అలాంటి పవిత్ర క్షేత్రాలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఒకటి.
తిరుపతిలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పేర్కొనే ఈ ఆలయ చరిత్ర త్రేత, ద్వాపర, కలి యుగాలకు చెందినదిగా తెలుస్తోంది.విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు మరో చిరునామా.
కొద్దిగా ఎత్తులో ఉండే గర్భాలయంలో నిలువెత్తు శ్రీ రామ, లక్ష్మణ, సీతాదేవి విగ్రహాలు నయన మనోహర పుష్ప, స్వర్ణా భరణ అలంకరణతో దేదీప్య మానంగా ఉంటాయి.
ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు ఉన్నాయి. అన్ని ఆలయాలలో రామునికి ఎడమ పక్కన ఉండే జానకీ మాత ఇక్కడ కుడిప్రక్కన కొలువై ఉంటారు. అదేవిధంగా పాదాల వద్ద ఉండాల్సిన ఆంజనేయుడు ఉండడు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా మరో మందిరంలో ఫల, పుష్ప అలంకరణతో నిలువెత్తు రూపంలో అంజనా సుతుడు కొలువు తీరి వుంటారు.
ఆలయానికి బయట ఉన్న ఉత్సవ మండపం పైన రామాయణ ఘట్టాలను రమణీయ సూక్ష్మ శిల్పాలుగా చెక్కారు.
స్థల పురాణం ప్రకారం రామ రావణ యుద్దానంతరం అయోధ్యకు తిరిగి వెలుతూ సపరివార సమేతంగా శ్రీ రాముడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని తెలుస్తోంది.