Airavateswarar Temple, Darasuram

శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం, ధారసురం ఐరావతం కొలిచిన శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయాల రాష్ట్రం తమిళనాడులో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. ముఖ్యంగా చోళ రాజుల కాలం(క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 13వ శతాబ్దం)లో నిర్మించిన ఆలయాలు మనోహరమైన శిల్పాలకు నిలయాలు. తమిళ దేశంలో ఆలయాల నిర్మాణానికి ఆద్యులు పల్లవులు. వీరి కాలంలో ఎక్కువగా నిర్మించబడినవి గుహాలయాలు. మహాబలిపురం దీనికి నిదర్శనం. చోళుల తరువాత పాండ్యులు, విజయనగర, నాయక, హొయసల రాజ వంశాల వారు కూడా చక్కని ఆలయాల నిర్మాణాలు చేశారు. చోళుల నిర్మాణాలన్నీ విశాల ప్రాంగణంలో, రాతిని మైనపు ముద్దలా మలచగల నేర్పులైన శిల్పులు చిత్రవిచిత్రమైన శిల్పాలు, పురాణ ఘట్టాలను రమణీయంగా చెక్కారు. చోళ రాజుల నిర్మాణాలలో ప్రతివొక్కటి ఎన్నదగ్గవే ! కానీ శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు, గంగై కొండ చోళ పురం లాంటివి ఆణి ముత్యాల లాంటివి. అదే కోవకి చెందిన మరో ఆలయం శ్రీ ఐరావతేశ్వర స్వామి కొలువైన ధారాసురం లో ఉన్నది. ...