశాన్ని తాకుతున్న ఎడమ పాదాన్ని బ్రహ్మాది దేవతలు కడుగుతుండగా, పక్కనే నారద తుంబురాదులు ఆనంద గానం చేస్తుంటారు. స్వామి వారు దండం, కమండలం, ఛత్రం శంఖు చక్రాలను, పాదాలకు పావుకోళ్ళను ధరించి నయనమనోహర రూపములో దర్శనమిస్తారు.   
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో ప్రతి నిత్యం వైఖానస ఆగమనం ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు. వామన జయంతి, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామనవమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు.  చెరుకూరు లో శ్రీ అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ పర్యటన సందర్బంగా కొంతకాలం భార్య లోపాముద్ర, శిష్యప్రశిష్య బృందంతో విడిది చేసినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆ సమయంలో ఆయన భార్య కోరిక మేరకు పంచ శివలింగ ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. అవి చెరుకూరు, ఉప్పుటూరు, కొమ్మూరు, మోటుపల్లి మరియు పంగులూరు. 
చెరుకూరులో ప్రతిష్టించిన శివాలయం తప్పక సందర్శించవలసినది. శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయ సమీపంలోనే ఉంటుంది. 
చెరుకూరు బాపట్ల పట్టణం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాపట్ల లోని పురాతన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం దర్శించుకోవడం వాంఛనీయం !

జై శ్రీమన్నారాయణ !!!!

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...