5, డిసెంబర్ 2012, బుధవారం

palayur- syro-malabar catholic church

                      పలయూర్ - ప్రచారకుని ప్రధమ మజిలి 

                                                                                                           =  ఇలపావులూరి వెంకటేశ్వేర్లు 


"భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు." అంటూ కారు దిగి లోపలికి నడుస్తూ నా కేరళా మిత్రుడు శయన్ తో అన్నాను.
దీనికి నేపద్యం ఏమిటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే శబరిమల యాత్ర చేసుకొని తిరుగు ప్రయాణంలో గురువాయూర్ వచ్చాము నేను, నే ఇద్దరు మిత్రులు.
అక్కడ ఉండే శయన్ మమ్ములను రిసీవ్ చేసుకొని తన కారులో గురువాయూర్ లోని కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తున్నప్పుడు నేను పలయూర్ చర్చి గురించి అడిగి, చూడాలని ఉన్నది అన్నాను.
నా వంక అదోలా చూస్తూ" నువ్వా !" అన్నదానికి నా సమాధానమే  పైన చెప్పినది.
దానికి తను కూడా నవ్వుతూ మాతో పాటు నడిచాడు.
గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఈ దేశం లోని ప్రజలు ఎన్నో కులాలు, మతాలు, రకరకాల భగవద్ ఆరాధనా విధానాలను ఆచరిస్తున్నా మనందరి మూలాలు ఒక్కటే అనే సత్యాన్ని తెలిపే చారిత్రాత్మిక ప్రదేశం పలయూర్.
 ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం గురువాయూర్, సందర్శించిన పలితం దక్కాలంటే తప్పక దర్సించాల్సిన మమ్మియూర్ మహాదేవ మందిరం, ఎన్నో చరిత్ర కందని ఆలయాలు, కొదంగాల్లుర్ దగ్గరలో ఏడో శతాబ్దంలో హిందూ నిర్మాణ శైలిలో నిర్మించబడిన భారతదేశ తొట్ట తొలి జూమ మసీదు అయిన చేరమాన్ జూమా మసీదు దీనికి సాక్ష్యం గా నిలుస్తాయి.
చేతిలోని కెమెరాను సర్దుకుంటూ పరిసరలన్నింటిని గమనిస్తూ పలయుర్ సైరో - మలబార్ కాథలిక్ చర్చి గురించి చదివినవి, విన్నవి గుర్తుకుతెచ్చుకొన్నాను.

సెయింట్ థామస్ - భారత దేశంలో తొలి అడుగు 

జీసస్ క్రీస్తుకు అత్యంత సన్నిహితులైన పన్నెండుమందిలో ( వీరినే Apostle అంటారు ) ఒకరైన సెయింట్ థామస్, ఈయననే సందేహ ప్రాణి ( డౌటింగ్ థామస్ ) అని కూడా పిలుస్తారు.
క్రీస్తుకు శిలువ వేసిన తరువాత ఆయన సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ఆకాంక్షతో బయలుదేరారట.
ఆ పర్యటనలో ఇజ్రాయిల్ చేరుకొని, కొంతకాలముంది, అప్పటికే భారతదేశంతో వ్యాపార సంభంధాలు ఏర్పరచుకొన్న అక్కడి వ్యాపారస్తులతో కలిసి తన తొలి అడుగును కేరళలోని  క్రాన్గానోర్ ( నేటి కొదంగాల్లూరు ) లో క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో మోపారు.
తరవాత పలయూర్ చేరుకొన్నారు. తన మహిమలతో ( సింహం, ఏనుగు, పులి లాంటి అడవి జంతువులను కంటి చూపుతో వశంచేసుకోవడం లాంటివి) స్థానికులను సంభ్రమాశ్హర్యాలకు లోను చేసి చాలా మందిని క్రిస్తవులుగా మార్చారు. నాడు కేరళ లోని కొందరు పాలకులు కూడా థామస్ భోధనలకు ప్రభావితులై ఆయనను అనుసరించారట.
కొంత కాలం కేరళలోనే ఉండి, తమిళనాడు లో ప్రభోధనలు చేస్తూ మద్రాసు చేరుకొని నేటి  మీనంబాకం విమానాశ్రయం దగ్గరలోని సెయింట్ థామస్ మౌంట్ గా పిలవబడుతున్న కొండమీద ఉంటూ ఉండగా  ఆయన చేస్తున్న మత ప్రచారానికి ఆగ్రహించిన వారు ఒకనాడు ప్రార్ధనలో ఉన్న థామస్ ను పొడిచి చంపేసారట. ఆయన స్మారకార్ధం ఒక ప్రార్ధనా మందిరం అక్కడ, సైదాపేట దగ్గర లోని చిన్న మలై లోను నిర్మించారని తెలుస్తోంది.
భారత దేశ ప్రభుత్వం థామస్ గౌరవార్ధం రెండు తపాల బిళ్ళలను ప్రవేశ పెట్టినది.
భారత దేశంలో మొత్తం పదిహేడు సంవత్సరాలు ఉన్న థామస్ ఏడు పూర్తి స్థాయి చర్చి లను, ఒక ప్రార్ధనా మందిరాన్ని ఏర్పాటు చేసారు. వాటిల్లో మిగిలినవన్నీ మారిపోగా, ఆయన నిర్మించిన  స్థలంలో ఉన్న ఒకేవక్క చర్చి పలయూర్ లోవున్నదే.
మన దేశంలోని అత్యంత పురాతన మైన చర్చి కూడా ఇదే.
భారత దేశంలో క్రైస్తవ మతాన్ని ప్రవేశపెట్టినవాడు సెయింట్ థామస్.

మహిమలతో మారిన విశ్వాసాలు 

కొదంగాల్లురు నుండి పడవలో నీటి మార్గం ద్వారా పలయూర్ చేరుకోన్నారట సెయింట్ థామస్.
ఆ నాడు పలయూర్ ఒక బ్రాహ్మణ అగ్రహారం.
వారు నిత్యం తమ పూజా విధానాలలో భాగంగా సూర్యునికి అర్ఘ్యం ఇస్తూవుందేవారట.
వారు పైకి విసిరిన అర్ఘ్యం తాలూకు జలం తిరిగి క్రింద పడిపోతుండేదట.
అదిచూసిన థామస్ వారితో " మీ పూజలను మీ దేవుడు స్వేకరించడంలేదు. అందుకే నీరు క్రింద పడుతోంది. కాని మేము నమ్మిన దైవం దానిని స్వీకరిస్తారు. కావాలంటే నిరుపిస్తాను." అని సవాలు విసిరారట.
దానికి సరేనన్న బ్రాహ్మణుల ముందు తన చేతిలోని నీటిని గాలిలోకి విసరగా అవి అలానే నిలిచిపోడమే కాక గులాబీ పుష్పాలుగా మారిపోయాయట.
దాంతో నిర్ఘాంతపోయిన స్థానికులలో కొందరు థామస్ వద్ద బాప్తిసం తీసుకోన్నారట. 
అలా నీరు పువ్వులుగా మారిన స్తలమే నేటి తాలియకులం.
ఇక్కడ నలభై ఐదు అడుగుల సెయింట్ థామస్ విగ్రహం ఉంటుంది.
ప్రక్కనే మ్యూజియం ఉంటుంది.
తమలో కొందరు మత మార్పిడికి పాలుపడతంతో దానిని జీర్ణించుకోలేని మిగిలినవారు పలయూరును "శాపకాడు"గా నిందించి అక్కడినుండి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారట.
కొంతకాలానికి శిధిలమైన హిందూ దేవాలయం మీద చర్చిని నిర్మించారట.
పురాతన ఆలయ శిధిలాలలో కొన్నింటిని నేటికి ఇక్కడ చూడవచ్చు.
తదనంతర కాలంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా, ప్రస్తుత నిర్మాణాన్ని ఇటలీకి చెందిన ఫాదర్ ఫెనికో పదహారువందల ఏడో సంవత్సరంలో నిర్మించారని తెలుస్తోంది.

పలయూర్ చర్చి విశేషాలు 

గురువాయూర్ కి మూడు కిలోమీటర్ల దూరంలో చవక్కాడ్ బీచ్ దారిలో పల యూర్ ఊరికి పడమర దిశలో ఉన్న చర్చి రెండు భాగాలుగా ఉంటుంది.
ఒక భాగంలో తాలియకులం, బోటు కులం,సెయింట్ థామస్ విగ్రహం, మ్యూజియం ఉంటాయి.
రెండో భాగంలో చెర్చిఉంటుంది.
పడమర, దక్షినాలలో రెండు గేట్లు ఉంటాయి.
 దక్షిణ ప్రవేశ ద్వారానికిరుప్రక్కలా ప్రాంగనంలో పదునాలుగు రాతి బొమ్మల రూపంలో థామస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను పెట్టారు.
టవర్ లాగా నిర్మించిన భాగం తప్ప మిగిలిన నిర్మానమంతా కేరళా శైలిలోనే నిర్మింపబడినది.
పెంకులతో నిర్మించిన మండపంలో సెయింట్ థామస్ శిలువను ప్రతిష్టించారని చెబుతారు. దానికి గుర్తుగా అక్కడ ఒక బౌద్ధ స్థూపం లాంటి నిర్మాణం పైన శిలువను ఉంచారు.
సందర్శకులు ఇక్కడ ప్రార్ధనలు చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం చేస్తుంటారు.
ప్రధాన ప్రార్ధనా స్థలికి వెళ్ళే దారిలో టేకు చెక్కమీద బైబిల్ లో ఉదహరించిన ఘట్టాలను సుందరంగా చెక్కిన జూబ్లి డోర్ దర్శనమిస్తుంది.
డోమ్ లాగా నిర్మించిన పైకప్పు మీద వివిధ వర్ణ చిత్రాలను అందంగా చిత్రించారు.
లోపలి భాగంలో నలుపక్కల యేసు క్రీస్తు, మేరిమాత, సెయింట్ థామస్ మరియు ఇతర సెయింట్స్ మూర్తులను చక్కగా అమర్చారు.
శుభ కార్యాలప్పుడు, పర్వదినాలలో ప్రార్ధనలు చేస్తారిక్కడ.
పడమర వైపున పురాతన ఆలయ శిధిలాలు, చర్చి అధ్వర్యంలో నడుపుతున్న స్కూల్, చర్చి అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల సమాధులను సందర్సించుకొని, మొదటి భాగమైన మ్యూజియం వైపుకు వచ్చాము.
ఇక్కడ ఎన్నో చారిత్త్రాత్మిక వస్తువులు, సెయింట్ థామస్ వాడిన వస్తువులు ఉన్నాయని తెలిసింది.
చూద్దమనుకోన్నాము.
కాని టైం అయిపోవడంతో మూసేసారు.
బాధనిపించింది.
ఫోటోలు తీసుకొని బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఎన్నో చారిత్రిక అంశాలకు చిరునామా అయిన పలయూర్ చర్చి వంక తృప్తిగా చూస్తూ ఉండగానే  శయన్ వాహనాన్ని ముందుకు నడిపాడు.













  

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...