శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం
ఈ పేరు వినగానే మన కనుల ముందు ఒక చిత్రమైన రూపం మెదులుతుంది. పెదవుల మీదకు నవ్వు వస్తుంది. కానీ చిత్రగుప్తుడు సామాన్యుడు కాదు. సృష్టికర్త బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించినవాడు. విధాతకు తెలియ కుండా ఆయన కాయంలో (దేహంలో) దాగి ఉండి ఆయనకు తెలియ కుండా బయటకు వచ్చిన చిత్ర మైన వాడు గనుక ఈయనకు చిత్రగుప్తుడు అన్న పేరొచ్చినది.
భూలోకం లోని ప్రాణులు తమ జీవితాలలో చేసిన అన్ని పనులను నమోదు చేసేవాడు.వాటిని బట్టి మరణానంతరం నరకమా ? స్వర్గమా ? అన్నది తెలిపేవాడు. అత్యంత మేధావి. సునిశిత పరిశీలన గలవాడు.అసలు చిత్రగుప్తుడు అంటే అన్ని విషయాలను గుప్తంగా ఉంచేవాడు అని కదా అర్ధం ! దానిని నిరంతరం నిలబెట్టుకునే వాడు చిత్రగుప్తుడు.
అసలు తొలిసారి అక్షర మాలను, సంఖ్యలను రాసినవాడు చిత్రగుప్తుడే !
ఇన్ని విశేషాలు ప్రత్యేకతలు కలిగి చతుర్ముఖుని దేహం నుండి ఆవిర్భవించిన వాడు నరకంలో ఉంటూ సతతం జీవుల పాపపుణ్యాలను లిఖించడం ఏమిటి ?
ఈయన జన్మ వృత్తాంతం మరియు లక్ష్యం గురించిన కధలు అనేక పుస్తకాలలో ఉన్నాయి.
జీవుల పాపపుణ్యాలను లెక్క కట్టడంలో త్రీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు యమధర్మ రాజు. కొన్ని వేల జీవుల గురించి సరి అయిన విధానం లేక పాపులను స్వర్గానికి, పుణ్య జీవులను నరకానికి పంపుతూ అవస్థపడుతున్న సమవర్తికి తన కర్తవ్య నిర్వహణ సరిగ్గా ఉండాలంటే ఏమిచేయాలో పాలుపోలేదు. మార్గదర్శకత్వం కొరకు సత్యలోకం వెళ్లి హంసవాహనుని వేడుకొన్నాడు. ఆయనకు కూడా ఏమి చేయాలో తోచలేదు. సుదీర్ఘ ధ్యానం లోనికి వెళ్లి పోయి కొన్ని సంవత్సరాల తరువాత కనులు తెరువగా ఎదురుగా ఘంటం తాళపత్రాలు పట్టుకొని ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరు నీవు అని ప్రశ్నించగా తాను చాలాకాలం ఆయన శరీరంలో గుప్తంగా ఉన్నానని తెలిపాడు.
యముని సమస్యకు పరిష్కారం ఇతని వలన లభిస్తుంది అని అర్ధం చేసుకొన్నాడు బ్రహ్మ. తనకు తెలియకుండా తన శరీరంలో గుప్తంగా ఉన్నఅతనికి చిత్రగుప్తుడు అని నామకరణం చేసి నరక లోకానికి వెళ్లి యమధర్మరాజుకు జీవుల పాప పుణ్యాల లెక్కలలో సహాయ పడమని ఆదేశించారు. ఆ ప్రకారం చిత్రగుప్తుడు నాటి నుండి తనకు అప్పగించిన పని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు.
మన దగ్గర తక్కువ కానీ ఉత్తరాదిలో చిత్రగుప్త ఆరాధన చాలా ఎక్కువ. కాయస్థ కులస్థులు ఈయనను తమ వంశ మూలపురుషునిగా భావించి కొలుస్తారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, రాష్ట్రాలలో ఎన్నో చిత్రగుప్త ఆలయాలు ఉన్నాయి.
తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా ఒక చిత్రగుప్త ఆలయం ఉన్నది.
తమిళనాడు రాష్ట్రంలో ఆలయాల నగరం సప్త ముక్తి ముక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో ఒక విశిష్ట ఆలయం తొమ్మిదో శతాబ్దంలో చాలా రాజుల చేత నిర్మించబడినది కలదు.
కంచి బస్టాండ్ కు అత్యంత సమీపంలో ఉన్నఈ ఆలయం అత్యంత అరుదైనది. తూర్పు ముఖంగా ఉన్న మూడు అంతస్థుల రాజ గోపురం కొద్దీ దూరానికి స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నదైనా ముఖమండపం లోనికి ప్రవేశించగానే ఎదురుగా గర్భాలయంలో ఉపస్థితః భంగిమలో కుడి చేతిలో ఘంటం, ఎడమ చేతిలో తాళపత్రాలు పట్టుకొని నయన మనోహర పుష్పాలంకరణలో దర్శనమిస్తారు మూలవిరాట్టు శ్రీ చిత్రగుప్తులవారు.
ప్రతి నిత్యం ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో వివిధ రకాల పూజలు, అర్చనలు, అలంకారాలు మరియు ఆరగింపులు జరుగుతాయి. స్వామి ఆరాధన జన్మజన్మల పాపాల నుండి ఉపశమనం కలిగిస్తుంది అన్నది తరతరాల నమ్మకం.
చిత్రగుప్తుని జన్మ దినమైన చైత్ర పూర్ణిమ రోజున విశేష పూజలు నిర్మహిస్తారు. అదే రోజున చిత్రగుప్త కళ్యాణం కూడా జరుపుతారు.తిరువణ్ణామలై (అరుణాచలం)లోని అమ్మవారు శ్రీ ఉణ్ణామలై అమ్మన్ ఆలయ ఆస్థానమండపంలోని నవగ్రహ సన్నిధి వద్ద శ్రీ చిత్ర గుప్త సన్నిధి ఉన్నది. అక్కడ కూడా చైత్ర పౌర్ణమికి విశేష పూజలు జరుపుతారు.
నవగ్రహాలలో కేతు గ్రహానికి అధిపతి చిత్రగుప్తుడు. ఈయనకు చేసే పూజల వలన కేతు గ్రహ ప్రభావం వలన కలిగే ఇబ్బందులైన అయినవారితో ఆస్తి తగాదాలు, దురభ్యాసాలకు లోను కావడం, వివాహ సంబంధిత ఇబ్బందులు, గౌరవం కోల్పోవడం లాంటి వాటి నుండి బయట పడవచ్చును. కేతు అనుగ్రహం మనిషిని భగవంతునిగా మారుస్తుంది అని శాస్త్ర వాక్యం.
ప్రధాన ఆలయం వెనుక అమ్మవారి చిత్రగుప్తుని దేవేరి శ్రీ కర్ణగీ అమ్మవారు కొలువుతీరి ఉంటారు.
ఆలయాలకు ప్రసిద్ధి చెందిన కంచిలో తప్పనిసరిగా దర్శించవలసిన అరుదైనది శ్రీ చిత్రగుప్త ఆలయం.