25, ఆగస్టు 2018, శనివారం

Tamirabarani River

                 

              

                  తమిరబారాణి నది పుష్కరాల సంబరం    


                                                                                                 


లక్షల సంవత్సరాలుగా ఎందరో ఈ భూమిలో జీవించారు.ఎంతో సాధించారు. కొంత పోగొట్టుకున్నారు. కానీ ఎవరు నీరు లేకుండా జీవించలేదు. రానున్న తరాలు కూడా అంతే !

జలం జీవం


హిందువులు నీటిని భగవంతుని ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీపరమశివుని ప్రతిరూపాలుగా పరిగణిస్తారు. ప్రసిద్ధి చెందిన పంచ భూత క్షేత్రాలు భక్తులకు సందర్శనీయ క్షేత్రాలు. నీరు అమ్మ కూడా. నదీమతల్లి, గంగమ్మ అంటూ  కన్న తల్లిగా సంబోధిస్తారు. ప్రాణం పోసే అమ్మగా ఆరాధిస్తారు. పూజిస్తారు. అందులో భాగమే  పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జీవనదుల  పుష్కరాలు. వీటి ప్రధానోద్దేశ్యం నీటి గొప్పదనం, అవసరం అందరికీ తెలియచేయడం, సక్రమంగా ఉపయోగించుకోవడం, భావితరాలకు అందించడం. సంవత్సరానికి ఒకసారి కాకపోయినా ఇలాంటి సమయంలో అయినా పూడికలు తీయడం,తీరాలలో పేరుకున్న చెత్త చెదారం తీసివేయడం,నీటి ప్రవాహాన్నిసక్రమంగా సాగేలా చేయడం,నీటి స్వచ్ఛత పెంచే చర్యలు చేపట్టి నది బాగోగులు పట్టించుకొంటారు అన్న ఆలోచనతోనే  మన పూర్వులు పుష్కర సంప్రాదాయం ఆరంభించి  ఉండవచ్చును.అసలు పుష్కరం అంటే నీరు మరియు వరుణ కుమారుడు అనే అర్ధాలు ఉన్నాయి. 
ప్రతి నదికి ఒక రాశి ఉంటుందని, బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో ఉంటాడని, ఆ  సంవత్సరం ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు జరుపుతారని మనందరికీ తెలిసిన విషయమే !
మన దేశంలో ఎన్నో నదులున్నాయి. కానీ ఏడాది కాలం వానలు తక్కువగా ఉన్నా నిరంతరంగా ప్రవహించే జీవ నదులు పన్నెండు. వీటిల్లో అధిక శాతం హిమాలయాలలో ఉద్భవించి పరివాహక ప్రాంతాల ప్రజల నీటి అవసరాలను తీరుస్తున్నాయి. దక్షిణాదిలో పుట్టిన కావేరి, పెన్నా, భీమా మరియు తుంగభద్ర నదులు ప్రసిద్ధి చెందినవి. ఇవి దక్షిణాదిలోనే పుట్టినవి.  వీటికీ పుష్కరాలు నిర్వహిస్తారు. కృష్ణా, గోదావరి మహారాష్ట్రలో జన్మించినా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక దూరం ప్రవహిస్తాయి.ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తాయి. చాలా మందికి తెలియని పుష్కరాలు జరుపుకొనే మరో నది దక్షిణ భారతదేశంలో ఉన్నది.అదే తమిర బారాణి నది.

తమిరబారాణి - నిత్య ప్రవాహిణి  

కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు వద్ద పశ్చిమ కనుమలలో ఎత్తైన పెరియ పొదిగై పర్వతాల మీద జన్మించి తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలలో వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే తమిరబారాణి నది ఆ ప్రాంతవాసుల నీటి అవసరాలకు మూలాధారం. ఈశాన్య మరియు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో సహ్యాద్రి పర్వతాలలో సంవత్సరం అంతా కురిసే వర్షాల వలన తమిరబారాణి నది నిత్య ప్రవాహిణి.  
ఆరువేల అడుగుల ఎత్తున జన్మించి, పాపనాశం వద్ద నేలను తాకి, ప్రవాహ మార్గంలో పది ఉప నదులు కలుపుకొని, నూటపాతిక కిలోమీటర్ల దూరం ప్రవహించి చివరికి పున్నయైకాయల్  వద్ద గల్ఫ్ అఫ్ మన్నార్ లో సముద్రంతో సంగమిస్తుంది.  
తమిర బారాణి నదిలో కలిసే ఉపనదులు అన్నీ  పశ్చిమ కనుమలలో ఉద్భవించేవే కావడం విశేషం. పేయార్, ఉల్లార్, పంబ, సెర్వలార్, కఱైయార్, మణిముత్తార్, గడన, పచైయార్, చిత్తార్, రామా నదుల జన్మస్థలం పశ్చిమ కనుమలే.ఈ ఉపనదులకు  ఉన్న ఉప నదులు కూడా ఇక్కడ పుట్టినవే ! తమిర బారాణి దాని ఉపనదుల మీద నిర్మించిన పెద్ద జలాశయాలు,ఆనకట్టలు పదిహేను దాకా ఉంటాయి.ఇవి కాకుండా చిన్న చిన్న ఆనకట్టలు చాలా నిర్మించారు. ప్రవాహ మార్గం లోని అన్నిప్రాంతాలకు సాగు,త్రాగునీరు అందటానికి  కాలువలు తవ్వారు.పుష్కలమైన  నీటి లభ్యతతో   సంవత్సరమంతా ఈ ప్రాంతం పచ్చగా కనిపిస్తుంది. నదీ జలాల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు రెండు జిల్లాల ప్రజలకు వెలుగును అందిస్తుంది.పురాణ ప్రస్థానం - పుట్టుక 

 తమిరబారాణి నది పుట్టుక సప్తమహర్షులలో ఒకరైన అగస్థ్య మహామునితో ముడిపడి ఉన్నది అని పురాణ గాధలు తెలుపుతున్నాయి. శివపార్వతుల కళ్యాణం వీక్షించడానికి సమస్త లోకాల నుండి విచ్చేసిన అతిథులతో పుడమి ఉత్తర భాగంలో భారం పెరిగిపోవడంతో, మహేశ్వరుడు అగస్త్య మహర్షిని శిష్యప్రశిష్య సమేతంగా దక్షిణభాగానికి వెళ్ళమని ఆదేశించారట. ఆయనకు వివాహాన్ని అక్కడ నుండి తిలకించే వరాన్ని ప్రసాదించారు. అలా వింధ్య పర్వతాలను దాటి మహాముని నేటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాలలో ఎన్నో శివలింగాలను ప్రతిష్టించి చివరకు సహ్యాద్రి పర్వతశ్రేణి లోని పొదిగై కొండలలో నివాసమేర్పరచుకుని శివ కల్యాణాన్ని దర్శించుకొన్నారట. ఇక్కడ ఉంటున్నప్పుడే ఆయన సంస్కృత, తమిళ భాషలను రూపొందించారని పురాత తమిళ గ్రంధాల ఆధారంగా తెలుస్తోంది. ఆయన నివసించిన పర్వతాన్ని అగస్త్యమలై అని పిలుస్తారు. శిఖరాగ్రాన శ్రీ అగస్త్యమహర్షి విగ్రహాన్ని ప్రతిష్టించబడి ఉంటుంది. ప్రస్తుతం మూడువేల అయిదు వందల కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని రక్షిత క్షేత్రంగా నిర్ణయించారు. అరుదైన వృక్ష జాతులకు, వనమూలికలకు అంతరించిపోతున్న జంతువులకు స్వస్థలం.పర్యావరణ పరిరక్షణా ఆవశ్యకత ఉన్న ప్రాంతంగా గుర్తించి  అగస్త్యమలై బయో స్పియర్ రిజర్వు గా ప్రకటించారు. ప్రవేశానికి జనవరి నుండి మార్చి మధ్య కాలంలో తిరువనంతపురం లోని అటవీ శాఖాధికారులు అనుమతులను ఇస్తారు. ప్రకృతిని సమీపం నుంచి వీక్షిస్తూ అరణ్యంలో సాహస యాత్రలు చేయడానికి  ఔత్సహికులు ఉత్సాహం చూపిస్తుంటారు. 
అగస్త్యమహర్షి దక్షిణానికి బయలుదేరినప్పుడు కమండలంలో గంగాజలాన్ని తీసుకొని వచ్చారట. పొదిగై పర్వతాల మీద కమండలాన్ని తామరాకు మీద ఉంచగా తొణికి అందులోని గంగాజలం క్రిందకి ప్రవహించి తమిరబారాణి నదిగా మారింది అంటారు. మరో కధనం ప్రకారం కమండలంలోని గంగ (నీరు) శివపార్వతుల కల్యాణాన్ని తిలకించి పులకించి అందమైన నర్తకిగా మారి నాట్యమాడి నదిగా మారిందట.రెండు కధనాలు తెలిపేది ఒక్కటే గంగ తమిరబారాణి వేరు కాదు అని. ఈ ఉదంతం గురించి, అగస్త్యమహర్షి గురించి అనేక పురాణాలలో, పురాతన తమిళ గ్రంధాలలో ఉదహరించబడినట్లుగా తెలుస్తోంది. 

అనేక నామాలు 

తమిర బారాణి నదికి గల పెక్కు ఉప నదుల మాదిరి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. పురాణ కాలంలో "పొరునై" గా పిలిచే ఈ నది ప్రస్థాపన శ్రీమద్రామాయణం,మహాభారతాలలో  ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 సంగమ కాలం అనగా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన అనేక తమిళ రచనలలో కూడా  నది గొప్పదనాన్ని వివరించారట. ఆ కాలానికి చెందిన తమిరబారాణి  మహత్యం అనే గ్రంధంలో నది గురించిన సమస్త సమాచారం నిక్షిప్తమై ఉన్నట్లు చెపుతారు.తామ్రం అంటే రాగి. ఎరుపు రంగులో ఉండే లోహం అధికశాతంలో ఉండటం వలన ఎఱ్ఱటి రంగులో కనిపించే నీరు కలిగిన నదిగా ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. తామ్రపారాణి, తామ్రపర్ణి, తమిర వర్ని, తమిరవారుణి, తమిరపారాణి  ఇలా అనేక నామాలతో పిలువబడి చివరికి తమిరబారాణిగా స్థిరపడినది. నేడు అధికారికంగా ఈ పేరుతోనే పిలుస్తున్నారు.


ఆహ్వానించే జలపాతాలు 

తమిరబారాణి, ఉపనదులన్నీ ఎత్తైన పర్వతాలలో పుట్టినవి కావడాన అవి నేలను తాకే క్రమంలో మనోరంజకమైన జలపాతాలు ఏర్పడ్డాయి. సహ్యాద్రి పర్వత శ్రేణి సహజ ప్రకృతి అందాలకు  నిలయాలు. పచ్చని పర్వతాలతో, స్వచ్ఛమైన గాలితో, ప్రశాంత వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక్కడ. మనసులను రంజింపచేసే పరిసరాలు. వదిలి రాబుద్ది కాదు.నేర్పరి అయిన చిత్రకారుడు అత్యంత శ్రద్ధతో, తగిన వర్ణాల కలయికతో చిత్రించిన చిత్రాల మాదిరి ఉంటాయి. సహజ సుందర  పరిసరాలకు రమ్యంగా జాలువారే జలపాతాలు తోడై అదనపు శోభను అద్దుతాయి.తమిరబారాణి క్రిందకు దిగే క్రమంలో పాపనాశం వద్ద ఏర్పడే అగస్త్యార్ జలపాతాలు ప్రసిద్ధమైనవి. ఉపనది మణిముత్తార్ జలపాతాలు మరో ఆహ్లాదకర ప్రదేశం.మరో ఉపనది చిత్తార్, కుర్తాళంలో ఎనిమిది చోట్ల నేలకు జలపాతాల రూపంలో జాలు వారుతుంది. ఇంకొక ఉపనది కరియార్. పాపనాశం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఆనకట్ట నుండి లోపలికి పడవలో వెళితే అద్భుతమైన ప్రకృతి మధ్య బాణతీర్ధం జలపాతాలు దర్శనమిస్తాయి. సంవత్సర కాలం అంతా యాత్రీకులతో నిండి ఉంటాయి జలపాతాలు.

ఆరోగ్య ప్రదాయని 

మానవులకి శరీర పటిష్ట కొరకు ప్రతి నిత్యం తీసుకోవలసిన లోహాలలో ఒకటి రాగి. పంటలకు, పశువులకు కూడా ఈ లోహపు ఆవశ్యకత ఉన్నది.అది ఈ నీటిలో తగు మోతాదులో  లభ్యమౌతుంది. నియమంగా ఈ జలపాతాలలో స్నానం చేస్తే నరాల,చర్మసంబంధిత వ్యాధులు తగ్గుతాయని, రక్తపోటు అదుపులోనికి వస్తుందని విశ్వసిస్తారు.ఎందరో అనారోగ్యంతో భాధపడేవారు నెలా  రెండు నెలలు పాటు ఇక్కడే ఉండిపోతారు.ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. 
కొండకోనలలోని మూలికల సారాన్ని తనలో కలుపుకోవడం వలన నది నీటికి ఆ శక్తి వచ్చినదని చెపుతారు.పశ్చిమ కనుమలు అరుదైన వన మూలికలకు నిలయాలు. ఆయుర్వేద ఔషదాలు తయారు చేసేవారి పాలిట సంజీవనీ పర్వతాలే !  
దేశంలో మరుగునపడిన అనేక అద్భుతాలను తిరిగి మనకి అందించిన వారు ఆంగ్లేయులు. పశ్చిమ కనుమల జలపాతాల రహస్యాన్ని కూడా వారే వెలికి తీశారు.1811 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ నీటి గుణాలపై పరిశోధించడానికి ప్రత్యేక బృందాన్నినియమించింది.  డాక్టర్ వైట్ సారధ్యంలో బృందం రెండు సంవత్సరాల పాటు కృషి చేసి నదీజలాలు రెండు    వేల రకాల వన మూలికల గుణాలు కలిగి ఉన్నాయని తేల్చారు. మన పెద్దలు శతాబ్దాల క్రిందట తెలిపిన విషయాలను ఆంగ్లేయులు శాస్త్రీయ విధానంలో నిర్ధారించారు అంతే. అప్పటి నుండి ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరగసాగింది. 

  అన్నపూర్ణ 

 రెండు జిల్లాల పరిధిలో నూటపాతిక కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రవహించే తమిరబారాణి నది సుమారు లక్ష ఎకరాల పంటకు నీరు అందిస్తుంది. ప్రాంతవాసులకు అన్నపూర్ణ. మూడువందల అరవై అయిదు రోజులూ ఋతుపవనాల ప్రభావంతో నీటితో నిండి ఉంటుంది. వరి, అరటి, కొబ్బరి పంటలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం.వేరుశెనగ, కందులు, మిరప,చెఱకు మరియు ప్రత్తి కూడా పండిస్తుంటారు. గత కొంత కాలంగా సంప్రదాయ పంటల నుండి వాణిజ్య పంటల వైపుకు మొగ్గు చూపుతున్నారు యువతరం వ్యవసాయదారులు.  

అమ్మకు కూడా ఆగ్రహం వస్తుంది 

నిజమే ! అమ్మకు కూడా కోపం వస్తుంది కాని పనులు చేసినప్పుడు. మరి ఈ అమ్మకు ఎందుకు కోపం వచ్చింది? నీటిని సద్వినియోగం చేసుకోకపోవడమా? నదీమతల్లిని సంరక్షించకపోవడమా ?  వాణిజ్య పరంగా చూడటమా ? అన్నీ సమంజసమైన కారణాలే.  
ఏది ఏమైనా 1992మరియు 20015 సంవత్సరాలలో ఉవ్వెత్తున ఎగసిపడింది తమిర బారాణి.  వేలాది ఎకరాలు, వందల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. హఠాత్తుగా సంభవించిన వరదల వలన పంట, ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగింది. ప్రతి సంవత్సరం కొద్దో గొప్పో వరదలు రావడం సహజమే ! కానీ పైన పడే వర్షాల ఆధారంగా హెచ్చుతగ్గులు ఉంటాయి తమిరబారాణి    ప్రవాహంలో. ఉపనదులు కూడా ఎక్కువ కదా ఊహించలేనంతగా ప్రవాహం పెరిగింది. ఆ అనుభవంతో వరదల రాకుండా అడ్డుకోడానికి, నీటి నిలువలను \అధికం చేయడానికి ఆనకట్టల ఎత్తు పెంచడము , మరి కొన్నిజలాశయాలను నిర్మించడం, నదుల అనుసంధానం లాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. నీరు వృధాగా సముద్రంలో కలవకుండా, ఊర్ల మీదకి రాకుండా సరైన విధానంలో అడ్డుకొంటే ప్రమాదం ఉండదు. దానికి తగిన పర్యవేక్షణ కూడా జతగా ఉండాలి. 

ఎన్ని రుచులో 

చక్కని పలహారాలకు, భోజనానికి ఈ ప్రాంతం పేరెన్నికగన్నది. అదే విధంగా  తిరునెల్వేలి హల్వా, అరటికాయ చిప్స్ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. తిరునెల్వేలి, కుర్తాళం, పాపనాశనం, టెంకాశి, షేంకొట్ట ప్రాంతాలలో వీటిని అప్పటికప్పుడే వేడివేడిగా చేసి రుచిగా  అందిస్తారు.తమిళనాడులో తిరునెల్వేలి వెళ్లి హల్వా తినకుండా వస్తే పెద్ద తప్పు క్రింద లెక్క.  
మనం ఏనాడు చూడని రకరకాల ఫలాలు కనపడతాయి.చాలా వాటి పేర్లు కూడా మనకి తెలియవు. ఎందుకంటే ఎప్పుడూ చూసి ఉండము కదా. తీపి,పులుపు, వగరు, కొంచెం చేదు ఇలా అన్నిరుచులనూ అందిస్తాయి ఇక్కడి ఫలాలు. అరుదైన పుష్పాలలోని పలు రకాలు.నేత్రాలకు కనువిందు కలిగిస్తాయి.
స్థానిక వంటకాలతో నిండిన భోజనము రుచికరంగా ఉంటుంది. మాంసాహారులకు ముఖ్యంగా జలచరాలంటే ఇష్టపడే వారికి తమిరబారాణి తీరం రుచికరమైన మత్స్య రుచులను అందిస్తుంది. 

నీటి వివాదం     


ఇదేమిటి రెండు రాష్ట్రాల మధ్య కాదు కదా తమిరబారాణి  ప్రవహించేది ? రెండు జిల్లాల మధ్య. అదీ ఒకే రాష్ట్రంలో కదా మరి వివాదం దేనికి అంటే పరిశ్రమలకు చేసిన నీటి కేటాయింపుల గురించి. 
తమిళనాడు ప్రభుత్వం తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలలో పారిశ్రామికాభివృద్ధి కోసం కొన్ని కంపెనీలకు గంగైకొండన్ అనే గ్రామంలో స్థలాలను కేటాయించింది. అందులో కోకాకోలా. పెప్సీ కంపెనీలు కూడా ఉన్నాయి. అందరికీ నీరు కావాలి.  శీతలపానీయాల పరిశ్రమలకు నీరు అధికంగా కావాలి. ప్రభుత్వం వీరికి రోజుకు కోటిన్నర లీటర్ల నీటిని తమిరబారాణి నది నుండి తీసుకోడానికి అనుమతి ఇచ్చింది. అది వివాదానికి దారి తీసింది. కేటాయించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకొంటున్నాయి అని అది ప్రజల త్రాగునీటి అవసరాల మీద ప్రభావం చూపిస్తుంది అని తమిరబారాణి నీటి సంకట నివారణ సమితి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మీద ఎలాంటి నిషేధం విధించలేమని తేల్చి చెప్పింది న్యాయస్థానం. పై న్యాయస్థానానికి వెళతామంటున్నారు సమితి వారు.వివాదం కొనసాగుతోంది.    

కాపాడే నది కలుషితం 


దేశంలోని అన్ని నదులు ఎదుర్కొంటున్న కాలుష్య భూతం తమిరబారాణి నదిని కూడా వదలలేదు. ప్రవాహ మార్గంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలు ఉన్నాయి. వీరందరికీ ఈ నది నీరే కావాలి అన్ని అవసరాలకు. కానీ నది పరిసరాల శుభ్రత మరియు నీటి స్వచ్ఛత గురించి అధికారులు, పారిశ్రామిక సంస్థలు, ప్రజలు తీసుకొంటున్న జాగ్రత్తలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉన్నాయని స్వచ్చంద సంస్థలు చేపట్టిన సర్వేలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా గృహాల నుండి వచ్చే ప్లాస్టిక్, నదీ తీరాలలో, జలపాతాల వద్ద యాత్రీకులు ఉపయోగించే సబ్బుల, షాంపూల పాకెట్స్ పెద్ద ఇబ్బందిగా మారింది అని వారు తెలియజేస్తున్నారు. అశుద్దాలతో కూడిన నీటిని నది లోనికి వదలడం మరో  ఆపదగా పరిణమించింది.పరిశ్రమలు వదులుతున్న అపరిశుభ్ర విషపూరిత వ్యర్ధాలు అన్నిటి కన్నా పెద్ద అపాయంగా తేల్చబడింది. అదుపు లేని ఇసుక త్రవ్వకాలు మరో విధంగా నదిని దెబ్బ తీస్తున్నాయి.చేపట్టిన సర్వేలు అన్నీ కాలుష్య ప్రమాదాన్ని ఎత్తి చూపడంతో ప్రభుత్వ యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  
ప్రతి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయడం, పరిశ్రమల నుండి వ్యర్ధాలను శుభ్రపరచి వదిలేలా చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోడానికి తీరంలో బందోబస్తు పెంచడానికి ఆలోచిస్తున్నారు, యాత్రీకులు జలపాతాల వద్ద సబ్బులు, షాంపూలు వాడకుండా చూడటానికి స్వచ్చంద సంస్థల వారి సహాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు.
  

అపురూప ఆలయాలకు నిలయం 


తమిరబారాణి నది దాని ఉపనదుల తీర ప్రాంతాలు మహిమాన్విత స్థలాలుగా ప్రసిద్ధి. ఎన్నో విశేష ఆలయాలు ఈ ప్రాంతాలలో శతాబ్దాల క్రిందట నిర్మించబడినాయి. పాపనాశం నుండి సముద్రంలో సంగమించే దాకా ఉన్న నదీ తీర ప్రాంతాలన్నీ అరుదైన ఆలయాలతో నిండిపోయి ఉంటాయి. 
 పాపనాశేశ్వరస్వామి,నెల్లిఅప్పార్, కుర్తాళనాదర్ లాంటివి ప్రముఖమైనవి.  అంబసముద్రం, టెంకాశి, మన్నార్ కోయిల్, శంకరన్ కోయిల్ లాంటి ప్రదేశాలలో చక్కని ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలలోని ఆధ్యాత్మిక విశేషం ఏమిటంటే శైవులు మరియు వైష్ణవులు అధికంగా సందర్శించే నవ కైలాసాలు మరియు నవ తిరుపతులు పేరిట పురాతన మహాదేవుని, మహావిష్ణు  ఆలయాలు కలవు. వీరు వీటిని నవగ్రహ క్షేత్రాలుగా పరిగణిస్తారు. అదే విధంగా ప్రఖ్యాతి గాంచిన ఆరుపాడైవీడు ఆలయాల్లో ఒకటి సముద్రతీర ప్రాంతం అయిన తిరుచెందూర్ ఇక్కడే ఉన్నది.  
తిరునెల్వేలి లోని శ్రీ కాంతిమతీ సమేత శ్రీ నెల్లి అప్పార్ స్వామి ఆలయంలోని తామ్ర సభ,  కుర్తాళంలోని చిత్రసభ నటరాజ స్వామి ఆనందతాండవం చేసిన పంచసభలలో భాగం. తామ్రసభలో చెక్క మీద పురాణ ఘట్టాలు, దేవీదేవతలు రూపాలు, సూక్ష్మ చెక్కడాలు అబ్బుర పరిచే విధంగా చెక్కారు. నెల్లిఅప్పార్ ఆలయ శిల్పకళ అద్భుతం. తడితే సప్తస్వరాలు పలికే సంగీత స్థంబాలు ఇక్కడి ప్రత్యేకత.  చిత్రసభ లో కనిపించే సహజ వర్ణ చిత్రాలు అయిదు వందల సంవత్సరాల నాటివి. నేటికీ చెక్కుచెదరక పోవడం వీటిలోని గొప్పదనం.పన్నెండేళ్లకు పుష్కరాలు  


అన్ని నదులకు వచ్చినట్లే  తమిరబారాణి నదికి కూడా పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వృశ్చిక రాశి లోనికి ప్రవేశించిన సమయంలో తమిరబారాణి మరియు కృష్ణానదికి ఉపనది అయిన భీమానదికి పుష్కరాలు వస్తాయి. అది ఈ సంవత్సరమే. రెండు నదులకు పుష్కరాలు ఒకే తేదీలలో జరగనున్నాయి. 
అక్టోబర్ పన్నెండో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు దాకా పన్నెండు రోజుల పాటు జరిగే తమిరబారాణి నది పుష్కరాలకు తమిళనాడు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 
పాపనాశం, టెంకాశి, కుర్తాళం, తిరునెల్వేలి, అంబసముద్రం లాంటి ఊర్లలో ఉండటానికి తగిన వసతులు లభిస్తాయి. స్థానికంగా క్షేత్రదర్శనానికి వాహనాలు అద్దెకు ఇస్తారు. 
విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం నుండి తిరునెల్వేలి కి నేరుగా ఆరు రైళ్లు, హైదరాబాద్ నుండి ఒక రైలు ఉన్నాయి. ఇవన్నీ వారానికి ఒకసారి నడిచేవే !  చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి తిరునెల్వేలి మరియు టెంకాశి దాకా ప్రతి రోజు నడిచే రైళ్లు ఉన్నాయి. చెన్నై నుండి బస్సులు కూడా లభిస్తాయి. తిరుచురాపల్లి, మధురై నుండి కూడా చాలా బస్సులు ఉన్నాయి. తిరువనంతపురం మరియు కన్యాకుమారి నుండి రోడ్డు మరియు రైలు మార్గంలో తిరునెల్వేలి చేరుకోవచ్చును.  
భక్తులారా ! ప్రయాణానికి సిద్దంకండి. పుష్కర స్నానం మరియు క్షేత్ర దర్శనం చేసుకోండి.  ప్రశాంత ప్రకృతిలో విహరించండి. 


నమః శివాయ !!!!వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం వందేవందారు మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   1. అంగం హరేః పులక భ...