శ్రీ అరుణగిరినాధర్ ఆలయం, తిరువన్నామలై
గతంలో చెప్పుకొన్న విధంగా అరుణాచలంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి.
కానీ మూడు ఆలయాలు మాత్రం తిరువన్నామలై ఆవిర్భావానికి సంభందించిన పురాణ గాధతో ముడిపడి ఉండటం చెప్పుకోవాల్సిన / తెలుసుకోవాల్సిన అంశం.
కైలాస వాసుడు వాదులాడు కొంటున్న బ్రహ్మ, విష్ణు లకు తగిన రీతిన సమాధానపరచి ఈ క్షేత్రంలో అగ్ని లింగ రూపంలో వెలిసారన్నది పురాణగాధ.
తమ మధ్య సామరస్యత నెలకొల్పి అనవసర వివాదాలు కూడదు అన్న విషయాన్ని తెలిపిన పరమేశ్వరునికి విధాత మరియు స్థితి ప్రదాత ఒక్కో ఆలయాన్ని నెలకొల్పారు.
అవే ఆది అన్నామలై స్వామి ఆలయం మరియు అరుణ గిరి నాదర్ ఆలయం.
సృష్టి కర్త ప్రతిష్టిత శ్రీ ఆది అన్నామలై స్వామి ఆలయం అరుణా చలానికి వెనుక పడమర దిక్కులో ఉంటుంది. ( ఈ ఆలయ విశేషాలను ఈ బ్లాగ్ లో చూడవచ్చును)
వైకుంఠ వాసుడు నెలకొల్పిన శ్రీ అరుణ గిరి నాధర్ ఆలయం శ్రీ అన్నామలై స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న రహదారిలో "అయ్యన్ కులం " పుష్కరణి పక్కన ఉంటుంది.
శ్రీ అరుణాచలేశ్వరుని తెప్పోత్సవం ఈ కోనేరు లోనే జరుగుతుంది. ఈ నీటితోనే అష్ట దిక్పాలక లింగాలలో మొదటిదైన ఇంద్ర లింగానికి ప్రతి నిత్యం అభిషేకం జరుపుతారు. ఈ కారణంగా "ఇంద్ర పుష్కరణి" అని కూడా పిలుస్తారు. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం బ్రాహ్మణ అగ్రహారం. బ్రాహ్మణులను అయ్యవారు అని కూడా పిలుస్తారు కదా! అలా "అయ్యన్ కులం" ( అయ్యవార్ల కోనేరు)గా స్థిరపడిపోయింది.
ఇంతటి విశేషత కలిగిన పుష్కరిణి ఒడ్డున ఎలాంటీ నిర్మాణ ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా ఉండేదే శ్రీ అరుణ గిరి నాదర్ ఆలయం.
నిర్మాణ కాలం ఏనాటిదో అన్న పూర్తి వివరాలు తెలియకున్నా ప్రస్తుత నిర్మాణం పదిహేనో శతాబ్ద కాలంలో విజయ నగర, నాయక రాజుల మరియు స్థానిక పాలకుల అధ్వర్యంలో చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రధాన ద్వారం పైభాగాన చిన్న గోపురం దానికి ఇరుపక్కలా నంది వాహన పరమేశ్వర, శ్రీ రుక్మిణీ సత్య భామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి రూపాలను ఉంచారు.
పురాతన మండపంలోఒక పక్కన శ్రీ గణపతి మరో పక్క శ్రీ కుమార స్వామి ఉపస్థితులై దర్శనమిస్తారు.
తిరువన్నామలై లోని అన్ని ఆలయాలలో శివ కుమారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అరుణాచలేశ్వర స్వామి ఆలయంలోనే వీరిరువురి ఉపాలయాలు ఎన్నో ఉండటం గమనించవచ్చు.
చూడటానికి ఈ ఆలయం చాలా చిన్నదిగా కనపడుతుంది. కానీ లోపల ఎన్నో నిర్మాణాలు విశేషాలు ఉంటాయి.
గర్భాలయానికి గోడలకు గణపతి, లింగోద్భవ మూర్తి, శ్రీ మహా విష్ణువు రూపాలను నిలిపారు.
మండపం దాటి ముందుకి వెళితే నంది , ఎదురుగా శ్రీ అరుణగిరినాథర్ లింగ రూపంలో వివిధ వర్ణ పుష్పాలంకరణలో రమణీయంగా దర్శనమిస్తారు.
గర్భాలయం వెనక ఉన్న పురాతన మండపంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ మహలక్ష్మి విగ్రహాలను ప్రతిష్టించారు. అలా ఈ ఆలయం హరిహర క్షేత్రంగా రూపాంతరం చెందినది.
గర్భాలయానికి ఉత్తర భాగాన చిన్న మందిరంలో శ్రీ చెండికేశ్వర స్వామి ఉపస్థితులై ఉంటారు. భక్తులు మూడు సార్లు చప్పట్లు కొట్టి తమ గోత్ర నామాలు, జన్మ నక్షత్రాలు చెప్పుకొని తమ కోర్కెలను విన్నవించుకొంటారు. ఆయన వాటిని శ్రీ అరుణగిరి నాదర్ కి తెలిపి భక్తుల మనో భీష్టాలు నెరవేర్చేలా చేస్తారు అన్నది తరతరాల విశ్వాసం.
పక్కనే ఉన్న మరో ఆలయంలో అమ్మవారు శ్రీ జ్ఞానంబిక దేవి కొలువుతీరివుంటారు.
ప్రధాన ఆలయం లోని అమ్మవారు, ఆది అన్నామలై ఆలయం లో ఉన్న దేవేరి ఇద్దరి పేర్లు శ్రీ ఉన్నామలై అమ్మన్. కానీ ఇక్కడ మాత్రం పేరు వేరే ! కానీ గమనించవలసిన అంశం ఏమిటంటే ముగ్గురి రూపాలు ఒకే రకంగా ఉండటం. అరుదైన అంశం.
ఇదే కాకుండా మరో రెండు ప్రత్యేకతలు ఈ ఆలయంలో నెలకొని ఉన్నాయి.
శివాలయాలలో నవగ్రహ మండపం ఉండటం సహజం ! అలానే శ్రీ అరుణగిరి నాదర్ ఆలయంలో కూడా ఉన్నది.
ఇక్కడి విశేషమేమిటంటే నవగ్రహాలు తమ తమ వాహనాల మీద సతీ సమేతంగా కొలువుతీరి ఉండటం. నాకు తెలిసి ఇలాంటి అరుదయిన నవగ్రహ మండపం మదురై పట్టణం లోని అళగర్ పెరుమాళ్ కోవెలలో ఉన్నది.
ఇలా కొలువైన నవగ్రహాలను పూజిస్తే అన్ని గ్రహ భాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అన్ని విషయాలలో జయం లభిస్తుంది.
నవగ్రహ మండపం పక్కనే భైరవ సన్నిధి ఉంటుంది. శివాలయాలలో మనం ఎక్కువగా చూసేది "కాల లేదా ఉగ్ర " భైరవ రూపాలనే ! కానీ ఇక్కడ కొలువైనది "స్వర్ణ భైరవ". ధన ప్రదాత. నూట ఎనిమిది రూపాయి నాణేలతో అర్చించి వాటిని మన బీరవాలలో ఉంచుకొంటే రాబడి అధికమవుతుందనేది స్థానిక నమ్మకము. ప్రతి అష్టమి నాడు జరిగే భైరవ అభిషేకం లో భక్తులు వేలాదిగా పాల్గొనడం వారి విశ్వాసానికి నిదర్శనం.
ఆలయ వృక్షం జమ్మి. ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రతి సోమవారము, మాస శివరాత్రి నాడు, త్రయోదశి నాడు ప్రదోష పూజలు, కార్తీక మాస పూజలు, నవరాత్రులు ఇలా అన్ని విశేష దినాలలో ఎన్నో రకాల అభిషేకాలు, పూజలు, అర్చనలు, అలంకరణలు శ్రీ అరుణగిరి నాదర్ మరియు శ్రీ జ్ఞానాంబిక దేవికి జరుపుతారు.
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పదకొండు వరకూ తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీ అన్నామలై స్వామి ఆలయానికి తూర్పున ఉంటుంది. నడిచి వెళ్ళవచ్చును.
స్థానికంగా ఒక విశ్వాసం వ్యాపించి ఉన్నది.
ఆది అన్నామలై ఆలయం శిరస్సుగా, శ్రీ అన్నామలై స్వామి ఆలయం శరీరంగా, శ్రీ అరుణగిరి నాదర్ ఆలయం పాదాలుగా పేర్కొంటూ త్రిమూర్తుల ప్రతిరూపాలుగా భావించే ఈ మూడు ఆలయాలను ఒకే రోజు సందర్శిస్తే సమస్త కోరికలు నెరవేరతాయని చెబుతారు.